ఈజిప్టు, ట్యునీషియా తిరుగుబాట్లకు ట్విట్టర్, ఫేస్ బుక్ లు సహాయపడ్డాయనడం నిజం కాదు


ముఖ్యమైన విషయం ఏంటంటే కార్పొరేట్ పత్రికలు ప్రచారం చేసినట్లు ఈజిప్టు ఉద్యమ నిర్మాణంలో ట్విట్టర్, ఫేస్ బుక్ ల పాత్ర ఏమీ లేదు. ఉద్యమ వార్తలను ట్విట్టర్, ఫేస్ బుక్ లలో రాసుకున్నారు గానీ ఉద్యమ వ్యాప్తికి అవేమీ ఉపయోగపడలేదు. అసలు ట్విట్టర్,  ఫేస్ బుక్ ల ద్వారా ఉద్యమాలు వస్తాయనడమే పెద్ద తప్పు, మోసం కూడా. కేవలం ఇంటర్నెట్ లో సందేశాలతో ఉద్యమ కాంక్షలను రగిల్చే పనైతే ఫేస్ బుక్ లో కాజ్ ల పేరుతో చాలా నడుస్తున్నాయి. ఆ ఉద్యమాలు కూడా జరగాని లెక్క ప్రకారం. కాని అవేవీ లేవు.

ఈ ప్రచారం వెనక అమెరికా ప్రయోజనాలు ఉన్నాయి. ఈజిప్టు, ట్యునీషియా లలో నియంతలకు అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు పూర్తి మద్దతు ఇచ్చి నిలబెట్టాయి. వారికి ఆయుధాలు డబ్బు అన్నీ సమకూర్చాయి. ప్రతిఫలంగా అక్కడి వనరులను దోచుకున్నాయి. అక్కడి సైన్యానికి నేరుగా డబ్బులిచ్చి ప్రజలను అణచివేయడానికి వినియోగించాయి. నియంతృత్వాలు ఉన్నచోట అమెరికా, పశ్చిమ రాజ్యాల ప్రయోజనాలు నిరాటంకంగా నెరవేరతాయి. అదే ప్రజాస్వామ్యం అంటె ప్రజలు ప్రజాస్వామిక హక్కులనీ, పౌర హక్కులనీ, మానవ హక్కులనీ ఊరికే గోల చేస్తూ వారి పెట్టుబడులకు ఆటంకం కలిగిస్తారు. పారిశ్రామిక అశాంతికి కారణ మవుతారు. నియంతృత్వంలో ఈ బాధలేమీ ఉండవు. అందుకే ప్రపంచ వ్యాపితంగా నియంతృత్వాలని అమెరికా పెంచి పోషించింది.

ఈజిప్టు, ట్యునీషియాలలో నియంతృత్వంపైన ప్రజలు తిరగబడ్డారు. కనుక అక్కడ నియంతలను పోషిస్తున్న అమెరికా పైన కూడా ప్రజలు ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా నియంతలకు వ్యతిరేకంగా ప్రజలు ఉచ్యమించారని ప్రపంచ ప్రజలు భావించినట్లయితే అమెరికాకి అది ప్లస్ అవుతుంది. అమెరికా ఇంటర్నెట్ కంపెనీలు ప్రజాస్వామిక ఉద్యమాలకు ప్రోత్సాహిస్తున్నాయి కనుక ఆ ఖ్యాతి అమెరికాకే దక్కుతుంది. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ఈ మేరకు క్రెడిట్ సొంతం చేసుకుంటూ ప్రకటనలు ఇచ్చింది కూడా. ఆ విధంగా తాను దశాబ్దాల తరబడి నియంతలను పోషించిన అపఖ్యాతినుండి బైటపడాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నం చేసింది.

ఈ ప్రచారం బుద్ధి జీవుల్లోకి బాగా వెళ్ళింది కానీ అది వాస్తవం కాదు. వాస్తవానికి ఈజిప్టు, ట్యునీషియాల్లో ఉద్యమాలు ప్రారంభదశలో ఉన్నపుడు అక్కడి నియంతల అవినీతి, వారితో అమెరికా, ఫ్రాన్సుల కుమ్మక్కులపై ‘వికీలీక్స్’ సంస్ధ కళ్ళు తిరిగే వాస్తవాలను బైటపెట్టింది. అమెరికాకి చెందిన రాయబారులు తమ ప్రభుత్వానికి గత నలభై ఏళ్ళకు పైగా పంపిన కేబుళ్ళు వికీలీక్స్ కి అందాయన్నది తెలిసిందే. వివిధ ఉద్యమాల కాలంలో వికీలీక్స్ అధినేత ఆయా దేశాలకి సంబంధిచిన కేబుళ్ళు ప్రచురిస్తూ వచ్చాడు. ఈజిప్టు, ట్యునీషియాల ప్రజలు కూడా వికీలీక్స్ ద్వారా వెల్లడయిన తమ పాలకుల అకృత్యాలను తెలుసుకుని మరింత తీవ్రంగా ఉద్యమించి పాక్షిక ఫలితాల్ని సాధించారు తప్ప అందులో ఫేస్ బుక్, ట్విట్టర్ లు శోదిలోకి కూడా రావు.

అనేక దశాబ్దాల తరబడి కమ్యూనిస్టు విప్లవకారులు, సంఘాలు, సభలు, సమావేశాలు పెట్టి పాలకుల చర్యలను వివరిస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా తమ ఊళ్ళకు వచ్చి మరీ వివరిస్తున్నా స్పందించని ప్రజలు ఎక్కడో ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో ప్రకటనలు, వార్తలు చదివి ఈజిప్టు, ట్యునీషియాలలో  ఉద్యమించారని చెప్పడం ఓ జోక్. అయినా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఖాతాలుండేవారు ఎంతమంది ఉంటారు? అదీ వెనకబడిన ఈజిప్టు, ట్యునీషియాలలో? అక్షరాస్యులే కొద్దిమంది. వారిలో కూడా ఇంటర్నెట్ కి ప్రవేశం ఉన్నవారు ఇంకా కొద్దిమంది. వారు నెట్ లో వార్తలు, సందేశాలు చదివి ఉద్యమాల్లోకి దూకారనడంలో ఎంత వాస్తవం ఉందో ఆలోచించి చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది.

ఇండియానే తీసుకోండి. అక్షరాస్యుల్లో చాలామందికి ఇంటర్నెట్ సౌకర్యం గురించి తెలియదు. తెలిసినా ఎలా బ్రౌజ్ చెయ్యాలో తెలియదు. ఈమెయిల్ ఖాతా కోట్లమంది అక్షరాస్యులకు లేదు. యాహూ, గూగుల్ లు అంటే ఏమిటి అని అడిగేవారు ఉద్యోగులు, విద్యార్ధుల లోనే అనేక మంది ఉన్నారు. ఈ మెయిల్ ఖాతా ఎలా ప్రారంభించాలో కూడా తెలియదు. మౌస్ ని కదిలించడానికి కూడా ఇబ్బందులు పడుతున్నవారు అనేక మంది. అదీ కాక ఇంటర్నెట్ లో ప్రధానంగా అందుబాటులో ఉన్నది ఆంగ్ల భాష. ఆంగ్లంలో ఈజిప్టు వాసులు ఉద్యమ వార్తలు రాస్తే అవి చదివి అక్కడి కార్మికులు, కూలీలు, రైతులు, యువకులు ఉద్యమించారని చెప్తే నమ్మగలమా? అటువంటివారు ఈజిప్టులో ఉన్నా, ట్యునీషియాలో ఉన్నా ట్విట్టర్, ఫేస్ బుక్ సందేశాలు అందడం అసాధ్యం. అందినా చదివి ఉద్యమాలలోకి దూకడం ఇంకా అసాధ్యం.

ఒకవేళ సాధ్యమే అనుకుందాం. తివిరి ఇసుమున తైలంబు తీశారే అనుకుందాం. కుందేటి కొమ్ముని తెచ్చారే అనుకుందాం. వాళ్ళ నెట్ లో సందేశాలు చదివి, వార్తలు చదివి నియంతలపైనే ఉద్యమించ గలరా? పత్రికల్లో, టీ.వీల్లో చూపింది ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన ఉద్యమాలు, అక్కడ జరిగిన ఊరేగింపులు ప్రదర్శనలు మాత్రమే. వారికి అనేక రెట్ల మంది ఇతర పట్టణాల్లో, గ్రామాల్లో కార్మికులు, రైతులు, కూలీలు నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఇతర అనేక పట్టణాలలోని కార్మికులు ఫ్యాక్టరీలు వదిలి పెట్టి వీధుల్లోకి వచ్చారు. ముబారక్ దిగిపోయి, సైనిక కమిటీ పాలనలోకి వచ్చాక కూడా కార్మికుల పోరాటాలు సమ్మెలు ఈజిప్టులో కొనసాగాయి. ముబారక్ దిగాక కూడా విద్యార్ధులు, ఉద్యోగులు, యువత చాలా సార్లు కైరోలోని తాహ్రిరి స్క్వేర్ లో వారాల తరబడి బైఠాయింపులు జరిపారు. ఇవేవీ ట్విట్టర్, ఫేస్ బుక్ లు రగిలించినవి కావు.

ఇవి పుట్టకముందే ఈజిప్టులో, ట్యునీషియాలో, ఇండియాలో, అమెరికాలో కార్మిక వర్గం పుట్టింది. వాళ్ళు చరిత్రలో అనేక పోరాటాలు చేసారు. తిరుగుబాట్లు చేశారు. ఇపుడు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏమీ అప్పట్లో అందుబాటులో లేవు. కాని ఇప్పటికంటే అప్పుడే విప్లవాలు, ఉద్యమాలు విజయవంతం అయ్యాయి. వివిధ నియంతలకూ, నియంతృత్వ ప్రభుత్వాలకూ వ్యతిరేకంగా తమ కష్టాలు కడగండ్లు తొలిగిపోవాలని కాంక్షిస్తూ అనేక ఉద్యమాలు రగిలాయి. వాటిలో కొన్ని విజయవంతం అయ్యాయి. చాలా విఫలమైనాయి. ఆకృషి ఇంకా కొనసాగుతుంది. ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా ఈజిప్టు తదితర అరబ్ రాజ్యాల ప్రజలు తిరుగుబాటు విజయవంతం చేసుకుందన్న మాటే పచ్చి అబద్ధం, అదొక సంగతి. ఇంకో సంగతి ఏంటంటే ట్విట్టర్, ఫేస్ బుక్ లను ప్రపంచంలో జరిగే ఉద్యమాలకు అందుబాటులో ఉంచేంత దమ్ము, ధైర్యం ఆ సంస్ధలకు వాటి అధినేతలకు ఉన్నాయా?

వికీలీక్స్ ను తీసుకోండి. దాని ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ కి అమెరికా సీక్రెట్ కేబుళ్ళు అందాయి. అవన్నీ నేరుగా చదవడానికి వీలుగా అందుబాటులోకి రాలేదు. అన్నీ వివిధ స్ధాయిల్లో ఎన్‌క్రిప్టు అయ్యాయి. వాటన్నింటినీ డీకోడ్ చేసి కొన్ని లక్షల కేబుళ్ళు చదివి అన్నింటినీ ఒక క్రమంలోని అస్సాంజ్ తెచ్చాడు. వాటిలో ప్రమాదకరం అనుకున్నవాటిని ఆయన వెల్లడించలేదు. ఫలానా కేబుల్ వెల్లడీ అయితే ఎవరి ప్రాణాలకైనా ప్రమాదం ఉందని భావిస్తే, వాటిని విడుదల చేయలేదు. అయినా వాటిలో అనేక అమెరికా దుష్కృత్యాలు వెల్లడయ్యాయి. అమెరికా దారుణాలు, దానితో కుమ్మక్కయిన వివిధ దేశాల నియంతలు, సో కాల్డ్ ప్రజాస్వామిక ప్రభుత్వాలు చేసిన దారుణాలు కేబుల్స్ ద్వారా వెల్లడయ్యాయి. ఇరాన్, ఆఫ్ఘనిస్ధాన్ లలో అనేక వేలమంది పౌరులను నిర్ధాక్షిణ్యంగా చంపి వారికి తిరుగుబాటుదారులుగా మిలిటెంట్లుగా ముద్రవేసిన సంగతిని వెల్లడించింది. ఇండియాలో నియమితులైన రాయబారులు సైతం ఇక్కడ గూఢచార చర్యలకు పాల్పడ్డారు. వాటిలో ఇండియాకి సంబంధించి కొన్ని కేబుళ్ళ వివరాలని ఇదే బ్లాగ్ లో ప్రచురించడం జరిగింది.

ఇవన్నీ ఎలా వెల్లడయ్యాయి? ఇంటర్నట్ ద్వారానే వెల్లడయ్యాయి. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాపితంగా అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ చూసే అలవాటున్న ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చాయి. అమెరికా మిత్రుడు శతృవు అనే తేడా లేకుండా అన్ని దేశాల్లోను సాధ్యమైన అన్నిమార్గాల్లొనూ గూఢచర్యం చేస్తుందని వెల్లడయ్యింది. తన రాయబారులను సైతం వారు నియమించబడిన దేశాల్లో గూఢచర్యానికి వినియోగించుకుంటుందని వెల్లడయ్యింది. ఆయా దేశాల విదేశాంగ విధానాలు, ఆర్ధిక, ద్రవ్య విధానాలు ఎలాఉండాలో ప్రభావం చేస్తుందని వెల్లడయ్యింది. భారత దేశంలో మంత్రివర్గ మార్పులు చేర్పులను సైతం అమెరికా ప్రభావితం చేసిందని వెల్లడయ్యింది. ఇరాన్ నుండి పాక్ మీదుగా భారత్ కి పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయడం కోసం ఇరాన్, భారత్ ల మద్య ఒప్పందం చివరి దాకా వచ్చి రద్దు కావడం వెనక అమెరికా ఒత్తిడి ఉన్నదని వెల్లడయ్యింది. పాకిస్ధాన్ మిత్రత్వం చేయాలో, శతృత్వం చేయాలో, ఏ సమయంలో ఏమి చేయాలో కూడా అమెరికా భారత్ ని ప్రభావితం చేసిందని వెల్లడయ్యింది. అమెరికా రాయబారులు సమాచార సేకరణ కోసం ఎన్ని అకృత్యాలకు పాల్పడేదీ వెల్లడయ్యింది.

జులియన్ అస్సాంజ్ ఇవన్నీ బైటపెట్టడం అమెరికాకి పూర్తిగా నచ్చలేదు. ఇంటర్నెట్ స్వేచ్ఛపైనా, చైనా మానవ హక్కులపైనా, ఇంటర్నెట్ ని చైనా నియంత్రించడం పైనా నీతులు చెప్పే అమెరికా, అన్ని దేశాల మానవ హక్కుల పరిరక్షణపై ప్రతి సంవత్సరం నివేదికలు ఏక పక్షంగా తయారు చేసుకుని వెల్లడిస్తూ ఆయా దేశాలను బ్లాక్ మెయిల్ చేసే అమెరికా, జులియన్ అస్సాంజ్ దాని అకృత్యాలను బైటపెదుతుంటే సహించలేకపోయింది. జులియన్ అస్సాంజ్‌కి అమెరికా కేబుల్స్ ని చేరవేసినవాడు ఇరాక్‌లోని అమెరికా సైనిక బలగాలలో గూఢచార సమాచార విశ్లేషకుడుగా పనిచేసిన “బ్రాడ్లీ మేనింగ్” అని ఆ దేశం ఆరోపించింది. బాడ్లీ మేనింగ్ తాను చేసిన పనిని వేరొక హ్యాకర్ మిత్రుని తో పంచుకున్నాడనీ, అతను మేనింగ్ చేసిన పని సబబుగా అనిపించక ఎఫ్.బి.ఐకి తెలిపాడనీ వివిధ వ్యక్తులు, వార్తా సంస్ధలు వివిధ సందర్భాల్లో తెలిపారు. గమనించదగిన విషయం ఏమిటంటే ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో అమెరికా దుష్కృత్యాలను ప్రత్యక్షంగా చూసిన బ్రాడ్లీ మేనింగ్ అవన్నీ జరగకుండా ఉండాలంటే ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఉందని భావించి తాను ఇవ్వదలుచుకున్నవారికి ఇచ్చాడు. బ్రాడ్లీ మేనింగ్ చర్యలు అమెరికాకి వ్యతిరేకంగా ఉందనీ, అతని చర్యవలన ఏవో ప్రమాదం జరుగుతుందని భావించి అతని మిత్రుడు నేరుగా ఎఫ్.పి.ఐ కే తెలిపాడు. వీరిద్దరి దృక్పధాల్లో స్వల్ప మార్పే ఉన్నట్లు కనిపించినా, వారి చర్యలు పరస్పర విరుద్ధ ఫలితాలకు దారి తీశాయి.

బ్రాడ్లీ మేనింగ్ ని అరెస్టు చేసిన తర్వాత అతనిని అమెరికా ప్రభుత్వం జైలులో చూసిన తీరు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేట్లు చేసేదిగా ఉంది. బ్రాడ్లీ మేనింగ్ ని ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు గంటలపాటు సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్ లో ఉంచింది. అంటే ఏకాంత కారాగారవాసం అన్నామాట. చాలా చిన్న గదిలో కటిక చీకటిలో అతనిని ఉంచారు. రోజుకి ఒక్క గంట మాత్రమే బైటికి అనుమతించేవారు. మిగిలిన ఇరవైమూడు గంటలూ చీకటిలో చిన్నిగదిలో అతనిని ఒంటరిగా నిర్భంధించారు. పడుకునే ముందు అతని ఒంటిపై దుస్తులు తీసేసేవారు. నగ్నంగా వణికించే చలిలో ఒంటరిగా అతను అనేక వందల రాత్రులు గడిపాడు. బైటికి అనుమతించిన ఒక్క గంటలో కూడా ఇతర ఖైదీలతో మాట్లాడ్డానికి అనుమతించలేదు. బ్రాడ్లీ మ్యానింగ్ అనుభవిస్తున్న చిత్ర హింసల గురించి అతని మిత్రులు అతి కష్టం మీద సమాచారం సంపాదించి బైటపెట్టారు.

ఐక్యరాజ్య సమితి తరపున బ్రాడ్లీ మేనింగ్ హక్కులకు భంగం కలుగుతున్నదా లేదా పరిశీలించడానికి వచ్చిన పరిశీలకుడిని బ్రాడ్లీ మేనింగ్ వద్దకు మొదట అమెరికా అనుమతించలేదు. తర్వాత పోలీసుల సమక్షంలోనే మాట్లాడాలని బలవంతపెట్టారు. ఐక్యరాజ్య సమితి పరిశీలకుడికి బ్రాడ్లీ మేనింగ్ ని ఒంటరిగా కలిసి మాట్లాడి నివేదిక తయారు చేయాలని ఉత్తర్వులున్నాయి. కాని ఆయనకి అనేక నెలలపాటు ఆ అవకాశాన్ని అమెరికా ఇవ్వలేదు. బ్రాడ్లీ మేనింగ్ కి పోలీసులు, ప్రభుత్వం ఇస్తున్న ట్రీట్ మెంట్ పట్ల ఆగ్రహించిన అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రాజీనామా చేయడాన్ని బట్టి పరిస్ధితిని ఊహించవచ్చు. ఈ మద్యనే సమితి పరిశీలకుడు పత్రికలకెక్కి బహిరంగంగా అమెరికా వైఖరిని ప్రశ్నించడంతో గత మార్చి నెలలో అతనితో మాట్లాడ్డానికి అనుమతించారు. కాని ఆ సమయానికి బ్రాడ్లీ మేనింగ్ ని సౌకర్యవంతమైన మరొక జైలుకు తరలించి అక్కడ సమితి పరిశీలకుడిని అనుమతించారు.

బ్రాడ్లీ మేనింగ్ పరిస్ధితి ఇలా ఉంటే జులియన్ అస్సాంజ్ పరిస్ధితి మరోలా ఉంది. జులియన్ అస్సాంజ్ కి ఏదేశంలోనూ నిలువనీడ లేకుండా చేయడానికి అమెరికా అనేక పన్నాగాలు పన్నింది. కానీ ప్రపంచవ్యాపిత్తంగా ఆయనకి ఉన్న మద్దతుదారుల వలన అమెరికా ఆటలు అన్నీ సాగలేదు. జులియన్ అస్సాంజ్ పైన దేశ ద్రోహం లాంటి కేసులు నమోదు చేసింది. గ్రాండ్ జ్యూరీని నియమించి జులియన్ ను అమెరికా రప్పించేందుకు అనువైన కేసులు నమోదు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అమెరికా ప్రభుత్వం కోరింది. జులియన్ స్వీడన్ వెళ్ళినపుడు అతనితో గడిపిన ఇద్దరు మహిళా మద్దతుదారులు అతనిపై రేప్ కేసు నమోదు చేయించారు.

నిజానికి కేసు నమోదు చేసినపుడు జులియన్ స్వీడన్ లోనే ఉన్నాడు. కేసు నమోదైన సంగతిని తెలుసుకుని తన స్టేట్‌మెంట్ తీసుకోవాలని జులియన్, పోలీసులను కోరినప్పటికీ వారు అందుకు సిద్ధపడలేదు. అతనిపై నమోదైన కేసులు నిలిచేవి కావనీ, వాటిలో నిజం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిర్ధారించి కేసును రద్దు చేసారు. ఆ తర్వాత జులియన్ ఇంగ్లండ్ వచ్చాడు. ఈ లోపు స్వీడన్ లోని మరొక నగర పోలీసులు మళ్ళీ కేసు నమోదు చేసి ఇ.యు అరెస్ట్ వారంట్ జారీ చేసారు. దీని వెనుక అమెరికా ఉందన్నది బహిరంగ రహస్యం. స్వీడన్ కి రప్పించుకున్న తర్వాత ఆదేశంపై ఒత్తిడి తెచ్చి అమెరికాకి పంపించే ఏర్పాట్లు చేయాలని అమెరికా ప్రయత్నిస్తున్నదని అమెరికాలోని అనేక ప్రముఖులు జులియన్ కి చెప్పి అమెరికాకి రావద్దని సలహా ఇచ్చారు. దానితో తనను స్వీడన్ కి పంపించ కూడదంటూ జులియన్ బ్రిటన్ కోర్టుల్లో పోరాడుతున్నాడు. చిత్రం ఏమిటంటే ఇప్పటికీ స్వీడన్ పోలీసులు కోరుతున్నది జులియన్ చేత స్టేట్‌మెంట్ నమోదు చేసుకోవాలనే. అదే అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానో, ఆడియో కాన్ఫరెన్సు ద్వారానో చెయ్యవచ్చని జులియన్ కోరినా స్వీడన్ పోలీసులు వినడం లేదు.

జులియన్ కష్టాలు ఇంతటితో ఆగలేదు. వికీలీక్స్ పేపాల్ వద్దా, అమెరికా, స్విట్జర్లాండ్ లలోని బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహిస్తుంది. అమెరికా ఒత్తిడితో  పే పాల్ జులియన్ ఖాతాను స్తంభింపజేసింది. వికీలీక్స్ కి వచ్చే చందాలను బందు చేసింది. స్విట్జర్లాండ్ బ్యాంకుపై కూడా ఒత్తిడి తెచ్చి అక్కడి ఖాతాని స్తంభింప జేసింది. తర్వాత వికీలీక్స్ వెబ్ సైట్ ను హోస్ట్ చేసే సంస్ధపై ఒత్తిడి తెచ్చి హోస్టింగ్ రద్దు చేయించింది. నిరంతరం వికీలీక్స్ వెబ్ సైట్ ను హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అమెరికా. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. అయితే ప్రపంచ వ్యాపితంగా వికీలీక్స్ మిర్రర్ వెబ్ సైట్లు ఉండడంతో అమెరికా చర్యలకు ఫలితం ఉండడం లేదు. ఇటువంటి అమెరికా ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా ప్రజాస్వామ్యం కోసం ఉద్యమాలను ప్రోత్సహిస్తుందనడమ్ ఒట్టి భ్రమ. ఒక వేళ వాటివలన అటువంటి ప్రమాదమే ఉన్నట్లయితే ట్విట్టర్, ఫేస్ బుక్ ల పైన అమెరికా వెంటనే చర్యలు తీసుకుంటుంది. అందులో అనుమానమేమీ లేదు.

ట్విట్టర్, ఫేస్ బుక్, పేపాల్ లాంటి సంస్ధలన్నీ అమెరికా దారుణాలలో భాగస్వాములే. అమెరికా ప్రభుత్వం అన్నన్ని దారుణాలు చేసేది ఇటువంటి బడా బడా కంపెనీల కోసమే. ఆ కంపెనీల లాభాల కోసం, వాటికి అవసరమైన వనరుల కోసమే అమెరికా ప్రపంచంపై పడి యుద్ధాలు చేస్తూ మారణ హోమం సృష్టిస్తోంది. ప్రపంచంలో జరిగే ప్రజాస్వామిక ఉద్యమాలను నలిపి, చిదిమి వేసే చరిత్రే అమెరికాకి ఉన్నది తప్ప కాపాడే చరిత్ర అస్సలు లేనే లేదు.

3 thoughts on “ఈజిప్టు, ట్యునీషియా తిరుగుబాట్లకు ట్విట్టర్, ఫేస్ బుక్ లు సహాయపడ్డాయనడం నిజం కాదు

 1. May be this comment should be here.
  తమ ట్విట్టర్, ఫేస్ బుక్ కంపెనీలు ప్రజాస్వామిక ఉద్యమాలకు దోహదపడుతున్నాయని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్లింటన్ చెబుతూ ప్రచారం చేసుకుంటోంది.
  hahaha!

  మీ పుణ్యమాని కాస్సేపు నవ్వుకున్నాను!
  అమెరికా ఏం చెప్పినా అందరూ నమ్మెయ్యాలి

  మరి వల్ల ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువైతే లేదా వీటిని ఉగ్రవాదులు వాడుకుంటున్నరని తెలిస్తేనో అప్పుడు ఇవి కూడా మా వల్లే అని ఒప్పుకుంటారా!

 2. వాడటంలో తప్పేముంది? మన ప్రయోజనాల వరకే పరిమితమవుతూ ఉన్నంతవరకూ మనం వాటిని ఉపయోగించవచ్చు. పరిమితి దాటితే అది వెనక్కి కొడుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s