ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదిస్తే భారత దేశానికి నష్టకరం -ప్రణాళికా సంఘం


ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదిస్తే దాని ప్రభావం ఇండియాపై తీవ్రంగానే ఉంటుందని భారత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఒక ఇంటర్వూలో తెలిపాడు. సి.ఎన్.బి.సి-టి.వి 18 ఛానెల్ వారు అహ్లూవాలియాతో ఇంటర్వ్యూ చేసినపుడు ఆయన అమెరికా క్రెడిట్ రేటింగ్ కోత గురించి తన అభిప్రాయాలు తెలిపాడు. ప్రపంచ ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం వలన పారిశ్రామిక దేశాల్లో ఉద్భవించే ఏకైన సానుకూల పరిణామం, కమోడిటీ (సరుకుల) ధరలపైన ఒత్తిడి పెరగడమేనని తెలిపాడు. కానీ ఇండియాకి వచ్చేసరికి, ఎగుమతి మార్కెట్లలో ఆర్ధిక వృద్ధి తగినంతగా చోటు చేసుకోవడానికి అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని ఆయన తెలిపాడు. దానితో ఇండియా ఎగుమతులు తగ్గిపోయే అవకాశం ఉందని ఆయన పరోక్షంగా వివరించాడు.

సమ దృక్పధంతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి నెమ్మదిస్తున్న అంశాన్ని పరిశీలించాలనీ చెబుతూ అహ్లూవాలియా, సంక్షోభం వలన ఏర్పడే నికర ప్రభావాలని లెక్కలోకి తీసుకోవాలని వివరించాడు. “సాధారణంగా కలిగే ప్రభావం ఎలా ఉంటుంది? ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధిని కిందికి లాగే అంశం, దానిలో ఉన్న అన్ని ఆర్ధిక వ్యవస్ధలనూ కిందికి లాగుతుంది. కనుక సాధారణంగా అన్ని దేశాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది” అని అహ్లూవాలియా పేర్కొన్నాడు. “ప్రస్తుత ఆర్ధిక సమస్యలపైన జి20 గ్రూపు సరిగా దృష్టి కేంద్రీకరించాలి. సంక్షోభాన్ని పరిష్కరిస్తామన్న భరోసా మదుపుదారులకు బలంగా తెలియజేయాలని ఆయన కోరాడు.

అమెరికా రేటింగ్ తగ్గించడంలో ఆశ్చర్య పడవలసిన విషయమేమీ లేదని అహ్లూవాలియా అన్నాడు. “మార్కెట్లకు ఆ విషయం ముందుగానే తెలుసు. రేటింగ్ చర్యకు దారి తీసిన కారణాలను అమెరికా ప్రభుత్వమే గుర్తించింది” అని అహ్లూవాలియా తెలిపాడు. కానీ వాస్తవం అహ్లూవాలియా చెప్పినదానికి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అమెరికా ప్రభుత్వ అధికారులు అమెరికా క్రెడిట్ రేటింగ్ ని తగ్గించడం పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎస్ & పి కి విశ్వసనీయతే లేదు పొమ్మంటున్నారు. తప్పుల తడకతో నిర్ణయానికి వచ్చిందని ఆరోపిస్తున్నారు. అమెరికా కుబేరుడు వారెన్ బఫెట్, అమెరికా విషయంలో ఎస్ & పి తప్పుడు నిర్ణయానికి వచ్చిందని ప్రకటించాడు. ఇంతమంది ఇలా అంటుంటే రేటింగ్ కోత అమెరికాకి ముందే తెలుసనీ, దానికి కారణాలు కూడా తెలుసనీ చెబుతూ రేటింగ్ కోతకు అమెరికా సిద్ధపడే ఉన్నదన్నట్లుగా అహ్లూవాలియా చెప్పడం అర్ధం కాని విషయం.

రేటింగ్ తగ్గింపు వలన కరెన్సీ మార్కెట్లో ఒదిదుడుకులు తప్పవని అహ్లూవాలియా అన్నాడు. సోమవారం ఆర్.బి.ఐ గవర్నరు ప్రపంచ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు తెలిపాడు. రూపాయి విలువ, విదేశీ మారక ద్రవ్య నిల్వల ద్రవ్యత (లిక్విడిటీ), స్ధూల ఆర్ధిక వ్యవస్ధ స్ధితిగతులపైన వాటివలన పదే ప్రభావాన్ని గమనిస్తున్నట్లు ఆయన తెలిపాదు. సోమవారం మార్కెట్లు తెరిచాక షేర్ మార్కెట్లు దాదాపు 3 శాతం పైగానే కూలిపోయాయి. ఆ తర్వాత కోలుకుని మధ్యాహ్నానికి ఒక శాతం నష్టంతో ఉన్నాయి. మళ్ళీ సాయంత్రం 3 గం.ల సమయానికి 1.65 శాతం నష్టాలతో పడుతూ లేస్తూ ఉన్నాయి.

ఇంత జరుగుతున్నా ఇండియా అర్ధిక మంత్రి భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ మౌలికాంశాలన్నీ (ఫండమెంటల్స్) భేషుగ్గా ఉన్నాయనీ, ఎంత ఉత్పాతాన్నయినా ఎదుర్కొనే సత్తా ఇండియాకి ఉందనీ ఎన్నికల కబుర్లు చెబుతున్నాడు. భారత ఆర్ధిక పరిణామాలను ఇపుడు ఒక్క భారతీయ వ్యాపారస్తులే కాక, భారత ఉద్యోగులతో పాటు విదేశీ మదుపుదారులు కూడా గమనిస్తున్న విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది. లేకుంటే ప్రత్యక్షంగా జరుగుతున్నదానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడ్డానికి కొంతయినా జంకి ఉండేవాడు. ప్రణబ్ ముఖర్జీ ప్రకటనతో కోలుకున్న షేర్లు తర్వాత మళ్ళీ పతనం కావడం గమనార్హం.

అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గిగంపు ఒక రేటింగ్ ఏజన్సీ అభిప్రాయం మాత్రమే. అయినప్పటికీ రెటింగ్ తగ్గింపుకు గణనీయమైన ప్రాధాన్యత ఉంది. దీనివలన పారిశ్రామిక దేశాలు ఆర్ధిక క్షీణతలో ఉన్నాయని చెబుతూ అహ్లూవాలియా తదుపరి ఆరు నెలల్లో జిడిపి వృద్ధి రేటులో 0.25 నుండి 0.50 శాతం వరకూ తగ్గుదల నమోదవుతుందని పేర్కొన్నాడు. “కానీ సాధారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను అస్ధిరపరిచే ఏ పరిణామమైనా చెడ్డ వార్తే. ప్రపంచ నాయకులు తగిన చర్యలు తీసుకోక తప్పదు” అని అహ్లూవాలియా అన్నాడు. విదేశాలలో బడ్జెట్ లోటుపై ఉన్న కేంద్రీకరణ తప్పనిసరిగా భారత దేశ బడ్జెట్ లోటు పైకి కూడా ప్రసరిస్తుంది. భారత దేశ బడ్జెట్ లోటుపై ఇన్‌వెస్టర్లు ఆసక్తి ప్రదర్శిస్తారు” అని అహ్లూవాలియా హెచ్చరించాడు. “ఫిస్కల్ డెఫిసిట్ ని తగ్గించడానికి మనవద్ద ఒక పధకం ఉందని చెప్పగలగాలి. అది ఆర్ధిక వృద్ధికి సానుకూలంగా ఉండగలదని నచ్చ జెప్ప గలగాలి” అని అహ్లూవాలియా చెప్పాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s