ఎస్ & పి రేటింగ్ సంస్ధ అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఒక మెట్టు తగ్గించింది. అమెరికా మార్కెట్లనుండి ట్రేజరీ బాండ్ల వేలం ద్వారా అప్పు సేకరించే విషయం తెలిసిందే. ఆ విధంగా అప్పు సేకరించడానికి జారీ చేసే బాండ్ల రేటింగ్‌ను ఎస్ & పి తగ్గించింది. ఇలా అప్పులకి రేటింగ్ ఉండడం ఏంటో చాలా మందికి అర్ధం కాని విషయం. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించేవరకూ ఈ రేటింగ్‌ల విషయం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. భారత ప్రభుత్వం మార్కెట్ ఎకానమీ ఆర్ధిక సూత్రాలను “నూతన ఆర్ధిక విధానాల” పేరుతో అమలు చేయడం ప్రారంభం అయిన దగ్గర్నుండీ పశ్చిమ దేశాల ఆర్ధిక పదజాలం ఇక్కడ కూడా విస్తృతంగా వ్యాప్తి చెందడం అనివార్యమైంది. సామాన్య పాఠకుల కోసం అమెరికా రుణ సంక్షోభం దరిమిలా దాని క్రెడిట్ రేటింగ్ తగ్గించడానికి సంబంధించి కొన్ని అంశాలను వివరించడానికి ఈ ప్రయత్నం.
- ఎస్ & పి అంటే “స్టాండర్డ్ & పూర్” అని అర్ధం.
- ఎస్ & పి తో పాటు ఫిచ్ (Fitch), మూడీస్ (Moody’s) రేటింగ్ సంస్ధలు ప్రపంచ స్ధాయిలో ముఖ్యమైనవి. ఈ మూడింటి రేటింగ్ లపై ఆధారపడి ఇన్వెస్టర్లు వివిధ దేశాల అప్పు బాండ్లను కొనడానికి నిర్ణయించుకుంటారు. పూర్తిగా రేటింగ్‌ల పైనే ఆధారపడి పెట్టుబడులు పెడతారని రూలేమీ లేదు. కాని రేటింగ్ లు ఒక అవగాహనకు రావడానికి సహాయపడతాయి.
- ఎస్ & పి రేటింగ్ పద్ధతి లో టాప్ రేటింగ్ AAA. ఇది కాకుండా దీని క్రింద ఉండే రేటింగ్ లన్నీ పక్కన + గానీ – గానీ ఉంటాయి. ఇవి సదరు బాండు రేటింగ్ తక్షణ భవిష్యత్తులో ఏవైపుకి మొగ్గు చూపుతున్నదో తెలియజేస్తుంది. + గుర్తు ఉన్నట్లయితే సదరు బాండు రేటింగ్ పెరగడానికి అవకాశాలున్నాయనీ, – గుర్తు ఉంటే రేటింగ్ మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అర్ధం.
- అమెరికా ట్రెజరీ బాండ్ల రేటింగ్ ని AAA నుండి AA+ కి తగ్గించారు. అంటే రెండవ రేటింగ్ ఇస్తూ సమీప భవిష్యత్తులో మళ్ళీ AAA కి పెరిగే అవకాశం ఉందని అర్ధం. కానీ ఎస్ & పిలో సావరిన్ బాండ్ల రేటింగ్ విభాగానికి అధిపతి ఐన డేవిడ్ బీర్స్ అమెరికా రేటింగ్ తగ్గే అవకాశం ఉందని ఫాక్స్ న్యూస్ తో అన్నాడు. ఈ వైరుధ్యం ఏమిటో ఆయన వివరించలేదు.
- ఎస్ & పి రేటింగ్ లు వరుసగా: AAA, AA, A, BBB, BBB-, BB+, BB, B, CCC, CC, C, D. AAA టాప్ రేటింగ్ కాగా, D చివరి రేటింగ్.
- AAA కి ఎస్ & పి ఇచ్చిన నిర్వచనం:> “Extremely strong capacity to meet financial commitments.” అంటే “ద్రవ్య చెల్లింపుల సామర్ధ్యం అత్యధిక స్ధాయిలో శక్తివంతంగా ఉంది” అని చెప్పుకోవచ్చు. రుణ పరిమితి పెంపు ఒప్పందం (బడ్జెట్ కంట్రోల్ యాక్ట్) కుదిరాక ఆ ఒప్పందంలోని అంశాల ద్వారా అమెరికా ఆర్ధిక పరిస్ధితి దీర్ఘకాలంలో ఎలా ఉండబోతున్నదో ఎస్ & పి అంచనా వేసుకుంది. రానున్న పది సంవత్సరాలలొ 4 ట్రిలియన్ డాలర్లు (సంవత్సరానికి $400 బిలియన్లు) బడ్జెట్ లోటు తగ్గించేలా ఒప్పందం కుదరాలని ఎస్ & పి ముందే తెలిపింది. కానీ ఒప్పందం ప్రకారం $2.1 ట్రిలియన్ల మేరకు మాత్రమే బడ్జెట్ లోటు తగ్గించనున్నారు. రేటింగ్ తగ్గించడానికి ఇది ఒక కారణంగా ఎస్ & పి తెలిపింది.
- AA కి ఎస్ & పి ఇచ్చిన నిర్వచనం: Very strong capacity to meet financial commitments. దీనర్ధం, “ద్రవ్య చెల్లింపుల సామర్ధ్యం అధిక స్ధాయిలో శక్తివంతంగా ఉంది,” అని చెప్పుకోవచ్చు. ఎస్ & పి ఉన్నతాధికారి డేవిడ్ బీర్స్ అమెరికా రేటింగ్ పై వ్యాఖ్యానిస్తూ, AAA నుండి AA+ కి రేటింగ్ తగ్గించడం అంత తీవ్రమైన విషయం కాదనీ, అమెరికా రుణ చెల్లింపు సామర్ధ్యంలో స్వల్పంగా వచ్చిన తేడాను మాత్రమే అది ప్రతిబింబిస్తుందనీ” పేర్కొన్నాడు. అయితే, అమెరికా రేటింగ్ మరొక మెట్టు తగ్గే అవకాశాం ఉందని కూడా ఆయన చెప్పడం గమనార్హం.
- మరోసారి గనక అమెరికా రేటింగ్ తగ్గితే అప్పుడు అమెరికా రేటింగ్ A+ ఉంటుంది. A రేటింగ్‌కి ఎస్ & పి ఇచ్చిన నిర్వచనం: Strong capacity to meet financial commitments, but somewhat susceptible to adverse economic conditions and changes in circumstances. దానర్ధం: “ద్రవ్య చెల్లింపుల సామర్ధ్యం శక్తివంతంగానే ఉంది. కాని ప్రతికూల ఆర్ధిక పరిస్ధుతులకూ, పరిస్ధితులలో మార్పులకూ కొంతమేరకు ప్రభావితమవుతుంది” అని. అంటే అమెరికా ట్రెజరీ బాండ్లు అవి ప్రాతినిధ్యం వహించే ఆర్ధిక వ్యవస్ధ త్వరలో అంతర్జాతీయ మార్కెట్లలో సంభవించే ప్రతికూల మార్పులకు తేలికగా ప్రభావితమయ్యే ద్రవ్య సాధనాలుగా (ఎస్ & పి దృష్టిలో) మారబోతున్నాయని అర్ధం చేస్తుకోవచ్చు.
- ఇతర రేటింగ్ సంస్ధలు ఫిచ్, మూడీస్ లు ఎస్ & పి లాగా ఇవే రూపంలో రేటింగ్ ను ఇవ్వవు. అవి తమకంటూ ఒక రూపాన్ని వేరు వేరుగా రూపొంచించుకున్నాయి. ఉదాహరణకి మూడీస్ రేటింగ్ లో టాప్ రేటింగు Aaa. ఆ తర్వాత మూడు రేటింగ్‌లతో కలిసి ఒక సెట్ చొప్పున మూడు సెట్ లను ఏర్పరిచి వాటిని ఇన్వెస్ట్మెంట్ గ్రెడ్ గా పేర్కొంది. అంటీ ఈ రేటింగ్ లు ఉన్న బాండ్లు ఇన్వెస్టర్లకు వివిధ స్ధాయిల్లో అనుకులంగా ఉంటాయని అర్ధం. వాటిలో మొదటిది: Aa1, Aa2, Aa3, రెండోది: A1, A2, A3 మూడోది: Baa1, Baa2, Baa3. ఆ తర్వాత ఐదు మెట్లతో “స్పెక్యులేటివ్ గ్రేడ్” ను మూడీస్ ఏర్పరిచింది. ఈ గ్రేడ్లు ఉన్న బాండ్లలో పెట్టుబడులు పెడితే రిస్క్ తీసుకున్నట్లే అర్ధం. షేర్ మార్కెట్లలో తలపండినవారు ఈ షేర్లతో ఆడుకుంటారు. స్పెక్యులేటివ్ షేర్లు అంటే నిరంతరం జరిగే పరిణామాలకూ, పరిస్ధితులకీ త్వరగా స్పందిస్తూ ఉంటాయి. కొంతమంది బడా షేర్ల ఆటగాళ్ళు స్పెక్యులేటివ్ బాండ్ల వడ్డీలలో తమ బెట్టింగ్ లకు అనుకూలంగా కృత్రిమ పరిస్ధితులు సృష్టించి లబ్దిపొందుతారు. వాటిలో షార్ట్ సెల్లింగ్ ఒకటి. దీనిని ప్రభుత్వాలు చట్టబద్ధం చేయడమే విచిత్రం. కానీ సంక్షోభాలు తీవ్రంగా ఉన్నపుడు ఈ “షార్ట్ సెల్లింగ్”ను ప్రభుత్వాలు నిషేధిస్తుంటాయి.

You see the font size increase in the last point? Would you be able to continue this size?
ఆ సైజు ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. ఒకే పేరాలో రెండు సైజులు వచ్చాయి. ఆ టపాని స్క్రైబ్ ఫైర్ (యాడాన్) ద్వారా పోస్ట్ చేశాను. కార్టూన్లు, గ్యాలరీలు తప్ప అన్నీ దాని ద్వారానే పోస్ట్ చేస్తాను. అవన్నీ మామూలు సైజులోనే వచ్చాయి. ఇదెలా వచ్చిందో నాకు తెలియదు.
మీరు Ctrl + (Ctrl కీ ని నొక్కి పెట్టి + కీని ఒక సారి ప్రెస్ చేస్తే ఒక మెట్టు సైజ్ పెరుగుతుంది. మరొక సారి ప్రెస్ చేస్తే ఇంకొంచెం సైజు పెరుగుతుంది. ఆ విధంగా సైజు సమస్య తీరవచ్చు, సంజయ్ గారూ.