ఎస్ & పి, అమెరికా క్రెడిట్ రేటింగ్‌ తగ్గింపు, తెలుసుకోదగిన కొన్ని అంశాలు -2


 • స్పెక్యులేటివ్ షేర్లను ఆధారం చేసుకుని అనేక షేర్ల కుంభకోణాలు జరిగాయి. భారత దేశంలో హర్షద్ మెహతా కుంభకోణం అతి పెద్దది. తర్వాత కేతన్ పరేఖ్ కుంభకోణం, ఆ తర్వాతా, ముందూ కూడా చిన్నా పెద్దా కుంభకోణాలు జరిగాయి. కొన్ని పత్రికలకెక్కితే, మరి కొన్నింటిని తొక్కిపెట్టారు.
 • అమెరికా, యూరప్ లలో 2007-2009 కాలంలో మొదలైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభమే ఒక పెద్ద కుంభకోణం. అనేక వందల స్పెక్యులేటివ్ కుంభకోణాల ఫలితమే “ప్రపంచ ఆర్ధిక సంక్షోభం” అనే బడా బడా ఆర్ధిక కుంభకోణం. వాల్‌స్ట్రీట్ లో అతిపెద్ద ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకు గోల్డ్‌మేన్ సాచ్, ప్రభుత్వంలోనూ, ట్రెజరీల్లోనూ ఉన్న తమ మనుషలను అండగా పెట్టుకుని అతి పెద్ద కుంభకోణాలకు పాల్పడింది.
 • అంతెందుకు సంక్షోభం సమయంలో అమెరికా ట్రెజరీకి సెక్రటరీగా పని చేసిన హెన్రీ పాల్సన్ గోల్డ్ మేన్ సాచ్ లో మాజీ ఉద్యోగి. ఈయన కాంగ్రెస్ పీకలపైన కూర్చొని 700 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ని ఆమోదింపజేశాడు. దాన్నుండి గోల్డ్ మెన్ సాచ్ తాను కొంత బెయిలౌట్ పొందగా, బెయిలౌట్ పొందిన ఇతర కంపెనీలనుండి కూడా తన వాటాగా వసూలు చేసుకుంది. బెయిలౌట్ల వల్ల పైకి కనపడకుండా అత్యధిక స్ధాయిలో లబ్ది పొందినది ఈ బ్యాంకే. అనేక కంపెనీలను, సంస్ధలను, ఫండ్లనూ ఇది ముంచేసింది. విచారణ కూడా ఎదుర్కొంది. చివరికి కొన్ని మిలియన్ల డాలర్ల జరిమానాతో ఫెడరల్ రిజర్వు సరిపెట్టింది.
 • ఫిచ్ రేటింగ్ లు వరుసగా ఇలా ఉన్నాయి: AAA, AA, A, BBB, BB, B, CCC, CC, C, D, NR. చివరి రేటింగ్ D. NR నాట్ రేటెడ్ అని అర్ధం. దీని రేటింగ్ ను పబ్లిక్ గా చెప్పరని ఫిచ్ రేటింగ్ వ్యవస్ధ సూచిస్తోంది.

అమెరికా క్రెడిట్ రేటింగ్

 • “ఎంత చెట్టుకి అంత గాలి” అన్నట్లు అమెరికా అప్పు హిమాలయాలతో పోటీ పడుతుంది. దాని బడ్జెట్ లోటు కూడా ఆ స్ధాయిలోనే ఉంటుంది. బడ్జెట్ లోటుని కోశాగార లోటు (ఫిస్కల్ డెఫిసిట్) అని కూడా అంటారు. బడ్జెట్ లోటుకీ మొత్తం అప్పుకీ ఉన్న సంబంధాన్ని మొదట గుర్తించవలసి ఉంది.
 • బడ్జెట్ ఒక ఆర్ధిక సంవత్సరానికి రూపొందిస్తారని తెలిసిందే. ఒక సంవత్సరానికి వచ్చే ఆదాయాన్ని, ఆ సంవత్సరంలో దేశానికి అయ్యే ఖర్చునీ పరిగణనలోకి తీసుకుంటూ బడ్జెట్ రూపొందించుకుంటారు. అయితే ఖర్చుకు సరిపోను ఆదాయం రాకపోవచ్చు (రాదు కూడా). (ఆదాయానికి అదనంగా అయ్యే ఖర్చుకోసం అప్పులు చేస్తాయి ప్రభుత్వాలు.) ఇలా ఆదాయానికి, నిర్ధిష్ట సంవత్సరానికి బడ్జెట్‌లో తలపెట్టిన ఖర్చుకీ ఉన్న తేడాను బడ్జెట్ లోటు అంటారు. ఇది కూడా చాలా మందికి తెలిసిన విషయమే. దీనినే తెలుగులో కోశాగార లోటు అనీ, ఆంగ్లంలో ఫిస్కల్ డెఫిసిట్ అనీ అంటారు. బడ్జెట్ లోటు అనడం తక్కువ. ఎక్కువగా ఫిస్కల్ డెఫిసిట్ అనే అంటారు. బడ్జెట్ సంవత్సరాన్ని ఫిస్కల్ ఇయ్యర్ అనీ, లేదా ఫిస్కల్ అని కూడా అంటారు.
 • బడ్జెట్ లోటుని తీర్చడానికి ప్రతి సంవత్సరమూ అప్పు తెస్తారు. ఫిస్కల్ లోటును తీర్చడానికి తెచ్చిన అప్పే ఆ సంవత్సరానికి అప్పుగా తేలుతుంది. ఇప్పటివరకూ గడచిన సంవత్సరాలన్నింటా లోటు పూడ్చడానికి చేసిన అప్పుల మొత్తమే నికర అప్పుగా తేలుతుంది. కనుక బడ్జెట్ లోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్ ల మొత్తమే అప్పుగా తేలుతుందన్నమాట!
 • ఈ కారణంగా ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించడానికీ, అప్పు పరిమితి పెంచడానికి అమెరికా రిపబ్లికన్ పార్టీవారు సంబంధం పెట్టారు.
 • ఒబామా లక్ష్యం అప్పు పరిమితి పెంచడం. పెంచకుంటే ఆగస్టు 2 నుండీ మామూలు ఖర్చులు కూడా జరగవు. రిపబ్లికన్లేమో అప్పు పరిమితిని పెంచినదాని కంటే ఎక్కువగా బడ్జెట్ లోటు తగ్గించాలని పంతం. ఎస్ & పి 4 ట్రిలియన్లు లోటు తగ్గిస్తే రేటింగ్ తగ్గించనని చెప్పింది. నాలుగు ట్రిలియన్ల లోటు తగ్గించి 2.1 ట్రిలియన్లు రుణ పరిమితి పెంచితే నికరంగా 1.9 ట్రిలియన్లు లోటు తగ్గి ఉండేది. కాని 2.1 ట్రిలియన్ల రుణ పరిమితి పెంచి 2.1 ట్రిలియన్లు లోటు తగ్గించడానికి కార్యక్రమం రూపొందించారు. దానితో నికర లోటు తగ్గింపు సున్న గానే తేలింది.
 • దేశ ఆర్ధిక వ్యవస్ధ లోటు తగ్గించడానికి రిపబ్లికన్లకు అంత పంతం ఏమిటి? లోటు తగ్గిస్తే మంచిదేగదా? అన్న అనుమానాలు సహజం. నిజానికి రిపబ్లికన్ల దృష్టి లోటు తగ్గించి తద్వారా దేశ ఆర్ధిక వ్యవస్ధ లోటు తగ్గించడం పైన లేదు. వారి దృష్టంతా లోటు తగ్గించే పేరుతో, సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టడం పైనే.
 • వారి దృష్టి ప్రధానంగా వృద్ధులకు ఇచ్చే మెడి కేర్, పెన్షనర్లకు ఇచ్చే మెడిక్ ఎయిడ్, నిరుధ్యోగ భృతి తదితర సంక్షేమ పధకాలలో కోత విధించాలన్నదానిపైనే ఉంది. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఆదాయం పెరిగే మార్గాలు కూడా చూసుకోవాలి. అందులో కూడా రిపబ్లికన్ల దృష్టి జనాల్ని బాదడంపైనే. పన్నులు ఏమన్నా వేయాలనుకుంటే జనంపైనే వేయాలని వారి పంతం.
 • డెమొక్రట్ల దృష్టి 2012 ఎన్నికలపైన ఉంది. జార్జ్ బుష్ కాలంలో ఆర్ధిక సంక్షోభం పేరు చెప్పి కార్పొరేట్ కంపెనీలకి పన్నుల్లో విపరీతమైన రాయితీలు ఇచ్చారు. సంక్షోభం నుండి కోలుకున్నాం అని అమెరికా ప్రభుత్వం ప్రకటించినా వారి రాయితీల్లో ఒక్క నయాపైసా కూడా రద్దు కాలేదు. ఉద్యోగులకి, వృద్ధులకి ఇచ్చే సంక్షేమ సదుపాయాలు వారు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు. పోరాడి సాధించుకున్న హక్కుల్ని రద్దు చేయాలని రిపబ్లికన్లు చెబుతూ కంపెనీల రాయితీలని మాత్రం తగ్గించొద్దని పంతం పట్టారు. రిపబ్లికన్లకి ప్రతినిధుల సభలో మెజారిటీ ఉంది. కనుక బిల్లు పాస్ కావాలంటే వారిని ప్రసన్నం చేసుకోక తప్పదు. 
 • ఆ విధంగా ప్రతిష్టంభన ఏర్పడింది. చివరికి ఒప్పందం పరిశీలిస్తే రిపబ్లికన్ల పంతం నెగ్గినట్లె స్పష్టం అవుతుంది. ఒబామాకి 2013 వరకూ అప్పు గురించి సమస్యలు తలెత్తకుండా వీలు కలిగింది. డెమొక్రాట్లు పెద్దగా సాధించింది అదొక్కటే. డెమొక్రట్లకి కూడా జనాన్ని బాదడంపైన వ్యతిరేకత లేకపోవడం వల్లే ఈ దారుణ ఒప్పందం కుదిరింది.
 • ప్రస్తుతం అమెరికా అప్పు దాదాపు దాని వార్షిక జిడిపికి సమానంగా ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే జిడిపిలో అప్పు 98 శాతం ఉంది. ఒక అంచనా ప్రకారం ఈ క్షణంలో అమెరికా అప్పు 14.587  ట్రిలియన్లు. వార్ధిక జిడిపి 14.828 ట్రిలియన్లు. 14.587/14.828*100 = జిడిపిలో అప్పు శాతం = 98.37%. ఈ అంకెలు ఫెడరల్ రిజర్వు అందించినవే.
 • అమెరికా మొత్తం అప్పు చూస్తే గుండెలు బాదుకోవలసిందే. మొత్తం అప్పు అంటే, అమెరికన్ల కుటుంబ అప్పులు + వ్యాపార అప్పులు + రాష్ట్రాల అప్పులు + స్ధానిక ప్రభుత్వాల (మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మొ.వి) అప్పులు + ద్రవ్య సంస్ధల అప్పులు + ఫెడరల ప్రభుత్వ అప్పులు. అన్ని కలిపితే 54.9 ట్రిలియన్ డాలర్లు. దీనిని రూపాయిల్లోకి మారిస్తే రు.24.7 కోట్ల కోట్లు.

అమెరికా అప్పు గురించిన మరిన్ని వివరాలు వేరే టపాలో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “ఎస్ & పి, అమెరికా క్రెడిట్ రేటింగ్‌ తగ్గింపు, తెలుసుకోదగిన కొన్ని అంశాలు -2

 1. ఏదైనా ఒక సంఘటన సందర్భంగా రాస్తే అది బాగా అర్ధం కావడానికి అవకాశం ఉంది. ఆర్.బి.ఐ, మానిటరీ పాలసీ సమీక్ష జరిపినపుడు ఓ సారి భారత లోటు, ద్రవ్యోల్బణం గురించి చర్చించాను. మన మార్కెట్ ఎకానమీ పండితులు మన్మోహన్, అహ్లూవాలియా, చిదంబరం, కౌసిక్ బసులు (సుబ్బారావుతో సహా) ఎప్పుడూ ద్రవ్యోల్బణం తగ్గింపు మా మొదటి కర్తవ్యం అని దాదాపు రెండున్నర సంవత్సరాల నుండి చెబుతున్నారు. ఆ పేరుతో వాళ్ళు ఆర్.బి.ఐ వడ్డీరేట్లు పెంచారు గానీ ఇప్పటివరకూ ద్రవ్యోల్బణం ప్రజలకు అందుబాటులో వచ్చేలా తగ్గించలేకపోయారు. ప్రపంచ స్ధాయి ఆర్ధిక విశ్లేషకులు సైతం ఈ పండితులని ద్రవ్యోల్బణం అంశంలో తిట్టి పోసారు. కబుర్లు తప్ప చేసేది లేదని. ఈ అంశాలతో నాలుగైదు సార్లు రాశాను. మళ్ళీ ఏదన్నా సంఘటన జరిగినప్పుడు రాస్తాను.

  మీ ఆసక్తిని అట్టే పెట్టండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s