అమెరికా రేటింగ్ తగ్గింపుతో నిలువునా కూలుతున్న అమెరికా, యూరప్ షేర్ మార్కెట్లు


Traders-outside-New-York-Stock-Exchange

న్యూయర్క్ స్టాక్ ఎక్ఛేంజ్ బైట నిలబడి ఉన్న ట్రేడర్లు

అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గింపుతో ప్రపంచంలోని అన్ని దేశాల షేర్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. జపాన్‌ని భూకంపం, సునామీలు తాకిన రీతిలో ఎస్&పి అమెరికా రేటింగ్ తగ్గింపు, ప్రపంచ షేర్ మార్కెట్లను తాకింది. సోమవారం ఇండియా షేర్ మార్కెట్లను దాదాపు రెండు శాతం పైగా లోయలోకి తోసేసిన ఈ పరిణామం యూరప్ షేర్ మార్కెట్లను రెండు నుండి నాలుగు శాతం వరకూ పతనం చేసింది. ఇక అమెరికా షేర్ మార్కెట్లు సైతం రెండున్నర నుండి మూడున్నర శాతం వరకూ కుప్పకూలాయి.

ఎస్&పి రేటింగ్ తగ్గింపును చిన్న పరిణామంగానూ, పెద్ద తీవ్రమైనది కానట్లుగానూ అభివర్ణిస్తూ తక్కువ చేసి చూపడానికి అమెరికా అధికారులతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, కంపెనీలు ప్రయత్నించినప్పటికీ మార్కెట్లు అవేవీ పట్టించుకోలేదు. అమెరికా రుణ సంక్షోభం తాలూకు ప్రభావాన్ని స్వల్ప కాలికంగానూ, దీర్ఘకాలికంగానూ అంచనా వేసుకున్న ఇన్‌వెస్టర్లు దాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నట్లుగా షేర్ మార్కెట్ల పతనం స్పష్టం చేస్తోంది. అమెరికా రుణ సంక్షోభానికి తోడు యూరప్ అప్పు సంక్షోభం కూడా యూరప్ లో పెద్ద ఆర్ధిక వ్యవస్ధలైన స్పెయిన్, ఇటలీ లకు కూడా వ్యాపిస్తుందన్న భయాలు మార్కెట్లను వణికిస్తున్నాయి. ఇ.యు అధికారులు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు అధికారులు ఎన్ని విధాలుగా ఉపశమన ప్రకటనలు చేసినప్పటికీ మార్కెట్లు శాంతించడం లేదు.

ఎస్&పి సంస్ధ, అమెరికా క్రెడిట్ రేటింగ్‌ని AAA నుండి AA+కు తగ్గించినట్లు ప్రకటించాక సోమవారం నాటి సెషనే మొదటి సెషన్ కావడంతో ఆ చర్య ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఆర్ధిక వ్యవస్ధ ఆరోగ్యంతో నేరుగా సంబంధం ఉన్న ద్రవ్య రంగ షేర్లు (బ్యాంకింగ్, ఇన్సూరెన్స్), కమోడిటీలు తీవ్రంగా పతనమవుతున్నాయి. ప్రతి ఒక్కడి ఇల్లూ తగలబడిపోతోందని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించడాన్ని బట్టి పరిస్ధితిని అంచనా వేసుకోవచ్చు.

అమెరికా ప్రధాన షేర్ సూచిలు డౌ సూచి 2.35 శాతం కూలిపోయి 11,175 వద్ద ట్రేడవుతుండగా, ఎస్&పి సూచి 3.3 శాతం పతనమై 1162 వద్ద ట్రేడవుతోంది. నాస్‌డాక్ సూచి 3.14 శాతం పతనమై 2453 వద్ద ట్రేడవుతోంది. యూరప్ లో ప్రధాన మార్కెట్లయిన జర్మనీ డాక్స్ సూచి 5.02 5923 వద్ద ట్రేడవుతుండగా, ఫ్రాన్సు సి.ఎ.సి సూచి 4.68 శాతం పతనమై 3125 వద్ద ట్రేడవుతోంది. ఇక బ్రిటన్ కి చెందిన ఎఫ్.టి.ఎస్.ఇ 100 సూచి 3.4 శాతం పతనమై 5069 వద్ద ట్రేడవుతోంది.

ఎస్&పి రేటింగ్ తగ్గింపు ఫలితంగా అమెరికాకి రుణాల ఖర్చులు పెరగనున్నాయి. అమెరికా ప్రభుత్వంతో పాటు కంపెనీలు, వినియోగదారులకు కూడా రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. దీనితో అమెరికాలో రుణ లభ్యత గతం కంటే ఖరీదై ఆర్ధిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. సరుకుల కొనుగోలు తో పాటు పెట్టుబడులు కూడా ఖరీదు కావడంతో రెండువైపుల నుండీ ప్రతికూల ప్రభావం పడి ఆర్ధిక వృద్ధి రేటును మరింత క్షీణించనుంది. దానితో మార్కేట్లలో మదుపుదారులు అమ్మకాలకు తెగబడుతూ షేర్ మార్కెట్ల పతనానికి కారణమవుతున్నారు.

గత వారమంతా యూరోజోన్ అప్పు సంక్షోభం భయాలు మార్కెట్లకు కాళ రాత్రులని మిగల్చగా, ఈ వారం వంతు అమెరికా రుణ సంక్షోభానిది అయ్యేటట్లుగా సోమవారం నాటి పరిణమాలు సూచిస్తున్నాయి. యూరప్ అప్పు సంక్షోభం భయాలని తొలగించడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, బాండ్ మార్కెట్లలో జోక్యం చేసుకుని  స్పెయిన్, ఇటలీ బాండ్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా వాటి వడ్డీ రేట్లను (యీల్డ్) తగ్గించినప్పటికీ మార్కెట్లకు సంతృప్తి కలగలేదు. అమ్మకాల ఒత్తిడితో చాలా షేర్లు కొనుగోలుకు ఆకర్షణీయంగా మారాయని మరికొంతమంది ఇల్లుకాలిన చోట బొగ్గులు ఏరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజిలో పతనమైన షేర్లు 33 ఉండగా లాభపడ్డవి కేవలం 2 మాత్రమే. నాస్ డాక్ లో పతనమైన షేర్లు 15 కాగా, లాభపడ్డవి 2 మాత్రమే. షేర్ల పతనాన్ని అడ్డుకోవడానికి న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజి స్పెషల్ రెగ్యులేషన్ అయిన “రూల్ 48” విధించినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s