అసలు ఎస్ & పి విశ్వసనీయత ఎంత? తనదాకా వచ్చాక అడుగుతున్న అమెరికా


Clouds pass over Capitol Hill in Washington

వాషింగ్టన్‌లో ప్రభుత్వ హెడ్‌క్వార్టర్స్ భవనం "కేపిటల్ హిల్" పైన కారు మేఘాలు కమ్ముకున్న దృశ్యం.

తనదాకా వస్తేగాని అర్ధం కాలేదు అమెరికాకి. ఒక దేశానికి చెందిన క్రెడిట్ రేటింగ్ తగ్గించడం అంటే ఏమిటో అమెరికా అధికారులకి, కాంగ్రెస్ సభ్యులకీ, సెనేట్ నాయకులకీ ఇప్పుడు అర్ధం అవుతోంది. అది కూడా పాక్షికంగానే. అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించాక మాత్రమే ఎస్ & పి కి ఉన్న విశ్వసనీయతపైన అమెరికాకి అనుమానాలు వస్తున్నాయి. యూరప్, ఆసియా లకు చెందిన అనేక బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్ధలతో పాటు దేశాల సావరిన్ అప్పులకు కూడా రేటింగ్ లను తగ్గించినపుడు అమెరికాకి చెందిన వాల్‌స్ట్రీట్ కంపెనీలు బాగా లబ్ది పొందాయి. ఆయా సంస్ధలు జారీ చేసే బాండ్లపైనా, సెక్యూరిటీలపైనా, దేశాలు జారీ చేసే సావరిన్ బాండ్లపైనా ప్రతికూల బెట్టింగ్‌లు కాసి అవి పతనం కావడానికి దోహద పడ్డాయి. ఆ కంపెనీలకి అమెరికా ప్రభుత్వం, ట్రెజరీ, ఫెడరల్ రిజర్వ్‌లు ఇతోధికంగా సహాయపడ్డాయి. ఇప్పుడు అమెరికా క్రెడిట్ రేటింగే తగ్గించడంతో మింగలేక, కక్కలేక, చివరికి ఎస్ & పి విస్వసనీయతపైనే అనుమానాలు రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారు.

2007-2009 నాటి ఆర్ధిక సంక్షోభం వరకూ దారితీసిన పరిస్ధితుల్లో ఈ రేటింగ్ సంస్ధలు కూడా ఒక ప్రధాన పాత్రను పోషించాయి. అమెరికాలో పౌరులకు ఇచ్చిన ఇళ్ళ అప్పులను ఆధారం చేసుకుని వాల్‌స్ట్రీట్ కంపెనీలు (ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్ధలు) సంక్లిష్టమైన సెక్యూరిటీలు తయారు చేస్తే అందులో ఏమున్నదీ పట్టించుకోకుండా టాప్ రేటింగ్ లు కేటాయించాయి. కాని అమెరికా ప్రజలకు ఇచ్చిన అప్పుల్లో అనేక అవకతవకలు దొర్లాయి. హౌసింగ్ లోన్లపై ఆధారపడి తయారు చేసిన సెక్యూరిటీలకు ఆదాయం దండిగా వస్తుండడంతో వాల్‌స్ట్రీట్ కంపెనీలు మరిన్ని అప్పులివ్వమని వాణిజ్య బ్యాంకులను ప్రోత్సహించాయి.

హౌసింగ్ లోన్ ఇచ్చేటప్పుడు సాధారణంగా కట్టబోయే లేదా కొనుగోలు చేసే ఇళ్ళను తనఖా పెట్టుకోవడమే కాకుండా, రుణం పొందేవారికి స్ధిరమైన ఉద్యోగం, లేదా ఇతర ఆస్ధులు ఉన్నాయో లేదో చూస్తారు. అవి కాక కోలేటరల్ సెక్యూరిటీ పేరుతో ఇతర ఇన్సూరెన్స్ పాలసీలను కానీ మరే ఇతర సెక్యూరిటీలను గానీ అడుగుతారు. లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న నేపధ్యంలో హౌసింగ్ లోన్లు దండిగా జారీ చేశాక ఒక దశలో కోలేటరల్ సెక్యూరిటీ ఇవ్వగలవారు ఇంక మిగల్లేదు. “అయినా, ఫర్లేదు ఇవ్వండని” వాల్ స్ట్రీట్ కంపెనీలు అత్యాశతో, పేరాశతో ప్రోత్సహించాయి. కొన్ని సంవత్సరాలకి వారి సంఖ్య కూడా ఐపోవడంతో సరైన ఉద్యోగం లేనివారికీ ఇచ్చారు. ఎవరూ ష్యూరిటీ ఇవ్వకపోయినా లోన్లు ఇచ్చేశారు. చివరికి ఏ ఉద్యోగమూ, ఏ సెక్యూరిటీ లేకున్నా హౌసింగ్ లోన్లు ఇచ్చేశారు. అన్ని సెక్యూరిటీలు ఉన్న లోన్లను ప్రైమ్ లోన్ల గానూ, పాక్షిక సెక్యూరిటీలు, లేదా అసలు సెక్యూరిటీలే లేని వాటిని సబ్-ప్రైమ్ లోన్లుగానూ పేరు పెట్టారు.

ప్రైమ్ లోన్లకు అర్హులైన వారి సంఖ్య ఎన్నడో ముగిసిపోగా సబ్-ప్రైమ్ లోన్లపై ఆధారపడి కూడా వాల్ స్ట్రీట్ కంపెనీలు సంక్లిష్టమైన “సూపర్ సెక్యూరిటీలు” (ఇది నేను పెట్టిన పేరు. నిజానికి వాటికి సిడిఓ – కోలేట్రలైజ్డ్ డెట్ ఆబ్లిగేషన్స్ అనీ, సి.డి.ఎస్ – క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ అనీ ఇలా అర్ధం కాని పేర్లు ఉన్నాయి) తయారు చేశారు. వీటికి కూడా టాప్ రేటింగ్స్ ని క్రెడిట్ రేటింగ్ సంస్ధలు ఇచ్చేశాయి. ఇలా అర్హత లేని సెక్యూరిటీలకి కూడా టాప్ రేటింగ్ ఇవ్వడానికి కారణం వాల్‌స్ట్రీట్ కంపెనీలకీ, రేటింగ్ సంస్ధలకీ మధ్య లోపాయకారీ ఒప్పందం కుదరడమే. ఆ తర్వాత సబ్ ప్రైమ్ లోన్లు తీసుకున్నవారు కనీసం మొదటి వాయిదా కూడా చెల్లించకుండా డిఫాల్ట్ అయ్యారు. కాని వాటి ఆధారంగా తయారు చేసిన సూపర్ సెక్యూరిటీల్లో ప్రపంచ వ్యాపితంగా ప్రభుత్వాలు, బ్యాంకులు, అనేకానేక ద్రవ్య కంపెనీలు, ఫండ్స్ కొన్ని ట్రిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు. వీళ్ళందరికీ లోన్ తీసుకున్నవాడు నెలసరి వాయిదాలు చెల్లిస్తేనే లాభాలు లేదంటే అసలుకే మోసం.

సబ్ ప్రైమ్ లోన్లనుండి నెలసరి వాయిదాలు కొంతకాలం వచ్చి ఆగిపోవడం, కొన్నిటికి అసలు వాయిదాలే చెల్లించకపోవడం జరగడంతో సూపర్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టినవారంతా దివాలా తీసే పరిస్ధితి తలెత్తింది. ఏ వాణిజ్య బ్యాంకు చూసినా, ఏ ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకు చూసినా, ఏ మ్యూచువల్ ఫండ్ లేదా హెడ్జ్ ఫండ్ చూసినా, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ చూసినా ఈ సూపర్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టినవే. అంటే ఆదాయాలు లేని పెట్టుబడులు. కనీసం అసలు కూడా రాని పెట్టుబడులు. వీరికి ఉన్న ఒకే ఒక్క గ్యారంటి ఇళ్ళు. అవి అమ్ముకుని నష్టం పూడ్చుకోవాలి. కాని ఒకేసారి లక్షల సంఖ్యలో ఇళ్లు అమ్మకానికి రావడంతో పెద్ద ఇళ్లు సైతం కేవలం కొన్ని వేల డాలర్లకు మాత్రమే అమ్ముకోవాల్సిన పరిస్ధితి ఎదురైంది. ఇంకేముంది ఢమాల్! ఇప్పటికీ ఇంకా బ్యాంకులు దివాళా తీస్తూనే ఉన్నాయి. వాటికి ఇప్పటికీ “ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్” క్లెయిం లు చెల్లిస్తూ, మూసేస్తూ ఉంది. కానీ ఇంత అనర్ధానికి కారణమైన వాల్‌స్ట్రీట్ కంపెనీలు తాము నష్టపోయిన సొమ్ముని ప్రభుత్వం నుండి బెయిలౌట్లుగా పొందాయి. బెయిలౌట్ల డబ్బంతా అమెరికా ప్రభుత్వం అప్పుచేసి తెచ్చిందే.

ఇప్పుడు ఆ అప్పుని కట్టమని ప్రజలపైన భారం వేయడానికి రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు రెండూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దానికి “బడ్జెట్ కంట్రోల్ చట్టం” అని ఒక అందమైన పేరు పెట్టాయి. వాస్తవానికి ఈ రెండు పార్టీలు కిందా మీదా పడింది ప్రజలని గట్టిగా బాదుదామా ఒకమాదిరిగా బాదుదామా లేక మెత్తగా బాదుదామా అని నిర్ణయించుకోవడానికే. రిపబ్లికన్లలో మోడరేట్లు గట్టిగా బాదుదాం అని. వారిలోనే కఠినాత్ములు గట్టిగా వెనకా ముందూ చూడకుండా బాదేద్దాం అని. డెమొక్రట్లలో మోడరేట్లు ఒక మాదిరిగా బాదుదాం అని. డెమొక్రట్లలో మెతక వాదులు మెత్తగా నొప్పి తెలియకుండా బాదుదాం అని. మొత్తం మీద అంతా బాదుదాం అన్నదాంట్లో ఏకాభిప్రాయంతో ఉన్నవారే. ఎంత తీవ్రంగా బాదుదాం అన్నదానిపైనే తేడాలన్నీ. అంతిమ ఒప్పందంలో గట్టిగా బాదుదాం అని నిర్ణయిస్తూ, ఒక మాదిరిగా బాదుదాం అన్నవారి సిఫారసులకు కొంత చోటిచ్చారు. దానితో రిపబ్లికన్లలో కఠినాత్ములు (టీ పార్టీ ఉద్యమకారులు వారి మద్దతుదారులు) బాదుడు అవసరమైనంతగా లేదని బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశారు. రిపబ్లికన్లలో మోడరేట్లు, డెమొక్రట్లలో మోడరేట్లు కలిసి బిల్లుని గెలిపించుకున్నారు. డెమొక్రట్లలో మెతక వాదులు కూడా బిల్లు మరీ కఠినంగా ఉందని వ్యతిరేక ఓట్లు వేశారు.

ఒప్పందం కుదరడానికి కొన్ని రోజుల ముందు ఎస్ & పి, అమెరికా రేటింగ్ తగ్గకుండా ఉండాలంటే 4 ట్రిలియన్ డాలర్ల మేరకు బడ్జెట్ ఖర్చులు తగ్గించాలని చెప్పింది. కానీ ఒప్పందం ప్రకారం 2.1 ట్రిలియన్ల ఖర్చులు తగ్గించడానికి వీలుంది. దానితో ఎస్ & పి అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించక తప్పలేదని చెబుతూ రేటింగ్ ని ఒక మెట్టు తగ్గించింది. ఎస్ & పి లెక్కల్లో ఏవో తప్పులున్నాయనీ, ఆర్ధిక సంక్షోభానికి ముందు కూడా ఈ సంస్ధ తప్పుడు రేటింగ్ లు ఇచ్చి సంక్షోభానికి దోహదం చేసిందనీ అమెరికా అధికారులు, రాజకీయ నాయకులూ ప్రచారం మొదలు పెట్టారు. ఈ మేరకు పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్ధ వార్తను ప్రచురించింది. లెక్కల్లో ఏమన్నా మార్పులుంటే అది ప్రకటనకు ముందే చెబితే పరిగణించేవారమనీ ఇప్పుడు చేసేదేమీ లేదనీ ఎస్ & పి సి.ఇ.ఓ తెలిపాడు. అయితే ఆర్ధిక సంక్షోభానికి ముందు పైన చెప్పుకున్న సూపర్ సెక్యూరిటీలకు టాప్ రేటింగ్ ఇచ్చి ట్రిలియన్ల కొద్దీ పెట్టుబడులను అకర్షించడానికి ఇతర రేటింగ్ కంపెనీలయిన ఫిచ్, మూడీస్ కూడా ఉన్నాయి. అవి ప్రస్తుతానికి అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించకుండా ఉన్నాయి కనుక మంచి రేటింగ్ సంస్ధలు, నిజాయితీ గల సంస్ధలుగా ఉన్నాయన్నమాట!

ఎస్ & పి రేటింగ్ సంస్ధ అమెరికా క్రెడిట్ రేటింగ్‌ని తగ్గించాక ఆ అంశాన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడానికి రిపబ్లికన్లు, డెమొక్రట్లు ఇరువురూ పోటీలు పడుతున్నారు. రిపబ్లికన్ల వల్లనే చర్చలు అన్ని రోజులు సాగాయని డెమొక్రట్ పార్టీ ఆరోపిస్తుంటే, డెమొక్రట్లు ఎంతకీ రాజీకి రాలేదనీ వారి వల్లనే చర్చలు కొనసాగి సాగి రేటింగ్ తగ్గిపోవడానికి కారణమయ్యారని రిపబ్లికన్ పార్టీ ఆరోపిస్తోంది. ట్రెజరీ గానీ, ఫెడరల్ రిజర్వ్ గానీ రేటింగ్ తగ్గింపుని తేలిగ్గా కొట్టిపారేస్తున్నట్లు మాట్లాడారు. అది నిజమో నటనో పరిస్ధితులే తెలుపుతాయి.

ఎస్ & పి సంస్ధ దీర్ఘకాలిక అమెరికా క్రెడిట్ కి రెటింగ్ తగ్గించింది. కాని 10 సంవత్సరాల సావరిన్ బాండ్లపైన 2.5 శాతం మాత్రమే వడ్డీ (యీల్డ్) వస్తున్నదనీ, ఇది చాలా తక్కువేననీ కనుక ఎస్ & పి లెక్కల్లో తప్పుందనీ అంటున్నప్పటికీ రేటింగ్ తగ్గించడం ముగిసింది. ఇక చేసేదేమీ లేదు, నష్టాన్ని లెక్కించడ తప్ప. సెనేట్ లో డెమొక్రట్లదే (స్వల్ప) మెజారిటీ. సెనేట్ మెజారిటీ నాయకుడు హ్యారీ రీడ్ ఏమంటున్నాడో చూడండి. “ఎస్ & పి చర్య, లోటు తగ్గించడానికి సమతులిత పద్దతిలో వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఖర్చుల తగ్గింపుని, రెవిన్యూని పెంచే చర్యలతొ మేళవిస్తే సంతులిత పద్ధతిలో లోటు తగ్గించడానికి వీలుండేది” అని రీడ్ అన్నాడు. ఇక ప్రతినిధుల సభలో రిపబ్లికన్లది మెజారిటీ. వాళ్ళ నాయకుడు, స్పీకర్ జాన్ బొయెనర్ “ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి నియంత్రణ లేకుండా చేసిన ఖర్చులకు తాజా ఫలితమే ఈ రేటింగ్ తగ్గింపు అని పేర్కొన్నాడు.

రిపబ్లికన్లలో మరీ కఠినాత్ములు ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. (ఎలాగూ గీధనర్ తాను రాజీనామా చేస్తానని అర్ధం సంవత్సరం నుండీ చెబుతున్నాడు. ఒబామా ఆయన్ని ఉండు, ఎక్కడికి పోతావ్ అంటున్నాడు.) డెమొక్రట్ నాయకుడొకరు ట్విట్టర్ లో ఇలా రాసుకున్నాడు “ఇది (డెమొక్రట్లు కోరినట్లు కార్పొరేట్లకు ఇస్తున్న పన్ను రాయితీలు తగ్గిస్తూ, మరికొన్ని పన్నులు వేసి ఆదాయం పెంచుకోవడం) జరగలేదు. ఎందుకంటే ఒక భూకంపం మన ఫ్యాక్టరీలని నాశనం చేసింది. ప్లేగు వ్యాది మన కార్మికులని ముంచెత్తింది. అదే కాంగ్రెస్. ముఖ్యంగా రిపబ్లికన్లు మెజారిటీ ఉన్న కాంగ్రెస్.”

ఫాక్స్ న్యూస్ సంస్ధ రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చే పరమ ప్రజా వ్యతిరేక వార్తా ఛానెల్. కార్మికులు, ఉద్యోగులు, రైతులు ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరూ ఉచితంగా ఇరవై నాలుగు గంటలూ కార్పొరేట్ కంపెనీలకు అత్యధిక లాభాలు వచ్చేలా శ్రమిస్తే తప్ప దీనికి సంతృప్తి దొరకదు. అప్పటికైనా దొరుకుతుందో లేదొ అనుమానమే. అటువంటి ఫాక్స్ న్యూస్ నుండి ట్విట్టర్ లో రీట్వీట్ అయ్యిన ఒక పరిశీలన ఇలా ఉంది. “గుర్తుంచుకోండి. బడ్జెట్ ఖర్చులని 4 ట్రిలియన్ డాలర్ల మేరకు తగ్గించడానికి అవకాశం ఉన్న “గొప్ప బేరసారాలకు” ఒబామా సిద్దమయ్యాడు. కాని జాన్ బొయెనర్ బేరసారాలనుండి వెళ్ళిపోయాడు.” దీనర్ధం స్పష్టమే. అందరూ భావిస్తున్నట్లు ఒబామా వృద్ధుల మెడికేర్ కాపాడ్డానికి పెద్దగా పట్టుపట్టలేదు. కార్పొరేట్ల పన్ను రాయితీ తగ్గించడానికీ పెద్దగా ప్రయత్నించలేదు. ఒబామాతో చర్చలని కొనసాగించి ఉంటే 4 ట్రిలియన్ల మేర ఖర్చులు తగ్గించడానికి వీలై ఉండేది. కానీ రిపబ్లికన్ నాయకుడు జాన్ బొయినరే చర్చలనుంచి వెళ్ళిపోయాడని అది తెలియజెప్పుతోంది. అదే నిజమైతే ఒబామా అమెరికన్ ప్రజల్ని నిలువునా మోసం చేశాడని చెప్పవచ్చు.

“తిలా పాపం తలా పిడికెడు” అన్నట్లు అమెరికా సంక్షోభంలో ఉండడానికి, నిరుద్యోగం పెరగడానికి, జీవన స్ధాయి పడిపోవడానికీ రాజకీయ నాయకులూ, కార్పొరేట్లూ, ఉన్నతాధికారులు, రేటింగ్ సంస్ధలు, ద్రవ్య కంపెనీలు అందరూ కారణమే. వీరందరిలోనూ ముఖ్యమైనవారు వాల్‌స్ట్రీట్ కంపెనీల లాంటి కార్పొరేట్ కంపెనీలు, బహుళజాతి కంపెనీలూ, వారికి మద్దతుగా నిలిచిన రాజకీయ నాయకులూనూ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s