తిరుగుబాటులో చీలిక! లిబియా దాడిలో పట్టు కోల్పోతున్న నాటో?


Libya Civil War

లిబియా యుద్ధానికి సంబంధించిన కొన్ని సంగతులు -రాయిటర్స్ కూర్పు

లిబియాలో తిరుగుబాటుగా చెబుతున్న యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్సు, అమెరికాలు వైమానిక దాడులతో మద్దతు, సహకారం ఇస్తున్నప్పటికీ లిబియా తిరుగుబాటుదారులు ముందంజ వేయడంలో విఫలమవుతుండం పశ్చిమ రాజ్యాలను నిరాశకు గురి చేస్తోంది. తిరుగుబాటు ప్రారంభం అయిన ప్రారంభ దినాల్లొనే లిబియా తిరుగుబాటుదారుల పక్షం చేరిపోయిన మిలటరీ కమాండర్ జనరల్ అబ్దెల్ ఫత్తా యోనెస్ హత్యతో లిబియా తిరుగుబాటుదారుల్లో ఉన్న విభేదాలు లోకానికి వెల్లడయ్యాయి. ఫ్రంట్ లైన్ యుద్ధంలో పాల్గొంటున్న కమాండర్ ను వెనక్కి పిలిపించి మరీ హత్య చేయడతో తిరుగుబాటుదారుల లోని విభేధాల తీవ్రత స్పష్టమయ్యింది.

యోనెస్ హత్యలో తిరుగుబాటుదారుల్లోని ఆల్-ఖైదా గ్రూపు హస్తం ఉందని లిబియా ప్రభుత్వ ప్రతినిధి చెబుతున్నాడు. ఆల్-ఖైదా గ్రూపు ఉనికిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు నిరాకరిస్తున్నప్పటికీ తిరుగుబాటుదారుల్లో వారిదే ఆధిక్యం అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. యోనెస్ హత్య జరిగాక హత్యకు గల కారణాలను ఇంతవరకూ తిరుగుబాటు ప్రభుత్వం వెల్లడించలేక పోయింది. క్రింది స్ధాయివారు చేసిన పని అనీ, వారి నాయకుడిని అరెస్టు చేశామనీ తిరుగుబాటు ప్రభుత్వం చెబుతున్నది. అయితే దాని పట్ల యోనెస్‌కి చెందిన తెగ పెద్దలు సంతృప్తి పడలేదని రాయిటర్స్ వార్తాసంస్ధ బుధవారం తెలిపింది.

జనరల్ అబ్దెల్ ఫత్తా యోనెస్ హత్య విషయంలో తిరుగుబాటు దారుల నాయకత్వం సంతృప్తికరమైన వివరణ లభించనట్లయితే శక్తివంతమైన తమ తెగవారు న్యాయాన్ని తమ చేతుల్లోకి తీసుకోక తప్పదని యోనెస్ కుటుంబం మంగళవారం హెచ్చరించిందని రాయిటర్స్ తెలిపింది. యోనెస్ హత్య తిరుగుబాటుదారుల్లో కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలను పశ్చిమ దేశాల్లో రేకెత్తిస్తున్నాయి. తిరుగుబాటుదారులు ఆధారపడదగినవారా లేదా అన్న అంశంలో పశ్చిమ దేశాల ప్రభుత్వాలలో భయాలు వ్యక్తమవుతున్నాయని కూదా రాయిటర్స్ తెలిపింది.

“మౌమ్మర్ గడ్డాఫీ స్ధానంలో ప్రతిష్టించాలని పశ్చిమ దేశాలు ఆశపడుతున్న తిరుగుబాటుదారులు దేశాన్ని పాలించడం అటుంచి, తూర్పు లిబియాలోని తమ ప్రధాన బేస్ లోనే నియంత్రణ సాధించలేని పరిస్ధితిలో ఉన్నారు.” అని స్ట్రాట్‌ఫర్ అనే ప్రఖ్యాత ప్రపంచ స్ధాయి గూఢచార విశ్లేషణా సంస్ధ అభిప్రాయపడడం ఈ సందర్భంగా గమనార్హం.  దానికి తోడు తిరుగుబాటు సైనికులు గత రెండు రోజుల్లో గడ్డాఫీ బలగాల చేతుల్లో నష్టాలను చవి చూశారు. పశ్చిమాన తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్నదని చెబుతున్న మూడవ అతి పెద్ద పట్టణం ‘మిస్రాటా’లో, మంగళవారం, తిరుగుబాటుదారు సైనికుల్లో ఆరుగురు గడ్డాఫీ బలగాల ప్రతిదాడుల్లో చనిపోయారని రాయిటర్స్ తెలిపింది. మరో65 మంది గాయపడ్డారని కూడా ఆ సంస్ధ తెలిపింది. మిస్రాటా వద్ద ఉన్న జిటాన్ పట్టణాన్ని తిరుగుబాటుదారులు వశం చేసుకున్నారని వారం రోజుల క్రితం ప్రకటించినప్పటికీ అక్కడ ఇంకా యుద్ధం జరుగుతోందని విలేఖరులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో అబ్దెల్ యోనెస్ హత్య తిరుగుబాటుదారుల కేంప్ లో అనిశ్చితికి దారి తీసింది.

ఈ పరిస్ధితిని వినియోగించుకోవడానికా అన్నట్లు గడ్డాఫీ “తిరుగుబాటుదారుల పక్షం చేరిన మాజీ ప్రభుత్వ శక్తులు తిరిగి ప్రభుత్వం వైపుకి రావాల”ని పిలుపు నిచ్చాడు. అలా వచ్చినవారికి క్షమాభిక్ష అందించడమే కాక ప్రమోషన్లు, జీతాల పెంపు అందిస్తామని ప్రకటించాడు. నాటో బాంబింగ్ ఆగినా, ఆగకపోయినా తిరుగుబాటుదారులను తుడిచిపెట్టేవరకూ ప్రభుత్వం విశ్రమించబోదని గడ్డాఫి పుత్రుడు సైఫ్ ప్రకటించాడు. నాటో బాంబింగ్ ఆపినట్లయితే కాల్పుల విరమణ అమలు చేస్తామని గతంలో ప్రకటించిన సైఫ్ తాజా ప్రకటనతో తమ ఆఫర్ ను వెనక్కి తీసుకున్నాడని అర్ధం అవుతోంది.

ప్రస్తుతం లిబియా యుద్ధానికి సంబంధించి మూడు చోట్ల ఫ్రంట్ లైన్ యుద్ధాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఒకటి, పశ్చిమాన ట్యునీషియా సరిహద్దులో ఉన్న పర్వతాలలో కొనసాగుతుండగా రెండవది, తూర్పున గల ఆయిల్ పట్టణం బ్రెగా, దానికి దగ్గర్లోనే ఉన్న జ్లిటాన్ పట్టణం చుట్టూరా కొనసాగుతోంది. మూడవది రెబెల్ బలగాల ఆధీనంలో ఉన మిస్రాటా పట్టణం వద్ద కొనసాగుతోంది. ట్యునీషియా సరిహద్దు గుండా పశ్చిమ దేశాలు తిరుగుబాటుదారులకు ఆయుధ సరఫరా చేస్తుండడంతో అక్కడ ప్రభుత్వ బలగాలు చేసిన దాడులు ఫ్రంట్ లైన్ యుద్ధంగా మారింది. ఆయిల్ వనరులపై నియంత్రణ కోసం తిరుగుబాటుదారులు, ప్రభుత్వ బలగాల మధ్య సాగుతున్న ఘర్షణ బ్రెగా, జ్లిటాన్ ల వద్ద ఫ్రంట్ లైన్ యుద్ధానికి దారితీసింది. ఇక మిస్రాటా మూడవ పెద్ద పట్టణమేకాక లిబియాకి గల ఏకైక ఓడరేవు గల పట్నం. దీని ద్వారా కూడా పశ్చిమ దేశాలు తిరుగుబాటుదారులకు ఆయుధాలు, మందుగుండుతో పాటు ఆహార పదార్ధాలను కూడా సరఫరా చేస్తున్నాయి.

లిబియా ఆయిల్ కోసం, అక్కడ తమకు నమ్మకమైన పాలకుడ్ని ప్రతిష్టించడం కోసం పశ్చిమదేశాలు ప్రారంభించిన ఆఘాయిత్య వైమానిక దాడులు ఇప్పటికే అనేక మంది లిబియన్ పౌరులని చంపేశాయి. లిబియా కూడా మరొక ఇరాక్, మరొక ఆఫ్ఘనిస్ధాన్ లేదా మరొక వియత్నాం లాగా పరిణమిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే పశ్చిమ దేశాలకు మరొక గుదిబండ తగులుకున్నట్లే. ఇప్పటికే బలహీనపడిన వారి ఆర్ధిక వ్యవస్ధలు మరింతగా కునారిల్లడం ఖాయంగా కనిపిస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s