ల్యాప్ టాప్‌ విసిరేస్తూ, చెంప ఛెళ్ళుమనిపిస్తూ, పదవీవియోగ నైరాశ్యంలో యెడ్యూరప్ప


కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న బి.ఎస్.యెడ్యూరప్ప పదవీ వియోగంతోనో మరి దేనివల్లనో అదుపు తప్పినట్లు కనిపిస్తోంది. బి.జె.పి మాజీ అధ్యక్షుడూ వెంకయ్య నాయుడు ల్యాప్ టాప్‌ లాక్కొని మరీ నేలకు విసిరికొట్టి ఆయనపై యెడ్యూరప్ప ఆగ్రహం ప్రకటించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇంటివద్ద తనను కలవడానికి వచ్చిన పార్టీ నాయకుడొకరిని చెంప ఛెళ్ళుమనిపించిన సంగతి కూడా ఆ పత్రిక వెల్లడించింది.

ఇండియా టుడే కధనం ప్రకారం, యెడ్యూరప్ప తనకు మద్దతు తెలుపుతూ రాసిన ఒక లేఖపై సంతకం చేయాలని వెంకయ్య నాయుడుని కోరాడు. అందుకు వెంకయ్య నాయుడు తిరస్కరించాడు. అంతే, యెడ్యూరప్పకు కోపం నసాళానికి అంటింది. వెంకయ్య నాయుడు చేతిలో ఉన్న ల్యాప్ టాప్‌ ని లాక్కొని నేలకేసి విసిరి కొట్టాడాయన. పార్టీ సమావేశంలోనే ఈ సంఘటన జరగడం గమనార్హం. లలిత్ అశోక్ హోటల్ లో ఈ సంఘటన జరిగింది. అక్కడే వెంకయ్య నాయుడు ప్రభృతులు యెడ్యూరప్పను రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ శతపోరారు. ఆ తర్వాత ఇంటి వద్ద తనను కలవడానికి వచ్చిన పార్టీ నాయకుడిని మాటల సందర్భంలోనే కోపాన్ని ఆపుకోలేక చెంప మీద కొట్టినట్లు తెలిసింది.

రెండు సంఘటనలు పార్టీ కార్యకర్తల ముందే జరిగాయి. గతంలో కూడా పార్టీ అధికారులతో యెడ్యూరప్ప ఇలాగే ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయి. పార్టీ పెద్దలు ఆయనను తన కోపాన్ని నియంత్రించుకోవాలని అనేక సార్లు కోరడం కూడా జరిగిందని తెలుస్తోంది. యెడ్యూరప్ప పాలన సైతం అనేక సమస్యలతో, గండాలతో సాగింది. మూడుసార్లు తిరుగుబాట్లను చవిచూశాడు. బెంగుళూరులోనూ, దాని చుట్టుపక్కలా ప్రధాన భూముల్ని తన కొడుకు, కూతుళ్లకు కట్టబెట్టడం, అక్రమ ఇనుప గనుల మైనింగ్‌కి అనుమతించడం, అక్రమ మైనింగ్‌లొ ఉన్న కంపెనీలనుంది లబ్ది పొందడానికి తన కుమారులను అనుమతించడం, బి.జె.పి పక్షానికి రావలసిందిగా జె.డి (ఎస్) పార్టీ ఎం.ఎల్.ఎ లను ఆకర్షించడం… ఇవన్నీ యెడ్యూరప్ప మార్కు సమస్యలే.

తన కూతురు, కొడుకులకు భూములను అక్రమంగా కట్టబెట్టిన ఆరోపణలు వెల్లువెత్తిన తరుణంలో బి.జె.పి అధ్యక్షుడు యెడ్యూరప్పను వెనకేసుకొచ్చాడు. యెడ్యూరప్ప చేసింది నైతికంగా సరైంది కాకపోవచ్చు గానీ, చట్టపరంగా సరైందేనని గడ్కారీ ప్రకటించి యెడ్యూరప్పకు మద్దతుగా వచ్చాడు. అయితే యెడ్యూరప్ప చర్యల చట్ట విరుద్ధతను లోకాయుక్త సంతోష్ హెగ్డే నిరూపించాడు. తన నివేదికలో యెడ్యూరప్ప ఎన్నెన్ని తప్పుడు చర్యలకు పాల్పడిందీ పూస గుచ్చాడు. అవినీతికి పాల్పడినందుకు ఆయన్ని విచారించాలని సిఫారసు కూడా చేశాడు. పాత ఆరోపనలేనని యెడ్యూరప్ప తప్పించుకోజూసినా, గడ్కారీ అంగీకరించక వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించాడు. ఆషాఢ మూఢం అంటూ ఆదివారం వరకు తాత్సారం చేసిన యెడ్యూరప్ప చివరికి రాజీనామా చేయక తప్పింది కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s