ముదిరిన సి.ఐ.ఎ, ఐ.ఎస్.ఐ ల విభేధాలు, ఐ.ఎస్.ఐ ఛీఫ్ రహస్య చైనా పర్యటన


అమెరికా, పాకిస్ధాన్ ల సంబంధాలు రోజు రోజుకీ జఠిలంగా మారుతున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం సాగిన యాభై సంవత్సరాల పాటు అమెరికాకి దక్షిణాసియాలో నమ్మకమైన బంటుగా ఉంటూ వచ్చిన పాకిస్ధాన్‌తో, అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఒకవైపు ఇండియా, రష్యాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందగా, మరొక వైపు పాకిస్ధాన్, అమెరికాల మధ్య సత్సంబంధాలు అభివృద్ధి చెందాయి. స్నేహ సంబంధాలు అనడం కంటే, భారత్, పాకిస్ధాన్‌ల పాలక వర్గాలు తమ తమ అవసరాల కోసం రష్యా, అమెరికా ల పంచన చేరాయనడం సరిగ్గా ఉంటుంది. భారత్, పాక్‌ల దాయాది వైరం రష్యా, అమెరికాలకు ఆయుధాలు అమ్మకం రూపంలో బాగా కలిసి వచ్చింది.

ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక రష్యా ప్రాబల్యం క్షీణించడంతో పాకిస్ధాన్‌తో అమెరికాకి ఇక అవసరం లేకపోయింది. మరొకవైపు రష్యా క్షీణత, భారత్ కు మరొక పెద్దన్నయ్యను వెతుక్కోవలసిన పరిస్ధితి ఎదురయ్యింది. రష్యా పరిస్ధితి క్షీణించాక మిగిలింది ఒకే ఒక పెద్దన్నయ్య అమెరికా. దానితో అప్పటినుండి అమెరికా, భారత్‌ల మధ్య స్నేహ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. యూరోపియన్ యూనియన్ అభివృద్ధి, యూరోజోన్ ఏర్పాటు తదితర పరిణామాలతో యూరప్ పైన అమెరికా పట్టు నెమ్మదిగా జారిపోవడం మొదలైంది. అమెరికా ఆధిక్యాన్ని ప్రశ్నిస్తూ జర్మనీ, ఫ్రాన్సుల నేతృత్వంలోని యూరోపియన్ యూనియన్ ముందుకు రావడంతో ప్రపంచ అధిపత్య పోరాటం ఆసియా, ఆఫ్రికాల పైకి మళ్ళింది. ఆసియా, ఆఫ్రికాల పైన ఆధిపత్యం కోసం అమెరికా, యూరోపియన్ యూనియన్ ల మద్య అంతర్గత ఘర్షణ తీవ్రమైంది. ఆధిక్యం కోసం ఈ రెండింటితో పరిమితంగానైనా జపాన్ కూడా పోటీ పడింది.

ఆఫ్రికాలో అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల మధ్య ఆధిపత్య ఘర్షణలు వివిధ రూపాల్లో కొనసాగుతుండగా, ఆసియాలో చైనా ప్రాబల్యాన్ని, మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యాన్ని తట్టుకుంటూ ఇజ్రాయెల్ ప్రాబల్య పరిరక్షణ కోసం ఏదో ఒకటి చెయ్యవలసిన అవసరం అమెరికాకి ముందుకొచ్చింది. అమెరికాలో ఆర్ధిక సంక్షోభం లోపలి నుండి తొలిచి వేస్తున్న పరిస్ధితులు తీవ్రమై అధిక ఉత్పత్తి సంక్షోభ పరిష్కారం కోసం స్ధిరమైన మార్కెట్లను వెతుక్కోవలసిన అగత్యం కూడా అమెరికాకి ముందు కొచ్చింది. ఈ నేపధ్యంలోనే న్యూయార్క్ నగరంలో టెర్రరిస్టు దాడులు జరిగాయి. ఈ దాడుల వెనక అమెరికాకి చెందిన ఒక సెక్షన్ పాలకవర్గాలే ఉన్నారన్న ఆరోపణలు ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. సెప్టెంబరు 11 దాడుల వెనక ఎవరున్నదీ, ఎవరు లేనిదీ ఒక అంశం కాగా, అమెరికా తన సంక్షోభాల పరిష్కారం కోసం ఆక్రమణ యుద్ధాలకు తెగబడడానికి అవి అవకాశాన్నిచ్చాయన్నది ‘దాచేస్తే దాగని సత్యం.’

ఈ సెప్టెంబరు 11 దాడుల అనంతరం అమెరికా ఆఫ్ఘనిస్ధాన్‌, ఇరాక్‌లపై సాగించిన దురాక్రమణ యుద్ధాల ద్వారా కొన్ని లక్ష్యాలను సాధించదలుచుకుంది. పైన చెప్పినట్లు మధ్య ప్రాచ్యంలో ఉనికిని సంపాదించడం ద్వారా ఇరాన్ ప్రాబల్యం విస్తరించకుండా అడ్డుకోవడం, ఇజ్రాయెల్ భద్రత పేరుతో పాలస్తీనా అరబ్ ప్రజల ఉద్యమాలను అణచివేయడం, పాలస్తీనా అరబ్బులకు అరబ్ దేశాల ప్రజల్లో సంఘీభావం అభివృద్ధి చెందకుండా ఎత్తుగడలు పన్నడం, ఆసియాలో అంతకంతకూ తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంటూ దూకుడుగా వస్తునదని భావిస్తున్న చైనాపై నిఘా వెయ్యడం వీలయితే చైనా ఆయుధ సంపత్తి దాని చుట్టుపక్కల గల సముద్ర ప్రాంతాల్లో మోహరించకుండా కాపలా కాయడం, ఇండియాల ఎదుగుదలపైన ఒక కన్నేసి ఉంచడం, పాత సోవియట్ ప్రాంతాల్లో రష్యా ప్రాబల్య విస్తరణకు వ్యతిరేకంగా పని చేయడం వీలయితే పాగా వేయడం… ఇవన్నీ ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధాల ద్వారా అమెరికా సాధించదలుచుకున్న లక్ష్యాలు.

ఫలితంగా అవసరం లేదనుకున్న పాకిస్ధాన్ మళ్లీ అక్కరకొచ్చింది. టెర్రరిజం పై ప్రపంచ యుద్ధంలో పాకిస్ధాన్‌ని నమ్మకమైన భాగస్వామిగా ఎంచుకుంది. పేరుకు టెర్రరిజంపై యుద్ధం ఐనా, అది వాస్తవానికి పై లక్ష్యాలను సాధించడానికి అమెరికా పన్నిన పన్నాగం. యూరప్ దేశాలు కూడా ఈ వేటలో భాగం దక్కించుకోవడానికి అమెరికాతో జత కట్టాయి. ఆ విధంగా పాకిస్ధాన్ గత పది సంవత్సరాలుగా అమెరికాకి వ్యూహాత్కక భాగస్వామిగా పని చేసింది. కాని పాక్ సహకారం ద్వంద్వ పద్దతులతో సాగింది. ఓ వైపు అమెరికాకి సహకారం అందిస్తూ అమెరికానుండి సాయం పొందడం, మరొవైపు ప్రాంతీయంగా ప్రాబల్యం సంపాదించడానికి ఆఫ్ఘన్ తాలిబాన్ తదితర సంస్ధలతో రహస్య స్నేహ సంబంధాలు కొనసాగించడం.

ఇది తెలిసినా అమెరికా తన ప్రయోజనాల కోసం పాక్ తో స్నేహం కొనసాగించింది. పాక్ సహకారంతో అమెరికా ఆఫ్ఘన్, పాకిస్ధాన్ లలో నరమేధం సాగించింది. లక్షల మందిని చంపి, మరిన్ని లక్షల మందిని జీవచ్ఛవాలుగా మార్చింది. ఇప్పుడు ఇరాక్ ఎంతకీ ఆరని రావణ కాష్టం. అమెరికా పుణ్యమాని మత ఘర్షణలు, జాతి వైషమ్యాలు, తెగల ఘర్షణలు ఇరాక్‌లో రోజువారి జీవనంగా మారిపోయాయి. అమెరికా హామీ ఇచ్చిన ప్రజాస్వామ్యం లేకపోగా అరాచకం రాజ్యమేలుతోందక్కడ. ఇరాక్‌ యుద్ధం ద్వారా ఫలానాది సాధించాను అని చెప్పుకోవడానికి ఇప్పుడు అమెరికాకి ఏమీ మిగల్లేదు, యుద్ధ ఖర్చులు, వాటి వలన పైబడిన అప్పులు, బడ్జెట్ లోటులు తప్ప.

కాని పాకిస్ధాన్ ప్రజలు పాకిస్ధాన్ పాలకులకి పాఠాలు నేర్పితే, ఆఫ్ఘనిస్ధాన్ ప్రజలు అమెరికాకి పాఠాలు నేర్పారు, ఇంకా నేర్పుతూనే ఉన్నారు. ఇరాక్‌లో పాక్షిక ఉపసంహరణ ముగిసింది. అమెరికా సైనిక స్దావరాలు అనేక ఒత్తిళ్ళ మధ్య, దిన దిన గండాల మధ్య కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్‌లో కూడా పాక్షిక ఉపసంహరణకి తెరలేచింది. అందుకు వీలుగా ఎప్పటినుండో అమెరికాకి అందకుండా తప్పించుకు తిరుగుతున్న ‘ఒసామా బిన్ లాడెన్’ అమెరికా కమెండోల చేతికి చిక్కి హతమయ్యాడు. ఆఫ్ఘన్ యుద్ధం ఎలాగూ గెలవని యుద్ధమేనని సైనిక జనరళ్లంతా ముక్త కంఠంతో చెవినిల్లు కట్టుకుని పోరుతుండగా, రానున్న ఎన్నికల కోసం వారి మాటను ఒబామా ఆలకించాడు. ఫలితంగా వరుసగా ఒసామా హత్య, తాలిబాన్‌తో చర్చల అంకం తెరమీదికి వచ్చాయి.

వీటితో పాటు పాకిస్ధాన్ అమెరికాల సంబంధాలలో కొన్ని పరిణామాలు వేగంగా జరుగుతూ వచ్చాయి. జనవరిలో ఒక సి.ఐ.ఎ గూఢచారి ఇద్దరు పాకిస్ధానీ పౌరులను కాల్చి చంపడం, ఫలితంగా అప్పటికే పాక్‌లో కొనసాగుతున్న అమెరికా వ్యతిరేక ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడం జరిగింది. తమ ఇళ్ళ పక్కనే తమ మధ్యే పాక్ యువతుల్ని పెళ్ళి కూడా చేసుకుని నివసిస్తున్న అమెరికన్లు వాస్తవానికి సి.ఐ.ఎ ఏజంట్లని పాక్ ప్రజలకు స్పష్టంగా అర్ధం అయ్యింది. అబ్బొత్తాబాద్ లో ఒసామా హత్య జరిగిందని చెప్పాక పాక్ ప్రజల ఆగ్రహం మరింత పెరిగింది. ఇద్దరు పాక్ పౌరుల్ని చంపిన సి.ఐ.ఎ గూఢచారిని ఏ శిక్షా లేకుండా ప్రభుత్వమే రహస్యంగా పంపించడం వారి ఆగ్రాహాన్ని ఇంకా తీవ్రం చేసింది. ఈ పరిణామాల మధ్య పాకిస్ధాన్‌లో అమెరికా వ్యతిరేకత తీవ్రమై పాక్ పాలకుల మీద ఒత్తిడి పెరిగింది. దానితో పాక్ ప్రభుత్వం దాదాపు 90 మందికి పైగా సి.ఐ.ఎ ఏజంట్లను వెనక్కి పంపించింది. వారిని మళ్ళీ అనుమతించాలని సి.ఐ.ఎ ఛీఫ్ స్వయంగా వచ్చి కోరినా ఐ.ఎస్.ఐ అనుమతించడానికి ధైర్యం లేకపోయింది.

ఇక పాక్‌‌పై అమెరికా ఆరోపణలు మొదలయ్యాయి. ఒసామా బిన్ లాడెన్ పాక్‌లో ఉన్న సంగతి ఐ.ఎస్.ఐ కి తెలుసునంది. తాలిబాన్‌తో ఐ.ఎస్.ఐ రహస్య సంబంధాలు కొనసాగిస్తున్నదని ఆరోపించింది. పాక్ ఆర్మీలో కూడా తాలిబాన్, ఆల్ ఖైదా సానుభూతిపరులున్నారని ఆరోపించింది. టెర్రరిజం అణవివేతకు పాక్ సరిగా సహకరించడం లేదనీ ఇంకా సహకరించాలనీ గుడ్లురిమింది. ఇవన్నీ పాకిస్ధాన్ పట్ల అమెరికాకి ఉన్న అవసరం తీరిందా అన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఓవైపు పాక్‌తో ఘర్షణ రీతిలో వ్యవహరిస్తూనే, మరోవైపు ఇండియాను సాదటం మొదలు పెట్టింది. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ఇండియా పర్యటనలో ఉండగా, అమెరికా ప్రతినిధుల సభలో కాశ్మీరు స్వతంత్రం కోసం లాబీ నడుపుతూ ఐ.ఎస్.ఐ నుండి సొమ్ము తీసుకుని అమెరికా కాంగ్రెస్ సభ్యులకు ఇస్తున్నాడని ఆరోపిస్తూ కాశ్మీరు ప్రతినిధిని అరెస్టు చేసింది. వాస్తవానికి అమెరికాలో లాబియింగ్ నేరం కాదు. ఆయన కాశ్మీరు స్వతంత్రత కోసం అమెరికా కాంగ్రెస్, సెనేట్ సభ్యులకు అవగాహన కల్పించడానికి ఎప్పటినుండో కృషి చేస్తున్నాడు. అవన్నీ అమెరికాకి తెలుసు. భారత మేధావులు, రాయబారులు కూడా అనేకులు ఆయన ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరు కావడం మామూలు విషయం. అటువంటిది అకస్మాత్తుగా ఆయన్ని అరెస్టు చేయడం ఇండియాని ఊరించడానికేనని ప్రపంచ రాజకీయ విశ్లేషకులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

పరిస్ధితిని అర్ధం చేసుకున్న పాకిస్ధాన్‌ ప్రత్యామ్నాయాల వెతుకులాటలో పడింది. ఆర్ధిక వ్యవస్ధ ఛిద్రమై అమెరికా విదిల్చే డాలర్లపైనే ఆధారపడ్డ పాకిస్ధాన్ పాలకులకు కొత్త పోషకుడు కావాలి. అక్కడే పాకిస్ధాన్ చైనాను దర్శించుకుంది. అమెరికాపై ఆధారపడడాన్ని తగ్గిస్తూ చైనాపై ఆధారపడడాన్ని పెంచాలని నిర్ణయించుకున్నట్లుగా దాని చర్యలు తెలుపుతున్నాయి. అమెరికా, పాక్ ల మిలట్రీ సంబంధాలు దెబ్బతింటున్న నేపధ్యంలో పాక్ మిలట్రీ అధికారుల చైనా పర్యటనలు ఎక్కువయ్యాయి. ఐ.ఎస్.ఐ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షుజా పాషా ఇటీవల రహస్యంగా చైనా సందర్శించాడని ఎ.ఎన్.ఐ వార్తా సంస్ధ అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది. అంతకు ముందు కొన్ని వారాల క్రితం పాకిస్ధాన్ మిలట్రీలోని సీనియర్ కమాండర్ ఒకరు బీజింగ్ వెళ్ళి వచ్చాడని కూడా తెలుస్తోంది.

గత నెలలో ఛీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వహీద్ అర్షద్, వారం రోజుల పాటు చైనా పర్యటించి వచ్చాడనీ, “పాక్, అమెరికాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాల రీతిలోనే చైనాతో కూడా ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలను పరిశీలించడానికే” వహీద్ ఆ పర్యటన సాగించాడనీ పాక్ అధికారులు తెలిపినట్లుగా వార్తా సంస్ధ తెలిపింది. ఇస్లామాబాద్‌లో పని చేస్తున్న సి.ఐ.ఎ స్టేషన్ ఛీఫ్ అనూహ్యంగా పాకిస్ధాన్ నుండి వెళ్ళి పోవడం, ఆ వెంటనే వహీద్ చైనా పర్యటన పెట్టుకోవడం గమనించవలసిన అంశాలు. వ్యక్తిగత ఆరోగ్య కారణాల రీత్యా సి.ఐ.ఎ స్టేషన్ ఛీఫ్ అమెరికాకి తిరిగి వచ్చాడని అమెరికా ప్రకటించినప్పటికీ దానిని ఎవరూ నమ్మడం లేదు.

“ఆదివారం సాయంత్రం జనరల్ పాషా బీజింగ్ వెళ్లనున్నాడు” అని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక ఒక భద్రతాధికారిని ఉటంకిస్తూ పేర్కొంది. ఆయన వివరాలు ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ జనరల్ షుజా పాషా పర్యటన కారణాలు ఊహాలకు అతీతమైనవేవీ కావు. ఇవిలా ఉండగానే గత రెండు రోజులుగా అమెరికా, పాక్ ల మద్య తాజా వివాదం తలెత్తింది. పాకిస్ధాన్‌లో అమెరికా రాయబారుల కదలికలపై నిబంధనలు విధిస్తూ పాక్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (ఇటువంటి ఉత్తర్వులు భారత అధికారులు గానీ ప్రభుత్వం గానీ ఏ పరిస్ధితుల్లో నైన ఇవ్వగలరా అన్నది ఊహాతీతమైన విషయం). అమెరికాకి చెందిన దాదాపు 14 గూఢచార సంస్ధలు గూఢచర్య కార్యకలాపాల్లో మునిగి ఉన్నా, చాలక, అమెరికా రాయబారులు కూడా అదే పనిలో మునిగి ఉంటారు. ఆ విషయం వికీలీక్స్ బైటపెట్టిన డిప్లొమేటిక్ కేబుల్స్ ద్వారా వెల్లడయిన సంగతి విదితమే. కనుక అమెరికా రాయబారుల కదలికలపై నిబంధనలు విధించడం పాక్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన చర్యగా పేర్కొనక తప్పదు.

అమెరికా – పాక్ ల మధ్య పెరుగుతున్న దూరం, పాక్ – చైనా ల మధ్య పెరుగుతున్న చెలిమి, భారత్ – చైనా ల మధ్యా భారత్ – పాక్ ల మధ్యా ఇప్పటికే ఉన్న సుదూరాలు ఇవన్నీ వెరసి అమెరికా – భారత్ ల మధ్య దూరాన్ని తగ్గిస్తూ వాటి మధ్య చెలిమి పెరగడానికి దోహద పడుతున్నది. అమెరికాతో స్నేహం దృతరాష్ట్ర కౌగిలిలాంటిదని భారత పాలకులు అర్ధం చేసుకోవడానికి తగినన్ని ఉదాహరణలు చరిత్రలో బోల్డన్ని దృష్టాంతాలు నమోదై ఉన్నాయి. అయితే అమెరికా దృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకునేది భారత ప్రజలే తప్ప భారత పాలకులు కాదు. కనుక అందుకు భారత పాలకులు అభ్యంతరం చెప్పబోరు. అంతిమంగా అమెరికా సాన్నిహిత్యంలో, అమెరికా స్నేహ సంబంధాలలో పాక్ ప్రజలు ఇప్పటివరకూ ఎదుర్కొన్నట్లుగానే అనేక కష్ట నష్టాలను ఎదుర్కోవడానికి భారతీయులు సిద్ధంగా ఉండాలి. అందుకు ఇష్టపడకపోతే భారతీయులు సైతం అమెరికా కౌగిలికి వ్యతిరేకంగా ఆందోళనలకు పోరాటాలకు సంసిద్ధం కావలసి ఉంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s