మరింత క్షీణిస్తున్న భారత ఆర్ధిక వృద్ధి, లక్ష్య సిద్ధి అనుమానమే


భారత దేశ ఆర్ధిక వృద్ధి మరింత క్షీణిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రంగాల్లో ఉత్పత్తి పెరుగుదల రేటు తగ్గిపోతుండడంతో జి.డి.పి వృద్ధి రేటు అంచనా వేసిన దానికంటే తక్కువే నమోదు కావచ్చని ప్రభుత్వంలోని ఆర్ధిక సంస్ధలు, పరిశీలకులు భావిస్తున్నారు. దానితో గతంలో విధించుకున్న జిడిపి వృద్ధి రేటు లక్ష్యాన్ని ప్రభుత్వం తగ్గించుకుంటోంది. జి.డి.పి వృద్ధితో పాటు మార్చి 2011 నాటికి చేరాలని భావిస్తున్న బడ్జెట్ లోటు (ఫిస్కల్ డెఫిసిట్), ద్రవ్యోల్బణం తదితర లక్ష్యాలను కూడా ప్రభుత్వం తగ్గించుకుంటోంది.

జులై నెలలో ఫ్యాక్టరీల ఉత్పత్తి గత 20 నెలల్లో అత్యల్పంగా నమోదైందని సోమవారం వెల్లడయిన గణాంకాలు తెలుపుతున్నాయి. ఇండియాలో అత్యధిక సంఖ్యలో కారులు ఉత్పత్తి చేసే మారుతి కంపెనీ అమ్మకాలు తీవ్రంగా పడిపోయాయి. దానితో ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా బృందం, ప్రస్తుత సంవత్సరానికి జిడిపి వృద్ధి రేటు అంచనాను తగ్గించుకుంది. ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా కౌన్సిల్ ఇప్పటివరకూ భారత ఆర్ధిక వృద్ధి రేటు ప్రస్తుత సంవత్సరంలో 9 శాతం ఉంటుందని అంచనా వేస్తూ వచ్చింది. దాన్ని ఇప్పుడు 8.2 శాతానికి తగ్గించుకుంది. రిజర్వ్ బ్యాంకు రెండు నెలల క్రితమే 2011-12కి గానూ భారత ఆర్ధిక వృద్ధి 8 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేసింది.

బడ్జెట్ లోటు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం చివరికి జిడిపిలో 4.6 శాతానికి తగ్గించాలని ప్రధాని ఆర్ధిక సలహా కౌన్సిల్ లక్ష్యంగా పెట్టుకోగా, దానిని ఇప్పుడు 4.7 శాతానికి పెంచుకుంది. రెవిన్యూ ఆదాయం పెంచుకోవడంతో పాటు, ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోక పోతే బడ్జెట్ లోటు లక్ష్యం చేరుకోవడం కష్టకని కౌన్సిల్ హెచ్చరించింది. ప్రవేటు ఆర్ధిక విశ్లేషకులు, ఆర్ధికవేత్తలు మొదటినుండి బడ్జెట్ లోటు లక్ష్యం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చివరికి వారి అనుమానాలు నిజమేనని ప్రధాని ఆర్ధిక సలహా మండలి సవరణలు చెప్పినట్లయ్యింది. భారత దేశ పాలకులు ఆర్ధిక లక్ష్యాలను చేరలేకపోవడంలో నిష్ణాతులని అంతర్జాతీయ పత్రికలు ఆడిపోసుకుంటూ ఉంటాయి. బడ్జెట్ లోటు, ద్రవ్యోల్బణం లాంటి లక్ష్యాలను చేరకపోవడం వలన విదేశీ పెట్టుబడుదారులకు ప్రతికూల వాతావరణం ఏర్పడుతున్నదని వారి దుగ్ధ.

అమెరికాలో ప్రసిద్ధి చెందిన ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకుల్లో ఒకటైన మోర్గాన్ స్టాన్లీ కూడా భారత దేశానికి సంబంధించిన ఆర్ధిక భవిష్యత్తుపై అంచనాలను తగ్గించుకుంది. జిడిపి వృద్ధి రేటు 7.7 శాతం ఉంటుందని ఇప్పటివరకూ అంచనా వేసిన ఆ బ్యాంకు, తన అంచనాను 7.2 శాతానికి తగ్గించుకుంది. ఇండియా జి.డి.పి అంచనా ప్రధాని ఆర్ధిక సలహా మండలి 8.2 శాతంగా అంచనా వేస్తుంటే, ఆర్.బి.ఐ 8.0 శాతం, మోర్గాన్ స్టాన్లీ 7.2 శాతం అంచనా వేస్తున్నారన్నమాట! మరొకర్ని తీసుకుంటే వారు కూడా ఈ మూడు కాకుండా మరొక సంఖ్య చెప్పే అవకాశం చాలా ఉంది. ఆర్ధిక వ్యవస్ధలో జరిగే పరిణామాలు, కార్యకలాపాలు, ప్రజల బాగోగులను ఎంతో కొంత చూసే ప్రభుత్వం చేతిలో కాకుండా తమ లాభాల కోసం తప్ప మరొకదాని కోసం పని చేయని ప్రవేటోళ్ళ చేతుల్లో పెడితే అంచనాలు ఇలాగే తయారవుతాయి, ఏ ఇద్దరూ ఏకీభవించనీ రీతిలో.

తన అంచనాను తగ్గించడానికి మోర్గాన్ స్టాన్లీ కొన్ని కారణాలు చూపింది. అవి:

  • అధిక ద్రవ్యోల్బణం
  • పెట్టుబడి ఖరీదు పెరిగిపోవడం (ఆర్.బి.ఐ వడ్డీ రేట్ల పెంపుదల వలన -విశే)
  • ప్రభుత్వ ఖర్చులు, జిడిపి ల నిష్పత్తి తగ్గిపోవడం (జిడిపిలో ప్రభుత్వ ఖర్చుల శాతం తగ్గిపోవడం)
  • ప్రపంచ కేపిటల్ మార్కెట్లలో బలహీనతలు (అమెరికా అప్పు పరిమితి పెంపులో అనిశ్చితి, యూరప్ అప్పు సంక్షోభం, ప్రపంచ ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం)
  • పెట్టుబడుల వేగం క్షీణించడం (విదేశీ, స్వదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలు, వాటి ఆమోదం నెమ్మదిస్తున్నాయని చెప్పడం)

అధిక ద్రవ్యోల్బణం గురించి చర్చించడం చర్వత చరణమే అవుతుంది. ఆర్.బి.ఐ ద్రవ్యవిధాన సమీక్షల్లో భాగంగా ఆర్ధిక సంక్షోభం తర్వాత ఇప్పటికి 11 సార్లు వడ్డీ రేట్లు పెంచింది. దానివలన మార్కెట్లోని డబ్బులు బ్యాంకుల ద్వారా ఆర్.బి.ఐ చెంతకు చేరడంతో మార్కెట్లలో అందుబాటులో ఉన్న డబ్బు తగ్గిపోయిందనీ, దానితో పెట్టుబడి కావాలంటే అధిక వడ్డీలు చెల్లించవలసి వస్తున్నదనీ మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. జిడిపి వంద రూపాయలయితే దానిలో ప్రభుత్వ ఖర్చులు తగ్గిపోతున్నాయట! ప్రభుత్వ ఖర్చులు అంటే జనరల్ గా ప్రజల సంక్షేమ పధకాల కోసమ్ పెట్టే ఖర్చుగా చూపిస్తారు. ఇక్కడ మాత్రం స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు బడ్జెట్ కేటాయింపుల రూపేణా, బ్యాంకుల రుణాలుగా ఇవ్వవలసిన డబ్బు తగ్గిందని మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. నిజానికి స్వదేశీ, విదేశీ పెట్టుబడుదారులు తమ వద్ద ఉన్న నిధులను పెట్టుబడిగా పెడతాయన్న అంచనాతో ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా ప్రజలకు చెబుతుంది. కాని తీరా చూస్తే ఆ కంపెనీలు కొద్ది మొత్తాని తమ డబ్బుని చూపించి మిగిలినదంతా ఇండియా బ్యాంకులనుండి అప్పులుగా తీసుకుని పెట్టుబడులు పెడతాయి. ఆ విధంగా ప్రవేటు కంపెనీలకు ఇవ్వవలసిన అప్పు మొత్తం వారు కోరుకున్నంతగా లేదని మోర్గాన్ స్టాన్లీ చెబుతున్నది.

అమెరికా అప్పు పరిమితి, బడ్జెట్ డెఫిసిట్ మొదలైనవన్నీ షరా మామూలే. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు, డెమొక్రట్లు అప్పు పరిమితి పెంచడంపై సోమవారం ఒక ఒప్పందానికి వచ్చారని వార్తా సంస్ధలు చెబుతున్నాయి. కానీ ఆ సంతోషం ఎంతో కాలం ఉండకపొవచ్చు. మళ్ళీ ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం లాంటి సమస్యలు రంగం మీదికి వస్తాయి. యూరప్ అప్పు సంక్షోభం వెనక్కి మళ్ళుతున్న ఛాయలేవీ కనిపించడం లేదు. రేటింగ్ సంస్ధలు తాజాగా స్పెయిన్ ఆర్ధిక వ్యవస్ధ, అప్పుల పైన అనుమానాలు, హెచ్చరికలు చేస్తున్నాయి. ఇటలీ ఎలాగూ వరసలో ఉంది. స్పెయిన్, ఇటలీ లు యూరప్ లో పెద్ద ఆర్ధిక వ్యవస్ధలు. ఇవి సంక్షొభం లో చిక్కుకుంటే వాటికి కావలసిన మొత్తం సర్దటం జఠిల సమస్యే. ముందుంది ముసళ్లపండగ! అన్నట్లుగా యూరప్ పరిస్ధితి ఉంది. పెట్టుబడుల వేగం అని మోర్గాన్ స్టాన్లీ చెబుతున్నది ప్రభుత్వం అనుమతుల గురించి. వివిధ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, అటవీ శాఖ అనుమతులు తదితర అనుమతులు వేగంగా ఇవ్వడం లేదని మోర్గాన్ స్టాన్లీ ఆక్షేపిస్తున్నది.

ఈ పరిస్ధితుల్లో మరిన్ని సంస్కరణలు అమలు చేసి ఇంకా ప్రజల వద్ద ఇంకా మిగిలి ఉన్న గోళ్ళు ఏమన్నా ఉంటే వాటిని కూడా ఊడగొట్టమని రాయిటర్స్, సి.ఎన్.బి.సి లాంటి అంతర్జాతీయ ఆర్ధిక పత్రికలు, సంస్ధలు, విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనందున అందులోనే ఆ గోళ్ళూడగొట్టే కార్యక్రమానికి భారత పాలకులు ఊపునిస్తారని అవి బోల్డన్ని ఆశలు పెట్టుకున్నాయి. ఆ విషయంలో మాత్రం భారత పాలకులు ఎన్నడూ మడమ తిప్పలేదు, మాట తప్పలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s