ప్రతిపక్షాల కుంభకోణాలకేమీ తక్కువలేదు, మాకేం భయం? -ప్రధాని


అటు పాలక పక్షాలు, ఇటు ప్రతిపక్షాలూ… ఎవర్ని కదిలించినా తాము “సాధు పుంగవులమ”నే అంటారు. “కోరికలసలే లేక ప్రజాసేవలో తరించవచ్చిన సన్యాసులమే” అంటారు. మరే! రాజకీయ నాయకులు వారు చెప్పుకున్నట్లు కోరికలు లేని సన్యాసులే. అపుడు ‘సన్యాసీ సన్యాసీ రాసుకుంటే రాలేది బూడిదే’ అన్నది పాతకాలపు సామెత గా రద్దవుతుంది. ‘సన్యాసీ సన్యాసీ రాసుకుంటే రాలతాయి బోలెడు కుంభకోణాలు’ అన్నది ఆధునిక నియమంగా స్ధిరపడుతుంది. ప్రధాని మన్మోహన్ వెల్లడించిన ధైర్యంలో ఆ సంకేతాలే కనపడుతున్నాయి.

సోమవారం వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపధ్యంలో ప్రధాని మన్మోహన్ ఆశలన్నీ అలాంటి సామెత నిజం కాకపోతుందా అన్నదానిపైనే అని ఆయన వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయి. “ప్రతిపక్షాలేం తక్కువ తిన్లేదు” (Opposition had too many skeletons in its cupboard) అనడం ద్వారా పార్లమెంటు సమావేశాల్లొ తాము అనుసరించనున్న ఓ వ్యూహాన్ని బైటపెట్టారు. శర పరంపరగా వెల్లడవుతున్న కుంభకోణాలను ఎత్తి చూపి ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టాలని చూస్తున్న ప్రతిపక్షాలు కూడా తమ తమ కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకుని ఉన్నాయనీ, ఇక వారు తమను భయపెట్టేదేమిటనీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెబుతున్నారు. నిజమే కదా!

అయితే ప్రధాని ప్రతిపక్షాలనుద్దేశించి చేసిన ఈ వ్యాఖ్య, ఆయనకి కనపడుతున్నది ప్రతిపక్షాలే తప్ప ప్రజలు కాదని స్పష్టం చేస్తున్నది. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రజలే దేవుళ్ళు అనే ఈ రాజకీయ నాయకులు ఎన్నికల్లో తప్ప ఆ దేవుళ్ళను తలుచుకోరు. ఎప్పుడన్నా తలుచుకున్నా ఏ ఉప ఎన్నికలో వచ్చుంటాయి తప్ప తమ దేవుళ్లకు పూజాధికాలు చేయడానికైతే అయి ఉండదు. పార్లమెంటు సమావేశాలంటే ప్రజలు, వారి అభివృద్ధి, వారి అభివృద్ధికి ఏమేం చేయాలి, అభివృద్ధి అయినవారెవరు, కానివారెవరు, కానివారికోసం ఏం చేయాలి ఇత్యాది ప్రశ్నలు వేసుకుని వాటికి సమాధానాలుగా బిల్లుల్ని పార్లమెంటులో ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది.

కానీ వర్షా కాల సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నది అటువంటి బిల్లులు కాదు. మొదటి రెండు రోజుల్లో లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెడతామని ప్రభుత్వమే చెప్పింది. కేబినెట్ ఆమోదించిన లోక్ పాల్ బిల్లు అత్యంత బలహీనమైనదని అన్నా హజారే, కేజ్రివాల్, జస్టిస్ హెగ్డే లాంటి ప్రజల తరపున మాట్లాడ్డానికి ప్రయత్నిస్తున్నవారు ఘంటాపధంగా చెబుతున్నారు. బి.జె.పి కూడా అదే అంటోంది. ప్రజలను లంచం అడుగుతున్న అవినీతిపరులపైన వాళ్ళు ఎక్కడ ఫిర్యాదు చెయ్యాలి అని అన్నా హజారే బృందం అడుగుతుంటే, ప్రభుత్వోద్యోగులందరినీ లోక్ పాల్ పరిధి కిందికి తేవడం కుదరదు అని ప్రభుత్వం చెబుతోంది. అక్కడికి అన్నా హజారే బృందం ప్రభుత్వ ఉద్యోగులందర్నీ విచారించమని కోరుతున్నట్లు?!

ఏతా వాతా తేలేదేమంటే, లోక్ పాల్ బిల్లు అని ఒకటి నామ మాత్రంగా ప్రవేశ పెడుతూ తద్వారా అవినీతి గడ్డి మేస్తున్న రాజకీయ నాయకులు, అధికారులను క్షేమంగా గట్టు దాటించే మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం శాశ్వతంగా రూపొందించబోతున్నది. ఇక అవినీతి ఆరోపణలుంటే లోక్ పాల్ కి చెప్పుకోవచ్చు. పాలక ప్రతిపక్షాలు కలిసి నియమించిన సదరు లోక్ పాల్ ఆనక, అవినీతికి రుజువులేమీ లేవు అని బల్లమీద గుద్ది అవినీతిపరుల్ని వదిలేస్తారు. వదిలేశాక అవినీతిపరులు శుద్ధ నీతిపరులుగా మళ్ళీ రంగంలోకి దిగి తమ పని తాము చేసుకుపోతారు. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న లోక్‌పాల్ బిల్లు చట్టంగా మారితే దాదాపు అదే పరిస్ధితి ఏర్పడుతుంది. అవినీతిపరులుగా ఆరోపణలు పొందినవారు లోక్ పాల్ దగ్గర నేరం రుజువు కాక నీతిపరులుగా బైటికి వస్తారు.

లోక్‌పాల్ బిల్లు తర్వాత సరళీకరణ, ప్రవేటీకరణ, గ్లోబలీకరణ బిల్లులు ఆమోదానికి వస్తాయి. ఇన్సూరెన్స్ రంగంలో ఇప్పటివరకూ 25 శాతం వరకే విదేశీ పెట్టుబడుల్ని అనుమతించవచ్చు. దాన్ని 49 శాతానికి పెంచుతూ రాజ్యసభ గత ప్రభుత్వంలోనే ఆమోదించింది. రాజ్యసభ ఒక బిల్లుని ఆమోదిస్తే అది ప్రభుత్వం మారినా ఆ ఆమోదం అలానే ఉంటుంది. ఇపుడు లోక్ సభలో ఆమోదానికి వస్తుంది. రిటైల్ రంగం ప్రవేటీకరణ బిల్లు కూడా ఆమోదానికి క్యూలో ఉంది. భారత దేశంలో ప్రజలు రోజువారి అవసరాలయిన పప్పు, ఉప్పు, ఉల్లి, బియ్యం, నూనె తదితర సరుకుల్ని దగ్గర్లో ఉన్న షావుకారు కోట్టులో తెచ్చుకుంటారు. ఉద్యోగులు వారి వద్దే ఖాతాలు పెట్టుకుని నెల నెలా చెల్లిస్తారు. రిటైల్ బిల్లు ఆ పరిస్ధితిని తారుమారు చేస్తుంది.

బహుళ బ్రాండుల రిటైల్ అమ్మకాల రంగాన్ని ప్రవేటీకరణ చేస్తే వాల్ మార్ట్ లాంటి పెద్ద సంస్ధలు దేశంలోకి వస్తాయి. మార్కెట్ పెంచుకోవడం కోసం అవి వేసే ఎత్తుగడల ముందు మన షావుకార్లు పనికిరారు. ఫలితంగా వారు షాపులు మూసివేసుకోక తప్పని పరిస్ధితి తలెత్తుతుంది. ప్రజలకి కూడా ఖాతాలు పెట్టుకునే వెసులుబాటు దూరం అవుతుంది. ఆయా ఉద్యోగుల ఆర్ధిక స్ధాయిలకు తగ్గట్లుగా షావుకార్లు కూడా వివిధ స్ధాయిల్లో ఇప్పటివరకూ అందుబాటులో ఉంటారు. రిటైల్ బిల్లు ఆమోదం పొంది అది పూర్తి స్ధాయిలో అమలయ్యాక భారత ప్రజలకు ఇక షావుకార్ల ఖాతాలు ఉండవు. బి.జె.పి పార్టీకి ఈ షావుకార్లు ఓటింగ్ బేస్ అని చెబుతుంటారు. అందువలనే ఏమో కాని బి.జె.పి రిటైల్ బిల్లుని వ్యతిరేకిస్తాం అని అంటోంది. కానీ బి.జె.పికి కూడా రిటైల్ బిల్లు పై వ్యతిరేకత లేదు. వ్యతిరేకత లేదు అనడం కంటే విదేశీ బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడగల దమ్ము, ధైర్యం, ఆసక్తి బి.జె.పికి ఏమీ లేవు అనడం కరెక్టుగా ఉంటుంది.

క్యూలో ఉన్న మరొకటి భూసేకరణ బిల్లు. విదేశీ, స్వదేశీ ప్రవేటు కంపెనీలకు భూమి సేకరించి ఇవ్వడం కష్టంగా మారింది ప్రభుత్వాలికి ప్రజలు తమ భూముల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేక ప్రతిఘటిస్తుండడం ప్రవేటు కంపెనీలకు, వారికి వత్తాసుగా వచ్చే ప్రభుత్వాలకు బొత్తిగా నచ్చడం లేదు. దాన్ని అధిగమించడానికి భూమి సేకరించడం వలన నష్టపోయే రైతులకు అక్కడ పెట్టే కంపెనీల్లో భాగస్వామ్యం కల్పిస్తామని కొత్త బిల్లు ఒకటి తెస్తున్నారు. భాగస్వామ్యం ఇస్తామని పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు చెప్పిన మాటలు ఎన్నడూ అమలు కాలేదు. తాత్కాలికంగా పని జరగడానికి వేసే ఎత్తులు తప్ప అవి నిజం కాదు. అటువంటి మోసమే ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా మళ్ళీ చేయబోతున్నది.

ఇంకా ఇలాంటి బిల్లులు చాలా ఉన్నాయి. చిత్రం ఏమిటంటే ఈ బిల్లులపైన ప్రతిపక్షాలేవీ గోల చేయవు. అవి ప్రజలకు వ్యతిరేకం అని ఒక్క ముక్క కూడా చెప్పవు. పైగా ఆ బిల్లులు ఆమోదం పొందడానికి ప్రభుత్వంతో సహకరిస్తాయి. ఈ సహకారం బిల్లులకు అనుకూలంగా ఓటు వేయడం ద్వారా ఇస్తాయి అనుకుంటే పొరబాటు. ఆరోజు జరిగే ఏదో ఒక అంశాన్ని పట్టుకుని బాయ్ కాట్ చెయడం ద్వారా సహకరించవచ్చు. లేదా విచ్చలవిడిగా అరిచి గోల చేసి, చొక్కాలు చొక్కాలు పట్టుకుని సస్పెండ్ చేయించుకుని సహకరించవచ్చు. లేదా మూజువాణీ ఓటింగ్ తో ఆమోదం పొందేలా సహకరించవచ్చు.

ప్రజల ప్రయోజనాలకు హాని చేయడంతో పాటు విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు లాభం చేకూర్చేందుకు పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లుల్లో మెజారిటీ, ఇలా ప్రతిపక్షాల సహకారంతోనే ఆమోదం పొందాయంటే అతిశయోక్తి కాదు. ప్రతిపక్షాలే సహకరించకపోతే ముఖ్యంగా 1990ల తర్వాత ఏర్పడుతూ వచ్చిన సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో ఏ బిల్లూ ఆమోదం పొందడం దాదాపు అసాధ్యం అయి ఉండేది. అణు ప్రమాద పరిహార బిల్లు బి.జె.పి ప్రత్యక్ష సహకారంతోటే ఆమోదం పొందిందన్న సంగతి గుర్తుంచుకుంటే ఆ విషయంలో అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని అర్ధం అవుతుంది.

ఈ నేపధ్యంలో చూస్తే ప్రధాని భయపడనవసరం లేదన్నది అక్షరాలా నిజం. అలాగని పాలక ప్రతిపక్షాలు అన్ని విషయాల్లోనూ ముందస్తు అవగాహనతో సహకరించుకుంటాయా అంటే కాదనే సమాధానం.  పార్లమెంటులో ఘర్షణలేవీ ముందస్తు వ్యూహం కాకపోవచ్చు. కాని ఆ ఘర్షణల మాటునే ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందుతున్నది వాస్తవం. పాలక ప్రతిపక్షాలు పార్లమెంటులో పాల్పడే ఘర్షణలన్నీ ప్రజలలో పలుకుబడికొసం, ఆ పలుకుబడి ద్వారా కురుస్తాయనుకునే ఓట్ల కొసమే తప్ప వారి మధ్య అన్నన్ని కోపతాపాలు, కక్ష్యలు ఉండవు.

“అవినీతి అంశం గురించి చర్చించడానికి మేము భయపడడం లేదు. ప్రతిపక్షాలు కూడా ఆ విషయంలో తక్కువు తినలేదు. (వారిపై కావలసినన్ని కూడా కావలసినన్ని కేసులున్నాయి). ఏ అంశం గురించైనా పార్లెమెంటులో చర్చించడానికి మాకు అభ్యంతరం లేదు” అని ప్రధాని ఆదివారం విలేఖరులతొ అన్నాడు. పార్లమెంటు సమావేశాలను పురస్కరించుకుని స్పికరు మీరా కుమార్ అన్ని పార్టీలతో సమావేశం జరిపారు. అక్కడ ప్రధాని విలేఖరులతో ఈ భరోసా వ్యక్తం చేశాడు. “కొన్ని అంశాలు కోర్టుల్లో ఉన్నాయి. మరికొన్నింటిపై సి.బి.ఐ దర్యాప్తు చేస్తున్నది. కోర్టుల్లో ఉన్న అంశాలను కోర్టుల నిర్ణయాలకే వదిలేస్తారని నేను మనఃస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మనం ఆ విషయాలపైన ముందుగా తీర్పులివ్వరాదు” అని ప్రధాని గొప్ప ఆచరణీయ సూత్రాన్ని ప్రకటించాడు.

ప్రధాని ఎంత చక్కగా మాట్లాడారో చూడండి! కోర్టుల పట్ల ఎంత విశ్వాసాన్ని నమ్మకాన్నీ వ్యక్తం చేశారో చూడండి. సుప్రీం కోర్టు ధాన్యం గోదాముల వద్ద ఆరుబైట నిలవ ఉంచిన ధాన్యం ఎండకూ, వానకూ పాడై పోతున్నందున ఆ ధాన్యాన్ని అతి పేదవారికి ఉచితంగా పంపిణీ చెయ్యమని కోరితే లేదా ఆదేశిస్తే, ‘కోర్టులు ప్రభుత్వ, కార్యనిర్వాహక వర్గ విధుల్లో జోక్యం చేసుకోజాలవు’ అని మొహమాటం లేకుండా ప్రకటించి కోర్టు ఆదేశాలని పూచిక పుల్ల లెక్కన తీసిపారేసింది  ఈ ప్రధాన మంత్రిగారే కాదూ?! విదేశాల్లో దాచిన నల్లడబ్బుని వెనక్కి తేవడానికి సుప్రీం కోర్టు “స్పెషల్ ఇన్‌వెస్టిగేషన్ టీం”ని నియమించి ఆదేశాలు జారీ చేస్తే, కోర్టులు ప్రభుత్వ ఆర్ధిక విధానాలను శాసించజాలవు అని వాదిస్తూ ఆ ఆదేశాలను రద్దు చేయాలంటూ రివ్యూ పిటిషన్ వేసింది ఈ ప్రధాని మన్మొహన్ గారే కాదూ?! అది జరిగి రెండు వారాలు కూడా కాలేదు. అంతలోనే కోర్టులపైన అంతటి నమ్మకం ఎక్కడనుండి వచ్చిందో ప్రధానే సెలవివ్వాలి.

కోర్టులైనా, పార్లమెంటైనా ధనికులకి, కార్పొరేట్ కంపెనీలకీ, స్వదేశీ విదేశీ బహుళజాతి కంపెనీలకీ సేవలు చేస్తేనే వారి ఆదేశాలకు విలువ. ప్రజలకు అనుకూలంగా, వారి ప్రయోజనాలకు అనుకూలంగా ఎవరు పూనుకున్నా అవి ఆచరణ రూపం దాల్చడానికి అనేక చట్టాలు, లొసుగులు అడ్డు వస్తాయి. కనుక ప్రధాని మన్మోహన్ ఈ వ్యవస్ధ ఇలాగే కొనసాగినంత కాలం ఎప్పటికీ భయపడనవసరం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s