పోస్టాఫీసులు రద్దు చేసి బ్యాంకులు నెలకొల్పుతాం -కపిల్ సిబాల్


దేశ వ్యాపితంగా ఉన్న 1.5 లక్షల పోస్టాఫిసులపై ప్రవేటీకరణ మంత్రుల కన్నుపడింది. ప్రభుత్వంలో ప్రవేటీకరణ కోసం, నూతన ఆర్ధిక విధానాలను వేగంగా అమలు చేయడం కోసం ప్రత్యేకంగా కొంతమంది మంత్రులను ప్రధాని మన్మోహన్ నియమించుకున్నాడు. వారిలో కపిల్ సిబాల్ ఒకరు. ఈయన పూర్వాశ్రమంలో సుప్రీం కోర్టులో పేరు మోసిన న్యాయవాది. అమెరికా పాలకులకు ఇష్టుడు. 2జి కుంభకోణం వలన ప్రభుత్వానికి రు.176,000 కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని భారత అత్యున్నత ఆడిటింగ్ సంస్ధ చెప్పగా, కపిల్ సిబాల్ మాత్రం 2జి స్పెక్ట్రం వేలం వేయకపోవడం వలన ప్రభుత్వ ఖజానాకి ఒక్క పైసా కూడా నష్టం జరగలేదని ప్రకటించి సుప్రీం కోర్టు చేత చీవాట్లు తిన్నాడు. “మంత్రిని బాధ్యతగా వ్యవహరించడం నేర్చుకోమని చెప్పండి” అని సుప్రీం కోర్టు ప్రాసిక్యూటర్‌‌కు హెచ్చరికలు చేయించిన ఘనుడీ కపిల్ సిబాల్. మానవ వనరుల శాఖ మంత్రిగా పని చేస్తున్న ఈయన తాజాగా పోస్ట్ ఆఫీసులపై కన్నేశాడు.

దేశం అంతటా వ్యాపించి ఉన్న ఒకటిన్నర లక్షల పోస్ట్ ఆఫీసులను రద్దు చేసి వాటి స్ధానంలో బ్యాంకులను నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయించిందని కపిల్ సిబాల్ పిటీఇ వార్తా సంస్ధకు తెలిపాడు. దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు అత్యాధునికమైన బ్యాంకింగ్ సేవలను అందించాలన్నదే తన ఆశయమని కపిల్ చెప్పినట్లు పిటీఇ పేర్కొంది. అది పోస్ట్ అఫీసుల ద్వారా చెయ్యొచ్చని గ్రహించాడు కపిల్ సిబాల్. “డిపార్ట్‌మెంట్ ని వాణిజ్యీకరణ చేయాలనుకుంటున్నాం. దేశంలోని పోస్టాఫీసులన్నింటినీ బ్యాంకుల కిందికి మార్చడానికి త్వరలో ఆర్.బి.ఐ అనుమతిని కోరతాము” అని కపిల్‌ని ఉటంకిస్తూ పి.టి.ఐ పేర్కొంది.

గ్రామీణ ప్రాంతాలలో అధునిక బ్యాంకింగ్ సదుపాయాలు కొరవడడం, తమ అప్పుల అవసరాల కోసం ఇతర రంగాలపై (ప్రవేటు వ్యాపారులపై) గ్రామీణులు ఆధారపడుతుండడం… ఇవన్నీ ఆర్ధిక వృద్ధిలో గ్రామీణులను కలుపుకుపోవలసిన కర్తవ్యానికి ప్రభుత్వాన్ని పురిగొల్పాయనీ, ‘పోస్టల్ బ్యాంకు’ లను నెలకొల్పడం ద్వారా ఆ కర్తవ్యాన్ని నిర్వహించొచ్చని ప్రభుత్వం భావిస్తున్నదని కపిల్ చెబుతున్నాడు. “స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశమంతా బ్రాంచి ఆఫీసులను నిర్మించుకోలేదు. కానీ దేశమంతా పోస్ట్ ఆఫీసులున్నాయి. పోస్టల్ బ్రాంచి ఆఫీసులు ఇప్పటికే ఉన్నాయి. కనుక మౌలిక నిర్మాణాల అవసరం తలెత్తదు. కనుక బ్యాంకింగ్ సౌకర్యాలను సాపేక్షికంగా తక్కువ ఖరీదుకి  అందించవచ్చు. అది ప్రజలకు చాలా లాభదాయకంగా ఉంటుంది” అని కపిల్ సిబాల్ తాదాత్మతతో వివరించాడు.

పోస్ట్ ఆఫీసులు ప్రస్తుతం కొన్ని ఆర్ధిక సేవలు అందిస్తున్నాయి. సేవింగ్స్ బ్యాంక్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పెన్షన్ చెల్లింపులు, డబ్బు బదలాయింపు సేవలు మొ.వి అందులో ఉన్నాయి. భారత పోస్ట్ ఆఫీస్ కార్పస్ ఫండ్ మార్చి 31 2011 నాటికి రు.5,82,832.9 కోట్లు ఉన్నట్లుగా పోస్ట్ ఆఫీస్ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ ద్వారా తెలుస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్టాఫీస్ (డి.ఒ.పి) రెవిన్యూ ఆదాయం 2010-11 లో రు.6954.09 కోట్లుగా నమోదైంది. ఇది 2009-10 ఆదాయం రు.6366.7 కోట్లు కంటే 11 శాతం ఎక్కువ. కానీ కొన్ని సర్కిళ్ళలో నెగిటివ్ వృద్ధి రేటు నమోదు కావడం వలన మొత్తం మీద డి.ఒ.పి లోటుతో ఉన్నది. 2010-11లో డి.ఒ.పి లోటు రు.6625 కోట్లుగా నమోదయ్యింది.

గ్రామీణులకి ఆధినిక సేవలు అందించాలన్న లక్ష్యం అభినందనీయమే కానీ, ప్రభుత్వానికి నిజంగా ఆ ఉద్దేశ్యం ఉందా అన్నదే అనుమానం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఎ.టి.ఎం లాంటి ఆధినిక సౌకర్యాలు కలిగి ఉన్నవే. కాని ఈ బ్యాంకుల వలన గ్రామీణులకు అందుతున్న అదనపు సౌకర్యాలేవీ లేవు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల్లో ఉన్న సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి ఉండగా, ఎంతో కొంత అందుబాటులో ఉన్న పోస్టాఫీసుల్ని రద్దు చేసి బ్యాంకుల్ని స్ధాపిస్తామని చెప్పడం, అది ప్రజలకోసమే అని చెప్పడం ఉత్తి మోసం.

గ్రామీణ ప్రాంతాల్లొ రైతులు రుణాల కోసం అల్లాడుతున్నారు. గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారు. ప్రభుత్వాలు ప్రకటిస్తున్న రేట్లు రైతులకు అందకుండా దళారులు కొట్టేస్తున్నారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంత సమస్యలే. ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చి నివారించదగినవే. వాస్తవంలో ప్రభుత్వాలు వాటి ఏజన్సీలు ప్రవేశపెడుతున్న అధునిక కంప్యూటర్ సమాచార సౌకర్యాలు దళారీలకే అందుబాటులో ఉంటున్నాయి. ఈ తప్పులను సవరించే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం బ్యాంకర్ల సమావేశాలు జరిపి రైతులకు ఇంత మొత్తంలో రుణాలు ఇవ్వాలని ఆదేశాలు జారి చేసి కాఫీ, టీలు తాగి చక్కా పోతారు. తర్వాత బ్యాంకర్లు నిజంగా తమ ఆదేశాలు అమలు చేస్తున్నదీ లేనిదీ పట్టించుకోరు. రైతులు, కొంతమంది అధికారులు బ్యాంకులు రుణాలివ్వడం లేదని ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. అలాంటిది ఇప్పుడు కొత్తగా పోస్ట్ ఆఫీసులు రద్దు చేసి బ్యాంకులు పెడతాం అనడం మోసపూరిత ప్రకటన.

పోస్టాఫీసుల స్ధానంలో బ్యాంకులు అన్న నినాదం మాటున జరిగేది పోస్టాఫీసుల రద్ధు మాత్రమే. బ్యాంకుల స్ధాపన చేస్తామంటూ కాలయాపన చేసే అవకాశాలే ఎక్కువ. మొక్కుబడిగా కొన్ని పోస్టాఫీసుల్ని కలిపి ఒక బ్యాంక్ గా ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటారని ప్రభుత్వాల గత ఆచరణ స్పష్టం చేస్తుంది. పోస్టాఫీసులు రద్దు చేసి అవి సంపాదించుకున్న 5.82 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ని స్వాహా చేయడానికి ప్రభుత్వం పన్నాగం పన్నింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడబెట్టుకున్న గ్రాట్యుటీ, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ తదితర నిధులను స్వాహా చెయ్యడానికి ఇతర రంగాల్లో పెట్టుబడులుగా తరలించడానికీ, ప్రవేటీకరణ చెయ్యడానికి ప్రభుత్వాలు దశాబ్దం పైబడి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగమే ఈ పోస్టాఫీసుల బ్యాంకీకరణ పధకం. పోస్టల్ కార్మికులు ఈ పధకానికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉంది. లేకుంటే త్వరలో వారి ఉపాధి కనుమరుగు కాక తప్పదు.

4 thoughts on “పోస్టాఫీసులు రద్దు చేసి బ్యాంకులు నెలకొల్పుతాం -కపిల్ సిబాల్

  1. బ్యాంక్‌లు ATM కార్డ్‌ల పిన్ నంబర్లనీ, అకౌంట్ స్టేట్మెంట్లనీ పోస్ట్‌లోనే పంపుతాయి. రిజిస్టర్డ్ పోస్ట్‌కి 35 రూపాయలు ఖర్చైతే నాన్-రిజిస్టర్డ్ పోస్ట్‌కి 5 రూపాయలు ఖర్చవుతాయి. పోస్ట్ ఆఫీసుల్ని రద్దు చేస్తే ప్రైవేట్ కొరియర్‌లకి లాభం.

  2. ఔను ప్రవీణ్. పోస్టాఫీసుల్ని రద్దు చేసేది కూడా వాళ్ల కోసమే. త్వరలో అంతర్జాతీయ పోస్టల్ సంస్ధలు ఇండియాలో అడుగుపెడతాయి. పోస్టాఫిస్ ని రద్దు చేశాక మెల్లగా దానికి ఉన్న దేశ వ్యాపిత నెట్ వర్క్ ని వాటికి సర్కిల్ వారీగానో, రాష్ట్రాల వారిగానో అమ్మేస్తారు. ఇన్నాళ్ళు పోస్టల్ డిపార్ట్ మెంట్ సంపాదించుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ని ప్రవేటోడికి కారు చౌకగా అమ్మేస్తారు. వాడికి చౌకగా ఇచ్చి మంత్రులు, అధికారులు కమీషన్లు మెక్కుతారు. ఇప్పుడు ఇదొక స్టాండర్డ్ ప్రొసీజర్.

  3. విశేఖర్ గారు, నేను ఈ పోస్టును కాపీ చేసి, wordpad లో పేస్ట్ చేసి కింద మా సంఘం PDSU అని టైప్ చేసి ఫోటో స్టాట్ కాపీలు తీసి, కావలి పోస్ట్ ఆఫీసులో పంచాను. మీకు అభ్యంతరం ఉండదన్న ధైర్యంతో ఈ పని చేశాను. పోస్ట్ ఆఫీసులో చాలా మంచి స్పందన వచ్చింది.

  4. భాస్కర్, చాలా బ్రిలియంట్ ఐడియా. పోస్ట్ ఆఫీసు వాళ్ళకు ఈ బ్లాగ్ చూడ్డానికి సొంత కంప్యూటర్లు కావాలి. మీరు చేసిన పని వలన వారికి ఒక ముఖ్యమైన సమాచారం అందించినట్లయింది. వెల్ డన్. I appreciate your spirit. చాలా క్రియేటివిటీతో వ్యవహరించారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s