అప్పు పరిమితి పెంపుపై ఒప్పందం శూన్యం, టాప్ క్రెడిట్ రేటింగ్ కోల్పోనున్న అమెరికా?


అమెరికా అప్పు పరిమితిని 14.3 ట్రిలియన్ డాలర్లనుండి పెంచడానికి ఒబామాకి, రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి మధ్య ఒప్పందం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఆగస్టు 2 లోపు అప్పు పరిమితి పెంచడంపై నిర్ణయం తీసుకోనట్లయితే అమెరికా అప్పు చెల్లించలేని పరిస్ధితి వస్తుందని ట్రేజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ ఇప్పటికె పలుమార్లు హెచ్చరించాడు. దీనితో అమెరికా సావరిన్ అప్పు రేటింగ్ (క్రెడిట్ రేటింగ్) ను, మూడు క్రెడిట్ రేటింగ్ సంస్ధల్లో ఏదో ఒకటి అత్యున్నత స్ధాయి నుండి తగ్గించవచ్చనీ రాయిటర్స్ సంస్ధ చేసిన సర్వేలో మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సర్వే చేసిన 53 మంది ఆర్ధిక విశ్లేషకులలో 30 మంది అమెరికా తన టాప్ AAA రేటింగ్‌ని కోల్పోవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

స్టాండర్డ్ ‌& పూర్, మూడీస్, ఫిచ్ రేటింగ్ సంస్ధలు ప్రపంచంలో పేరు పొందిన మూడు క్రెడిట్ రేటింగ్ సంస్ధలు. వీటిలో కనీసం ఒకటైనా అమెరికా క్రెడిట్ రేటింగ్‌‌ను తగ్గించే అవకాశాలున్నాయని ఆర్ధికవేత్తలు భావిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా అమెరికా జారీ చేసే సావరిన్ అప్పు బాండ్లు, లేదా ట్రెజరీ బాండ్లు లేదా ట్రెజరీస్ కు అత్యున్నత రేటింగ్ ఇప్పటివరకూ ఉంది. స్వల్ప కాలిక లాభాల కోసం మదుపుదారులు ఇతర బాండ్లలో గానీ, షేర్ మార్కెట్లలో గానీ పెట్టుబడులు పెట్టినా, మార్కెట్లో అనిశ్చితి పరిస్ధితి ఉన్నపుడు అమెరికా ట్రెజరీస్‌లో మదుపు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. అత్యున్నత క్రెడిట్ రేటింగ్ ఉన్న అమెరికా ట్రెజరీ బాండ్లలో డబ్బు మదుపు చేస్తే వాటిపై వచ్చే వడ్డీ (యీల్డ్) తక్కువే ఐనా సొమ్ము భద్రంగా ఉంటుందని భావిస్తారు. అటువంటి అమెరికా బాండ్ల రేటింగ్ తగ్గించడం అంటే ప్రపంచ అర్ధిక వ్యవస్ధకు అది దుర్వార్తే.

అమెరికా కాంగ్రెస్ సభ్యులకు అప్పు పరిమితి పెంపుదలపై ఒప్పందం చేసుకోవడానికి మరొక వారం రోజులు మాత్రమే ఉంది. మామూలుగానైతే అప్పు పరిమితి పెంచడం పెద్ద విషయం కాదు. సాధారణ ప్రభుత్వ కార్యక్రమంగా జరిగిపోవలసిన విషయం. అధ్యక్షుడు, ప్రతినిధుల సభ మెజారిటీ వేరు వేరు పార్టీలకు చెందినప్పటికీ మామూలుగా జరిగిపోవలసిన విషయం. అమెరికాలో ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు లోతుగా ఏర్పడి ఉన్న నేపధ్యంలో దాని ప్రభావం అమెరికా రాజకీయాలపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. సంక్షోభ పరిస్ధితుల నేపధ్యంలో నిరుద్యోగం, నిజవేతనాల పతనం వలన ప్రజల కోనుగోలు పరిస్ధితి పడిపోతుండడంతో పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదులు అడ్డదారుల్లో లాభాలు పెంచుకోవడానికి తెగిస్తున్నారు. ఉత్పత్తి కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టి నాణ్యమైన సరుకులు తయారు చేయడంలో పోటీలు పడుతూ వినియోగదారుల ఆకర్షించడం ద్వారా లాభాలు పెంచుకోవడానికి బదులు కార్మికులు, ఉద్యోగుల వేతనాలను, సౌకర్యాలను మరింతగా కోతపెట్టి లాభాలు మిగుల్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు సహకరించే రాజకీయ పరిస్ధితులు ఏర్పడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో రిపబ్లికన్లు మెజారిటిగా ఉన్న ప్రతినిధుల సభలోని రిపబ్లికన్ల బృందం ఒకటి కార్పొరేట్ పెట్టుబడిదారులను సంతృప్తి పరచడానికి పొదుపు విధానాలతో కూడిన బిల్లుని తయారు చేసి అది డెమొక్రట్లు మెజారిటీగా ఉన్న సెనేట్ ఆమోదించడానికి అంగీకరిస్తేనే అప్పు పరిమితి పెంచడానికి ప్రతినిధుల సభ ఆమోదిస్తుందని మెలిక పెట్టారు. పొదుపు విధానాలలో భాగంగా వృద్ధుల ఆరోగ్య భీమాకు ప్రభుత్వ కంట్రిబ్యూషన్ లో తీవ్రంగా కోత పెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిరుద్యోగ భృతి లాంటి సంక్షేమ చర్యలకు కోతలను ప్రతిపాదించారు. మరీ ముఖ్యంగా కార్మికులు, ఉద్యోగులు లాంటి మధ్య తరగతి, ఎగువ మద్య తరగతి ప్రజలపై పన్నులు పెంచుతూ, కార్పొరేట్ కంపెనీలకు మాత్రం టాక్స్ హాలిడేలు, పన్నుల రాయితీలు, కొన్ని చోట్ల పన్నుల రద్దు కూడా ప్రతిపాదించారు.

మరొకసారి అధ్యక్షుడిగా ఎన్నికకావడానికి ప్రయత్నిస్తున్న ఒబామాకి ఇవి ఎన్నికల్లో ప్రతికూలంగా పని చేస్తాయన్న భయంతో కొన్ని ప్రతిపాదనలు తొలగించేలా రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కంపెనీలపై కొన్ని పన్నులు వేయడం ద్వారా బడ్జెట్ లోటు (ఫిస్కల్ డెఫిసిట్) తగ్గించడానికి చూస్తున్నాడు. బడ్జెట్ లోటు తగ్గింపు కూడా ఒక ఎన్నికల అంశంగా మారింది. కానీ కార్పొరేట్ బహుళజాతి కంపెనీలు పన్నులేవన్నా ఉంటే ప్రజలపైన వేసి తమకు మాత్రం ఆదాయం పెరిగే మార్గాలను చూపాలని ఒత్తిడి చేస్తున్నారు. దానితో రిపబ్లికన్లకు, డెమొక్రట్లకు అప్పు పరిమితి పెంపు, పొదుపు బిల్లు, పన్నుల పెంపు అంశాల్లొ రాజీ కుదరడం గగనంగా మారింది. ఒబామా రాజీ ప్రతిపాదనలన్నింటినీ రిపబ్లికన్ల వెనక ఉన్న బహుళజాతి కంపెనీలు, వాల్‌స్ట్రీట్ కంపెనీలు తిరస్కరించాయి. దానితో రిపబ్లికన్లు కూడా ఒప్పందానికి ముందుకు రావడం లేదు.

ఈ నేపధ్యంలో మార్కెట్లకు రెండు ప్రధాన భయాలు పట్టుకున్నాయి. ఒకటి అమెరిక క్రెడిట్ రేటింగ్‌ని తగ్గిస్తారనీ, రెండవది అప్పు పరిమితి పెంచకపోతే ఇప్పటికే చేసిన అప్పులపై చేయవలసిన చెల్లింపులను అమెరికా సమయానికి చేయలేకపోవచ్చని (అమెరికా అప్పు చెల్లించలేక డిఫాల్ట్ కావచ్చని). కార్పొరేట్ వార్తా సంస్ధలు కంపెనీల లాభాల ఆశలకు రిపబ్లికన్లు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతిని ప్రస్తావించకుండా రిపబ్లికన్లు లోటు తగ్గింపు పధకాన్ని ఆమోదించాలని పట్టుబడుతున్నట్లుగా ఘనంగా చెబుతూ, రాస్తున్నాయి. లోటు తగ్గింపు పధకం అంటే బడ్జెట్ లోటు తగ్గించడానికి బడ్జెట్ ఖర్చులనే తగ్గించాలని కోరడం. బడ్జెట్ ఖర్చులను తగ్గించడానికి కంపెనీలపై పన్నులు వేయడం, ప్రజలకు ఉద్యోగులకు అందిస్తున్న అరకొర సౌకర్యాలను కూడా కత్తిరించడం అనే రెండు మార్గాలు ఉండగా రెండో దానికి రిపబ్లికన్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. కంపెనీలపై పన్నులకు అంగీకరించడం లేదు.

క్రెడిట్ రెటింగ్ వలనా, డిఫాల్ట్ వలనా జరిగే పరిణామల మధ్య చాలా తేడా ఉంది. రేటింగ్ తగ్గించడం వలన మార్కెట్ విశ్వాసం కొంత దెబ్బతినవచ్చు. అది రిసెషన్ కి బహుశా దారి తీయవచ్చు. కాని కొన్ని నెలల పాటు ప్రభుత్వానికి సమయం దొరుకుతుంది. కాని డిఫాల్ట్ వలన పరిణామాలు మరొక ఆర్ధిక సంక్షోభానికి దారి తీసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అమెరికా అప్పు చెల్లింపులను సకాలంలో చేయలేకపోయిందన్న వార్త ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఆశనిపాతంలా తాకుతుంది. రెండేళ్ళ క్రితం నగర ప్రభుత్వం ఐన దుబాయ్ ప్రభుత్వమే అప్పు చెల్లింపులను నెలపాటు వాయిదా వేయమని కోరడంతోనే ప్రపంచం దాదాపు వణికిపోయింది, మరొక గ్రేట్ రిసెషన్ రానున్నదేమోనని. అటువంటిది అమెరికా డిఫాల్ట్ అయితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

రాయిటర్స్ సర్వే చేసిన 54 లో 38 మంది విశ్లేషకులు, రిపబ్లికన్లు, డెమొక్రట్ల విభేధాల వలన తలెత్తిన అనిశ్చితి ఆర్ధిక వృద్ధిని దెబ్బతీయనున్నదని అభిప్రాయం తెలిపారు. మొదటి క్వార్టర్ లో అమెరికా జిడిపి 1.9 శాతమే వృద్ధి చెందింది. రెండో క్వార్టర్ లో కూడా అంతకంటే ఎక్కువేమీ ఉండదని భావిస్తున్నారు. పారిశ్రామిక వృద్ధి తగ్గిపోగా, ఉపాధి నిలిచిపోయింది. నిరుద్యోగం అధికారికంగా 9.2 శాతం ఉండగా నిజానికది 15 నుండి 20 శాతం వరకూ ఉండవచ్చని నౌరుబి లాంటి ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. వాల్ స్ట్రీట్ కంపెనీ గోల్డ్ మేన్ సాచ్, ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదించడాని కంటే వినియోగదారుల సెంటిమెంట్ తగ్గుదల తీవ్రంగా ఉందని తెలిపింది. అంటే అప్పు పరిమితి పెంపు చర్చలు వినియోగదారుల సెంటిమెంట్ ని దెబ్బతీసి వారు ఖర్చులు చేయడానికి బదులు పొదుపు చేయడానికే ప్రాధాన్యం ఇవ్వడానికి దోహదపడుతున్నదని దానర్ధం.

చివరి నిమిషంలోనైనా ఒప్పందం కుదుర్చుకుని ఆందోళనకర పరిస్ధితిని తప్పించకపోరా అని వివిధ స్టేక్ హోల్డర్లు ఎదురు చూస్తున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s