లగడపాటి తెలంగాణని వ్యతిరేకిస్తున్నది ఆస్తుల కోసం కాదట!


తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు, ‘సీమాంధ్రులు కూడా’ కూడా కాదు, దేశ ప్రజలంతా తెలుసుకోవలసిన విలువైన విషయం బెజవాడ ఎం.పి, లాంకో యజమాని, లగడపాటి రాజగోపాల్ గారు బుధవారం తెలియజేశారు. “ఆస్తులు కాపాడుకోవడానికే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. అది కరెక్టు కాదు. నేను తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ని వ్యతిరేకిస్తున్నది నా ఆస్తులను కాపాడుకోవడానికి కాదు. దేశ సమగ్రతను కాపాడడం కోసం” అని సగర్వంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పని చేస్తున్న జవాన్ స్ధాయిలో ప్రకటించారు.

ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తే దేశ సమగ్రతకు భంగకరమా? విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి, భారత దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న లగడపాటి రాజగోపాల్ ఉద్దేశ్యంలో ‘దేశ సమగ్రత’ అంటే ఏమిటి? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడితే దేశ సమగ్రత దెబ్బతిన్నట్టా? ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతం వారు “మా జిల్లాల మీదుగా నదులు పారుతున్నా నీటి పారుదల సౌకర్యాలకు అరవై ఏళ్ళపాటు నోచుకోలేక పోయాం. మా ప్రాంతంలో ఉన్న ఖనిజ వనరులను తవ్వి ప్రాసెస్ చేస్తున్న ఫ్యాక్టరీల్లో పెద్దగా ఉద్యోగాలు పొందలేకపోయాం. గతంలో ఉన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిస్తే అవి ఏర్పాటు చేసుకుంటాం” అని కోరితే, దేశ సమగ్రతని యూరప్ వాళ్ళు మళ్ళీ పట్టుకెళ్ళి పోతారా?

మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి సీమాంద్ర వాళ్ళు దేశ సమగ్రతను దెబ్బతీశారా? తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకుని సీమాంధ్రులు దేశ సమగ్రతను పటిష్టం చేశారా? బొంబాయి రాష్ట్రం నుండి విడిపోయి గుజరాత్, ఉత్తరప్రదేశ్ నుండి విడిపోయి ఉత్తర ఖండ్, బీహార్ నుండి విడిపోయి జార్ఖండ్, మధ్య ప్రదేశ్ నుండి విడిపోయి ఛత్తీస్ ఘర్ దేశ సమగ్రతను నాశనం చేశాయా? పార్లమెంటు సభ్యుడు ఇంత అజ్ఞానంతో మాట్లాడ్డం సాధ్యమేనా? విజయవాడ ప్రజలు మరొకసారి తప్పు చేయకుండా ఉంటామని ఈరోజు మనసులోనే ఒట్టు పెట్టుకుని ఉంటారు?

దేశ సమగ్రత లేదా జాతీయ సమగ్రత అన్నది ఒక విశాలమైన భావన. విశాలమైన జీవన వ్యవస్ధను సూచించే ప్రకటన. భిన్న మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు, ఇంకా ఇతర సామాజిక విభిన్నతలు ఉన్న ప్రజలు తమ తమ మానవ, సాంస్కృతిక, మత, నైసర్గిక, శాస్త్రీయ, విద్యా విషయక వనరులన్నింటినీ సమానంగా వినియోగించుకుంటూ, దేశ పౌరుల జీవితాలకు సంబంధించిన సమస్త రంగాలలో సమాన అభివృద్ధి సాధిస్తూ, తమ తమ వ్యక్తిగత, ప్రాంతీయ, భాష గుర్తింపులను కాపాడుకుంటూనే జాతీయ ఏకత్వాన్ని సాధించ గలిగితే అది, నిజంగా, జాతీయ సమగ్రతను లేదా దేశ సమగ్రతను స్ధాపించుకున్నట్లు లేదా కాపాడుకున్నట్లు. ఏ ఒక్క భాషీయులుగానీ, ప్రాంతీయులు గానీ, రాష్ట్రీయులు గానీ, మతస్ధులు గానీ తాము అన్యాయానికి గురయ్యామన్న భావనకు గురి కాకుండా ఉండగలిగితేనే జాతీయ సమగ్రతను సాధించినట్లు.

నిజానికి భారత దేశ జాతీయ సమగ్రతను దాని నిజమైన అర్ధంలో స్ధాపించగలగడంలో భారత దేశ పాలకులు విఫలమయ్యారు. అందుకే ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమాలు చెలరేగాయి. చెలరేగుతూనే ఉన్నాయి. ఉద్యమాలు చేసినవారు వివిధ రాష్ట్రాలను సాధించుకున్నారు. అందులో సీమాంధ్రులు ఒకరు. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష అనంతరం, మదరాసీలతో తప్ప గుర్తింపు లేని తెలుగువారు పోరాడి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని (ఆంధ్ర ప్రదేశ్ కాదు) సాధించుకున్నారు.  తెలంగాణవారి ప్రయోజనాలను కాపాడతామని ఆంధ్ర రాష్ట్రం వారు హామీలు, బాసలు చేయడంతో హైద్రాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వారు నమ్మి వివిధ ఒప్పందాలతో సంతృప్తి పడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. కానీ మరునాటినుండే తెలంగాణవారితో చేసుకున్న ఒప్పందాలను అడ్డంగా ఉల్లంఘించారు. ఫలితమే తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఆరని మంటగా ఇప్పటికి రగులుతూనే ఉంది.

పొట్టి శ్రీరాములు గారి ఫోటోలను ఇప్పుడు సమైక్యాంధ్ర పేరుతో ప్రదర్శిస్తున్నారు గానీ, వాస్తవానికి ఆయన పోరాడింది మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడదీసి ఏర్పాటు చేసే ఆంధ్ర రాష్ట్రంలో (సీమాంధ్ర) మద్రాసు మద్రాసు నగరాన్ని కూడా కలపాలని మాత్రమే. మొదట ఆంధ్ర రాష్ట్రం కోసం 37 రోజులు నిరాహార దీక్ష చేసింది గొల్లపూడి సీతారామ శాస్త్రి (గొల్లపూడి సీతారాం అనీ స్వామీ సీతారాం అనీ ఈయన్ని పిలుస్తారు) అనే గాంధియన్. ఈయన అన్ని రోజులు నిరాహార దీక్ష చేసినా ఫలితం దక్కలేదు. వినోభా బావే గారి విజ్ఞప్తి మేరకు దీక్ష విరమించారు.

మొన్నీమధ్య స్వామీ రవిశంకర్ విజ్ఞప్తి మేరకు బాబా రాందేవ్, అంతకు ముందు రైతుల ప్రయోజనాల కోసం దీక్ష చేపట్టి సి.పి.ఐ, సి.పి.ఎం నాయకుల విజ్ఞప్తి మేరకు చంద్రబాబు నాయుడు దీక్షలు విరమించినట్లన్నమాట! నిజానికి ఈ పోలిక సరైంది కాకపోవచ్చు. ఎందుకంటే గాంధీ అనుచరులైన గొల్లపూడి సీతారాం గారు నిజాయితీగా రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి ఉండాలి. ఇప్పటిలాగా సమస్తం రాజకీయ ప్రయోజనాలకు, తద్వారా సంపదల వృద్ధికీ ఆందోళనలు చేసే కళ అప్పటికి ఇంకా అభివృద్ధి చెందలేదు కనుక ఇలా భావించాల్సి వస్తున్నది.

జె.వి.పి (జవహర్ లాల్ నెహ్రూ, వల్లబ్ భాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య) కమిటీ మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సిఫారసు చేయడంతో, ప్రధానంగా మద్రాసు నగరం ఆంధ్ర రాష్ట్రానికే దక్కాలన్న డిమాండ్‌తో పొట్టి శ్రీరాములు గారు మద్రాసు నగరంలోనే బులుసు సాంబమూర్తిగారి ఇంటిలో నిరాహార దీక్ష ప్రారంభించి 58 రోజుల దీక్ష అనంతరం అమరుడయ్యాడు. ఆయన మరణం తర్వాత నాలుగైదు రోజులపాటు సీమాంధ్ర అంతటా ఆందోళనలు చెలరేగిన తర్వాత నెహ్రూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు. కాని అక్టోబరు 1, 1953 న మద్రాసు లేకుండానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మరో మూడు సంవత్సరాలకి తెలంగాణ జిల్లాలని కలుపుకుని ఆంద్రప్రదేశ్ ఏర్పడింది.

ఇది చరిత్ర. నిప్పులాంటి చరిత్ర. చెరపాలన్నా చెరగని చరిత్ర.

అయితే దేశ లేదా జాతీయ సమగ్రత ఎలా సిద్ధిస్తుంది? పైన నిర్వచనంలో పేర్కొన్నట్లు దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు అనేక భిన్నత్వాలకు అతీతంగా ఏకత్వాన్ని అనుభవించగలిగినపుడే సిద్ధిస్తుంది. ప్రతి ఒక్కరూ తాను అన్యాయానికి గురయ్యాననీ, తన ప్రయోజనాలు కొల్లగొట్టబడ్డాయనీ భావించని నాడే జాతీయ సమగ్రత సిద్ధిస్తుంది. జాతీయ సమగ్రతకు రాష్ట్రాల నిరంతర ఏకశిలా సదృశత, షరతు కానే కాదు. పైగా తమ భిన్నత్వాలను సమగ్ర రీతిలో కాపాడుకోగలిగినప్పుడే అటువంటి భిన్నత్వాలు జాతీయ సమగ్రతలో మనఃపూర్వకంగా భాగం అవుతాయి. బలవంతంగా కలిపి ఉంచి “మాదే జాతీయ సమగ్రత. దీన్ని కొట్టింది లేదు” అంటే అది తప్పు.

జాతీయ సమగ్రత నిలబడాలంటే ముందు అనేక భిన్నత్వాల సమగ్రత కాపాడబడాలి. “మా భాష అవమానానికి గురవుతున్నది” అని ఏ భాషా, యాసా భావించకూడదు. ఉప ప్రాంతీయ అని ఇప్పుడంటున్నారు కానీ నిజానికి తెలంగాణది ఒక ప్రాంతీయత. సీమాంధ్రది ఒక ప్రాంతీయత. తెలంగాణ యాసకి ద్రవిడ భాషలతో ఉన్న సామీప్యత సీమాంధ్ర యాసకు లేదని భాషపండితులు నిర్ద్వంద్వంగా అంగీకరించే సత్యం. వారు నిజాయితీపరులైతేనే సుమా! తెలంగాణ యాసకి ద్రవిడ భాషలతొ సామీప్యత ఉంటే, సీమాంధ్ర యాసకి సంస్కృతంతో సామీప్యత ఉన్నది. అందుకే మన గ్రాంధీక భాషలో సంస్కృత పదాలు కలిసి కనిపిస్తాయి. కాని అవి తెలంగాణ యాసలో కనిపించవు. అక్కడ కన్నడ, తమిళ ఛాయలు కనిపిస్తాయి. (వచ్చిండు, పోయిండు). తెలుగు అన్న పదానికి తెలంగాణ పదానికి ఉన్న సామీప్యత చూడండి, అర్ధమవుతుంది.

‘మా భాషని అవమానిస్తున్నారు. మా వనరులు కాజేశారు. మా నీళ్ళు మాకు కాకుండా చేశారు’ అని ఒక యాస వారు, లేదా ఒక ప్రాంతం వారు ఆరోపిస్తున్నపుడు నిజానిజాలను నిజాయితీగా చర్చించి తర్కించుకోవాలి. దానికి బదులు సమైక్యతను చెడగొడుతున్నారని, సమగ్రతను నాశనం చేస్తున్నారనీ ప్రత్యారోపణలు చేస్తూ, హేళన చేస్తూ, బలవంతంగా కలిపి ఉంచి దేశ సమగ్రతను కాపాడుతున్నామని చెబితే అది దేశ సమగ్రత భావపరంగానూ కాదు, ఆచరణపరంగానూ కాదు.

నిఖార్సైన జాతీయవాది మాత్రమే నిజమైన అంతర్జాతీయవాది కాగలడని ఓ పెద్ద మనిషి చెప్పిన సంగతిని గుర్తుంచుకుంటే ఆయా భిన్నత్వాల ఐడెంటిటీలను గుర్తించినవాడే, కాపాడిననాడే నిజమైన జాతీయ సమగ్రతను అందరూ ఆచరణలో ఆస్వాదించగలరు. మైకు పట్టి కెమెరాల ముందు నేను జాతీయ సమగ్రతా పరిరక్షకుడిని అని చెప్పుకుంటేనే అలా కాలేడు. జాతీయ సమగ్రతను జీవితంలోని అన్ని కోణాల్లో ఆచరించగలమే తప్ప మైకాసురులుగా ఉపన్యాసాలు దంచలేము.

5 thoughts on “లగడపాటి తెలంగాణని వ్యతిరేకిస్తున్నది ఆస్తుల కోసం కాదట!

 1. నాకు తెలిసి మొదటిసారి నిరాహార దీక్ష ఆంధ్ర రాష్ట్రం కొరకు చేసింది గొల్లపూడి సీతారాం. పొట్టి శ్రీరాములు దీక్ష చేసింది ఒక్కసారే, అది మద్రాసు నగరం కోసం మాత్రమే.

 2. >>> ఏ ఒక్క భాషీయులుగానీ, ప్రాంతీయులు గానీ, రాష్ట్రీయులు గానీ, మతస్ధులు గానీ తాము అన్యాయానికి గురయ్యామన్న భావనకు గురి కాకుండా ఉండగలిగితేనే జాతీయ సమగ్రతను సాధించినట్లు

  Excellent!!!

 3. HI
  అంత బావుంది బాసు మనం ప్రతి 5 సంవస్తరలకు Elections పెత్తి బొలెదు Kotlu కర్చు పెత్తి MLA లను MP లను ఎన్నుకుంతం కద.
  మరి తెలంగన విషయం లొ కూద వొతింగ్ పెత్తమని అదగొచుగ మీరు (మెము కూద) అది మానెసి బందు లంతం రస్త రొకొలు అంతం సకలజన సమ్మెలంతం రైల్ రొకొలు అంతం బస్సు రొకొలు అంతం మన ఆస్తులను మనమె తగలబెత్తు కుంతం .ఆత్మ హత్యలు చెసుకుంతం
  దరిద్రపు ఎదవలు అందరుకలిసి సమైక్యంద్ర AND టెలంగన ఉద్యమల్లొ ఉన్నతున్నరు ఒక్కదు logical గ ఆలొచించదు.
  ఎమొ వాల్లకు ఎమైన స్వప్రయొజనలు ఉన్నయెమొ తెలియదు బాసు తెలంగన ఇవ్వలొ వద్దొ Election పెత్తమను.
  టెలంగన ఒక్కదంత్లొనె Election పెదితె 80% మంది తెలంగన కావలంతె ఇచెయ్యమని అందరు పొరదదం
  మొత్తం అంద్రప్రదెష్ లొ అయితె 60% ఒప్పుకుంతె తెలంగన ఇవ్వమని పొరదదం అంతెకాని మన ఆస్తులను మనమె పాదు చెసుకొవదమొ లెక మన సొదరులను (సీమంద్ర OR టెలంగన) మనమె కొత్తుకొవదమొ మూర్కత్వం ల లెదు
  ఇంక 80% మీద నీకు doubt రవొచు కాని అది correct ఎందుకంతె మల్లి మర్చుకొలెని నిర్నయం కాబత్తి.అందరు
  బాసు ఇకనైన లొగిచల్ గ aalochiddam.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s