బి.జె.పి నోట సెక్యులరిజం మాట


దేశంలో సెక్యులరిస్టు శక్తులకు నిరాశ కలిగించే పరిణామాలు జరుగుతున్నాయంటూ భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అది కూడా ఒక ముస్లిం వ్యక్తిని ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా తొలగించినందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన తొలగింపు దేశంలోని సెక్యులరిస్టు శక్తులకు నిరాశను కలిగించిందని వాపోయింది.

లక్నోలోని దారుల్ ఉలూమ్‌కు మొహతామిమ్ (వైస్ ఛాన్సలర్‌)గా జనవరిలో నియమితుడయిన మౌలానా గులామ్ మొహమ్మద్ వాస్తన్విని తొలగిస్తూ యూనివర్సిటీ గవర్నింగ్ బాడీ ఐన మజ్లిస్-ఎ-షూరా  ఆదివారం నిర్ణయం తీసుకుంది. అతని స్ధానంలో కాన్పూరుకి చెందిన ‘మౌలానా అబుల్ ఖాసిం నొమాని’ ని నూతన మొహతామిమ్‌గా నియమించింది. వాస్తన్వి రాజీనామా చేయడానికి నిరాకరించడంతో అతనిని తొలగిస్తున్నట్లుగా మజ్లిస్-ఎ-షూరా ప్రకటించింది. సాధారణంగా యూనివర్సిటీకి పాలకవర్గంగా ‘బోర్డ్ ఆఫ్ స్టడీస్’ వ్యవహరిస్తుంది. దీనిని దారుల్ ఉలూమ్‌ విషయంలో మజ్లిస్-ఎ-షూరా అని పిలుస్తారు.

దారుల్ ఉలూమ్‌కి వైస్ ఛాన్సలర్ గా పని చేస్తున్న మౌలానా మార్ఘూబర్ రహమాన్ జనవరి 10 న చనిపోవడంతో ఆయన స్ధానంలో మోహమ్మద్ వాస్తన్వి నియమితుడయ్యాడు. పదవిని చేపట్టాక ఆయన గుజరాత్ మంత్రి నరేంద్రమోడిని పొగడ్తల్లో ముంచెత్తి కలకలం సృష్టించాడు. నరేంద్రమోడి సారధ్యంలో గుజరాత్ అభివృద్ధి చెందిందనీ, ఆయన పాలనలో గుజరాత్ ముస్లింలు బాగా అభివృద్ధి చెందారనీ వాస్తన్వి ప్రశంసలు కురిపించాడు. అంతటితో ఆగకుండా గుజరాత్ ముస్లింలు గోధ్రా ట్రైన్ దుర్ఘటన అనంతరం జరిగిన మత మారణకాండకు అతీతంగా ఆలోచించడం నేర్చుకోవాలని, దాన్ని దాటి ముందుకు నడవాలనీ హితబోధ చేశాడు. ఇది ముస్లిం వర్గాల్లొ తీవ్ర అగ్రహం రేకెత్తించింది.

వాస్తన్వి హితబోధ నరేంద్ర మోడికి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ముస్లింలు భావించారు. దానితో యూనివర్సిటీ కేంపస్‌లో హింస చెలరేగింది. ఆయన రాజినామా చేయాలన్న డిమాండ్ రోజు రోజు కీ ఊపందుకోవడంతో ఫిబ్రవరి 23 న ఆయనపై ఆరోపణలను విచారించడానికి షూరా ముగ్గురితో కమిటీ వేసింది. వాస్తన్వి ఒత్తిడితోనే కమిటీ వేయడం విశేషం. కమిటీ తనకు అనుకూలంగాగానీ, ప్రతికూలంగాగానీ ఏం చెప్పినా దానితో సంబంధం లేకుండా రాజీనామా చేస్తానని అప్పుడే ఆయన ప్రకటించాడు. దానికి ఆయన కట్టుబడకుండా కమిటీ నివేదిక అసంపూర్ణం అని చెబుతూ రాజీనామాకి తిరస్కరించడంతో అతనిని తొలగించారు.

ఈ తొలగింపు దేశ సెక్యులర్ విలువలకి భంగకరమని బి.జె.పి అభివర్ణించడం ఆసక్తికరంగా మారింది. “సున్నితమైన సామాజిక, సెక్యులర్ విలువలకు ఇది పెద్ద వెనకడుగు. మోడి నాయకత్వంలో గుజరాత్ ధనిక రాష్ట్రంగా అవతరించిందన్న సంగతిని ఎవరూ కాదనలేరు” అని బి.జె.పి ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢి అన్నాడు. “ఇది ఆ సంస్ధ యొక్క అంతర్గత విషయం ఐనప్పటికీ వాస్తన్వి తొలగింపు గుజరాత్ అభివృద్ధి చెందిందన్న ఆయన ప్రకటనతో ముడిపడి ఉన్నందున ఈ అంశం తీవ్రతను సంతరించుకుంది” అని అన్నాడు. “అవినీతి అరోపణలతోనో, అసమర్ధత వలనో లేదా నైతిక కారణాల రీత్యానో ఆయనను తొలగించలేదు. కేవలం గుజరాత్ అభివృద్ధి గురించిన నిజం తెలిపినందుకే ఆయనను తొలగించడం దురదృష్టం” అని రూఢి వ్యాఖ్యానించాడు.

బి.జె.పి తరచుగా సూడో సెక్యులరిస్టులని కాంగ్రెస్ తదితర పార్టీలను నిందిస్తూ ఉంటుంది. అసలు సెక్యులరిజం అంటే ఏమిటో ఆ పార్టీ ఎన్నడయినా చెప్పిందో లేదో అనుమానమే. ఇప్పుడు వాస్తన్విని సెక్యులరిస్టుగా అభివర్ణిస్తున్నందున బి.జె.పి యే అసలైన సెక్యులరిస్టు పార్టీ అనీ, బి.జె.పి నాయకులు, కార్యకర్తలంతా అసలైన సెక్యులరిస్టులేననీ, కనుక వారిని ప్రశంసించేవారు కూడా అసలైన సెక్యులరిస్టులేనీ బి.జె.పి చెప్పదలుచుకున్నట్లుగా భావించవలసి వస్తున్నది. ఓవైపు ముస్లింలు దేశం విడిచి వెళ్ళాలని చెబుతూ, బాబ్రీ మసీదుని కూలగొట్టడానికి రధయాత్ర జరిపి మరీ మతకల్లోలాలను రెచ్చగొట్టిన బి.జె.పి, తానే నిజమైన సెక్యులరిస్టు పార్టీనని చెప్పడం నిజంగా సాహసమే. గోధ్రా రైలు బోగిని తగలబెట్టి కరసేవకులను చంపిన ఘోరాన్ని అడ్డు పెట్టుకుని గుజరాత్‌లో ఏ పాలకుడూ తలపెట్టని విధంగా మత మారణకాండని సృష్టించి నరమేధం సాగించిన మోడి కూడా గొప్ప సెక్యులరిస్టే కాబోలు. అందుకే ఆయన సాగించిన నరమేధాన్ని మరిచిపోవాలని బోధించిన వాస్తన్వి కూడా గొప్ప సెక్యులరిస్టు అయ్యాడు.

భారత దేశంలో ఒక్క బి.జె.పి యే కాదు సెక్యులరిజాన్ని, సెక్యులరిస్టు విలువలను భ్రస్టు పట్టించింది. తిలాపాపం తలాపిడికెడు అన్నట్లుగా ఈ దేశంలోని రాజకీయ పార్టీలన్నీ సెక్యులరిస్టులుగా చెలామణి అవుతూ అటు హిందువులతో పాటు ముస్లింలను కూడా రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్న చరిత్రను సంపాదించుకున్నాయి. అది కాంగ్రెస్ కావచ్చు, జనతా కావచ్చు, ఎస్.పి, తదితర పార్టీలన్నీ మత విభేధాలను పెట్టుబడి చేసుకుని వోట్లు సంపాందించినవే. హిందువుల ఓట్ల కోసం బాబ్రీ మసీదు తాళం తెరిచి వైషమ్యాలు తలెత్తడానికి కారణభూతంగా నిలిచాడు రాజీవ గాంధి. దానిని అంది పుచ్చుకున్న బి.జె.పి అధికారంలోకి రావడానికి సాగించిన మత అరాచకం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే రాజీవ గాంధి ముస్లింల ఓట్ల కోసం షాబానో కేసును అడ్డు పెట్టుకుని ముస్లిం స్త్రీల హక్కులను హరించే చట్టం తెచ్చాడు. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వామ పక్షాల చేత కూడ సెక్యులరిస్టు పార్టీగా మన్ననలందుకోవడం వింతల్లోకెల్లా వింత.

భారత దేశంలో ప్రభుత్వరంగంలో ఉన్న ప్రతి కంపెనీ అకౌంటు పుస్తకాలు, కంప్యూటర్ల నుండి నూతన ఆఫీసు భవన ప్రారంభాల వరకూ హిందూ మత ఆచారాలను పాటించడం ఒక సహజ కార్యక్రమంగా మారిపోయింది. రాష్ట్రపతులనుండి ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులు అంతా సత్యసాయిబాబా జన్మదినానికి హాజరై ఆయన ఎత్తైన ఒక సింహాసనంలో ఆసినుడై ఉంటే, ఆయన పాదాల చెంత ఉండే కుర్చీల్లో ఆసీనులై తరించడం ఈ దేశ సెక్యులరిస్టు నాయకులు చేసిన గొప్ప సెక్యులర్ కార్యక్రమం.

ఒక మాజీ రాష్ట్రపతి, పదవిలో ఉండగానే, ప్రతి సంవత్సరం అధికారిక లాంచనాలను వినియోగించుకుంటూ తిరపతి సందర్శించి పొర్లు దండాలు పెట్టిన గొప్ప సెక్యులరిస్టు నాయకులున్న దేశం మనది. వారు తమ సొంత ఖర్చులతో అధికారిక లాంచనాలేవీ లేకుండా పొర్లు దండాలు కాదు. కుప్పి గంతులేసినా ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కాని ప్రధమ పౌరుడు లేదా, ప్రధాని, మంత్రి, ఎం.పి, ఎం.ఎల్.ఎ ఇలా అన్ని పదవుల అధికారాలను వినియోగిస్తూనే తిరపతి, కాకుంటే భద్రాచలం, అది కాకపోతే ఇంకొకటి సందర్శించి దండాలు దస్కాలు పెట్టడం సెక్యులరిస్టు సూత్రాలకు విరుద్ధమని ఎవరూ గ్రహించకపోవడం ఆశ్చర్యకరం.

సెక్యులరిజం అనే భావానికి, విలువకు నిజమైన అర్ధం ఏమిటన్నది భారత ప్రజలకు తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. సెక్యులరిస్టులమని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు పదవుల్లో కొనసాగుతూ గుళ్ళూ గోపురాలు తిరుగుతూ, ప్రారంభోత్సవాలను హిందూ మతాచారాల ప్రకారం నిర్వహిస్తూ ఉంటున్నపుడు అదే సెక్యులరిజం అని ప్రజలు భావించడంలో తప్పు లేదు.

సెక్యులరిజం అంటె అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం అని కూడా చాలా మంది తప్పుగా భావిస్తున్నారు. పోనీ అదైనా అమలులో ఉన్నదా అంటే అదీ లేదు. ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా ప్రారంభోత్సవాలను గానీ, శంకుస్ధాపనలు గానీ లేదా ఇతర అధికారిక కార్యక్రమాలకుగానీ ముస్లిం మతాచారాన్నో, బౌద్ధమతాచారాన్నో, జైన మతాచారాన్నొ పాటించిన దాఖలాలు ఒక్కటంటే ఒక్కటి కూడా భారతదేశంలో దొరకదంటే అతిశయోక్తి కాదేమో.

సెక్యులరిజం అంటే ఏ మతానికీ ప్రాధాన్యత ఇవ్వకపోవడం. ప్రభుత్వ పరంగా ఏ ఒక్క మతాచారాన్నీ పాటించకపోతేనే ఆ ప్రభుత్వం సెక్యులరిస్టు సూత్రాలను పాటిస్తున్నట్లు లెక్క. నిజానికి సెక్యులరిజం అనేది ఒక జీవన విధానం. అది నిజ జీవితంలో పాటించవలసిన గొప్ప విలువల సమాహారం. వ్యక్తిగత మత నమ్మకాలను గౌరవిస్తూనే, ప్రభుత్వ పరంగా ఏ మతాన్ని పాటించకపోవడం రాజకీయ నాయకులు చేయవలసిన పని. సెక్యులరిస్టు పార్టీగా చెప్పుకునే ఏ పార్టీ అయినా, ఏ ఒక్క మతానికి సంబంధించిన ఆచారం తన పార్టీ కార్యకలాపాల్లో కనిపించనీయకుండా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంస్ధల్లోగానీ, ప్రభుత్వ కార్యాలయాలు, కార్యకలాపాలు వేటిలోనూ మతానికి సంబంధించిన ఆచారా వ్యవహారాలు అనుసరించకూడదు. అలా చేయగలిగితేనే ఏ పార్టీ అయినా, ప్రభుత్వం అయినా సెక్యులరిస్టు పార్టీగా, సెక్యులరిస్టు ప్రభుత్వంగా చెప్పుకోవడానికి అర్హత సాధిస్తుంది.

ఏ మతాచారాన్ని అనుసరించకపోవడం అటుంచి, అసలు ఆ ప్రయత్నమే చేయని పార్టీలు సెక్యులరిస్టుగా చెప్పుకోవడం విచిత్రం. ఒక్క వామ పక్ష పార్టీలు తప్ప ఈ దేశంలో ప్రతి పార్టీ హిందూ మతాచారాలకు ప్రాధాన్యత ఇచ్చి అమలు చేసేవే. ఆ వామపక్షాలు కూడా సెక్యులరిజం విలువలు పాటించని కాంగ్రెస్ పార్టీలకు సెక్యులరిస్టు బిరుదు తగిలించడం ఒక పెద్ద అపభ్రంశం. సెక్యులరిజం అర్ధం మతాలను అగౌరవపరచడంగా భావిస్తే అది పొరబాటే. సెక్యులరిజం వ్యక్తిగత మత విశ్వాసాలను గౌరవిస్తుంది. కాని ఆ విశ్వాసాలను తనవరకు, తన ఇంటివరకే పరిమితం చేయాలని కోరుతుంది. సామాజిక జీవనంలో ఎన్ని దేవుళ్లను కొలిచినా, ఏ మతాన్ని ఆచరించినా సెక్యులరిజం పట్టించుకోదు. దానిని బలవంతంగా రుద్దాలనుకుంటె మాత్ర్రం అందుకు నిరాకరిస్తుంది.

వ్యక్తిగత విశ్వాసాలను గౌరవించడం అంటే ప్రభుత్వం తాను ఆ విశ్వాసాలను అనుసరించడం కాదు. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించినంతవరకూ ఒక అధికారి గానీ, ఉద్యోగి గానీ, మంత్రిగానీ, ఎం.ఎల్.ఎ గానీ. చివరికి ప్రధాని, రాష్ట్రపతులైనా సరే తాను ఫలానా మతస్ధుడిని/మతస్ధురాలిని అని సూచించే ఎటువంటి పనినీ చేపట్టరాదు. అలా చేయగలిగినప్పుడే మత సామరస్యత సాధ్యమవుతుంది. మైనారిటీ మతస్ధులు తాము భద్రంగా ఉన్నామని విశ్వసించగలుగుతారు. మైనారిటీ మతస్ధులు అనుక్షణం బిక్కు బిక్కుమంటూ గడిపే పరిస్ధితులని దేశం నిండా పెట్టుకుని, వాటిని పోగొట్టడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా, తాము సెక్యులరిస్టులమనీ, తమది సెక్యులరిస్టు పార్టీ అనీ చెప్పుకోవడం పచ్చి మోసం, దగా.

ఓవైపు ప్రభుత్వ వ్యవహారాలన్నింటినీ హిందూ మతాచారాలతో ముంచెత్తుతూ తమది సెక్యులరిస్టు పాలన అని చెప్పుకోవడం వాగాడంబరమే కాక వంచన కూడా. ప్రవేటు షాపుల్లో దేవుడు, దేవత ల బొమ్మలు ఉండే అభ్యంతర పెట్టవలసిన అవసరం లేదు. కాని బ్యాంకుల్లో, ఇన్సూరెన్సు ఆఫీసుల్లో క్యాషియర్ కౌంటర్లను చూస్తే చుట్టూ వివిధ రకాల దేవుడు దేవతల బొమ్మలు అతికించి కనిపిస్తాయి. ఉద్యోగులు, ఆఫీసర్ల టేబుళ్ళపై ఉండే అద్దాల కింద సకల దేవతల బొమ్మలు ఉంటాయి. కంప్యూటర్ల స్క్రీన్లపై కూడా దేవతల బొమ్మలే. అనేక చేతులు, అనేక రకాల తలలు కలిగిన దేవతలు, దేవుళ్ళ బొమ్మలు సర్వవ్యాప్తం అయిపోయాయి. అటువంటి వాతావరణంలో ఒక ముస్లిం ఆఫీసులోకి గానీ, బ్యాంకులోకిగానీ అడుగుపెట్టి తాను సెక్యులరిస్టు దేశానికి చెందిన సెక్యులరిస్టు ప్రభుత్వ కార్యాలయానికి వచ్చానని భావించగలడా? అది ప్రభుత్వ సెక్యులరిస్టు సూత్రాలకు విరుద్ధం అని చెప్పిన నమ్మే పరిస్ధితి ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో లేదు. కారణం సెక్యులరిజం భారత ప్రభుత్వ విధానం, అది ప్రభుత్వ కార్యాలయాలు తప్పనిసరిగా అనుసరించాలి అని చెప్పేవారు ఎవరు? ఓట్ల కోసం మత భావాలను రెచ్చగొట్టే భావదారిద్ర రాజకీయ పార్టీలు తప్ప.

సెక్యులరిజం ఏ ఒక్క మతానికీ అనుకూలం కాదు. అలాగని వ్యతిరేకం కాదు. అది మతానికి అతీతమైన జీవన విధానానికి సంబంధించిన సూత్రం. సెక్యులరిజం జీవనవిధానంగా మార్చుకున్న దేశంలో మత కల్లోలాలు కాదు గదా, మత దూషణలు కూడా జరగే అవకాశమే లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s