“దారుణమే, కాని అవసరం” -నార్వే బాంబు పేలుళ్ళు, కాల్పుల నిందితుడు


Mourners have been gathering in the centre of Oslo

ఓస్లో నగరంలో మృతులకు నివాళులు అర్పించడానికి కూడిన ప్రజలు

నార్వే రాజధాని ఓస్లోలో ప్రధాని కార్యాలయం వద్ద బాంబు పేలుళ్ళకు పాల్పడి 7 గురినీ, కాల్పులు జరిపి 85 మందినీ చంపిన నేరంలో అనుమానితుడిగా అరెస్టయిన ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ తానే ఆ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడని అతని లాయర్ ‘గీర్ లిప్పెస్తాద్’ తెలిపాడు. తన చర్యలు “దారుణమే, కాని అవసరం” అని బ్రీవిక్ పేర్కొన్నట్లుగా ఆయన తెలిపాడు. మృతుల కోసం ఉటోవా ద్వీపంలో పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మరింతమంది నీటిలో మునిగి పోయి ఉండవచ్చన్న అనుమానంతో మిని సబ్ మెరైన్‌ని వినియోగించి గాలిస్తున్నారు. కనీసం నలుగురి ఆచూకి ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. శుక్రవారం దాడుల్లో మరొక అనుమానితుడు ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు.

బ్రీవిక్ తన చర్యలకు కొంత కాలంగా పధకం వేసుకుంటున్నాడని లాయర్ తెలిపాడు. ‘టెర్రరిస్టు చర్యలకు పాల్పడ్డ’ నేరాన్ని బ్రీవిక్ పై మోపారు. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టబోతున్నామని పోలీసులు తెలిపారు. శనివారం వరకూ నిందితుడికి తీవ్రవాద మితవాద సంస్ధలతో సంబధాలు లేవని చెప్పిన పోలీసులు, ఆదివారం నుండి ఆ వాదనను వెనక్కి తీసుకున్నట్లు కనిపిస్తోంది. బ్రీవక్ కి కొన్ని తీవ్రవాద సంస్ధలతో సంబంధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ తీసిన 12 నిమిషాల నిడివిగల వీడియోను యూట్యూబ్ లో బ్రీవిక్ ఉంచాడని తెలుస్తోంది. వీడియోకు “నైట్స్ టెంప్లార్ 2083” (Knights Templar 2083) అని పేరు పెట్టాడు. ‘ఆండ్రూ బెర్విక్’ అనే తప్పుడు పేరుతో 1500 పేజీల డాక్యుమెంట్‌ను బాంబు పేలుళ్ళకు కొన్ని గంటల ముందు ఇంటర్నెట్ లో ఉంచాడని కూడా తెలుస్తోంది. డాక్యుమెంట్‌ను బ్రీవక్ రాసాడనీ, దాన్ని బట్తి కొద్దకాలంగా బ్రీవిక్ ఈ చంపుడు పనిలో ఉన్నాడని తెలుస్తున్నది.

డాక్యుమెంటు, వీడియోలలో చాలా చోట్ల నైట్స్ టెంప్లార్ గురించిన ప్రస్తావన ఉంది. బహుళ సంస్కృతి విధానం (multiculturalism), దేశంలోకి ముస్లింల వలస అంశాల గురించి కూడా పదే పదే ప్రస్తావించాడని పత్రికలు తెలిపాయి. బ్రీవిక్ ముస్లింల వలసను తీవ్రంగా వ్యతిరేకించాడని తెలుస్తోంది. అనేక మంది ముస్లింలు సైతం చనిపోయినవారి కోసం చర్చిలలో ప్రార్ధనలు జరిపారు. దాడులకు పాల్పడింది ఆల్-ఖైదా యేమోనని మొదట భావించినట్లు ముస్లింలు తెలిపారు. “నార్వే అందరినీ అంగీకరించే దేశం. అందరినీ ఆహ్వానిస్తుంది. నార్వే దేశీయుడు ఈ ఘటనలకు పాల్పడ్డాడని తెలిసినపుడు నేను నిజంగా నిర్ఘాంతపోయాను. అతను పూర్తిగా ద్వేషంతో నిండి ఉన్నాడు” అని ఒక ముస్లిం వ్యక్తి చెప్పినట్లుగా బిబిసి వెల్లడించింది. పోలీసు దుస్తుల్లో ఉన్న వ్యక్తి అందర్నీ ఒక చోటకు రమ్మని చెప్పి, వచ్చాక కాల్పులకు దిగాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కొందరు చనిపోయినవారి శవాల మద్య చనిపోయినట్లుగా నటించి బతికిపోయామని తెలిపారు.

నిందితుడి మాటలను బట్టి ముస్లింలు తమ దేశానికి వలస రావడానికి బద్ధ వ్యతిరేకిగా అర్ధం అవుతోంది. బహుళ సంస్కృతి, వివిధ సంస్కృతులు కలవారు ఉమ్మడిగా కలిసి జీవించే విధానం, ని అతను తీవ్రంగా ద్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది బ్రీవిక్ తో మొదలైంది కాదు. యూరప్ దేశాల్లో ఆర్ధిక సంక్షోభం తీవ్రమవుతున్న దృష్ట్యా పాలకులు ప్రజల మధ్య ఇటువంటి తగువులు పెట్టడానికి, ఉన్నవాటిని పెంచి పోషించడానికీ చర్యలు చేపడుతూ, ప్రజల దృష్టిని మళ్ళించడానికి ప్రయత్నిస్తున్నారు. తమ ఆర్ధిక సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, ఆకలి, దారిద్ర్యం తదితర సమస్యలన్నింటికీ ముస్లింలు తమ దేశాలకు వలస రావడమే కారణమని ప్రజలు భావించేలా ఉపన్యాసాలు, విశ్లేషణలు, ప్రకటనలను రాజకీయ నాయకులు చేస్తున్నారు.

మంత్రులతో పాటు, అధికారులు, బ్యాంకుల అధికారులు కూడా ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. పశ్చిమ దేశాల్లో పౌరులకు అందించే సంక్షేమ పధకాల కోసమే వస్తున్నారని రాజకీయ నాయకులు ప్రకటించడం, ద్వేష భావం వ్యక్తం చేయడం చేస్తున్నారు. యూరప్ దేశాల్లో గత కొన్ని సంవత్సరాలుగా మితవాద పార్టీలు పైచేయి సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన దగ్గర్నుండి ఈ ధోరణి పెరిగిపోయింది.  చౌక వేతనాలకు శారీరక శ్రమ చేసేవారి కోసం, ఇతర నైపుణ్య కార్మికుల కోసం ప్రభుత్వాలే బైటివారిని దేశంలోకి రావడానికి అనుమతిస్తున్న సంగతిని ప్రభుత్వాలు తమ ప్రజల వద్ద దాచిపెడుతున్నాయి. ఆర్ధిక సంక్షోభం వలన పెట్టుబడిదారుల ఆదాయాలను పెంచడం కోసం యూరప్ దేశాల ప్రభుత్వాలు ప్రజలపై అధిక పన్నులు మోపుతూ, ఉద్యోగాలను రద్దు చేస్తూ, ఉద్యోగులకు వేతనాల కోత, పధకాల రద్ధు, సౌకర్యాల రద్ధు విధానాలను అమలు చేస్తున్న సంగతిని చూడడంలో యూరోపియన్లు విఫలమవుతున్నారు. తమ కష్టాలకు తక్షణ కారణంగా ఎదురుగా కనిపిస్తున్న వలస ప్రజలను ఎంచుకుని వారిపై ద్వేషం పెంచుకుంటున్నారు.

దేశంలోపల తమ ప్రజల ఆర్ధిక స్ధితిగతులు కునారిల్లే విధంగా ఆర్ధిక విధానాలను అనుసరించే యూరప్ దేశాల ప్రభుత్వాలు తమ సామ్రాజ్యవాద విధానాల ద్వారా మూడో ప్రపంచ దేశాలను కూడా దోచుకుంటున్నాయి. తమ బహుళజాతి సంస్ధల మార్కెట్ల కోసం పేద, వర్ధమాన దేశాలను వారి మార్కెట్లను బహిరంగం కావించే ప్రవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు అమలు చేసేలా ఒత్తిడి చేస్తున్నాయి. తద్వారా ఆయా దేశాల ప్రజల సంపధలను కొల్లగొడుతూ, స్ధానిక ప్రజలకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ లాభాలు మూటకట్టుకుంటున్నాయి. వీరి ఉత్పత్తి విధానాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేవి కావడంతో ఇవి తాము పెట్టుబడి పెట్టే దేశాల ప్రజలకు కల్పిస్తున్న ఉద్యోగాలు కూడా చాలా తక్కువ.

అటు వనరులూ దోపిడీకి గురయ్యి, ఇటు ఉపాధి కరువయ్యి, ఉపాధి ఉంటే చాలీ చాలని వేతనాలతో బతుకు దుర్భరమయ్యి ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియాలనుండి పేదలు యూరప్ దేశాలకు అవి స్వర్గధామాలని భావిస్తూ వలస వెళుతున్నారు. అంటే యూరప్ దేశాలకు వలస రావడానికి కూడా యూరప్ దేశాలు పేద, వర్ధమాన దేశాల్లో చేస్తున్న దోపిడీయే కారణమని గ్రహించవలసి ఉంది. ఓ వైపు తమ సామ్రాజ్యవాద దోపిడీ విధానాలతో పేద, వర్ధమాన దేశాల సంపధలను కొల్లగుడుతూ, దానివలన వలస వస్తున్న బాధిత దేశాల ప్రజలపైన దుష్ప్రచారం చేస్తున్నాయి యూరప్ దేశాలు. వలస వస్తున్నవారిని సమస్త సమస్యలకు కారణంగా చూపుతూ అసలు కారనమైన తమ ఆర్ధిక విధానాలపై వారి దృష్టి పడకుండా జాగ్రత్త పడుతున్నారు.

గత సంవత్సరం అక్టోబరులో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మల్టి కల్టి (multi-kulti – multiculturalism) విఫలమైందంటూ ప్రకటించింది. జర్మనీ సెంట్రల్ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు ముస్లింలు కేవలం ప్రభుత్వ సౌకర్యాలకోసమే వలస వస్తున్నారని వారు ప్రభుత్వ సౌకర్యాలను అనుభవిస్తున్నారు తప్ప జర్మనీ ఎదుగుదలకు దోహదం చేయడం లేదని విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసి విభేధాలని ఎగదోశాడు. ఆ తర్వాత బ్రిటిష్ ప్రధాని కామెరూన్ కూడా అదే పల్లవిని అందుకుని తన భావ దారిద్రాన్ని ప్రకటించుకున్నాడు. వీళ్ళు తమ దేశ ప్రజలకు సైతం చేసే మేలు ఏమీ ఉండదు. తమ దేశంలోని పేదలు, మధ్య, ఎగువ మధ్య తరగతి ప్రజల మూలుగలను పీల్చివేసే పొదుపు విధానాలను అమలు చేస్తూ ధనికులకు, కార్పిరెట్ కంపెనీలకు, వ్యాపారాల్లో అక్రమాలు దోపిడీలు చేసే బడా కంపెనీలకు మేలు చేసే విధానాలనే అమలు చేస్తారు. తమ విధానాల వలన ఉద్యోగాలు కోల్పోతున్న తమ ప్రజలను మాత్రం వలస ప్రజలపైకి రెచ్చగొట్టి చోద్యం చూస్తూ నంగనాచిలా నీతులు చెబుతారు.

ఫలితంగా యూరప్ దేశాల ప్రజల్లో తమ కష్టాలకు, పేదరికానికి, నిరుద్యోగానికీ వలస ప్రజలే కారణమని నమ్ముతూ మితవాద భావాలవైపుకి ఆకర్షితులవుతున్నారు. అలా మితవాదిగా మారిన వారిలో ఒకరే బ్రీవిక్. వీళ్ళు సానుకూలంగా, సకారణంగా, హేతుబద్ధతతో ఆలోచించి విశ్లేషించుకుంటే తమ సమస్యలకు కారణం ఎవరో అర్ధం చేసుకోగలుగుతారు. కాని వారు సక్రమంగా ఆలోచించే లోపుగానే మితవాద భావాలతో కూడిన విద్వేష భావాలను, సిద్ధాంతాలను రాజకీయ పార్టీలు చొప్పించగలుగుతున్నాయి. అటువంటి ప్రభావాలకు లోనైన వారిలో కొద్దిమంది సున్నిత మనస్కులు తీవ్రవాదం వైపుకి నెట్టివేయబడే ప్రమాదం ఎల్లపుడూ ఉంటుంది. బ్రీవిక్ చేసింది దారుణాతి దారుణమే అయినా అతని చర్యలు ఒక చారిత్రక సంధికాలానికి ప్రతీకలుగా చూడాల్సి ఉంది. ప్రపంచం అంతా వరుస ఆర్ధిక సంక్షోభాలతో సతమవుతూ ధనికవర్గాలు మరింతగా దోపిడీ తీవ్రతను పెంచుతూ పోతుంటే కింద ఉన్న కార్మిక, రైతు, కూలీ వర్గాలు మరిన్ని కష్టనష్టాలకు గురవుతూ తమ సమస్యలకు తక్షణ కారణాలను వెతుకుతున్న క్రమంలో తప్పుడు భావాలకు, చైతన్యానికి గురవుతున్నారు.

బ్రీవిక్ చర్య యూరప్ లోని సామ్రాజ్యవాద పాలక వర్గాలకు ఒక విధమైన వేకువ పిలుపు కాగా, ప్రజల కోసం ఆలోచిస్తున్న ప్రగతిశీల వర్గాలకు మరొక విధమైన వేకువ పిలుపుగా చూడవలసి ఉంది. దోపిడీ పాలక పార్టీలకు బ్రీవిక్ లాంటి వ్యక్తుల ఉద్భవం సానుకూల పరిణామమే. కార్మికులు, రైతులు, కూలీలు, వేతన జీవులతో పాటు మొత్తం దేశాల ప్రగతిని అభివృద్ధిని కాంక్షించే ప్రగతిశీల వర్గాలకు బ్రీవిక్ చర్య హెచ్చరికి లాంటింది. వారు త్వరపడి ప్రజల్లోని అసంతృప్తిని సరైన దిశకు మళ్ళించడంలో విఫలమైతే, వేలాదిమంది బ్రీవిక్ లు మితవారుల విష పరిష్వంగంలోకి వెళ్ళిపోయి పరిస్ధితి మరింత దిగజారడానికి కారణమవుతారు.

16 thoughts on ““దారుణమే, కాని అవసరం” -నార్వే బాంబు పేలుళ్ళు, కాల్పుల నిందితుడు

 1. “తమ ఆర్ధిక సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, ఆకలి, దారిద్ర్యం తదితర సమస్యలన్నింటికీ ముస్లింలు తమ దేశాలకు వలస రావడమే కారణమని ప్రజలు భావించేలా ఉపన్యాసాలు, విశ్లేషణలు, ప్రకటనలను రాజకీయ నాయకులు చేస్తున్నారు.

  మంత్రులతో పాటు, అధికారులు, బ్యాంకుల అధికారులు కూడా ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలపై అధిక పన్నులు మోపుతూ, ఉద్యోగాలను రద్దు చేస్తూ, ఉద్యోగులకు వేతనాల కోత, పధకాల రద్ధు, సౌకర్యాల రద్ధు విధానాలను అమలు చేస్తున్న సంగతిని చూడడంలో యూరోపియన్లు విఫలమవుతున్నారు. తమ కష్టాలకు తక్షణ కారణంగా ఎదురుగా కనిపిస్తున్న వలస ప్రజలను ఎంచుకుని వారిపై ద్వేషం పెంచుకుంటున్నారు.”

  మరి ఇదే విధానాన్ని మన తెలంగాణా నాయకులు కూడా ఉపయోగిస్తున్నారని మనం అనుకోవచ్చా?

 2. just to make sure this only applies to the specific context in that paragraph. do NOT mix it with things like “యూరప్ దేశాల ప్రభుత్వాలు తమ సామ్రాజ్యవాద విధానాల ద్వారా మూడో ప్రపంచ దేశాలను కూడా దోచుకుంటున్నాయి. తమ బహుళజాతి సంస్ధల మార్కెట్ల కోసం పేద, వర్ధమాన దేశాలను వారి మార్కెట్లను బహిరంగం కావించే ప్రవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు అమలు చేసేలా ఒత్తిడి చేస్తున్నాయి. తద్వారా ఆయా దేశాల ప్రజల సంపధలను కొల్లగొడుతూ, స్ధానిక ప్రజలకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ లాభాలు మూటకట్టుకుంటున్నాయి. ”

  Because these may not be applicable to Telangaana.

 3. అనుమానం ఎందుకు?

  ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్ర కూడా. ఆ మాట కోస్తే ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా. ఇక్కడ తెలంగాణ కనపడింది కనక తెలంగాణ రాష్ట్రం లేకపోవడం పైకి తమ పాపాలన్నింటినీ నెట్టేశారు. ఆంధ్రలో ప్రభుత్వరంగ కంపెనీలపైకి నెట్టేస్తారు. లేదా ప్రవేటీకరణ చేయకపోవడం వలనా సెజ్ లు లేకపోవటం వలనా మనకిన్న సమస్యలని చెబుతూ వచ్చారు కదా. ఇప్పుడు తెలంగాణ రందిలో పడి అవన్నీ వెనకపట్టు పట్టాయి గానీ, కోస్తా కారిడార్, ధర్మల్ ప్లాంటులు ఇవన్నీ వస్తే ఆంధ్ర ప్రజల బతుకులు నందనవనం అని చెప్పాడు రాజశేఖర రెడ్డి. కాని అవొస్తే కోస్తాంధ్ర ప్రజల పరిస్ధితి మరింత దిగజారుతుంది. ఉద్యోగాలు తర్వాత సంగతి, అసలు ఇళ్లలో ఉండడమే కష్టమవుతుంది, కాలుష్యం వలన.

  ఈ విషయాలను గతంలో రాసిన పోస్టుల్లో రాశాను. తెలంగాణ రాష్ట్రం అన్ని సమస్యలకు పరిష్కారం కానే కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధానంగా తెలంగాణ పెట్టుబడిదారులకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఆ అవకాశాలను వినియోగించుకునే క్రమంలో అనివార్యంగా నీటిపారుదల సౌకర్యాలు, రోడ్డు సౌకర్యాలు తదితర మౌలిక సౌకర్యాలు ఒక మాదిరి పెద్ద ఊళ్ళ వరకూ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఈ సౌకర్యాలు అనివార్యంగా పేద, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేక రాష్ట్రంలో తమకంటూ వేరే బడ్జెట్ తెలంగాణకి ఉంటుంది. తెలంగాణ బడ్జెట్, సీమాంధ్ర బడ్జెట్ కంటె పెద్దదిగా ఉంటుంది. ప్రత్యేక రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులు ఇతరుల కంటె తెలంగాణ రాష్ట్రంలోని పెట్టుబడిదారులకోసం కేటాయించడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ప్రత్యేక రాష్ట్రంలో గతంలోలాగా సీమాంధ్ర పెట్టుబడుదారుల పోటీ ఉండదు. ఉన్నా మెజారిటీ భాగాన్ని తామే దక్కించుకోవచ్చు. బ్యాంకుల అప్పులు కూడా మెజారిటీ తామే దక్కించుకునే అవకాశం వస్తుంది. తెలంగాణ పెట్టుబడిదారులకి వచ్చే ఈ ప్రయోజనాలన్నీ కూడా ఆటోమేటిగ్గా ఉద్యోగాల రూపంలో గానీ, నీటిపారుదల సౌకర్యాల రూపంలో గానీ, తెలంగాణ వారి ఫ్యాక్టరీల రూపంలో కానీ కింది స్ధాయి ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తాయి. వీటి కోసమే, తెలంగాణ అన్ని సమస్యలకు పరిష్కారం కాదని భావిస్తున్నవారు కూడా తెలంగాణ డిమాండ్ కి మద్దతు ఇవ్వవలసి వస్తున్నదని గుర్తించాలి.

  దానర్ధం ఇప్పటికే తెలంగాణలో ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులకు అసలు అవకాశాలు ఉండవని కాదు. వారికీ ఉంటాయి. కానీ ప్రాధామ్యాల పరంగా చూస్తే తెలంగాణవారికి ప్రాధామ్యం ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికే సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆధిపత్యం (పలుకుబడి, పరిచయాలు, ఆర్ధిక సంబంధాలు మొ.వి) స్ధిరపడినందున వారితో పోటీలు పడి తెలంగాణ వారు కాంట్రాక్టులు పొందలేక పోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ బెడద తప్పించుకోవడానికే టి. పెట్టుబడిదారులు రాష్ట్రం కోసం అంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లగడపాటి తెలంగాణ వస్తే తాను రాజకీయాలనుండి తప్పుకుంటానంటున్నాడు. ఎందుకనుకుంటున్నారు? ఆ తర్వాత కూడా రాజకీయాల్లో ఉంటే సీమాంధ్ర రాజకీయనాయకుడానే గుర్తింపుని కలిగి ఉంటాడు. కనుక తెలంగాణలో ఉన్న అతని కంపెనీలకీ, వాటికి కావలసిన బడ్జెట్ సపోర్టుకీ తెలంగాణ ప్రభుత్వం పైన ఆధారపడి ఉండాల్సి వస్తుంది. రాజకీయ నాయకుడుగా కాకుండా కేవలం పెట్టుబడిదారుడిగా ఉంటే తన కంపెనీలకు భద్రత ఉంటుందని ఆశిస్తున్నాడు. ముడుపులు ముట్టజెప్పి ఎలాగూ కాంట్రాక్టులు చేజిక్కించుకోవచ్చని ఆశిస్తున్నాడు. సీమాంద్ర రాజకీయనాకుడిగా ఉంటూ కూడా ముడుపుపు ముట్టజెప్పి కాంట్రాక్టులు పొందడం కష్టంగా మారుతుంది. తెలంగాణ వారినుండి వ్యతిరేకత తీవ్రంగా ఉంటుంది. పక్కన ఉంటూ ముడుపులిచ్చి పబ్బం గడుపుకోవాలన్న ఆశతో రాజాకీయాల్లో ఉండనని అంటున్నాడు. తెలంగాణ ఇచ్చినందుకు నిరసనగానే రాజకీయాల్లో ఉండనని ఆయన అంటున్నాడని భావిస్తే అది నిజం కాదు. అలాగే, తెలంగాణ ప్రజల వెనుకబాటుతనం పట్ల వేదన ఉండి కాదు తెలంగాణ ధనికులు తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. తమ ప్రయోజనాలే వారినలా మాట్లాడిస్తున్నాయి.

  తెలంగాణ ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని చాలా చెబుతున్నారు. నిస్సందేహంగా అవన్నీ నిజం కాదు. చాలా వరకు, అబద్ధాలు అతిశయోక్తులే. కానీ సహజంగా జరిగే ఒక క్రమాన్ని తెలంగాణలో జరగకుండా సీమాంధ్ర ధనికులు (పెట్టుబడిదారులు) అడ్డుకున్నారు. ఏమిటా క్రమం? ప్రభుత్వాల నిధులు, బ్యాంకుల అప్పులు ఉపయోగించుకుంటూ స్ధానికంగా పలుకుబడి కలిగిన వర్గం ధనికవర్గంగా అభివృద్ధి సాధిస్తుంది. ఆ క్రమాన్ని తెలంగాణలో సాగకుండా అప్పటికే తెలంగాణలో కూడా పాతుకుపోయిన సీమాంధ్ర పెట్టుబడిదారులు అడ్డుకుంటున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన పెట్టుబడిదారుడు కొత్త పెట్టుబడిదారుల్ని పోటీకి రానివ్వడు. కొత్తవారికి అవకాశాలు రాకుండా అడ్డుకుంటాడు. కొత్తవాడు ఆంధ్రవాడైనా, తెలంగాణవాడైనా స్ధిరపడినవారు కొత్తవారిని ఎదగనివ్వరు. కోస్తా ప్రాంతంలో రెవిన్యూ కోసం బ్రిటిష్ వాడు ఏర్పరిచిన నీటిపారుదల సౌకర్యాలు కోస్తా ధనికులను తయారు చేశాయి. కాని తెలంగాణ ఫ్యూడల్ నిజాం పాలనలో ఉండడం వలన ఆ అవకాశాలు రాలేదు. దానితో తెలంగాణ ధనికులు ఇటీవలే నూతన ఆర్ధిక విధానాలతో లబ్ది పొంది అభివృద్ధి చెందారు. కాని వారు ఒక స్ధాయికి వచ్చాక సీమాంధ్ర పెట్టుబడిదారులు అవకాశాలు రానివ్వకుండా అడ్డుకున్నారు. అందుకే వారికి ప్రత్యేక రాష్ట్రం గుర్తుకు వచ్చింది.

 4. “పక్కన ఉంటూ ముడుపులిచ్చి పబ్బం గడుపుకోవాలన్న ఆశతో రాజాకీయాల్లో ఉండనని అంటున్నాడు.”
  లాంకో రెవెన్యూ లో తెలంగాణ నుంచీ ఎంత శాతం వస్తుందో మీకు తెలుసా? పది శాతం కంటే తక్కువ. దాని కోసం మాత్రమే, లగడపాటి సమైక్యవాదం వినిపిస్తున్నాడనటం సరికాదు. అయినా లగడపాటి మనసు లో విషయం మీకెలా తెలిసింది?

 5. హాయ్ బొందలపాటిగారూ,

  లగటిపాటి, టాటా, అంబానీ, గోల్డ్ మేన్ సాచ్ వీళ్లంతా మనసులో మాట చెప్పేవాళ్ళు కాదు. వాళ్లంతా శత సహస్ర కోటీశ్వరులు. వారు తమ కంపెనీల కోసం, లాభాల కోసం ఏయే వేషాలు వేసేదీ వారి చరిత్ర చెబుతుంది. వారి కంపెనీల లాభాలు పెంచుకోవడం కోసం ఏయే గడ్డీ తినేదీ, విలువలన్నీ ఎలా వదిలేసేదీ అన్నీ వారిలాంటి అనేక మంది చరిత్ర చెబుతుంది. పెట్టుబడిదారుల ఎత్తుగడలు, ప్రభుత్వాలతో వారికి ఉండే సంబంధాలు, రాజకీయ నాయకులకీ శత కోటీశ్వరులకీ, శత సహస్ర కోటీశ్వరులకీ మధ్య ఉండే బొడ్డు తాడు సంబంధాలూ అన్నీ జగత్ప్రసిద్ధం. వారి మనసులోకి దూరనక్కర్లేదు. వారి కంపెనీల ప్రయోజనాలే వారి ప్రయోజనాలు.

  లాంకో ఒక్కటే ఆయన కంపెనీ కాదు. ఇంకా అనేక కంపెనీల్లో ఆయనకి పెట్టుబడులు ఉంటాయి. ఆయన ‘నేను సచ్ఛరిత్రుడ్ని. కష్టపడి పైకొచ్చాను’ అని చెప్పుకుంటే నమ్మే వాళ్ళు బహుశా ఉండరేమో, ఆయన పెట్టే గడ్డి తినేవారు తప్ప. (మీకిది వర్తించకూడదని నా కోరిక) ఆయన పెడుతున్న గడ్డి తింటున్నవాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న రాజకీయ నాయకుల్లో చాలా మంది ఉండొచ్చు కూడా. అంతెందుకు, ఉద్యమ పార్టీ అని చెబుతున్నవారే అయన రాల్చే నోట్ల కట్టల్ని ఇష్టంగా దాచిపెట్టుకుంటున్నారు. అది వేరే సంగతనుకొండి.

  అదీ కాక లాంకోతోనే లగడిపాటిగారి బతుకంతా గడిచిపోదు. లాంకోలో వచ్చే లాభాలు కూడబెట్టాక అది మళ్ళీ పెట్టుబడి అవతారం ఎత్తుతుంది. పెట్టుబడిగా మారిందంటే అది ఒక చోట నిలవదు. మరిన్ని లాభాల కోసం పరుగులు పెడుతుంది. ప్రస్తుతం వాన్ పిక్ ప్రాజెక్టు వెనక్కి తగ్గిన నేపధ్యంలో ఆయనగారి కొత్త పెట్టుబడులు మళ్ళీ హైద్రాబాద్ కే రావాలి. కనుక హైద్రాబాద్ వారికి కావాలి. లగడపాటిగారే అంటున్నాడు కదా, హైద్రాబాద్ మాక్కూడా కావలసిందే అని. అది హైద్రాబాద్ మీద ప్రేమ కాదు. వారి పెట్టుబడుల కోసమే.

  బొందలపాటిగారూ, రాజకీయ నాయకుల ఎత్తుగడలను తెలుసుకోవడానికి వారి మనసులో దూరాలా చెప్పండి. పెట్టుబడుదారులు కూడా అలాగే. వారంతా పబ్లిక్ కి జవాబుదారీగా ఉండవలసినవారు. కానీ ఉండరు. కనుక వారి ఊహల్నీ, వ్యూహాల్నీ రాజకీయ, ఆర్ధిక విశ్లేషకులు ఎప్పటికప్పుడు జనానికి తెలియజేస్తూ ఉంటారు. వారి దగ్గర్నుండి తెలుసుకున్నవే నేను రాస్తున్నవి. ఇక్కడ వ్యక్తిగత ఇష్టా యిష్టాలకు తావు లేదు. తెలంగాణ, సీమాంధ్ర ఇవి కేవలం భూమి, చెట్లు, పొలాలు, రియల్ ఎస్టేట్ ఇవే కాదు. కాని అవేనని లగడపాటిలాంటివారి గట్టి నమ్మకం. వారి నమ్మకాలెలాగున్నా, తెలంగాణ, సీమాంధ్రల్లో పెట్టుబడిదారులే కాకుండా జనం ఉన్నారు. ఒకచోట నాలుగు, మరొక చొట ఆరు కోట్లమంది. వారికీ పని చేయడానికి చేతులు, నింపవలసిన పొట్ట ఉన్నాయి. వారి వర్తమానం, భవిష్యత్తు అంతా ఈ రాజకీయనాయకులు, పెట్టబడిదారులైన లగడపాటిలు…. వీరి చేతుల్లోనే ఏడ్చాయి మరి. అందుగురించే వారి గురించి పట్టించుకోవడం. వీళ్ల కోసం జనాలు ఆవేశపడిపోవడం, లగడపాటి, కావూరి, యాష్కీ, రాజగోపాల్, వనమా వీళ్ళకోసం జనాలు కొట్టుకోవడమే అసలు విషాధం.

  ఇందులో నాకు తెలియకుండా మిమ్మల్ని ఏమైనా అన్నట్లుంటే ఆ ఉద్దేశ్యం నాకు లేదని గమనించగలరు. సీరియస్ విషయాలు మాట్లాడుకునేటపుడు కొన్ని కఠినంగా ధ్వనించవచ్చు. అలాంటి కఠినత్వం ఏమైనా ధ్వనిస్తే మిమ్మల్ని ఉద్దేశించి కాదని గమనించ గలరు. మీ వ్యాఖ్యతో నా చేత ఇంకా కొంత రాయించినందుకు ధన్యవాదాలు.

 6. శేఖర్ గారు,
  పెట్టుబడిదారుల గురించి మీ అభిప్రాయాలతొ ఏకీభవిస్తాను. వారి గురించి మర్క్సియన్ అనాలిసిస్ సరైనదే! కానీ వారికి ప్రత్యామ్నాయమేది? సామ్యవాదం నిలబడలేక పోయింది.

 7. ప్రసాద్ గారు

  సామ్యవాదం నిలబడలేదనడం సరికాదని నా అభిప్రాయం. మానవ సమాజం ఏర్పడినప్పటి నుండి వర్గాల మధ్య ఘర్షణలు నిరంతరం జరుగుతూనే వచ్చాయి. టాల్‌స్టాయ్ అన్నట్లు యుద్ధానికీ, యుద్ధానికి మధ్య విరామమే శాంతి. వర్గ ఘర్షణలతోనే సమాజం ముందుకు సాగింది. రష్యా, చైనాలలో సోషలిస్టు వ్యవస్ధలు కూలినంత మాత్రాన అదే అంతిమం కాదు. రష్యా, చైనాలలో జరిగింది ఒక ప్రయోగం. మానవ జాతి అభివృద్ధి కోసం జరిగిన ప్రయోగం. కాకుంటే అది సుదీర్ఘ ప్రయోగం. తరాల తరబడి సాగిన ప్రయోగం.

  రష్యా, చైనాలలోని కమ్యూనిస్టు పార్టిల్లోకి పెట్టుబడిదారి శక్తులు జొరబడి ఆధిక్యం సంపాదించి, కీలక దశలో హత్యలు చేసి సమాజాన్ని వెనక్కి తిప్పారు. అది తాత్కాలికమే. పారిస్ కమ్యూన్ గురించి మీకు ఐడియా ఉండి ఉండాలి. పారిస్‌ని కార్మికులు సాయుధంగా ఆక్రమించుకుని పాలించుకున్నారు. అది పారిస్ కమ్యూన్ గా చరిత్రలో రికార్డయ్యింది. అది మూడు నెలలే నిలిచింది. ఖచ్చితంగా చెప్పుకోవాలంటే రెండు నెలల పది రోజులు. 1871 మార్చి 18 నుండి మే 28 వరకు. అది కార్మికవర్గ నేతృత్వంలో ఏర్పడిన మొదటి కమ్యూనిస్టు రాజ్యం. నిలిచింది డెబ్భై రోజులే ఐనా విలువైన పాఠాలు అందించింది. ఆ తర్వాత రష్యా, తర్వాత చైనా.

  పెట్టుబడిదారుల శక్తులు లోపలినుండి తొలుస్తూ విజయవంతంగా పెట్టుబడిదారీ వ్యవస్ధ వైపుకి తీసుకెళ్లగలిగారు. రష్యా, చైనాలు చాలా గుణపాఠాలు అందించాయి. వైరివర్గం (పెట్టుబడీదారి వర్గం) మళ్ళీ అధికారం ఏయే ఎత్తుగడలతో చేజిక్కించుకోగలదో, కమ్యూనిస్టు పార్టీల్లోకీ, కమ్యూనిస్టు పార్టీల అత్యున్నత కమిటీల్లోకీ ఏ రూపాల్లో జొరబడగలదో కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలకు నేర్పింది. ఆ పాఠాలతో తదుపరి ఏర్పడే సోషలిస్టు రాజ్యం మరింత కాలం నిలిచే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా పెట్టుబడిదారి వర్గం కొత్త ఎత్తుగడలు వేయవచ్చు. వాటిని సమర్ధవంతంగా కార్మిక వర్గం తిప్పి కొట్టగలిగితే నిలుస్తుంది. లేదా మరిన్ని పాఠాల్ని వదిలి ముగుస్తుంది. వ్యవస్ధ ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా ప్రగతి వైపుకి పయనించక తప్పదు. అది మానవ సమాజ లక్షణం. ఎప్పుడన్నదే సమస్య తప్ప, సొషలిస్టు లేదా నూతన ప్రజాస్వామిక విప్లవాలు వస్తాయా లేదా అన్నది సమస్య కాదు. సమాజంలో పరిస్ధితులు పండినప్పుడు తిరుగుబాట్లు, విప్లవాలు తప్పవు.

 8. సామ్యవాదం రావాటానికి, పెట్టుబడిదారీ మృత్యుశయ్య మీద ఉన్న ప్రస్తుత సమయం కంటే మంచి సమయం ఏముంటుంది?
  మీ బ్లాగ్ చాలా కాలం నుంచీ గమనిస్తున్నాను. చాలా విలువైన సమాచారం అందిస్తున్నారు. ఈ సమాచార సేకరన కి మీకు ఎంత సమయం పడుతుందో తెలియదు. మీకు ఉన్న ఆసక్తులూ, పరిజ్ఞానం కూడా విస్తృతమైనది. బ్లాగ్ క్వాలిటీ కూడా (బొమ్మలూ, భాషా) బాగుంది. మీరు దీనికోసం ఎంత సమయం వెచ్చిస్తారు? మీరు సమాచారం ఎక్కడి నుంచీ సేకరిస్తారు? మీ బ్లాగ్ లక్ష్యం ఏమిటి? మీరు కొడవటిగంటి. కుటుంబరావు రచనలు ఏమైనా చదివారా?

 9. ముందు మీ ప్రశ్నకు జవాబిస్తాను. ప్రశ్న కాకపోతే ప్రశ్న అనుకుని జవాబిస్తాను.

  మార్క్సిజం నుండి కార్మికవర్గం పాఠాలు నేర్చుకున్నట్లే పెట్టుబడిదారి విధానం కూడా నేర్చుకుంది. కాకుంటే నెగిటివ్ పాఠాలు. తిరుగుబాట్లు రాకుండా ఉండటానికి ఏం చేయ్యాలో నేర్చుకుంది. ఎంత నేర్చుకున్నా అది తన ప్రాధమిక లక్షణాన్ని వదులుకోదు గనక అది కూలిపోవలసిందే. పెట్టుబడిదారి వ్యవస్ధ మరణ శయ్యపై ఉంటేనే సరిపోదు. అది మరణశయ్యమీద ఉన్నదని అర్ధం చేసుకుని దానికి కొరివి పెట్టడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ప్రజలను సిద్ధం చేసే వాళ్ళు సిద్ధంగా ఉండాలి. సోషలిజం పేరు చెపుతూ ప్రపంచం నిండా అనేక పెట్టుబడిదారీ పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ మార్క్సిజానికి వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించి పెట్టాయి. పెట్టుబడిదారి వ్యవస్ధ చేసుకున్న ఏర్పాట్లే అవి. అలాగని పధకం ప్రకారం చేసుకున్న ఏర్పాట్లని అనడం లేదు. వ్యవస్ధలోని ఆధిపత్య వర్గాలు తమ అవసరాల రీత్యా వేసే వివిధ రకాల ఎత్తుగడలు, వాళ్ళలోనే తలెత్తే కుమ్ములాటలు తదితర అంశాలు అటువంటి ఏర్పాట్లకు దారి తీస్తుంది.

  పెట్టుబడిదారీ వర్గం ప్రపంచం అంతా సంస్కృతిని బాగా గుప్పెట్లో పెట్టుకుంది. దాన్ని బద్దలు కొట్టడం కమ్యూనిస్టుల వల్ల కావడం లేదు. లేదా ప్రస్తుతం బద్దలుకొట్టలేక పోతున్నారు. ఆ సంస్కృతిలో పడిన యువత ప్రగతిశీల ఆలోచనలవైపుకి ఆకర్షితం కావడం గతం కంటే కష్టంగా ఉంది. కెరీర్ దృక్పధం, డబ్బు వలన వచ్చే సుఖాలు ఇవన్నీ త్యాగాల జీవనాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. ఇండియాలాంటి చోట్ల మావోయిస్టుల చర్యలు ఉద్యమాలు ప్రారంభం కాకుండానే నిర్బంధం తెచ్చిపెడుతున్నాయి. దానితో ప్రాధమిక ఉద్యమాల కూడా కఠిన నిర్బంధం అమలయ్యి ఉద్యమాల అభివృద్ధి జరగడం కష్టమవుతోంది. ఈ పరిస్ధితిని మావోయిస్టు పార్టీ అర్ధం చేసుకున్నట్లే వారి మాటల్లో కనిపిస్తుంది కాని ఆచరణలో సరిదిద్దలేకపోతున్నారు ఎందువల్లనో. వారు ఆ వైపునుండి ప్రతికూలపరిస్ధుతులు ఏర్పడ్డానికి దోహదపడితే, మరోవైపు నుండి సి.పీ.ఐ, సి.పిఎం లాంటివి కమ్యూనిజానికి హోప్ లేదన్న అభిప్రాయాన్ని కలిగేలా దోహదపడుతున్నాయి. ఇవన్నీ కార్మికవర్గం వైపు నుండి ఎదురవుతున్న ప్రతికూల వాతావరణం.

  కానీ అమెరికా, యూరప్ లలో ఆర్ధిక విధానాలు గమనిస్తే అవి ప్రజల్ని మరింతగా కార్నర్ కి నెడుతున్న పరిస్ధితి కనిపిస్తుంది. ప్రజలకి (కార్మికులు, ఉద్యోగులు మొ.) ఇప్పటివరకూ ఇస్తూవచ్చిన సౌకర్యాలు రద్దు చేసి అవి కూడా లాభాలుగా జమ చేసుకుంటున్నారు. అంటే ప్రజల స్ధాయి ఇంకా దిగజారుతోంది. శ్రామికజనం కార్నర్ అవుతున్న కొద్దీ పెట్టుబడిదారీ వర్గం తమ అంతానికి దగ్గరవుతున్నట్లే లెక్క. కాని దాన్ని యాక్షన్ కింద మలచగల శక్తులు బలహీనంగా ఉండడమే ఇప్పటి ప్రపంచంలోని ప్రధాన బలహీనత. అది బలం పుంజుకుంటే పరిణామాలు వేగవంతం అవుతాయి. నేపాల్ లో విప్లవం వచ్చిందనే అనిపించింది. కాని చివరిదాకా వచ్చి వెనక్కి తగ్గారు వాళ్ళు. కారణం చుట్టూ ఉన్న దేశాల (ముఖ్యంగా చైనా, ఇండియా) పెట్టుబడిదారీ వర్గాల నుండి నేపాల్ ఆధిపత్య వర్గాలకి గట్టి మద్దతు అందింది. ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రపంచంలోని వివిధ దేశాల పెట్టుబడిదారి వర్గాల మధ్య ఉన్న చైన్ లింక్ ఎక్కడో ఒక చోట తెగాలి. అలా లింక్ తెగిన చోట విప్లవం విజయవంతం ఐతే, అది దావానలంలా ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. గతంలో వచ్చిన రెండు విప్లవాలు యుద్దాల అనంతరమే వచ్చాయి. అలాగని మళ్ళీ యుద్ధం వస్తేనే విప్లవం అని కాదు గానీ దాదాపు అటువంటి పరిణామం సంభవిస్తే అక్కడ కార్మికవర్గం బలపడితే చైన్ రియాక్షన్ ప్రారంభం అవుతుంది. ఇక్కడితో ఆపేస్తాను. ఇలా రాస్తుంటే రాస్తూ పోవడం నా బలహీనత.

  పోతే మీ అభినందనలకు ధన్యవాదాలు. వార్తలు సేకరించడం ఏమీ లేదు. నేను ప్రధాన న్యూస్ వెబ్ సైట్స్ తో పాటు, ది హిందూ, ఫ్రంట్ లైన్, మంత్లీ రివ్యూ పత్రికలు తెప్పిస్తాను. వార్తల వెబ్ సైట్లలో వార్తలు చూసి ముఖ్యమైనవి అనుకుంటె అవే రాస్తాను. వార్తలతో పాటు రాసే విశ్లేషణ వరకు నాదే. నాకున్న విశ్లేషణా శక్తి చాల కొంచెమే. సముద్రంలో నీటి బిందువు కంటే తక్కువ. అది నాకు ప్రధానంగా మార్క్సిజం అధ్యయనం వల్ల వచ్చింది. మొదట్నుండీ బుక్స్ బాగా చదివే అలవాటు ఉంది. అదే నన్నిక్కడివరకీ తెచ్చింది. కార్టూన్లు అన్నీ నెట్ నుండీ, పత్రికల నుండీ తీసుకున్నవే. అవెక్కడనుండి తీసుకున్నానో రాస్తున్నాను కదా. నేను ఆఫీసునుండి మూడు, నాలుగు టైంలో వస్తాను. అప్పటినుండీ పదకొండువరకూ చదువుతూ, టైప్ చేస్తూ గడుపుతాను. కొన్ని సార్లు ఉదయం, మధ్యాహ్నం కూడా ఒకటో రెండో పోస్టులు టైపేస్తాను. అంతే. అంతకంటే రహస్యాలేవీ లేవు.

  బ్లాగ్ లక్ష్యం నాకు తెలిసింది తెలియజేయడం, నేను నమ్మింది పంచుకోవడం ఇవే. చదవడం, రాయడం నాకు పొలిటికల్ పేషన్ (political passion). నాచేత రాయిస్తున్నది ముఖ్యంగా అదే. కొ.కు కధలు చదివాను. పుస్తకాలు కూడ కొన్ని చదివాను. ఆయన సాహిత్యం నాదగ్గర ఉంది. కేపిటల్, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావో వర్క్స్, అంబేద్కర్, రంగనాయకమ్మ వర్క్స్ నాదగ్గర ఉన్నాయి. అవి కాక రాజకీయాలు, చరిత్ర, ఫిలాసఫీ, సోషియాలజీ, పొలిటికల్ ఎకానమీ పుస్తకాలు నాదగ్గర ఉన్నాయి. వీటినుండే నేను నేర్చుకున్నాను.

 10. శేఖర్ గారు నాకొక అనుమానం, ఇప్పుడు చైనాలో నడుస్తున్నది కమ్యునిస్టు ప్రభుత్వమేనా? ఎందుకిలా అడుగుతున్నానంటే, కమ్యునిస్టు ప్రభుత్వం ఉన్నంత మాత్రాన చైనాలో కమ్యూనిజం పరిడవిల్లుతోందని భావించవచ్చా? చైనా దేశాధినేతలు ఎప్పుడూ కమ్యునిస్టులుగా కన్నా నియంతలుగానే ప్రవర్తిస్తున్నట్టుగా నాకు ఒక అభిప్రాయం. మావో కలలుగన్న చైనాయేనా ఇప్పుడు ఉన్నది. వీలు చూసుకుని చైనా అంతర్బహిర్గతాలని వివరిస్తూ ఒక ఆర్టికల్ రాయగలరని మనవి.

  పైన జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు చాలా ఉపయోగకరమైనవి. మీరు ఆశయం ఉన్నతమైనది, కొనసాగించగలరు.

 11. వనమాలి గారికి

  చైనాలో ఉన్నది కమ్యూనిస్టు ప్రభుత్వం కాదు. మావో మరణంతో అక్కడ సోషలిస్టు ఆచరణ ఆగిపోయి వెనక్కి నడవడం ప్రారంభం అయ్యింది. ఇప్పుడు అక్కడ ఉన్నది పూర్తిగా నిఖార్సయిన పెట్టుబడిదారీ వ్యవస్ధ. ప్రజల్లో మావోకి ఉన్న పలుకుబడి వలన సోషలిజాన్ని కొనసాగిస్తున్నట్లు నటిస్తున్నారు. చైనా ప్రధాని గత సంవత్సరం యూరప్ వెళ్ళీ మాది సోషలిస్టు వ్యవస్ధ కాదు. మార్కెట్ ఎకానమీయే మాది అని చెప్పుకున్నాడు. సోషలిస్టు వ్యవస్ధ అని ప్రచారం ఉండడం వలన చైనా పైన యూరప్ దేశాలు, అమెరికా కొన్ని ఆర్ధిక, రాజకీయ ఒత్తిడిలు తెస్తున్నాయి. అందుకని అక్కడ నిజం కక్కేశాడు.

  చైనాలో ఉన్న ఏకపార్టీ వ్యవస్ధ అక్కడ పెట్టుబడిదారీ వర్గానికే కాదు అమెరికా, యూరప్ దేశాల పెట్టుబడిదారులకి కూడా ఉపయోగపడుతోంది. రెండు మూడు పార్టీలుంటే ఎన్నికలూ, గెలుస్తోమో లేదో నన్న భయాలతో జనాల కోసం సంక్షేమ పధకాలు, వాగ్దానాలు ఇవన్నీ శ్రమ. ఒకే పార్టీ వలన ఆ శ్రమ తప్పింది. చైనాలో కార్మిక చట్టాలు సరిగా ఉండవు. అంతా కమ్యూనిస్టు పార్టీ కింద ఉండే సంఘాలు చెప్పినట్లు నడిచిపోవాలి. దానితో వారికి హక్కులు లేకుండా పోయాయి. ప్రతీ సంవత్సరం సమ్మెలు జరుగుతున్నా బైటికి పొక్కనివ్వరు. అణచి వేస్తారు. మీరన్నట్లు దాదాపు నియంతృత్వంతోనే క.పా వ్యవహరిస్తుంది.

  ఐతే చైనాలో ప్రవేటు పెట్టుబడిదారీ విధానం పూర్తిగా చైనా అనుమతించడం లేదు. అనుమతించినట్టు కనిపించినా పూర్తి నిజం కాదు. అక్కడ ఉన్నది ప్రధానంగా ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధ. అంటే ప్రభుత్వంలో ఉన్న క.పా నాయకులు, అధికారులు పెట్టుబడిదారులుగా ఉన్నారు. ప్రభుత్వ కంపెనీల సొమ్మంతా వారు దిగమింగుతారు. వారికదే బాగుంది.

  చైనా, రష్యాల గురించి గతంలో ఒక పోస్టు రాశాను. ఈ బ్లాగ్ లో వర్గాలు లో మార్క్సిజం-లెనినిజం అన్న వర్గాన్ని ఎన్నుకుంటే మూడే పోస్టులు ఉంటాయి. అందులో చైనా, రష్యాల్లొ సోజలిజం – నిజానిజాలు అని ఒక పోస్ట్ ఉంది. శ్రమ అనుకుకోకుంటే అది చదవగలరు.

 12. ప్రస్తుతం చైనాలో ఉన్న వ్యవస్థను చూసి మార్క్స్ లెనిన్ మావో వంటివారు( ఇప్పటికీ వార్ బతికి ఉండి ఉంటే) ఎలా స్పందిస్తారు ? … వారు ఆశించింది ఇటువంటి చైనానేనా లేక భిన్నమైందా ?

 13. చైనాలో ఉన్నది, మావో గానీ ఆయన నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ గానీ కోరుకున్న సోషలిస్టు వ్యవస్ధ కాదనే కదా నేనంటున్నది.

  పోతే వారి స్పందనను ఊహించగలడం నాకు చేతగాని పని. వారు ఆశించిన వ్యవస్ధకు పూర్తిగా భిన్నమైన వ్యవస్దే ఇపుడు చైనాలో ఉందని మాత్రం చెప్పగలను, శ్రీనివాస్ గారు. వనమాలి గారికి రాసిన సమాధానం మీరు చూడలేదనుకుంటా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s