“ప్రపంచీకరణ” ప్రపంచాన్ని కుగ్రామంగా చేసి అందరికీ లాభం సమకూర్చుతుందని చెప్పారు. ఆచరణలో ఏం జరిగింది? పెట్టుబడుల ప్రపంచీకరణ జరిగింది కానీ శ్రమ జీవులకీ, వేతన జీవులకీ అది ఒఠ్ఠి బూటకంగా మిగిలింది. పశ్చిమ దేశాల పెట్టుబడులు, ఎమర్జింగ్ దేశాలతో సహా మూడవ ప్రపంచ దేశాల పెట్టుబడులు ఏకమై మూడో ప్రపంచ ప్రజలనూ, వారి వనరులనూ కొల్లగొడుతున్నాయి. ఈ ఆటలో పశ్చిమ దేశాల బహుళజాతి గుత్త సంస్ధలు మాస్టర్లు కాగా, మూడో ప్రపంచ దేశాల బడా కంపెనీలు వారికి జూనియర్ పార్ట్నర్లుగా మారాయి. ప్రపంచీకరణ అంటే పశ్చిమ దేశాల బహుళజాతి సంస్ధలకు ప్రపంచాన్ని పాదాక్రాంతం చేయడంగా స్పష్టమైంది.
ప్రపంచీకరణకి అంగీకరించని ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ దేశాల్లో పశ్చిమ దేశాల బహులజాతి కంపెనీలు నేరుగా ప్రత్యక్ష మిలట్రీ యుద్ధాలకు పురిగొల్పాయి. తమకు మార్కెట్లను అప్పగించడానికి ఇష్టపడని ఇరాన్, ఉత్తర కొరియా లలో కుట్రలకు దిగుతూ క్రూరమైన ఆంక్షలు విధింపజేస్తున్నాయి. పాక్షికంగా లొంగిన లిబియా ను పూర్తిగా లొంగమని డిమాండ్ చేస్తూ, తమకు అనుకూలమైన తిరుగుబాటు ప్రభుత్వం కోసం అంతర్గత యుద్ధాన్ని రెచ్చగొట్టి తామూ ఒక చెయ్యి వేస్తున్నాయి. తమకు లొంగని సిరియాలో అమెరికా తాజాగా కొంతమందిని దారికి తెచ్చుకుని తన కార్యకలాపాలను ప్రారంభించింది. అక్కడి పాలకుడి ఆటోక్రట్ పాలనను సాకుగా చూపి తన కీలుబొమ్మని ప్రతిష్టించడానికి అడుగులేస్తోంది.
ఐతే ఇంకా అమెరికాకి నమ్మకమైన సిరియా ద్రోహి దొరకని నేపధ్యంలో అక్కడ కొత్తగా ప్రారంభించిన అమెరికా రాయబార కార్యాలయంలో సిరియా లొంగుబాటుకి సహకరించే కుట్రదారుల కోసం వెతుకుతోంది. ఆ పరిస్ధితిని కళ్లకు కట్టే కార్టూన్ ఇది.
గోడకు వేలాడుతున్న బోర్డు: కుట్రదారులు కావలెను
కార్టూనిస్టు: విక్టర్ నీటో, వెనిజులా