“రిలయన్స్ ఇండస్ట్రీస్”లో 30 శాతం షేర్లు “బ్రిటిష్ పెట్రోలియం” కు అమ్మడానికి కేంద్రం ఆమోదం


Reliance Industries' KG-D6 block off Bay of Bengal

బంగాళాఖాతంలో కె.జి.బేసిన్ లోని రిలయన్స్ కంపెనీకి చెందిన డి6 బ్లాక్

మొదట దేశంలోని విలువైన సహజ వనరులను స్వదేశీ ప్రవేటు పెట్టుబడిదారులకు అప్పగించడం, ఆ అర్వాత స్వదేశీ పెట్టుబడుదారులను తమ కంపెనీలో గణనీయమొత్తంలో షేర్లను విదేశీ బహుళజాతి సంస్ధలకు అమ్ముకోవడానికి ఆమోద ముద్ర వేయడం, తద్వారా భారత దేశ ఆయిల్, గ్యాస్ తవ్వకాల రంగంలోని దేశీయ మార్కెట్లను విదేశీ మార్కెట్ల ప్రవేశానికి గేట్లు బార్లా తెరవాలన్న పశ్చిమ దేశాల డిమాండ్లను నెరవేర్చడం భారత ప్రభుత్వం ఒక ఎత్తుగడగా అభివృద్ధి చేసినట్లు కనిపిస్తోంది. కాకుంటే ప్రభుత్వ రంగ పరిశ్రమల వద్ద సరిపోయినంత సాంకేతిక పరిజ్ఞానం లేదని చెప్పి స్వదేశీ ప్రవేటు పెట్టుబడిదారులకు దేశ సహజ వనరులను అప్పగించిన భారత ప్రభుత్వం ఇప్పుడు అదే పేరు చెప్పి విదేశీ కంపెనీలకు పెద్ద మొత్తంలో స్వదేశీ కంపెనీలు అమ్ముకోవడానికి ఆమోద ముద్ర వేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

ముఖేష్ అంబానీకి చెందిన ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ కంపెనీ తన 23 ఆయిల్ మరియు గ్యాస్ బ్లాకుల్లో 30 శాతం వాటాను విదేశీ కంపెనీ బి.పి కి అమ్మేయడానికి ప్రతిపాదించగా భారత ప్రభుత్వం వాటిలో 21 బ్లాకుల్లోని షేర్లను అమ్మడానికి అనుమతి ఇచ్చిందని పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి పత్రికలకు తెలిపాడు. ఇది 7.2 బిలియన్ డాలర్ల (రు.32,400 కోట్లు) ఒప్పందం అని ఆయన చెప్పాడు. కొన్ని సాంకేతిక కారణాల వలన ఈశాన్య రాష్ట్రాల్లోని ఉత్తర భాగాన ఉన్న రెండు బ్లాకుల్లో షేర్ల అమ్మకానికి అంగీకరించలేదని జైపాల్ తెలిపాడు. అంతకంటె వివరాలు చెప్పడానికి ఆయన నిరాకరించాడని రాయిటర్స్ తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా రిలయన్స్ కంపెనీకి బి.పి వద్ద ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందె అమూల్య అవకాశం లభించనుందని చెబుతున్నారు.

అసలు రిలయన్స్ కి ప్రభుత్వ (ప్రజల) ఆస్తులని అప్పజెప్పడానికి కారణమే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అని చెప్పినవాళ్ళు, అది రిలయన్స్ దగ్గర నిజానికి లేదని బి.పి వద్ద ఉందని కనుక అమ్మకానికి ఆమోదించామని చెప్పడం వెనక మతలబు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. ఫిబ్రవరిలో రిలయన్స్, బి.పి ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఇప్పుడు ఆమోదించామని జైపాల్ చెప్పాడు. “భారత దేశానికి గ్యాస్ అవసరం ఎంతగానో ఉంది” అని జైపాల్ తమ ఆమోద ముద్రకు కారణం అన్నట్లుగా చెప్పాడు. ఇరు కంపెనీలు కలిసి గ్యాస్ ఉత్పత్తిని పెంచుతాయని ఆశిస్తున్నట్లుగా ఆయన అన్నాడు. రిలయన్స్ కంపెనీ తన గ్యాస్ ఉత్పత్తిని అంచనాలకి తగ్గట్లుగా చేయలేక పోతున్నదని గత కొన్ని నెలలుగా విమర్శలు వస్తున్నాయి. అంతిమ లక్ష్యాన్ని చేరడం అటుంచి, ఇప్పటివరకు చేస్తున్న ఉత్పత్తి స్ధాయికంటె తగ్గుతోందని షేర్ హోల్డర్లు తదితరులు విమర్శలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

మే నెలలో రిలయన్స్ కంపెనీ రోజుకు 48 ఎం.ఎస్.సి.ఎం.డి ల (మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే) గ్యాస్ ను కెజి బేసిన్ లోని తన ప్రధాన డి6 బ్లాకునుండి ఉత్పత్తి చేసిందని తెలుస్తోంది. గత సంవత్సరం కంపెనీ 60 ఎం.ఎస్.సి.ఎం.డి ల వరకూ ఉత్పత్తి చేసేదనీ, అది మేనాటికి తగ్గిపోయిందనీ ప్రభుత్వ నియంత్రణా సంస్ధ తెలిపింది. వాస్తవానికి కంపెనీ రోజుకు 80 ఎం.ఎస్.సి.ఎం.డి ల ఉత్పత్తి తీయాలని లక్ష్యంగా పెట్టుకోగా, అది సుదూర లక్ష్యంగా మారిందని ఆ సంస్ధ తెలిపింది. నియంత్రణా సంస్ధ, మదుపుదారులు, విశ్లేషకుల నుండి ఈ విషయంలో రిలయన్స్ విమర్శలు ఎదుర్కొంటున్నదని తెలుస్తోంది. దానితో షేరు ధరల్లో ప్రధాన ఇండెక్సులో నష్టం 8.7 శాతమే ఉంటే రిలయన్స్ షేర్ ధర 17 శాతం పడిపోయిందని రాయిటర్స్ తెలిపింది.

ఇంతకీ రెండు కంపెనీలు కలిసి గ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయా, లేదా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పడానికి జైపాల్ నిరాకరించడం విచిత్రం. కాని భారత దేశ హైడ్రోకార్బన్ రంగంలోకి విస్తృతమైన టెక్నాలజీని తెస్తుందని మాత్రం చెప్పాడు. ఆధునిక టెక్నాలజీని బి.పి తెస్తుందని చెప్పినప్పుడు అది అధిక ఉత్పత్తి కోసమే నన్నది నిర్విదాంశం. మరి ఉత్పత్తి పెంచుతారు అని చెప్పలేక పోవడానికి కారణం ఏమిటో తెలియకుండా ఉంది. మంత్రి చెబుతున్నట్లు బి.పి కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తెస్తుందో లేదో అనుమానమే. ఎందుకంటె విదేశీ కంపెనీలు తమతో పాటు ఆధునిక టెక్నాలజీని ఇండియాకి పరిచయం చేసిన ఉదాహరణలు గతంలో ఎన్నడూ లేవు. ఇక కొత్తగా తెస్తాయని ఆశించడం తప్ప నమ్మకం పెట్టుకోలేము.

ఈ బి.పి కంపెనీయే అమెరికా పశ్చి తీరంలో కాలిఫోర్నియా అగాధంలో ఆయిల్ వెలికి తీస్తూ అతి పెద్ద ప్రమాదానికి కారణంగా నిలిచింది. సముద్రంలో క్రూడ్ ఆయిల్ పెద్ద ఎత్తున లీకయ్యి సముద్ర జంతుజాలాలు అనేకం చనిపోయాయి. పర్యావరణానికి కూడా అపారమైన నష్టాన్ని కలుగ జేసింది.

బ్రిటిష్ పెట్రోలియం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ల ఒప్పందం అమోదిస్తున్నట్లు ప్రకటించడంతో రిలయన్స్ షేర్లు 1.5 శాతం లాభపడింది. బి.ఎస్.ఇ ఇండెక్సు కూడా శుక్రవారం 1.55 శాతం లాభాలతో ముగిసింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s