ఒక సి.ఎం, 8 నేతలు, 500 అధికారులు, రు.1827 కోట్లు.. ఇదీ మైనింగ్ కుంభకోణం!


ఇది కుంభకోణాల యుగం. నిజానికి నల్లదొరల పాలన అంతా కుంభకోణాల మయమే. తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వచ్చారు తప్ప స్వాతంత్ర్యం వలన భారత ప్రజా కోటికి ఒరిగిందేమీ లేదన్నది నిష్టర సత్యంగా నానాటికీ రుజువౌతోంది. ఎవరూ గట్టి ప్రయత్నం చేయకుండానే రాజకీయ నాయకులు తమ మధ్య రగిలే కుమ్ములాటలవలన, రాజకీయ విభేధాల వలన తమ అవినీతి కార్యకలాపాలను బయట పెట్టుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్ధుల అలవిగాని సంపదల గుట్టుమట్టులని బైట పెట్టడం అనేది ఎన్నికల రాజకీయాల్లో పైచేయి సాధించే ప్రయత్నాల్లో భాగంగానే చేస్తున్నారు తప్ప ఎంత బద్ధ శత్రువైనా ప్రత్యర్ధి రాజకీయుల అవినీతిపై చివరిదాకా విచారణ సాగించి శిక్షించడానికి ఏ రాజకీయ పార్టీగానీ, నాయకుడు గానీ సిద్ధపడడం లేదు. సిద్ధపడితే తాను అధికారం కోల్పోయాక తనకూ అదే పరిస్ధితి ఎదురవుతుందన్న తెలివిడి వారిని చర్యలు తీసుకునేలా ప్రేరేపించడం లేదు. అంతిమంగా భారత ప్రజల సంపద విదేశీ బ్యాంకు ఖాతాల్లోకి తరలి వెళ్తోంది.

కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే, అక్రమ మైనింగ్ కుంభకోణంపై విచారణ జరిపి 5000 పేజీల నివేదికను తయారు చేశారు. నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈన గాచి నక్కల పాలు చేసినట్లుగా ఎంతో శ్రమకోర్చి హెగ్డే తయారు చేసిన నివేదికను మళ్ళీ ఆ నివేదికలోని నిందితుల ఆమోదానికే వెళుతోంది. కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఎలుగెత్తుతున్న ప్రతిపక్ష బి.జె.పి పార్టీయే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో నిస్సిగ్గుగా అవినీతి సామ్రాట్టులకు పాఠాలు నేర్పేలా కుంభకోణాల్లో భాగం పంచుకుంటోంది. వడ్డించేదీ, భోంచేసేదీ ఒకరే ఐనప్పుడు ఇక అవినీతి, ఖజానాకు వచ్చే భారీ నష్టం, నేరపూరిత రాజకీయాలు అన్నీ “గజం మిధ్య, పలాయనం మిధ్య” అన్న చందంగా తయారవుతున్నాయి తప్ప ప్రజాస్వామ్య పాలనకు తగినట్లుగా విచారణకీ, దోషులను శిక్షించడానికి దారి తీయడం లేదు.

కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పతో సహా 8 మంది రాజకీయ నాయకులు, 500 మంది బ్యూరోక్రట్ అధికారులు కలిసి14 నెలల పాలనలో కర్టాటక రాష్ట్ర ఖజానాకి రు.1827కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చారని కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే తయారు చేసిన నివేదిక పేర్కొన్నదని వెల్లడయ్యింది. లోకాయుక్త కేవలం 14 నెలల కాలంలో జరిగిన నష్టాన్ని మాత్రమే అంచనా వేశారు. అసలు గాలి బ్రదర్స్ 2005 లో ‘ఓబులాపురం మైనింగ్ కంపెనీని స్ధాపించినప్పటినుండి జరిగిన అవినీతిపై విచారణ జరిపినట్లయితే కొన్ని లక్షల కోట్ల విలువ గల అక్రమ ఇనుప ఖనిజ తవ్వకం బైటపడి ఉండేది. ఈ కుంభకోణంలోని ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి.

లోకాయుక్త నివేదికలో చోటు సంపాదించిన రాజకీయ నాయకులు: ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, అతని ముందు ముఖ్యమంత్రిగా పని చేసిన జనతాదళ్-ఎస్ నాయకుడు హెచ్.డి.కుమారస్వామి, ఇద్దరు గాలి బ్రదర్స్ తో సహా నలుగురు బి.జె.పి మంత్రులు, ఒక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సి.ఎం ఇద్దరు పుత్రులు (వీరిలో ఒకరు లోక్ సభ సభ్యుడు), సి.ఎం అల్లుడు. వీరు కాక సహకరించిన అధికారులు 500 మంది.

  • యెడ్యూరప్ప: దక్షిణాదిలో మొదటి బి.జె.పి ముఖ్యమంత్రి. నేరుగా కుంభకోణంతో సంబంధం లేకున్నా గాలి సోదరుల అఘాయిత్యాలను చూస్తూ ఊరుకున్నారు. ఈయనకి బి.జె.పి హైకమాండ్ నుండి మద్దతు దొరకలేదో ఏమో, గాలి సోదరుల ధాటికి బహిరంగంగా, పత్రికా విలేఖరుల సమావేశంలోనే భోరున విలపించిన చరిత్రను సొంతం చేసుకున్నారు. అక్రమ మైనింగ్‌ను ఆపడంలో విఫలమయ్యారు. గాలి సోదరుల అవినీతిపై వరుసగా ఆరోపణలు వెల్లువెత్తినా విచారణ చేయించలేదు. తద్వారా అక్రమ మైనింగ్ కుంభకోణంలో పాత్రధారిగా రుజువు చేసుకున్నారు.
  • యెడ్యూరపప పుత్రులు బి.వై.రాఘవేంద్ర. ఈయన బి.జె.పి లోక్ సభ సభ్యుడు. యెడ్యూరప్ప కుటుంబం తన ఎస్టేటుగా భావించే షిమోగాలో ఈయన ప్రేరణ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ ట్రస్టు నడుపుతున్నాడు. షిమోగా పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడు. అక్రమ మైనింగ్ జరిపే ఒక కంపెనీ నుండి ఈయన ట్రస్టుకి రు.10 కోట్లు అందాయి. ఈయన తన సోదరుడు, యెడ్యూరప్ప అల్లుడు సోహన్ కుమార్ తో కలిసి బెంగుళూరు దగ్గర ఎకర స్ధలం రు.2 కోట్లకు కొని రు.20 కోట్లకు ఒక మైనింగ్ కంపెనీకి అమ్ముకున్నారు.
  • రెడ్డి సోదరులు: అంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులైన వీరి తండ్రి ఒక పోలీసు కానిస్టేబుల్. ఇనుప ఖనిజంతో అలరారే బళ్ళారిని తమ రాజకీయ పునాదిగా చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జి.జనార్ధనరెడ్డి ముగ్గురు సోదరుల్లో నోరున్న వ్యక్తి. ఓబులాపురం మైనింగ్ కంపెనీ యజమాని. ఇతని ఆన్న జి.కరుణాకర రెడ్డి రెవిన్యూ శాఖామాత్యులు. తమ్ముడు సోమశేఖర రెడ్డి కర్ణాటక అసెంబ్లీ సభ్యుడు. 1999 నాటికి అడ్రస్ లేని రాజకీయనాయకుడుగా ఉన్న జనార్ధన రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో సోనియా గాంధిపై పోటీ చేసిన సుష్మా స్వరాజ్ కి దగ్గరయ్యాడు. 2005 లో ఒ.ఎం.సిని స్ధాపించి ఇనుప ఖనిజ తవ్వకాల్లో ప్రవేశించాడు. మైనింగ్‌లోకి ప్రవేశించిన కొద్ది కాలంలోనే శత సహస్ర కోటీశ్వరుడుగా మారాడు.
  • ఈయనకి వ్యక్తిగత వినియోగానికి హెలికాప్టర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల లోపలే ఈయనకి మైనింగ్ హక్కులున్నా, అక్రమంగా కర్ణాటక భూముల్లో కూడా మైనింగ్ చేశాడని ఆరోపణలున్నాయి. ఇతర గనుల యజమానులు కూడా తమ కంపెనీ ద్వారానే ఎగుమతులు చేయాలని బలవంతపెట్టి సాధించాడని కూడా ఆరోపణలున్నాయి. తనకు ఇష్టమైన అధికారులనే బళ్ళారి జిల్లాకు నియమింపజేశాడు. ఒక సారి ఆయనకు చెప్పకుండా సి.ఎం యెడ్యూరప్ప జిల్లా అధికారులను మార్చడంతో ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తింది. యెడ్యూరప్ప మెడలు వంచి ఆయన చేసిన మార్పులను రద్దు చేయించిన ఘనుడు జనార్ధన రెడ్డి. ఆ సందర్భంలోనే సి.ఎం గాలి సోదరుల అరాచకాలకు తట్టుకోలేక విలేఖరుల సమావేశంలో కన్నీటి పర్యంతం అయ్యాడు.
  • బి.శ్రీరాములు: ఆరోగ్య శాఖా మంత్రి. రెడ్డి సోదరులకు అత్యంత సన్నిహితుడుగా పేరు సంపాదించుకున్నాడు.
  • వి.సోమన్న: పౌర సరఫరాల శాఖా మంత్రి. ఈయన అసలుకి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఏప్రిల్ 2009 లో బి.జె.పి పార్టీలోకి దూకాడు.
  • హెచ్.డి.కుమార స్వామి: మాజీ ప్రధాని దేవెగౌడ్ సుపుత్రుడు. 2006 లో తండ్రి నుండి చీలినట్లు నాటకమాడి బి.జె.పితో కలిసి కాంగ్రెస్-జె.డి (ఎస్) ల ప్రభుత్వాన్ని కూలదోసాడు. అనంతరం బి.జె.పి మద్దతుతో 20 నెలల పాటు ముఖ్యమంత్రిగా వెలగబెట్టాడు. అక్రమ మైనింగ్ జరిపిన రెండు కంపెనీలకు అనుమతులిచ్చాడని ఆరోపణలున్నాయి.
  • అనిల్ లాడ్: కాంగ్రెస్ రాజ్య సభ సభ్యుడు. వి.ఎస్.ఎల్ గ్రూపు కంపెనీలకు అధిపతి. ఐదు దశాబ్దాలుగా ఈయన కుటుంబం మైనింగ్ కార్యకలాపాల్లో ఉంది. ఈయన సోదరుడు కాంగ్రెస్ తరపున అసెంబ్లీ సభ్యుడు. బళ్ళారిలో అక్రమ మైనింగ్ జరిపిన కంపెనీల్లో ఈయన కంపెనీ కూడా ఉన్నదని ఆరోపణ.

ఇక వీరందరిని బైటికి లాగిన వ్యక్తి నిట్టే సంతోష్ హెగ్డే. యూనివర్సిటీ స్ధాయిలో హాకీ ఆటగాడు. 1966లో న్యాయవాదిగా ప్రాక్టీసుగా ప్రారంభించాడు. 1998లో కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ గా నియమితుడయ్యాడు. 2005 లో న్యాయమూర్తిగా రిటైరయ్యాక ఆగస్టు3. 2006 న కర్ణాటక లోకాయుక్తగా నియమిగుడయ్యాడు. ఆగష్టు 2, 2011 తో ఐదు సంవత్సరాల పదవీకాలం ముగుస్తోంది.

సంతోష్ హెగ్డే రిటైర్ అయిన అనంతరం ఆయన సమర్పించిన నివేదిక గురించి అడిగేవారు బహుశా ఉండక పోవచ్చు. నివేదికలో జె.డి (ఎస్) అగ్ర నాయకత్వానికి కూడా పాత్ర ఉందని చెప్పినందున ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీ నివేదిక గురించి మాట్లాడే అవకాశం లేదు. ఇక మిగిలింది కాంగ్రెస్సే. కాంగ్రెస్‌కి చెందిన ఎం.పి కూడా అక్రమ మైనింగ్ లో భాగస్వామి కనుక కాంగ్రెస్ పార్టీ, యెడ్యూరప్పను రాజీనామా చేయమని డిమాండ్ చేసే ముందు తన సభ్యుడు చేత రాజీనామా చేయించాలి. లేదా ఒక్కరే కనుక పెద్దగా ఎవరూ పట్టించుకు పోవచు. కాంగ్రెస్ పార్టీ అనేక కుంభకోణాలను ఎదుర్కొంటున్న నేపధ్యంలో బి.జె.పితో కుమ్మక్కై నామ మాత్రంగా విచారణ చేయాలని డిమాండ్ చేయడం వరకే పరిమితమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక పార్టీ కుంభకోణం, ప్రత్యర్ధి పార్టీకి ఇన్సూరెన్స్ గా పని చేస్తోందన్నమాట!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s