భారత అణుప్రమాద పరిహార చట్టం ఐ.ఎ.ఇ.ఎ నిబంధనలకు లోబడాలి, అమెరికా కొత్త మెలిక


U.S. Secretary of State Hillary Rodham Clinton

ఉమ్మడి విలేఖరుల సమావేశానికి ముందు హిల్లరీ క్లింటన్

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. భారత్, అమెరికాల పౌర అణు ఒప్పందంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం అమలు దిశలో మలి దశగా ఈ పర్యటనను పత్రికలు గత కొన్ని రోజులుగా పేర్కొంటూ వచ్చాయి. అమెరికా, భారత్‌కు అణు రియాక్టర్‌లు, అణు పదార్ధం (శుద్ధి చేయబడిన యురేనియం) సరఫరా చేయడానికి అమెరికా తాజాగా మరొక మెలిక పెట్టింది. భారత పార్లమెంటు ఆమోదించిన ‘అణు ప్రమాద పరిహార చట్టం’ ఐ.ఎ.ఇ.ఎ ఆధ్వర్యంలో అణు నష్ట పరిహారం చెల్లించే విషయంలో రూపొందిన “అనుబంధ నష్టపరిహార సదస్సు” (సి.ఎస్.సి – కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కాంపెన్సేషన్) నిబంధనలకు అనుసరించి ఉన్నదీ లేనిదీ సరిచూసుకోవాలనీ, ఈ మేరకు ఐ.ఎ.ఇ.ఎ నుండి సర్టిఫికెట్ పొందాలనీ అమెరికా చెబుతోంది. ఈ మేరకు భారత పర్యటనలో ఉన్న హిల్లరీ క్లింటన్ భారత ప్రభుత్వానికి సూచించింది. భారత దేశం సి.ఎస్.సి ఒప్పందాన్ని ఇంకా ఆమోదించలేదు.

ఐతే భారత అధికారులు హిల్లరీ క్లింటన్ విధిస్తున్న కొత్త నిబంధనను వ్యతిరేకిస్తున్నారు. ఐ.ఎ.ఇ.ఎ అభిప్రాయాలకు అనుగుణంగా భారత చట్టాల్లో మార్పులు, చేర్పులు చేయాలన్న సూచనలు భారత దేశానికి ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకారయోగ్యం కాజాలవని వారు వ్యాఖ్యానించినట్లు ది హిందూ పత్రిక తెలిపింది. ఐ.ఎ.ఇ.ఎ అనేది సి.ఎస్.సి ఒప్పందానికి సంబంధించిన అంశాలను వివిధ దేశాల మధ్యన సౌకర్యవంతంగా ఇచ్చిపుచ్చుకోగలగడానికి ఏర్పరుచుకున్న వేదికే తప్ప సౌర్వభౌమ దేశాల చట్టాలను పరీక్షించి, నిర్ధారించే పాత్ర దానికి లేదని ఇండియా అధికారులు పేర్కొన్నారు. సి.ఎస్.సి ఒప్పంద ఆమోదానికి సంబంధించి ఆయా దేశాలు అందజేసిన పత్రాలను పరిశీలించగలగడమే ఐ.ఎ.ఇ.ఎ చేయగలదని వారు వివరించారు. భారత పార్లమెంటు ఆమోదించిన “అణుప్రమాద పరిహార బిల్లు” సి.ఎస్.సి ఒప్పందానికి అనుగుణంగానే ఉన్నదని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ సంవత్సరాంతంలోగా సి.ఎస్.సి ఒప్పందాన్ని ఆమోదించగలనని ఇండియా భావిస్తోంది.

మరోవైపు అమెరికా, భారత దేశ చట్టం సి.ఎస్.సి నిబంధనలను ఉల్లంఘిస్తోందని భావిస్తోంది. వివరణలోకి వెళ్తే, ఒక దేశం అణు ప్లాంటు నిర్మాణానికి అవసరమైన రియాక్టర్, అణు ఇంధనం అమెరికాలోని జనరల్ ఎలెక్ట్రిక్ (జి.ఇ) కంపెనీ నుండి దిగుమతి చేసుకుందని భావిద్దాం. వాటితో అణు కర్మాగారం నిర్మించాక అణు కర్మాగారాన్ని నడిపే భారత ప్రభుత్వం “ఆపరేటర్” గా పిలవబడుతుంది. రియాక్టర్ పరికరాలను, అణు ఇంధనాన్ని సరఫరా చేసిన జి.ఇ, “సరఫరాదారు” (సప్లయర్) గా పిలవబడుతుంది. భారత దేశ అణు పరిహార ప్రమాద చట్టం లోని 17(b) సెక్షన్, సరఫరాదారు నాణ్యమైన పరికరాలు సరఫరా చేయకపోవడం వలన అణు ప్రమాదం సంభవిస్తే, సరఫరాదారు (జి.ఇ) నుండి ఆపరేటర్ (భారత ప్రభుత్వం) నష్ట పరిహారం పొందగల అవకాశాలను విస్తృత పరిచిందనీ, ఇది సి.ఎస్.సి నిబంధనకు విరుద్ధమనీ అమెరికా వాదిస్తోంది. భారత చట్టంలోని 46 వ సెక్షన్‌ని కూడా అమెరికా కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. అణు ప్రమాదం వలన నష్టపోయే భాధితులు సప్లయర్ కంపెనీలపై నష్టపరిహార కేసులు వేసే అవకాశాన్ని ఆ సెక్షన్ కల్పిస్తోంది.

అంటే అమెరికా కంపెనీలు గానీ, అమెరికా ప్రభుత్వం గానీ తాము నాసిరకం అణు పరికరాలు సరఫరా చేయడం వలన అణు కర్మాగారంలో ప్రమాదం సంభవిస్తే ఆ ప్రమాదంలో నష్టపోయే బాధితులు గానీ, కోర్టులు గానీ, నాసిరకం పరికరాలు సరఫరా చేసిన కంపెనీని ఏమీ అనకుండా వదిలేయాలని కోరుతున్నాయన్నమాట! తమ నాసిరకం పరికరాల వల్ల సంభవించే ప్రమాదాలకు తమను బాధ్యులుగా చేయడం వారికి ఇష్టం లేదన్న మాట! దాదాపు 5 లేక 6 బిలియన్లు లేదా ఇంకా ఎక్కువగా సొమ్ము పెట్టి కొనుగోలు చేసినప్పటికీ అవి నాసిరకం అణు పరికరాలైతే అణు ప్రమాదాలు సంభవించడం అనివార్యం. అంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేస్తే అవి నాసిరకం అని తేలాక నష్టపరిహారం ఇవ్వనవసరం లేదని ఏ అంతర్జాతీయ చట్టం చెప్పగలుగుతుంది? ఒక వేళ ఐ.ఎ.ఇ.ఎ (ఇంటర్నేషనల్ ఎటామిక ఎనర్జీ ఏజెన్సీ) అటువంటి నిబంధనను రూపొందిస్తే ఆ సంస్ధలో ఇక అంతర్జాతీయత ఏముంటుంది? ఆయా బహుళజాతి అణు కంపెనీలకి గానీ లేదా ఆ కంపెనీల దేశానికి గానీ సేవలు చేసే సేవా సంస్ధ అవుతుందే తప్ప ఆయా దేశాల మధ్య సమాన న్యాయంతో వ్యవహరించే అంతర్జాతీయ సంస్ధగా అదిక మన జాలదు.

నిజానికి ఐ.ఎ.ఇ.ఎ ఎన్నడో అమెరికాకు జేబు సంస్ధగా మారిపోయింది. అది పేరుకు ఇంటర్నేషనల్ సంస్ధ, పేరుకే ఐక్యరాజ్యసమితి కి అనుభంధ సంస్ధగా ఉన్నదే తప్ప అమెరికా అనుసరించే బందిపోటు న్యాయాన్నే అదీ అనుసరిస్తుంది. బందిపోటు న్యాయంతోటే ఇరాన్ పైనా, దక్షిణ కొరియా పైనా, సద్దాం పాలిత ఇరాక్ పైనా అమానుషమైన ఆంక్షలను విధించి ఆ దేశాల ప్రజలకు తీరని కష్టాలని మిగిలించింది. ఇంకా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది కూడా. భారత దేశం ఇందిరా గాంధి హయాంలో రాజస్ధాన్ ఎడారిలో అణు పరీక్ష జరపడం వలన పశ్చిమ దేశాలు ఇండియాను అణు బహిష్కరణ కావించడంతో అమెరికా, యూరప్ దేశాల బందిపోటు న్యాయాన్ని చవిచూసే అవకాశం ఇండియాకి ఇంతవరకూ రాలేదు. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ సంక్షోభంలోకి జారిపోతున్న దృష్ట్యా, కొత్త మార్కెట్లను వెతుక్కోవలసిన అనివార్య పరిస్ధితి నేపధ్యంలో ఎన్.పి.టి (అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం) నిబంధనలను సడలించి ఇండియాతో అణు వ్యాపారం చేయడానికి అమెరికా నిర్ణయించుకుంది. దానితో అమెరికా, ఇండియాల మధ్య పౌర అణు ఒప్పందం కుదరడమైతే జరిగింది కానీ అమెరికా కోరుకున్నట్లుగా అణు ప్రమాద నష్టపరిహారాన్ని పూర్తిగా ఆపరేటరే (భారతప్రభుత్వం) భరించాలన్న చట్టాన్ని యు.పి.ఎ ప్రభుత్వం ఆమోదింపజేసుకోలేకపోయింది.

యు.పి.ఎ-2 ప్రభుత్వం మొదట రూపొందించిన బిల్లు అమెరికా, ఐ.ఎ.ఇ.ఎ లు కోరుకున్నట్లుగానే తయారైంది. ప్రతి పక్షాలు గొడవ చేయడంతో దాన్ని సవరించక తప్పలేదు. సవరించిన తర్వాత కూడా అమెరికా కంపెనీలకు పరోక్షంగా లబ్ది చేకూరే విధంగా, అనుమాన పూర్వక పదబంధాలను, అంతిమ పరిశీలనలో భారత ప్రభుత్వంపైనే తిరిగి పరిహార భారం పడేలా పరోక్ష నిభంధనలు ఇరికించి చట్టం నమూనాను తయారు చేసి గుట్టుచప్పుడు కాకుండా అమోదింపజేసుకోవడానికి ప్రయత్నించారు. కాని ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించే శాస్త్రవేత్తలు, సంస్ధలు, సంఘాలు అప్రమత్తంగా ఉంటూ హెచ్చరించడంతో ప్రతిపక్ష బి.జె.పి కూడా సదరు పరోక్షంగా మేలు చేసే సవరణలను ఎత్తి చూపక తప్పలేదు. ఎట్టకేలకు యు.పి.ఎ ప్రభుత్వంగానీ, అమెరికా ప్రభుత్వం లేదా కంపెనీలు గానీ కోరుకున్న బిల్లు భారత పార్లమెంటు నుండి బైటికి రాలేక పోయింది. అణు ప్రమాద పరిహారాన్ని దాదాపు రెట్టింపుకు పెంచగా, అణు సరఫరాదారు కంపెనీపై కూడా నష్టపరిహారాన్ని కోరుతూ కేసులు దాఖలు చేయగల అవకాశాలకు చట్టంలో చోటు దక్కాయి. ఇది భారత ప్రజల పోరాటాలకు దక్కిన పాక్షిక విజయం. ఈ పాక్షిక నిబంధనలను కూడా అమెరికా ప్రభుత్వం, కంపెనీలు సహించలేక పోతున్నాయి. “నాణ్యమైన అణు పరికరాలు అని చెప్పి మీ ఇష్టం వచ్చిన తుక్కూ, తాలూ అంతా సరఫరా చేయండి. మేము మాత్రం పూర్తి సొమ్ముని మీకు ముట్టజెపుతాం. మీపైన ఏ కేసూ పెట్టం. శుభ్రంగా మీ వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు” అని చట్టం చేస్తే తప్ప అమెరికా కంపెనీలకు సంతృప్తి కలగదు కాబోలు!

తాజాగా క్లింటన్ పర్యటన సందర్భంగా అణు పరికరాల సరఫరాకు సంబంధించిన తమ గొంతెమ్మ కోర్కెలను నెరవేర్చాలని అమెరికా ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఐ.ఎ.ఇ.ఎ రూపొందించిన సి.ఎస్.సి ఒప్పందానికి మీ చట్టం అనుగుణంగా ఉందో లేదో చూడండి అని హిల్లరీ క్లింటన్ భారత అధికారులను పురమాయిస్తోంది. క్లింటన్ అదిరిపాటుకి భారత అధికారులు చెప్పారంటున్న అభ్యంతరం
నిజమే అయితే దానిపైనే భారతప్రభుత్వం గట్టిగా నిలబడి ఉండాలి. భారత దేశ చట్టాల సవ్యతను సి.ఎస్.సి నిర్ధారించజాలదనీ, సి.ఎస్.సికి అనుగుణంగా భారత చట్టం ఉన్నదీ లేనిదీ నిర్ణయించి నిర్ధారించగల ఒకే ఒక్క వేదిక భారతదేశ సుప్రీం కోర్టు మాత్రమే తప్ప ఐ.ఎ.ఇ.ఎ కాదనీ భారత అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. భారత అధికారులు ఇంత కఠినంగా చెప్పినా, ఫుకుషిమా అణు ప్రమాదం తర్వాత అణుప్రమాద పరిహారం విషయంలో కొంత పట్టువిడుపులతో వ్యవహరించగల అవకాశం భారత ప్రభుత్వానికీ అధికారులకూ లేకుండా పోయిందన్న అంశాన్ని హిల్లరీ క్లింటన్ అంగీకరించినట్లుగా భారత అధికారులను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. ఐనప్పటికీ భారత అణు ప్రమాద పరిహార బిల్లు కఠినంగా ఉన్నందున ఇండియా తన చట్టాన్ని అమలు చేయడానికి వీలుగా, ఒప్పందం అమలులో చర్యలు తీసుకోవడానికి వీలుగా మార్చుకుంటుందన్న ఆశాభావాన్ని హిల్లరీ క్లింటన్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంటే ఎన్ని చెప్పినా, ఎంత గింజుకున్నా అంతిమంగా అమెరికాకి అనుగుణంగానే ఇండియా దిగిరావాలి తప్ప అమెరికాగానీ, దాని కంపెనీలు గానీ ఒక్క అంగుళం కూడా ముందుకు రావన్నమాట! చివరికి అదే జరిగినా ఆశ్చర్యం లేదు. అందుకు బలమైన సూచన హిల్లరీ క్లింటన్, భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ట ల ఉమ్మడి ప్రకటనలో వ్యక్తమైంది కూడా.

రెండవ వ్యూహాత్మక చర్చల సమావేశాల అనంతరం హిల్లరీ క్లింటన్, ఎస్.ఎం.కృష్ణలు విలేఖరుల సమావేశం నిర్వహించారు. అణు పరికరాలు, పదార్ధాల ఎగుమతులను పొందడానికి ఆయా దేశాలు నాలుగు ఎగుమతుల నియంత్రణా వ్యవస్ధలలో సభ్యత్వం తీసుకోవలసి ఉంటుంది. ఆ ఒప్పందాలు: ఒకటి, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు (ఎన్.ఎస్.జి); రెండు, ది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిం (ఎం.టి.సి.ఆర్); మూడు, ఆస్ట్రేలియా గ్రూపు; నాలుగు, వాస్సెనార్ అరేంజ్‌మెంట్. ఈ అంశంపై విలేఖరుల సమావేశంలో ఇద్దరూ మాట్లాడినప్పటికీ వారిరువురూ రెండు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ నాలుగు సంస్ధలలో ఇండియా ఒక దాని తర్వాత ఒకటిగా వరుసగా (in tandem) సభ్యత్వం తీసుకుంటుందని రెండు సార్లు స్పష్టం చేయగా, హిల్లరీ క్లింటన్ మాత్రం “ఇండియా దశలవారిగా (phased) సభ్యత్వం తీసుకోవాలని ప్రకటించింది. పత్రికలతో మాట్లాడుతున్నపుడు ఈ తేడాలు వ్యక్తమైనప్పటికీ, ఇద్దరూ చేసిన రాతపూర్వక ఉమ్మడి ప్రకటనలో మాత్రం “దశలవారిగా” అనే ఉండడం గమనార్హం. ఉమ్మడి ప్రకటనల్లో సాధారణంగా ఇరువురూ ఏకాభిప్రాయానికి వచ్చినవాటినే పొందుపరచాల్సి ఉంటుంది. కాని ఎగుమతుల నియంత్రణా వ్యవస్ధల్లో సభ్యత్వం తీసుకునే అంశంలో భారత ప్రతినిధి అభిప్రాయం పక్కకు నెట్టబడింది. భారత దేశం మొదట ఎన్.ఎస్.జి, ఎం.టి.సి.ఆర్ లలో సభ్యత్వం తీసుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుండగా, అమెరికా మొదట ఆస్ట్రేలియా గ్రూపు, వాస్సెనార్ అరేంజ్‌మెంట్ లలో ఇండియా సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటోంది.

చూడ్డానికి ఇది పద బంధాలలో తేడాలా కనపడినా, ఆచరణలో దాని ప్రభావం అధికంగా ఉంటుంది. లిబియాపై ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానంలో లిబియా పౌరులను రక్షించడానికి ఎవరికీ నష్టం కలగని రీతిలో “ఎటువంటి చర్యనైనా” తీసుకోవాలి అని పేర్కొనడంతో ఆ “ఎటువంటి చర్యనైనా” అన్నదాన్ని లిబియా అధ్యక్షుడి హత్యకూ, తిరుగుబాటుదార్లకు ఆయుధ సరఫరాలు చేయడానికీ, తిరుగుబాటుదారులకు అనుకూలంగా గడ్డాఫీకి వ్యతిరేకంగా బాంబు దాడులు చేయడానికీ కూడా పశ్చిమ దేశాలు అర్ధాలు బలవంతంగా లాగి అమలు చేస్తున్నాయి. పదబంధాల ప్రయోగంలో పశ్చిమ దేశాలు పాల్పడే ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండనట్లయితే చివరికి అనుభవించాల్సింది మనమేనని గుర్తెరగాలి. ఇది అమెరికా బందిపోటు న్యాయానికి చిన్న ఉదాహరణ మాత్రమే.

ఈ నేపధ్యంలో ఇరాన్‌పై చేస్తున్నట్లుగా భారత్ పై కూడా పెత్తనం చేయడానికి వీలు లేదు అని ఇండియా గట్టిగా అమెరికా మొఖం మీదే చెప్పాల్సి ఉంది. క్లింటన్ ఎక్కడో వ్యాఖ్యానిస్తే దాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని భారత అధికారులు తిరస్కరించారు అని భారతీయులు చదువుకోవలసిన అగత్యం ఉండరాదు. బహిరంగంగానే అందరికీ తెలిసే విధంగానే అణు ఒప్పందం తాలూకూ చర్చలు జరగాల్సి ఉంది. టీ.విలు, రేడియోల ముందు చర్చలు జరపాల్సిన పని లేదు. జరిగిన సమావేశాల మినిట్స్ ని సమావేశాల అనంతరం పత్రికలకు, ప్రజలకు అందుబాటులో ఉంచగలిగితే అది కూడా పారదర్శకతే. కాని భారత పాలకులు, అధికారులు తెరముందు ఒకటి, తెరవెనుక మరొకటి చెప్పడంలో నిష్ణాతులుగా ప్రావీణ్యం సంపాదించారు. అణు ఒప్పందం విషయంలో మొదటి నుండీ పాటిస్తున్న గోప్యతకు ఇక స్వస్తి పలకాలి. ఇది కోట్లాది ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సమస్య గనక పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని ప్రజలు ప్రజా సంఘాలు డిమాండ్ చేయాలి. అంతిమంగా అమెరికాతో అణు బంధం నుండి ఇండియా బైటికి వస్తే తప్ప భారత దేశ అణు స్వతంత్రత (ఏమైనా ఉన్నట్లయితే) మనజాలదని గ్రహీంచాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s