ప్రపంచంలో అతిపెద్ద యురేనియం నిల్వలున్న తుమ్మలపల్లె ఆంధ్రప్రదేశ్ కి వరమా? శాపమా?


Atomic Energy Commission Chairman Srikumar Banerjee

రాజస్ధాన్‌లో కొత్త అణు విద్యుత్ ప్లాంటు శంకుస్ధాపనకు హాజరైన భారత అటామిక ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ 'శ్రీకుమార్ బెనర్జీ'

ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్ధితి దాపురించింది. అణు బాంబులతో పాటు అణు విద్యుత్‌కి వినియోగించే యురేనియం నిల్వలు ఆంధ్రప్రదేశ్ లోని తుమ్మలపల్లెలో పుష్కలంగా ఉన్నాయని భారత అణు ఇంధన కమిషన్ ఛైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ తెలిపాడు. ప్రపంచంలో మరెక్కడా ఒకే చోట ఇంత అధిక స్ధాయిలో యురేనియం నిల్వలు ఉన్న ప్రాంతం లేదని ఆయన తెలిపాడు. ఇటీవల జరిపిన అధ్యయనాల ద్వారా తుమ్మలపల్లెలో35 కి.మీ పరిధిలో1.5 లక్షల టన్నుల యురేనియం ఖనిజ నిల్వలు ఉన్నాయని తేలిందని ఆయన వెల్లడించాడు. ఇక్కడ 49,000 టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్లుగా ఇప్పటికే రుజువైందనీ, తాజా పరిశోధనల ద్వారా ఇంతకంటే మూడు రెట్లు తుమ్మలపల్లెలో యురేనియం ఉన్నట్లు వెల్లడయ్యిందని ఆయన వివరించాడు.

అణు ఇంధనం విభాగానికి కార్యదర్శిగా కూడా ఉన్న శ్రీకుమార్ 700 మెగావాట్ల సామర్ధ్యం గల రెండు అణు కర్మాగారాల నిర్మాణాన్ని రాజస్ధాన్‌లోని రావత్‌భటా లో ప్రారంభించడానికి వచ్చాడు. రాజస్ధాన్ అటామిక్ పవర్ స్టేషన్ (ఆర్.ఎ.పి.ఎస్) లో ఈ రెంటిని నిర్మిస్తున్నారు. తుమ్మలపల్లెలో యురేనియం నిల్వలకోసం వెతుకులాట ఇంకా కొనసాగుతోందని ఆయన చెప్పాడు. తుమ్మలపల్లె కాకుండా దేశంలో ఇప్పటికి 175,000 టన్నుల యురేనియం ఉన్నట్లు కనొగొన్నామని బెనర్జీ వెల్లడించాడు. మొత్తం మూడు లక్షల టన్నుల యురేనియం ఇంధనం అందుబాటులో ఉన్నా, అది భారత దేశ అవసరాలకు సరిపోదని ఆయన చెప్పాడు. “తుమ్మలపల్లె నిల్వలు దేశీయ ఉత్పత్తిని పెంచుతాయి తప్ప మొత్తం అవసరాలను తీర్చజాలవు. అవసరానికి, లభ్యతకూ మధ్య ఇంకా చాలా తేడా ఉంది. అందువలన యురేనియం ఇంధనాన్ని దిగుమతి చేసుకోక తప్పదు” అని ఆయన తెలిపాడు.

దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేయకుండా విదేశీ టెక్నాలజీని దిగుమతి చేసుకోవడానికే భారత దేశం ఎక్కువ ఆసక్తి చూపుతున్నదన్న వాదనలను శ్రీకుమార్ నిజం కాదని చెప్పడానికి శ్రీ కుమార్ ప్రయత్నించాడు. విద్యుత్ శక్తిని వేగంగా ఉత్పత్తి చేయడానికి మాత్రమే టెక్నాలజీని దిగుమతి చేసుకుంటోంది తప్ప ఇండియా ప్రభుత్వానికి మరొక ఉద్దేశ్యం లేదని ఆయన చెప్పాడు. దేశీయ టెక్నాలజీ అభివృద్ధీ, విదేశీ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి రెండూ ఒకదాని పక్కన ఒకటి సమాంతరంగా సాగుతాయని ఆయన తెలిపాడు. “పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడానికి అణు విద్యుత్ ఉత్పత్తి అవసరం చాలా ఉంది. ఆర్ధిక వ్యవస్ధ 9 శాతం వేగంగా వృద్ధి చెందాలంటే విద్యుత్ ఉత్పత్తి 10 శాతం వేగంతో పెరగవలసిన అవసరం ఉంది” అని శ్రీ కుమార్ అన్నాడు. ఐతే ఈ 9 శాతం జిడిపి వృద్ధి రేటుకీ, 10 శాతం విద్యుత్ వృద్ధి రేటుకీ ఉన్న సంబంధం గురించి శ్రీకుమార్ వివరించలేదు. 9 శాతం జిడిపి వృద్ధి రేటు సాధించాలని ఈ సంవత్సరం ప్రభుత్వ లక్ష్యం కనుక ఆ సంఖ్యను వాడి, దాని తర్వాత పెద్ద సంఖ్య అయిన 10 శాతాన్ని విద్యుత్ ఉత్పత్తి వృద్ధి రేటుకి వాడారో లేక నిజంగానే సూత్రబద్ధంగానే జిడిపి వృద్ధి రేటు కంటే ఒక శాతం ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి వృద్ధి రేటు ఉండాలో వివరం తెలియదు.

విద్యుత్ ఉత్పత్తి వృద్ధి రేటు మరియు జిడిపి వృద్ధి రేటు మధ్య గల నిష్పత్తిని ఎలాస్టిసిటీ రేషియో (Elasticity of electricity consumption with respect to GDP) అంటారు. భారత దేశ విద్యుత్ వినియోగాన్ని ఇండియా కోర్ వెబ్‌సైట్ కొంత వివరంగా చర్చించింది. ఈ పేజిలోని Electricity Consumption అనే సబ్ హెడింగ్ కింద చర్చించిన అంశాల ప్రకారం మొదటి పంచవర్ష ప్రణాళికలో ఎలాస్టిసిటీ రేషియో (ఇ.ఆర్) 3.06 ఉండగా, అది మూడవ పంచవర్ష ప్రణాళికా కాలంలో 5.11 కి చేరుకుని, ఎనభైల నాటికి 1.65 కి తగ్గిందని తెలుస్తోంది. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం 1951-56 ల మధ్య ప్రతి 1 శాతం జిడిపి పెరుగుదలకు 3.14 శాతం విద్యుత్ వినియోగం పెరుగుదల సంభవించగా, ఎనిమిదవ పంచవర్ష ప్రనాళికా కాలం 1992-97 నాటికి విద్యుత్ వినియోగం ప్రతి 1 శాతం జిడిపి పెరుగుదలకూ విద్యుత్ వినియోగం 0.97 శాతం మాత్రమే పెరిగింది. 2005తో ముగిసిన దశాబ్ద కాలంలో విద్యుత్ వినియోగం (లేదా విద్యుత్ ఉత్పత్తి) పెరుగుదల రేటు, జిడిపి వృద్ధి రేటు కంటె తక్కువగా ఉందని కూడా తెలుస్తోంది. అంటే ఇ.ఆర్ అనేది ఒకటి కంటె తక్కువ ఉన్నదని అర్ధం. మరో విధంగ చెప్పుకుంటే ఇ.ఆర్ ఒకటి కంటె తక్కువ ఉంటే విద్యుత్ వినియోగం వృద్ధి రేటు జిడిపి వృద్ధి రేటు కంటె తక్కువగా ఉందని చెప్పవచ్చు.

జిడిపి వృద్ధి రేటు కంటె విద్యుత్ వినియోగం (లేదా ఉత్పత్తి) పెరుగుదల రేటుకంటే ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి? సర్వీసుల రంగం వేగంగా అభివృద్ధి చెందటం కారణం కావచ్చు. బ్యాంకులు, ఇన్సూరెన్స్, షేర్ మార్కెట్లు, ఛిట్స్ తదితర ద్రవ్యరంగ కంపెనీలు, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మొదలైనవి సర్వీసు రంగం కిందికి వస్తాయి. ఈ రంగాల్లో పెద్ద పెద్ద యంత్రాల వినియోగం ఉండదు. ఆఫీసు కార్యాలయాల వినియోగంతో సమాన విద్యుత్ ఈ రంగంలో వినియోగం ఉంటుంది. కనుక సర్వీసుల రంగం ఉత్పత్తి భాగం ఎక్కువగా ఉన్నప్పటికీ విద్యుత్ వినియోగం ఆ స్ధాయిలో లేకుండా తక్కువగా ఉంటుంది. దానితో సర్వీసుల రంగం వలన జిడిపిలోకి అధిక భాగం వచ్చి చేరినా, దానివలన వినియోగమయ్యే విద్యుత్ మాత్రం తక్కువగా ఉంటుంది. కనుక సర్వీసుల రంగం అభివృద్ధి చెందడం జిడిపి వృద్ధి రేటుతో పాటు విద్యుత్ వినియోగ రేటు ఉండకపోవడానికి ఒక కారణం. మరో ముఖ్య కారణం ఏంటంటే విద్యుత్ వినియోగంలో సామర్ధ్యం పెరగడం. ఉత్పత్తి అయ్యే విద్యుత్ ని వృధా పోనీయకుండా సమర్ధ వంతంగా వినియోగించినప్పుడు కూడా విద్యుత్ వినియోగం వృద్ది రేటు, జిడిపి వృద్ధి రేటు అధికంగా ఉంటుంది.

ఏతా వాతా తేలేదేమంటే, జిడిపి వృద్ధి రేటుకూ, విద్యుత్ వినియోగం (లేదా ఉత్పత్తి) పెరుగుదల రేటుకూ శ్రీకుమార్ బెనర్జీ గారు చెప్పిన సంబంధం లేదని. జిడిపి 9 శాతం పెరిగితే, విద్యుత్ ఉత్పత్తి 10 శాతం పెరగాలని శ్రీకుమార్ చెప్పారు. అంటే ఇ.ఆర్ (10% / 9%) ఎల్లప్పుడూ ఒకటి కంటే ఎక్కువా ఉండాలని అర్ధం. వాస్తవానికి చూస్తే ఇ.ఆర్ అనేది ఒకటి కంటె తక్కువ ఉన్నపుడు అది విద్యుత్ వినియోగ సామర్ధ్యం పెరగడాన్ని కూడా సూచిస్తుంది. లేదా తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్‌ని ఉత్పత్తి చేయగల సామర్ధ్యం పెరగడాన్ని కూడా సూచిస్తుంది. విద్యుత్ ప్రసారంలో నష్టాలు సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూస్తూ లక్ష్యానికి చేరుకునేలా చేస్తే అది నాణ్యమైన విద్యుత్‌ని ఉత్పత్తి చేసినట్లు అర్ధం. దీనిని బట్టి శ్రీకుమార్ గారు, లక్ష్యంగా పెట్టుకున్న జిడిపి వృద్ధిని సాధించాలంటె దాని కంటే విద్యుత్ వినియోగం వృద్ధి ఎక్కువగా ఉండాలి అని చెప్పిన లెక్క అంకెల గారడీనో లేక డొల్లు పుచ్చకాయ కబుర్లో తప్ప వాస్తవంతో కూడుకున్నవి కాదు. భవిష్యత్తులో ఎక్కువ విద్యుత్ కావాలి. ఎక్కువ విద్యుత్ కావాలంటే అది న్యూక్లియర్ విద్యుత్ తోనే సాధ్యం అని ఒక పరీక్షలకు నిలబడని సంగతిని ఆయన చెప్పదలుచుకున్నాడు. ఆయన ఎనర్జీ విభాగం సెక్రటరీ, పైగా ఎటామిక్ ఎనర్జీ విభాగం ఛైర్మన్ కూడా కనుక ఆయన నోట్లోంచి రాలే ప్రతిమాట ముత్యం ఐపోతుందని భావించి ఉండవచ్చు.

ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం వద్ద జరిగిన ప్రమాదం వలన వెలువడుతున్న రేడియేషన్‌ను ఇంకా అరికట్టలేదు. ఇప్పటివరకు వెలువడిన రేడియేషనే అధికంగా ఉందనుకుంటే, ఇంకా వెలువడుతున్న రేడియేషన్‌తో మరింత ప్రమాదకర పరిణామాలు జపాన్ ప్రజలు ఎదుర్కోవలసి ఉంది. ఫుకుషిమా చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు టోక్యోలో కూడా పాలల్లో, కూరగాయల్లో, మాంసంలో రేడియేషన్ స్ధాయి పెరుగుతోంది. ఫుకుషిమా ప్రమాదం గురించి వార్తా సంస్ధలు పట్టించుకోకుండా అణు రంగంలోని బహుళజాతి సంస్ధలు సమర్ధవంతంగా మేనేజ్ చేయగలిగాయి. కాని బ్లాగర్లు, ప్రజా ప్రయోజనాలకు కట్టుబడి ఉన్న కొన్ని వార్తా సంస్ధలు ఫుకుషిమా వాస్తవాలను ఇంకా తెలుపుతూనే ఉన్నాయి. జరిగిన ప్రమాదం నుండి త్వరలో బైటపడతామన్న హామీ కూడా ఇవ్వలేని పరిస్ధితి. అదలా ఉండగానే అణు రంగంలోని బహుళజాతి సంస్ధల ప్రయోజనాలకు అమ్ముడుబోయిన అధికారులు, శాస్త్రవేత్తలు అణు విద్యుత్ పై కల్లబొల్లి కబుర్లు చెప్పడం కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇప్పుడు అణు విద్యుత్ గురించి మాట్లాడె వారెవరైనా సరే, ముందు ఫుకుషిమాకి పరిష్కారం చెప్పిగాని ముందుకు సాగడానికి వీల్లేని పరిస్ధితి ఉంది. దాన్ని గురించి చెప్పకుండా అణు విద్యుత్ గొప్పతనం గురించీ. భద్రత గురించీ చెప్పే మాటలు, హామీలన్నీ వృధా మాటలో, వంచనా పూరిత మాటలో అవుతాయి తప్ప వాస్తవాలు కాజాలవు. ఫుకుషిమా ప్రమాదం ప్రధానంగా అణు విద్యుత్ కేంద్ర వద్ద విద్యుత్ సౌకర్యం దెబ్బతింటే, విద్యుత్ సౌకర్యం చెబ్బతిన్నపుడు సాయపడవలసిన జనరేటర్లు కూడా దెబ్బతినడం వలన తలెత్తిన ప్రమాదం. జనరేటర్లు ఆడక విద్యుత్ ఉత్పత్తి కాక, ఆ విద్యుత్ తో పనిచేసే కూలింగ్ వ్యవస్ధ పనిచేయక రియాక్టర్లలోని యురేనియం ఇంధన కడ్డీలు వేడెక్కి, కరిగిపోయి, బైటికి లీకయ్యి తద్వారా వాతావరణంలోకి రేడియేషన్ పెద్ద ఎత్తున వెలువడిన పరిస్ధితి ఫుకుషిమాలో తలెత్తింది. అంటే ఎటువంటి పరిస్ధితుల్లోనైనా అణు రియాక్టర్లకు విద్యుత్ సరఫరాలో ఆటంకాలు రాకూడదు. ఆటంకం వస్తే కూలింగ్ లేక కడ్డీలు వేడెక్కి కరిగి రేడియేషన్ విడుదల చేస్తాయి.

భారత అణు శాస్త్రవేత్తలే కాదు. అమెరికా, యూరప్ శాస్త్రవేత్తలు కూడా ఎటువంటి ప్రమాదంలోనైనా సరే విద్యుత్ సరఫరా ఆటంకం లేకుండా చూడగల వ్యవస్ధను నిర్మించలేదు. అమెరికాలో ప్రమాదం జరిగాక కనీసం ఎనిమిది నుండి పదహారు గంటలవరకూ విద్యుత్ సరఫరా చేయగల వ్యవస్ధ ఉండాలని అణు ప్లాంటుల భధ్రతా రివ్యూ కమిటీ సిఫారసు చేసింది. ఆ తర్వాత కూడా కూలింగ్ వ్యవస్ధ పనిచేయకపోతే పరిస్ధితి ఏంటో వాళ్ళింకా ఊహించలేక పోతున్నారు. ఊహించలేకే జర్మనీ, పది సంవత్సరాల తర్వాత అణు విద్యుత్ కి పూర్తిగా స్వస్తి పలకడానికి నిర్ణయించుకుంది. ఈ లోపు దేశంలోని అణు విద్యుత్ ప్లాంట్లను ఒక్కొక్కటి దశలవారీగా నిర్వీర్యం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. జపాన్, రెండు రోజుల క్రితం ఇండియాతో ఉన్న అణు పరికరాలు, పధార్ధాల సరఫరా ఒప్పందాన్ని సమీక్షించడాన్ని రద్దు చేసుకుంది. ఆ చర్య ఇండియాకి అణు పదార్ధాలు, పరికరాలు సరఫరా చేయడం ఇష్టం లేక తీసుకున్నది కాదు. అసలు అణు పదార్ధాల జోలికే పోకూడదని జపాన్ నిర్ణయించుకుంది. ఆ విషయమై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించనప్పటికీ, అణు వ్యాపారం రద్దు చేసుకోవడాన్ని బట్టి జపాన్ కూడా అణు విద్యుత్ ని భవిష్తత్తులో వినియోగించడాన్ని పూర్తిగా రద్దు చేసుకునే అవకాశం ఉంది. తాను అణు విద్యుత్ వినియోగించకుండా ఇండియాకి అణు పధార్ధం, పరికరాలు సరఫరా చేయడం నైతికంగా సరికాదన్న సూత్రాన్ననుసరించి జపాన్ ఇండియాతో చేయాలనుకున్న సమీక్షను రద్ధు చేసుకుంది.

ఫ్రాన్సు కూడా జర్మనీ బాటలో నడుస్తోంది. కానీ ఈ లోపు తాము వాడకూడదనుకుంటున్న అణు రియాక్టర్లను ఇండియాకి సరఫరా చేయడానికి మాత్రం రెడీ అంటోంది. అమెరికా కూడా తాము ఎన్నడో వాడకుండా పక్కన పడేసిన భద్రతా రహిత రియాక్టర్లను ఇండియాకి అంటగట్టడానికి చూస్తోంది. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ఇప్పుడు భారత్ లో పర్యటిస్తోంది. ఆవిడ దౌత్యంలో అణు విద్యుత్ రియాక్టర్ల అమ్మకం కూడా ఒక ప్రధాన భాగం. భారత్‌తో అణు వ్యాపారం చేయడానికి ఇంకా ఏవో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయట. వాటిని కూడా తొలగిస్తే మనం ఎంచక్కా అణు వ్యాపారం చేసుకోవచ్చు. మా కంపెనీలు కూడా తెగ ఎదురు చూస్తున్నాయి అని క్లింటన్ చెబుతోంది. కమీషన్లు మింగిన భారత పాలకులు “అయితే వాకే” అంటూ తలలూపుతున్నారు. భారత ప్రజలకు ఏం ఫర్లేదు అని భరోసా ఇస్తున్నారు. భారత పాలకుల భరోసాకు ఏపాటి విలువ ఉన్నదో భోపాల్ లోని యూనియన్ కార్బైడు ఫ్యాక్టరీలో విషవాయువు లీకై అనేక వేలమంది చనిపోయినప్పుడే రుజువైంది. బాధితులైన భారతీయులకు నష్టపరిహారం ఇప్పించే బదులు ఫ్యాక్టరీ యజమాని ఏండర్సన్ తో కుమ్మక్కై ప్రభుత్వ విమానంలో దేశం దాటించిన ఘనులు మన పాలకులు. వీరే అణు విద్యుత్ భద్రత పై కూడా హామీలుస్తున్నారు. అమెరికా తదితర పశ్చిమ దేశాలు అణు భద్రతపై ఆందోళన చెందుతుండగా భారత పాలకుల మాత్రం అంతా భద్రం అని అబద్ధాలు చెబుతున్నారు.

ప్రపంచంలోనే అత్యధిక యురేనియం నిల్వలున్న ఒకే ఒక ప్రాంతం అని చెబుతున్న తుమ్మలపల్లెలో యురేనియం వెలికి తీతకు సిద్ధపడితే రేడియేషన్ విడుదల కాకుండా ఉండటానికి సవా లక్ష భద్రతా ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. పశ్చిమదేశాల్లో అటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం, పర్యావరణ చట్టాలు పాటించడం తదితర భాద్యతలు ఖరీదుగా మారడంతో బహుళజాతి సంస్ధలు చైనా, ఇండియా లాంటి దేశాలకు పరుగెత్తుకు వస్తున్నాయి. చైనా, ఇండియాల్లోనైతే పర్యావరణ చట్టాలు చాలా బలహీనం. వాటిని కూడా రెండంకెల జిడిపి వృద్ధి రేటుకు ఆటంకం అని చెబుతూ పాటించడం లేదు. పర్యావరణ చట్టాలు పాటించాలని చెబుతున్నాడని మంత్రి జైరాం రమేష్ ను ఆ శాఖనుండి తీసేసి పెద్దల మాటలను బుద్దిగా వినే జయంతీ నటరాజన్‌ను పర్యావరణ మంత్రిగా నియమించుకున్నాడు ప్రధాని మన్మోహన్. భారత దేశంలో కార్మిక చట్టాలు లేనట్టే లెక్క. నూతన ఆర్ధిక విధానాలు అమలు చేయడం మొదలు పెట్టక ముందు కొద్దో గొప్పో లేబర్ చట్టాలు పని చేసేవి. కనీసం కార్మిక చట్టాలు ఉన్నాయన్న స్పృహ ఉండేది. ఇప్పుడదేమీ లేదు. కార్మిక చట్టాలంటే కార్మికుల హక్కులను కాపాడేవి అని భావించడానికి బదులు రెండంకెల జిడిపి వృద్ధి రేటుకు అడ్డం అని భావిస్తున్నారు. ఒక్క పెట్టుబడిదారులే కాదు, ప్రజల్లో నోరు, చదువు ఉన్న సెక్షన్లన్నీ అలాగే భావించేలా చేయడంలో సఫలమయ్యారు మన పాలకులు. ప్రభుత్వ రంగం పైన లైసెన్స్ రాజ్ అనీ, తెల్ల ఏనుగులనీ దుష్ప్రచారం చేసిన ఫలితంగా అందులో పూర్వాపరాలు విచారించకుండానే నమ్మడం ప్రారంభించింది మన మేధో ప్రజ. ఆ విధంగా భారత దేశంలో కార్మిక చట్టాలు నామ మాత్రంగా మారిపోయాయి. బలహీన పర్యావరణ చట్టాలు, ఉండీ లేని కార్మిక చట్టాలు, చౌకగా దొరికే శ్రమ ఇవన్నీ విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నాయి. తమ తమ దేశాలో పాటించవలసిన కఠినమైన పర్యావరణ చట్టాలను ఇండియాలో ఎగవేయవచ్చు కనక అణు ఇంధనం వెలికి తీతలో కూడా భారత ప్రభుత్వం విదేశీ టెక్నాలజీ పేరుతో విదేశీ పెట్టుబడుల్ని అహ్వానించనున్నాయి. ఇతర దేశాల ప్రజల ప్రాణాలని గడ్డిపోచల్లా భావించే ఈ అణు బహుళజాతి కంపెనీలు తుమ్మలపల్లె, దాని చుట్టుపక్కల నివసించే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడానికి ఈరోజు కాకపోయినా రేపైనా వస్తారు. తుమ్మలపల్లె వాసులారా! ఆంద్రప్రదేశ్ బిడ్డలారా!! భారతీయులారా!!! తస్మాత్ జాగ్రత్త!

2 thoughts on “ప్రపంచంలో అతిపెద్ద యురేనియం నిల్వలున్న తుమ్మలపల్లె ఆంధ్రప్రదేశ్ కి వరమా? శాపమా?

  1. ప్రజల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశాయి, అభివృద్ది సూచీలే అసలైన నిజాలని నమ్ముతూ పబ్బం గడుపుకుంటున్నాయి. జపాన్ లాంటి దేశాల్లోనే అణుభద్రత లేనపుడు ఇక ఇండియా గురించి చెప్పుకోవడం దండగ. ప్రభుత్వాలు గొర్రెదాటు చందంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడుతున్నాయి. కంచే చేను మేస్తే ఇక మొరపెట్టుకోవాల్సింది ఎవరితో?

  2. అవును. ఐతే కంచే చేను మేస్తే ఇక మొర పెట్టుకోవడం పైన నమ్మకం పెట్టుకోనవసరం లేదు. కంచెను నరుక్కోవడమే మిగిలింది. బహుశా మార్క్స్ చెప్పిన వర్గ పోరాటం అదేనేమో?! ప్రజలు తెగించి వర్గపోరాటం చేయాలని కదా ఆయనన్నది.

    లేకుంటే, విదేశీ బ్యాంకుల్లో దాచిన నల్ల ధనం వెనక్కి తేవడానికి సుప్రీం కోర్టు పూనుకుంటే, దాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడం ఏంటసలు? పైగా నల్లధనం తరలింపు కేంద్ర ఆర్ధిక విధానాల్లో భాగం ఐనట్లుగా, కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకోజాలవని ఆ పిటిషన్‌లో వాదించడం ఏంటి? భారత ప్రజల దరిద్రం కాకపోతే?!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s