తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు, ఫుకుషిమా అణు ప్రమాదం, కొన్ని సంగతులు


ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో యురేనియం నిల్వలున్న ప్రాంతంగా పేరు సంపాదించుకున్న తుమ్మలపల్లె గ్రామం కడప జిల్లా పులివెందుల మండలంలో ఉంది. ఇక్కడ 49,000 టన్నుల యురేనియం నిల్వలు ఉన్నాయని నిర్ధారించారని మాత్రమే నిన్నటి వరకూ లోకానికి తెలుసు. అయితే రాజస్ధాన్‌లో, దేశంలోని 25వ అణు విద్యుత్ రియాక్టర్ నిర్మాణానికి శంకుస్ధాపన కోసం విచ్చేసిన భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ, తుమ్మలపల్లెలో గతంలో నిర్ధారించినట్లుగా 49,000 టన్నులు కాకుండా దానికి మూడు రెట్లు, అంటే దాదాపు 1,50,000 టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్లు ఇటీవల పరిశోధనల ద్వారా వెల్లడయ్యిందని ప్రకటించాడు.

Tummalapalle Uranium Project

(క్లిక్ చేసి పెద్ద బొమ్మ చూడండి)

“తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు” దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి మానస పుత్రిక. స్ధానిక ప్రజల అభ్యంతరాలన్నింటినీ పక్కకు నెట్టి దీనికి కావలసిన అనుమతులన్నింటినీ సంపాదించాడాయన. అండర్ గ్రౌండ్ లో 300 మీటర్ల లోతున మైనింగ్ చేపట్టాలని నిర్ణయించి అందుకోసం పనులు చురుగ్గా సాగుతున్నాయి. యురేనియం ప్రాసెసింగ్ ప్లాంటు నిర్మాణం కూడా కొనసాగుతోంది. ఈ ప్లాంటులో యురేనియం ఖనిజాన్ని శుద్ధి చేస్తారు. ఆల్కలి లీచింగ్ పద్ధతిలో ఒత్తిడిని ఉపయోగించి శుద్ధి చేస్తారని “యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్” సంస్ధ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది.

యురేనియం శుద్ధి కర్మాగారం అంటే పకడ్బందీగా అనేక భద్రతా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అందులో పని చేసే ఉద్యోగులందరూ, గది శుభ్రం చేసేవారితో సహా, రేడియేషన్ కి గురికాకుండా ఒళ్ళంతా తొడుగులు వాడాల్సి ఉంటుంది. తొడుగులు పాడైపోకుండా రోజూ చెక్ చేసుకోవాలి. చిన్న రంధ్రమో, కోతో పడినా అదిక పనికి రాదు. వారికి తెలియ కుండా రంధ్రమో, కోతో పడితే అది వాడే ఉద్యోగి శరీరంలోకి రేడియేషన్ చొరబడుతుంది. దాన్ని తనతో పాటు ఇంటికి తీసుకెళ్తాడు. అతను తీసుకెళ్ళే మోతాదునీ, రూపాన్నీ బట్టి కుటుంబ సభ్యులకూ, పక్కింటివారికీ రేడియేషన్ సంక్రమించే అవకాశం ఉంటుంది. అదొక విష వలయంగా మారుతుంది. ఆ రేడియేషన్ పరిమితిలోపల ఉంటే మైనర్ సమస్యలతో బైటపడవచ్చు. పరిమితి మించితే వివిధ రకాల పరిణామాలకు దారితీస్తుంది.

అంతేనా! ఫ్యాక్టరీని అండర్ గ్రౌండ్ లోనే నిర్మించాలి. అండర్ గ్రౌండ్ లోకి గాలీ వెలుతురూ వెళ్ళడానికి నిర్మించే పైపులూ తదితరాలన్నీ అత్యంత భద్రతతో నిర్మించాలి. ఎంత అప్రమత్తంగా ఉన్నా మానవ తప్పిదాలకు అతీతమైంది ఏదీ లేదు. అదిగో, అక్కడే అణు భయాలన్నీ కేంద్రీకృతమై ఉంటాయి. జపాన్ లోని ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు గల ప్లాంటు అనే చెప్పారు. కాని 9 పరిణామం గల భూకంపం, ఆ తర్వాత సంభవించిన 20 నుండి 30 మీటర్ల అలలతో విరుచుకుపడే సునామిని వారు ఊహించలేదు. సముద్రం ఒడ్డున కట్టిన ఈ ప్లాంటులోకి సముద్ర అలలు రాకుండా ఉండటానికి 10 మీటర్ల గోడను నిర్మించారు. పది మీటర్ల అలలు వస్తాయా అనుకున్నారు తప్ప సునామీ వారి ఆలోచనలకు తట్టలేదు. అది కూడా మానవ తప్పిదమే.

ఏం జరిగింది? 20 నుండి 30 మీటర్ల ఎత్తుకు అలలు విరుచుకు పడిన సునామీని సృష్టించగల అతిపెద్ద భూకంపం రానే వచ్చింది. పది మీటర్ల అడ్డుగోడను ఇరవై మీటర్ల అల ఎందుకు లెక్క చేస్తుంది? అణు ప్లాంటుని ముంచెత్తింది. సాధారణంగా భూకంపం వస్తే అణు ప్లాంటు ఆటోమేటిక్ గా పని చేయడం ఆగిపోయేట్లు ఏర్పాటు చేస్తారు. ఫుకుషిమాలో చేశారు కూడా. భూకంపం రాగానే అణు ప్లాంటు పని చేయడం మానేసింది. భూకంపం అతి పెద్దది కావడంతో విద్యుత్ సరఫరా దెబ్బతిని మాములు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఈ విద్యుత్ ద్వారానే అణు ప్లాంటులోని ఇంధన రాడ్లను చల్లబరిచే కూలింగ్ వ్యవస్ధ పని చేస్తుంది. ఈ వ్యవస్ధ ద్వారా చల్లని నీరు నిరంతరం రియాక్టర్ లోనికి వెళ్తూ ఉండాలి. ఒకవైపు చల్లని నీరు వెళ్తూ ఉంటే మరోవైపు లోపల ఉన్న వేడి నీరు బైటికి వస్తూ ఉంటుంది. ఈ వ్యవస్ధ నడవాలంటే విద్యుత్ కావాలి. అది ఆగిపోయింది కనక ఆటోమేటిక్ గా ప్లాంటు వద్ద సిద్ధంగా ఉంచిన జనరేటర్లు పని చేయడం ప్రారంభం కావాలి.

కాని జనరేటర్లు పని చేయడం ప్రారంభం కాలేదు. సునామీ అలలతో కొట్టుకొచ్చిన సముద్రపు నీరు జనరేటర్లను ముంచేశాయి. దానితో జనరేటర్లు పని చేయలేదు. విద్యుత్ ఆగిపోవడంతో రియాక్టర్ లో ఇంధన రాడ్లను చల్లబరిచే కూలింగ్ వ్యవస్ధ కూడా పనిచేయడం ఆగిపోయింది. నీరు లోపలికి వెళ్లలేదు. లోపలి నీరు బైటికీ రాలేదు. దానితో ఇంధన రాడ్లు వేడెక్కడం ప్రారంభమైంది. ఇలా వేడెక్కి కరిగిపోవడాన్ని “మెల్డ్ డౌన్” అంటారు. మెల్డ్ డౌన్ సునామీ వచ్చిన కొన్ని గంటల్లోపే జరిగిందని మూడు నెలల తర్వాత టెప్కో (టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ) గాని చెప్పలేదు. మెల్డ్ డౌన్ అయిందంటే దానర్ధం రేడియేషన్ తో కలిసిన నీరు రియాక్టరు అడుగుకు చేరి బైటికి రావడం ప్రారంభం అయ్యిందని అర్ధం. అది జరిగితే రేడియేషన్ కి సంబంధించిన దారుణమైన పరిణామాలని వాతావరణం, అందులో ఉండే జీవజాలాలు, జలాలు, పశు పక్ష్యాదులు, మానవులు ఎదుర్కోక తప్పదు. ఇక నష్టం ఎంత తక్కువకి పరిమితం చేయాలా అన్నదే చర్చ అవుతుంది తప్ప నష్టం జరుగుతుందా లేదా అనేది చర్చాంశం కాబోదు.

ఇలా ఎట్టిపరిస్ధుతుల్లోనూ విద్యుత్ సరఫరా కొనసాగే ఏర్పాట్లు చేయగలిగితేనే అణు ప్లాంట్లు ప్రమాద రహితం. అది కూడా పూర్తిగా కాదు. అణు ప్లాంట్ల ప్రమాదాన్నుండి బైటపడే వరకూ ఆ విద్యుత్ సరఫరా కొనసాగుతూ ఉండాలి. లేకుంటే పరిస్ధితి మామూలే. కాని ఎట్టి పరిస్ధితుల్లోనూ విద్యుత్ ప్రసారం కొనసాగుతుంది అని చెప్పడం నమ్మశక్యంగాని విషయం. పూర్తిగా ఊహామాత్రం. ఇవన్నీ ఆలోచించే జర్మనీ, ఫ్రాన్సు, జపాన్ లు అణు విద్యుత్ జోలికి పోదలచుకోవడం లేదు. అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధలోని ధనిక వర్గం పూర్తిగా అమానవీకరణ చెందారు. వారికి మానవ సంబంధమైన సెంటిమెంట్లు, భావాలు, దుఃఖం, బాధ, లేమి ఇవేవీ పట్టని స్ధాయికి అభివృద్ధి చెందారు. మాములుగా అలాంటివారిని స్ధిత ప్రజ్ఞులు అనంటారు. కాని అమెరికా పెట్టుబడిదారీ వర్గం వారికి పూర్తిగా వ్యతిరేకం. పాజిటివ్ కోణంలో వారు స్ధిత ప్రజ్ఞులు కాలేదు. పూర్తిగా నెగిటివ్ కోణంలో అలా మారారు. అందుకే వాళ్ళు మూడు మానవ హనన, దురహంకార, దురాక్రమణ యుద్ధాలు చేస్తూనే పూర్తిగా యంత్రాల తోటే యుద్ధం చేయగల రోజు కోసం కలలు గంటున్నారు.

యూరప్ దేశాలు అందుకు కొంత భిన్నం. కొద్దిగా మాత్రమే నండోయ్. అది కూడా అమెరికా అప్పటికే ఉచ్ఛ పశు దశకి చేరుకున్న దశని వీరు ప్రత్యక్షంగా వీక్షించి, అదెంత అసహ్యంగా ఉంటుందో చూస్తున్నారు గనక ఆ స్ధితికి వెళ్ళడానికి ఇంకా జంకుతున్నారేమో తెలియదు గానీ, అణు సంక్షోభం మొత్తం మానవ జాతి ఉనికికే భంగకరమని గ్రహించగలుగుతున్నారు. కనుకనే అణు విద్యుత్ కి దూరం జరగడానికి ధైర్యం చేయగలుగుతున్నారు.

భారత దేశ పాలకులు అటు అమెరికా చేరిన స్ధితికి చేరే పరిస్ధితి కాదు. ఇటు యూరప్ దశకు చేరే స్ధితి అసలే కాదు. కాని సొమ్ములు కావాలి. ఇంకా కావాలి. ఇంకా ఇంకా కావాలి. అందుకు ఏ గడ్డైనా తినడానికి సిద్ధం. వారి వ్యవహారం అంతా బ్రోకరేజి వ్యవహారమే. వారి మాస్టర్లకు కావలసింది అందిస్తూ, వారి చేతులనుండి రాలిపడే పైసల్ని స్విస్ బ్యాంకుల్లో వేసుకోవాలి. అలా రాలిపడేది ఏరుకుంటెనే కోటి కోట్లకు విదేశీ ఖాతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మృష్టాన్న భోజనం తింటూ వచ్చిన పశ్చిమ దేశాల బహుళజాతి సంస్ధల ఆస్దులు ఎన్నని లెక్క వేయగలం?

తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు అనేక భారత ఫుకుషిమాలకు యురేనియం ఇంధనం సరఫరా చేసే ప్రాజెక్టుగా తయారవుతోంది. భారత ప్రజలు తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టును అడ్డుకోగలిగితే భవిష్యత్తులో తలెత్తనున్న పదుల సంఖ్యలోని భారత ఫుకుషిమా లను అడ్డుకున్నట్లే. అణు విద్యుత్ గురించి భారత పాలకులు, అమ్ముడుబోయిన శాస్త్రవేత్తలు రంగు రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు. కానీ ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో అత్యధిక భాగం ధనికుల ఇళ్ళలోని స్వర్గ సౌఖ్యాల నిర్వహణకు ఖర్చవుతున్నదన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. రైతు సాగు చేసే పంటకు రోజుకి ఏడు గంటలేనని విద్యుత్ సరఫరాపై పరిమితి విధించే ప్రభుత్వాలు ధనికుల ఇళ్ళలోని ఎ.సి ప్లాంట్లులు నడవడానికి 24 గంటలూ సరఫరా చేస్తాయని గ్రహించాలి. రైతు కష్టపడి సాగుచేసే పంటకు నీరు పెట్టడానికి, ఎప్పటికో వచ్చే విద్యుత్ కోసం 24 గంటలూ పహారా కాస్తే, ఒక మాదిరి ధనికులనుండి శత, సహస్ర కోటీశ్వరుల వరకూ… వారి ఇళ్ళు, ఆటల మందిరాలు, అతిధిగృహాలు, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కుల్లో ఉండే స్విమ్మింగ్ పూళ్ళలో ఎప్పటికప్పుడు కొత్త నీరు నింపడానికి విద్యుత్తు సదా సిద్ధంగా ఉంటుందని గమనించాల్సి ఉంది. ప్రజల జేబులను ఎలా కొల్లగొట్టాలా అని నిరంతరం పధకాలు రచించే ఫైనాన్స్ కంపెనీల దోపిడీ కార్యాలయాలకు అవసరాన్ని మించి విద్యుత్ అందుతున్న సంగతిని గమనించాలి. వీటన్నింటినీ అడ్డుకుని ప్రతి విద్యుత్ కణాన్ని నిజమైన దేశాభివృద్ధి కోసం సద్వినియోగం చేసినట్లయితే… మానవ జాతి గుండెలపై కుంపట్లుగా ఉన్న ఈ అణు విద్యుత్ ప్లాంటుల అవసరం అసలు రాదని గ్రహించవచ్చు. భారత దేశాన్ని దోచుకు తింటున్న నల్లజాతి దొంగల్ని అడ్డుకున్నట్లయితే, ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి రూపాయినీ నిజమైన భారత దేశ సౌభాగ్యం కోసం వెచ్చించినట్లయితే తుమ్మలపల్లెలో అండర్ గ్రౌండ్‌లో ప్రాణాంతక గనుల్ని నిర్మించవలసిన అవసరం లేదనీ, ఎప్పటిలాగే, ఇతర గ్రామాల్లాగే, తుమ్మలపల్లె కూడా పక్షుల కిలకిలారావాలతో, పెంపుడు జంతువుల కేరింతలతో, పల్లెకు సహజమైన పచ్చదనంతో కలకాలం వెలుగొందవచ్చని అర్ధం అవుతుంది.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s