బ్రిటన్‌ని ఊపేస్తున్న ఫోన్ హ్యాకింగ్ స్కాండల్‌లో ప్రధాని కామెరూన్ సన్నిహితురాలు రెబెక్కా అరెస్టు


Rebekah Brooks

మీడియా రారాజుగా అభివర్ణించబడుతున్న స్టార్ ఛానెళ్ళ అధినేత రూపర్ట్ మర్డోక్‌కి చెందిన “న్యూస్ ఆఫ్ వరల్డ్” పత్రిక విలేఖరులు వివిధ నేరాలలో భాధితులైన వ్యక్తుల ఫోన్లను హ్యాకింగ్ చేసి అందులోని సమాచారాన్ని దొంగిలించి పత్రిక కధనాలకు వినియోగించారన్న ఆరోపణలతో బ్రిటన్ మీడియా ప్రపంచం అట్టుడుకుతోంది. మర్డోక్‌కి కుటుంబ స్నేహితురాలు, ప్రధాని కామెరూన్‌కు మీడియా అడ్వైజర్‌గా కూడా పేరుపొందిన, “న్యూస్ ఇంటర్నేషనల్” పత్రిక ఛీఫ్ ఎడిటర్ రెబెక్కా బ్రూక్స్‌ను పోలీసులు “ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం” తో సంబంధం ఉందన్న అనుమానాలపై అరెస్టు చేశారు. 168 సంవత్సరాలనుండి బ్రిటన్ నుండి వెలువడుతున్న “న్యూస్ ఆఫ్ వరల్డ్” పత్రిక బ్రిటన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పత్రికగా పేరొందింది. న్యూస్ ఆఫ్ వరల్డ్, న్యూస్ ఇంటర్నేషనల్ రెండూ రూపర్డ్ మర్డోక్ కి చెందిన పత్రికలే. ‘న్యూస్ ఆఫ్ వరల్డ్’ టాబ్లాయిడ్ సమాజంలో సెలబ్రిటీ స్ధాయిలొ ఉన్నవారిపై అనేక పుకార్లు, పేపరాజ్జి వార్తలు ప్రచురించి క్రేజ్ ను సంపాదించుకుంది.

అత్యున్నత స్ధాయిని చేరుకునే క్రమంలో సదరు పత్రికా విలేఖరులు వివిధ నేర సంఘటనల్లో బాధితులైన వారి ఫోన్లను హ్యాకింగ్ చేశారని వెల్లడి కావడంతో ‘న్యూస్ ఆఫ్ వరల్డ్’ గురించి తెలిసి ఉన్న ప్రపంచం నిబిడాశ్చర్యంతో నిర్ఘాంతపోయింది. తాము ఆదరిస్తున్న పత్రిక తమలో బాధితులైన వారి ఫోన్లను హ్యాకింగ్ చేసి అందులోని సమాచారాన్ని దొంగిలించి ప్రచురించడం ద్వారా పేరు పొందిందన్న నిజం బ్రిటన్ దేశస్ధులను కలచివేసింది. తీవ్ర విమర్శలు చెలరేగుతుండడంతో రూపర్డ్ మర్డోఖ్ ఆస్ట్రేలియానుండి పరుగెత్తుకెళ్ళి నష్ట నివారణ చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. 168 సంవత్సరాల పత్రికను హ్యాకింగ్ ఆరోపణల వలన మూసేసినట్లు ప్రకటించి, రూపర్ట్ మర్డోక్ పత్రిక కోసం పనిచేస్తున్న రెండొందలమందికి పైగా ఉద్యోగులను వీధిపాలు చేసినా అలజడి చల్లారలేదు. శని, ఆదివారాల్లో రెండు రోజులు వరుసగా పత్రికా ముఖంగా రూపర్ట్ క్షమాపణ కోరినప్పటికీ రెబెక్కా బ్రూక్స్ అరెస్టు కాకుండా ఆపలేకపోయాడు.

ఇంతకీ “న్యూస్ ఆఫ్ వరల్డ్” పత్రిక చేసిన నేరం ఏమిటి? ‘మిల్లీ డౌలర్’ అనే బ్రిటన్ బాలిక పది సంవత్సరాల క్రితం హత్యకు గురైంది. బాలికకు చెందిన మొబైల్ ఫోన్‌ను ‘న్యూస్ ఆఫ్ వరల్డ్’ పత్రిక విలేఖరి హ్యాక్ చేశాడని మూడు వారాల క్రితం వెల్లడి కావడంతో ఆ పత్రిక పతనం ఆరంభమయ్యింది. బాలిక ఫోన్ హ్యాకింగ్ కి గురైన కాలంలో రెబెక్కా బ్రూక్స్ ఆ పత్రికకు ఎడిటర్ గా పనిచేసింది. దానితో ఆమె ప్రోద్బలంతోనే బాలిక్ ఫోన్ హ్యాకింగ్ కి గురైందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రెబెక్కాకు హ్యాకింగ్ తో సంబంధం లేదని రూపర్ట్ మర్డోక్ గట్టిగా వెనకేసుకు వచ్చినప్పటికీ ఆరోపణల వేడి చల్లారలేదు. ప్రతిపక్షాలు రూపర్ట్ మర్డోక్ తోనూ, రెబెక్కాతోనూ ప్రధాని కామెరూన్‌కి గల సన్నిహిత సంబంధాలను ఎత్తి చూపుతూ నిందితులను రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో రెబెక్కాను సైతం అరెస్టు చేయక తప్పలేదు. రెబెక్కా రాజీనామా చేసి మంచి నిర్ణయం తీసుకుందని కామెరూన్ మేకపోతు గాంభీర్యంతో ప్రకటన జారీ చేశాడు.

బాలిక ఫోన్ ఒక్కటే న్యూస్ అఫ్ వరల్డ్ విలేఖరుల హ్యాకింగ్ కి బలికాదన్న సంగతి నెమ్మదిగా వెలుగులోకి రావడం ఆరంభమైంది. అమెరికాలోని జంట టవర్లపై టెర్రరిస్టుల దాడి జరిగిన అనంతరం, ఆ దాడిలో మరణించిన వారి ఫోన్లను కూడా హ్యాకింగ్ చేసారని బైటపడింది. అంతే కాకుండా ఇరాక్, ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధాలలో విగతులైన బ్రిటన్, అమెరికా సైనికుల ఫోన్లను కూడా మర్డోక్ పత్రిక విలేఖరులు హ్యాకింగ్ చేశారని వెల్లడి కావడంతో బ్రిటన్ ప్రజల ఆగ్రహం రెట్టింపయ్యింది. సెప్టెంబర్ 11 దాడుల బాధితుల ఫోన్లను హ్యాకింగ్ చేసిన ఆరోపణలపై అమెరికా ఫెడరల్ నేర పరిశోధనా సంస్ధ ఎఫ్.బి.ఐ కూడా విచారణ చేపట్టింది. బాలిక మిల్లీ డౌలర్ కుటుంబ లాయర్ మార్క్ లూయిస్, రెబెక్కా రాజీనామాను యుగాల కిందే జరగి ఉండాల్సిందని అభివర్ణించాడు. ఆమె ఆధ్వర్యంలోనే మిల్లీ ఫోన్ హ్యాకింగ్ జరిగిందని ఆరోపించాడు. మిల్లీ కుటుంబం ఇన్ని సంవత్సరాలు ఆమె రాజీనామా కొసం వేచి ఉండవలసింది కాదని అన్నాడు.

“న్యూస్ ఆఫ్ వరల్డ్”, “న్యూస్ ఇంటర్నేషల్” పత్రికల యాజమాన్య సంస్ధ న్యూస్ కార్ప్ తో సంబంధం ఉన్న ఆరోపణలపై వివిధ విభాగాల్లో ఉన్నత స్ధానాలో ఉన్న అనేక మంది తలలు, తాజా స్కాండల్ తో రాలిపడిపోతున్నాయి. మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ సర్ పాల్ స్టీఫెన్‌సన్ కూడా కుంభకోణం పర్యవసానంగా రాజీనామా చేశాడు. బ్రిటన్‌లో అత్యంత సీనియర్ పోలీసు అధికారి అయిన స్టీఫెన్, న్యూస్ ఆఫ్ వరల్డ్ ఎక్జిక్యూటివ్ అధికారి నీల్ వాలిస్ ను సలహాదారుగా నియమించుకున్నందుకు గాను ఆయన విమర్శలను ఎదుర్కొంటున్నాడు. నీల్ వాలిస్ తో తనకున్న సంబంధాలు కేసు పరిశోధనను ప్రభావితం చేయవచ్చుననీ అందుకే రాజీనామా చేస్తున్నాననీ ప్రకటించాడు. ఫోన్ హ్యాకింగ్ విస్తృతి తనకు తెలియదని ఆయన చెప్పాడు. కామెరూన్ ప్రభుత్వంలోని అనేకులతోటి న్యూస్ కార్ప్ కు సన్నిహిత సంబంధాలున్న సంగతి వెల్లడవుతోంది. ఈ సంబంధాలను కామెరూన్ సమర్ధించుకోవడంతో ఆయనపై విమర్శలు చెలరేగుతున్నాయి.

ఆదివారం రూపర్ట్ మర్డోక్, హత్యకు గురై అనంతరం ఫోన్ హ్యాకింగ్ కు గురైన బాలిక మిల్లీ డౌలర్ కుటుంబాన్ని కలిసి క్షమాపణ కోరాడు. రెబెక్కా రాజీనామా చేసినప్పటికీ మిల్లీ ఫోన్ హ్యాకింగ్ లో తన పాత్ర ఉందని అంగీకరించడం లేదు. అదంతా విలేఖరుల వ్యవహారమని నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. “గతంలో జరిగినదాని ఫలితం ఇప్పుడు అర్ధం అవుతున్న నేపధ్యంలో నేను ఎంతగానో బాధపడుతున్నాను. సంక్షోభ సమయంలో పత్రికను దాటించడంలో నాయకత్వం వహించడం సరైందని నేనింతవరకు నమ్మాను. కానీ బ్రిడ్జి మీదనే నిలబడి ఉండాలన్న నా కోరిక, స్కాండల్‌కి సంబంధించిన చర్చ నాపై కేంద్రీకృతం కావడానికి దారి తీస్తున్నది. ఇది, గతంలో జరిగిన తప్పులను సవరించడానికి మేము నిజాయితీతో చేస్తున్న ప్రయత్నాలనుండి దృష్టి మరలడానికి దోహదుపడుతున్నందున రాజీనామా చేస్తున్నాను” అని రెబెక్కా ప్రకటనలో పేర్కొంది. 43 ఏళ్ళ రెబెక్కా, 22 సంవత్సరాలనుండి న్యూస్ ఇంటర్నేషనల్ లో పని చేస్తున్నదని బిబిసి తెలిపింది. తాను పనిచేస్తున్న కంపెనీపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుండడంతో రాజీనామా చేయక ఆమెక తప్పింది కాదు. న్యూస్ కార్పొరేషన్‌కి ఇటాలియన్ విభాగం అధిపతిగా ఉన్న టామ్ మాక్‌రిడ్జ్ రెబెక్కా స్ధానంలో నియమించబడ్డాడు.

“న్యూస్ ఆఫ్ ద వరల్డ్” మాజీ ఎడిటర్ ఆండీ కోల్సన్ రాజీనామా చేసిన అనేక వారాల తర్వాత కూడా గత మార్చి నెలలో ప్రధాని కామెరూన్ అధితిగా ఛెకర్స్ గెస్ట్ హౌస్ లో గడిపినట్లుగా ప్రెస్ అసోసియేషన్ తెలిపింది. రూపర్ట్ మర్డోక్‌తో పాటు అతని కుమారుడు జేమ్స్ మర్డోక్ కూడా రానున్న మంగళవారం నాడు కామన్స్ సభలో ఎం.పిల ముందు నిలబడి ఫోన్ హ్యాకింగ్ స్కాండల్ పై వివరణ ఇవ్వనున్నారు. కామన్స్ సభలో ఎం.పిలకు వివరణ ఇవ్వడానికి ప్రారంభంలో రూపర్ట్ మర్డోక్ ససేమిరా అన్నప్పటికీ తీవ్ర ఒత్తిడి రావడంతో అంగీకరించక తప్పలేదు. ప్రధానితో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ప్రధాని సమగ్రతను కాపాడడానికి రూపర్డ్ బ్రిటన్ కామన్స్ లో నిలబడి తన పత్రిక నైతిక వ్యతిరేక కార్యకలాపాలకు సమాధానం ఇవ్వనున్నాడు. రాజకీయ నాయకులకు పత్రికాధిపతులకు ఉన్న సన్నిహిత సంబంధాలు ఎంతటి అరాచకాలకు దారితీస్తుందో బ్రిటన్ ప్రజలు ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు, తెలుసుకుంటున్నారు కూడా.

2006 సం. లో ఇన్ఫర్మేషన్ కమిషన్ పరిశోధన జరిపి ఒక నివేదిక సమర్పించాడు. దాదాపు 305 మంది జాతీయ జర్నలిస్టులు ప్రభుత్వ నేర పరిశోధకుల నుండి అనేక అంశాలపై సమాచారాన్ని పొందారని కమిషన్ అప్పట్లో తన నివేదికలో గుర్తించింది. అప్పట్లోనే పూర్తి విచారణకు ఆదేశించి ఉండాల్సిందని మాజీ కన్సర్వేటివ్ పార్టీ ఛైర్మన్ లార్డ్ ఫౌలర్ వ్యాఖ్యానించాడు. కానీ ప్రభుత్వంలోని అధికారులు, రాజకీయ నాయకులకు పత్రికాధిపతులతోనూ, ప్రముఖ విలేఖరులతోనూ సంబంధాలు నెరుపుతున్న నేపధ్యంలో అటువంటి విచారణకు ఆదేశాలు వెలువడ్డం అసాధ్యమైన విషయం. ఇప్పుడైనా మరణించినవారి ఫోన్లను హ్యాకింగ్ చేశారన్న తీవ్ర ఆరోపణలవల్లనే పరిస్ధితి తీవ్రతను గుర్తించారు తప్ప ప్రస్తుత విచారణలు నిందితులను గుర్తించి శిక్షించే వైపుగా సాగుతాయన్నది అనుమానమే.

2 thoughts on “బ్రిటన్‌ని ఊపేస్తున్న ఫోన్ హ్యాకింగ్ స్కాండల్‌లో ప్రధాని కామెరూన్ సన్నిహితురాలు రెబెక్కా అరెస్టు

  1. హ్యాకింగ్, దాని వలన నష్టాల గురించి కొంచెం వివరిస్తే తెలుసుకుంటాం. మొత్తం మీద ఆర్టికల్ బాగుంది. …పి.ఆర్

  2. సెల్ ఫోన్లు కూడా కంప్యూటర్లు లాంటివే. ఆపరేషన్ పద్ధతిలో తేడాలే తప్ప సెల్ ఫోన్లలో కూడా సావ్ట్ వేర్ ఫ్రోగ్రాంలు ఉంటాయి. ఇతరుల కంప్యూటర్లలోకి గానీ సెల్ ఫోన్ల లోకి గానీ వాటి సొంతదారుల అనుమతి లేకుండా ఇంటర్నెట్ ద్వారా జొరబడడాన్ని హ్యాకింగ్ అంటారు. మామూలుగా వాడే సెల్ ఫోన్లు కాకుండా ఖరీదు గల ఐ ఫోన్ లాంటి ఫోన్లు, లేదా శాంసంగ్, హెచ్.టి.సి లాంటి కంపెనీలు తయారు చేసే అత్యంత ఖరీదు గల ఫోన్లను స్మార్ట్ ఫోన్లు అంటున్నారు. వీటిని ఒక్క ఫోన్‌గానే కాకుండా కంప్యూటర్ లాగే అనేక ఉపయోగాలకు వాడుకోవచ్చు. ఇంటర్నెట్ ని సర్ఫ్ చేయడం దగర్నించి, వార్తలు చదవడం, వీడియో కాలింగ్ చేయడం, బ్యాంకు ఖాతాలు నిర్వహించుకోవడం… అంటే డబ్బులు వేయడం, తీయడం, షాపింగ్ చేయడం, బిల్లుల చెల్లింపులు మొ.వి., వ్యక్తిగత సమాచారాన్ని భద్ర పరుచుకోవడం, సినిమాలు, పాటలు స్టోర్ చేసుకుని కోరుకున్నపుడు వినడం, చూడడం తదితర కార్యక్రమాలన్నీ స్మార్ట్ ఫోన్లలో చేయవచ్చు. వీటి ఖరీదు వాటిలో ఉండే ఫీచర్లను బట్టి 15,000 నుండి 40,000 రూపాయల వరకు ప్రస్తుతం ఉంది.

    ఇటువంటి ఫోన్లను హ్యాకింగ్ చేయడం అంటే ఇతరులు తమ ఇళ్లలో లేనప్పుడు వాళ్ళ ఇళ్ళ తాళాలు, తలుపులు బద్దలు కొట్టి జొరబడడం లాంటిది. యజమాని లేకుండా వారి ఇళ్ళలోకి ఎందుకు జొరబడతారు? దొంగతనానికే గదా! చిన్న దొంగలైతే డబ్బులు, నగలు ఇతర ఖరీదైనవి దొంగిలిస్తారు. తెలిసినవారైతే దస్తావేజుల కోసం, ఇతర డాక్యుమెంట్ల కోసం, లేదా లాకర్ కీల కోసం… జొరబడతారు. కంప్యూటర్లు, ఫోన్లు హ్యాకింగ్ చేసే వారిలో కూడా తేడాలు ఉంటాయి. కొంతమంది తాము కూడా హ్యాకింగ్ చేయగలమో లేదో తెలుసుకోవడానికి చేస్తారు. కొందరు ఫోన్లలో, కంప్యూటర్లలో దాచుకున్న క్రెడిట్ కార్డ్ నెంబర్లకోసం, వ్యక్తిగత వివరాల కోసం జొరబడతారు. క్రెడిట్ కార్డు నంబర్లు ఎందుకు దొంగిలిస్తారో తెలిసిందే. కంప్యూటర్లు, ఫోన్లు వినియోగించి ఇంటర్నెట్‌‌ని సర్ఫింగ్ చేసినపుడు వారు చూసిన వెబ్‌సైట్లు, వారి కార్యకలాపాలు అన్నీ రికార్డు అవుతాయి. అటువంటి వ్యక్తిగత వివరాలతో పాటు వ్యక్తిగత సమాచారానికు ఇంటర్నెట్‌లో చాలా విలువ ఉంటుంది. వాటిని వినియోగించి ఇంటర్నెట్ వాడకందారుల అలవాట్లు, ధోరణులు, ఏయే అంశాలకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు?, తదితర వివరాలన్నీ తెలుసుకుని వాటిని తమ సాఫ్ట్ వేర్ ని అభివృద్ధి చేసుకోవడానికీ, తద్వారా వినియోగదారుల అవసరాలను ఇతర సాఫ్ట్ వేర్ సంస్ధల కంటే శక్తివంతంగా, వేగంగా అందించడానికి ఆయా బిజినెస్ సంస్ధలు ప్రయత్నిస్తాయి. ఇలా వినియోగదారుల అవసరాలను బట్టి సేవలు అందించే సంస్ధలన్నీ హ్యాకీంగ్ కి పాల్పడవు. హ్యాకింగ్ చేసేవారు ఈ వివరాలను దొంగిలించి సాఫ్ట్ వేర్ సంస్ధలకు అమ్మేసుకోవచ్చు.

    ఇదంతా ఒక ఎత్తైతే న్యూస్ ఆఫ్ ది వరల్డ్ విలేఖరుల హ్యాకింగ్ వ్యవహారం మరొక ఎత్తు. జంట టవర్ల దాడుల భాదితుల ఫోన్లను హ్యాకింగ్ చేసి వారి వ్యక్తిగత వివరాలలో కొన్నింటిని సంచలనాత్మకంగా ప్రచురించవచ్చు. ప్రముఖుల సెల్ ఫోన్లు హ్యాకింగ్ చేస్తే వారి వారి రంగాల్లో వారి కార్యకలాపాలకు సంబంధించిన రహస్య వివరాలు సంపాదించి “మాకు నమ్మకమైన సోర్స్ ద్వారా తెలిసింది” అని చెప్పి తమ పత్రికలో ప్రకటించుకోవచ్చు. హత్యకు గురైన బాలిక ఫోన్‌ని హ్యాకింగ్ చేస్తే పోలీసులు తెలుసుకున్న వివరాలకంటే అదనపు వివరాలను తమ పత్రికలో ప్రచురించి పోలీసుల్ని, ప్రజలను ఆశ్చర్యానికి గురిచేయవచ్చు. వార్తా పత్రిక మిగతా పత్రికల కంటే ముందుండడానికీ, సర్క్యులేషన్ పెంచుకోవడానికీ ఇలా హ్యాకింగ్ ద్వారా సంపాదించిన వివరాలను ఉపయోగించారన్నది రూపర్ట్ మర్డోక్ పత్రిక న్యూస్ ఆఫ్ ది వరల్డ్ పై ఆరోపణ. అ విధంగా సమాచారం సేకరించడం, అందునా చనిపోయిన తర్వాత వారి ఫోన్లలోకి జొరబడడం, వారి సమాచారం దొంగిలించడం, అలా దొంగిలించిన సమాచారంతో సంచలనాత్మక, పరిశోధనాత్మక విలేఖరులుగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించడం… ఇవన్నీ నైతిక పతనానికి తీవ్ర పరాకాష్ట. వీరికి ప్రభుత్వంలో పెద్దలో, పోలీసులో సన్నిహితులు గా ఉంటే ఈ కార్యక్రమాలకి వారినుండి మద్దతు ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది. అధికారంతో సంబంధాలని తప్పులు కప్పిపుచ్చుకోవడానికీ, తప్పులు చేసిన దొరక్కపోవడానికీ, దొరికినా వదిలేయడానికే కదా వినియోగించేది! అందువలన ఈ హ్యాకింగ్ పత్రికతో సంబంధం ఉన్న పోలీసులు, రాజకీయ నాయకులపైన కూడా ఈ ప్రభావం పడుతోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s