గుర్రాల వ్యాపారి హసన్ ఆలీ ఖాన్ విదేశీ బ్యాంకులకు తరలించింది రు.3600 కోట్లు -ఇ.డి


Hasan Ali Khanపూనే గుర్రాల వ్యాపారి ‘హసన్ ఆలీ ఖాన్’ 800 మిలియన్ డాలర్ల (రు.3600 కోట్లు) నల్లధనాన్ని విదేశీ బ్యాంకులకు తరలించాడని ఆర్ధిక నేరాల దర్యాప్తు సంస్ధ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, బోంబే హైకోర్టు కు సోమవారం తెలిపింది. అమెరికా, స్విట్జర్లాండ్, సింగపూర్ తదితర దేశాల్లోని బ్యాంకులకు ఈ డబ్బు తరలించినట్లుగా ఇ.డి కోర్టుకు తెలిపింది. ఈ విదేశీ బ్యాంకుల అధికారులతో హసన్ ఆలీ ఖాన్‌కు లోతైన సంబంధాలున్నాయని ఇ.డి తెలిపింది. సెషన్స్ కోర్టు హసన్ ఆలీ ఖాన్ కు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించడంతో హైకోర్టుకి ఆలీ అప్పీలు చేసుకున్నాడు. జస్టిస్ ఎ.ఎం.ధిప్సే ఆలీ ఖాన్ బెయిల్ పిటిషన్‌ని విచారిస్తున్నాడు.

విదేశీ బ్యాంకుల్లో భారత రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారులు అక్రమంగా దాచిన నల్లడబ్బుని దేశానికి రప్పించాలని సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన నేపధ్యంలో, కేంద్ర ప్రభుత్వం, నల్ల డబ్బు నిందితులపై కేసులు పెట్టి విచారిస్తున్నామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతున్న ఏకైక కేసు ఈ హసన్ ఆలీ ఖాన్ కేసు. హసన్ ఆలీ ఖాన్ కేసు తప్ప, విదేశాల్లో దాచిన నల్ల డబ్బును తిరిగి దేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏమీ లేవు. కనీసం విచారణ జరుగుతోంది అని చెప్పుకోవడానికి కూడా ఒక్కటంటే ఒక్క కేసైనా ఎవరిపైనా నమోదు చేయలేదు. హసన్ ఆలీ ఖాన్ అయినా పొరపాటున దొరికిన కేసే తప్ప ప్రభుత్వం ప్రయత్నించి, దర్యాప్తు చేసి దాఖలు చేసిన కేసు కాదు.

కేంద్ర ప్రభుత్వం నిష్క్రియా పరత్వంతో విసిగిపోయిన సుప్రీం కోర్టు చివరికి నాలుగు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా అభిశంసిస్తూ ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీని పక్కన బెట్టి తాను ప్రత్యేకంగా “స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీం” ను ఒకదానిని ఏర్పాటు చేసింది. దానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.పి.జీవన్ రెడ్డిని ఛైర్మన్‌గా నియమించింది. దీనితో కేంద్ర ప్రభుత్వం నిర్ఘాంతపోయింది. పునాదులు కదులుతున్న చప్పుళ్ళు దానికి అప్పుడే వినిపించడం ప్రారంభమయ్యింది. దొరకనందునే వీరంతా దొరలుగా చెలామణి అవుతున్నారు తప్ప, సరిగ్గా విచారిస్తే ఈ దొంగల ముఠా అంతా బైటపడక తప్పదు. ఒక్క పాలక కూటమి మాత్రమే కాదు. ప్రతిపక్షాలుగా ఉన్న ప్రతి పార్టీ ఇందులో భాగస్వామిగానే చెప్పుకోవచ్చు.

సుప్రీం కోర్టు నియమించిన “సిట్” ను పనిచేయనిస్తే అమ్మగారు, అయ్యగారు తో మొదలుకుని, యువరాజావారి మీదుగా కింది స్ధాయి వానర సేవకుల దాకా గొలుసు కట్టు ముఠాలన్నీ బైటకపడక మానదు. అందుకే కేంద్ర ప్రభుత్వ పెద్దలు కంగారు పడుతున్నారు. సుప్రీం కోర్టు మరీ అతి చేస్తోందనీ, ప్రభుత్వ విధుల్లోకి, కార్యనిర్వాహక వర్గ బృందం విధుల్లోకి చొచ్చుకొస్తోందనీ, ఇలా అయితే వారి విధులను వారు నిర్వర్తించడం కష్టమై పోతుందనీ కేంద్ర ప్రభుత్వం గత శనివారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అందులో సిగ్గులేకుండా, దారుణంగా వాదనలు చేసింది. నల్లడబ్బు వెనక్కి తెప్పించడానికి సిట్ ని వేస్తే, కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక విధానాలలో కోర్టులు జోక్యం చేసుకోజాలవు అని వాదించింది. ఇదెక్కడి గొడవ? ఈ లెక్కన నల్ల డబ్బుని వెనక్కి రప్పించకపోవడం, వాయిదా వెయ్యడం, విచారిస్తున్నట్లు నాటకాలాడ్డం, సంవత్సరాల తరబడి ఫైళ్ళమీద కూర్చోవడం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక విధానాలుగా ప్రభుత్వం భారత ప్రజలకు చెప్పదలుచుకున్నదా?

‘సిట్’ నియామకం వలన “అధికారాల విభజన” అనే రాజ్యాంగంలోని సిద్ధాంతానికి ఆర్ధం లేకుండా పోతుందని ప్రభుత్వం తన రివ్యూ పిటిషన్ లో వాదించింది. రాజ్యాంగం కోర్టులకు, కార్యనిర్వాహక వర్గానికి (బ్యూరోక్రసీ), ప్రజా ప్రతినిధులకీ వేరు వేరుగా అధికారాలు అప్పజెప్పిందనీ, వీరు ఒకరి అధికారాల్లోకి ఒకరు జోక్యం చేసుకోరాదని రాజ్యాంగం చెప్పిందనీ దాన్ని ఉల్లంఘించి కోర్టులు కార్యనిర్వాహక వర్గం, ప్రభుత్వం విధుల్లోకి జోక్యం చేసుకుంటున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. నిజమే ఇతర అంగాల అధికారాల్లోకి ఇంకొకరు జోక్యం చేసుకుంటున్నది అక్షరాలా నిజం. అయితే జోక్యం చేసుకుంటున్నది కోర్టులు కాదు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికోబడిన రాజకీయ అధికారులే రాజ్యంలోని ఇతర అంగాలను గుప్పిట్లో పెట్టుకుని తమ ఇచ్ఛానుసారం నడిపిస్తున్నారు. సి.బి.ఐ అనేది అత్యున్నత నేర పరిశోధనా సంస్ధ. ఆ సంస్ధను ఎన్నడైనా ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు ఎన్నడైనా సక్రమంగా పనిచేయనిచ్చారా? ఎన్.డి.ఏ అధికారంలో ఉన్నప్పుడు కూడా సి.బి.ఐని పని చేయనివ్వలేదు కదా!

సి.వి.సి అవినీతి నిర్మూలనా వ్యవస్ధ. సి.వి.సి విధుల్లో జోక్యం చేసుకోలేదు అని ఏ ప్రభుత్వమైనా నిజాయితీగా చెప్పగలదా? సి.ఎ.జి అన్నది రాజ్యాంగ బద్ధ అధికారాలు కలిగిన అత్యున్నత ఆడిటింగ్ సంస్ధ. కాగ్ పరిశీలనలను ఏ ప్రభుత్వమైనా ఏ ఒక్క అంశంలో నైనా సీరియస్ గా పట్టించుకున్నదా? కాగ్ నివేదిక అనుసరించి ఒక్క చర్యనైనా తీసుకున్నారా? ఏమీ తీసుకోక పోగా, సుప్రీం కోర్టు పొరబాటున తన విధుల్ని గుర్తించి నల్ల డబ్బుని వెనక్కి రప్పించాలని, ఆరుబైట నిలవ ఉంచుతున్న ధాన్యం చెడిపోతున్నది కాబట్టి పేదలకు ఉచితంగా పంచాలనీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తే ఇంత ఎత్తున అరిచి గీపెట్టి, ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ హడావుడి చేయడంలో అర్ధం ఉన్నదా? అర్ధం ఉంది. ఉన్న అర్ధమల్లా, సుప్రీం కోర్టు చర్యలవలన తమ దొంగతనం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ బైట పడకూడదన్నదే వారి చర్యలకున్న ఏకైక అర్ధం.

గుర్రాల వ్యాపారి విదేశీ ఖాతాల విషయంలో సమాచారం ఇవ్వాలంటూ లెటర్ రెగోటరీలను ఆయా దేశాలకు పంపామనీ ఒక్క అమెరికా తప్ప మరేదేశమూ స్పందించలేదనీ ఇ.డి కోర్టుకు చెప్పింది. అమెరికా కూడా స్విట్జర్లాండ్ లోని బ్యాంక్ సరాసిన్ అనే బ్యాంకు నుండి అమెరికా లోని న్యూయార్క్ లో హసన్ ఆలీ ఖాన్ నిర్వహించే ఖాతాలోకి కేవలం 7 లక్షల డాలర్లు (రు.3.15 కోట్లు) మాత్రమే ట్రాన్స్‌ఫర్ అయ్యాయని అమెరికా రిప్లై రాసింది. కొండను తవ్వి ఎలకని పట్టడం అంటే ఇదే కాబోలు! స్విట్జర్లాండ్, సింగపూర్ తదితర దేశాలనుండి స్పందన రాలేదట. వస్తుందో లేదో అనుమానమే. అమెరికా ఆ మధ్య స్విస్ బ్యాంకుల్లొ అమెరికన్ల దొంగ ఖాతాలపైన కొంత సీరియస్ అయ్యింది. ఆ వేడిలో ఈ కాస్త వివరాల్నయినా పంపింది. లేకుంటే పరిస్ధితి ఇలా ఉండకపోను.

హసన్ ఆలీ ఖాన్‌కి అంతర్జాతీయ ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గీ తో సంబంధాలు ఉన్నాయని కూడా ఇ.డి కోర్టుకు చెప్పింది. 2003లో ఆయుధాల అమ్మకం ద్వారా వచ్చిన 300 మిలియన్ డాలర్లు ఖాన్ ఖాతాలోకి జమ అయ్యాయని ఇ.డి ఆరోపించింది. ఇది ఆరోపణే తప్ప రుజువులు లేవు. నిర్ధారించిన దేశమేదీ లేదు. భవిష్యత్తులో రుజువు చేస్తారేమో చూడవలసి ఉంది. భారత దేశ భద్రతకు, రక్షణకూ నష్టం కలిగించే నేరాలకు పాల్పడే కుట్రలు జరిగాయని ఇ.డి వాదించింది. ఇవన్నీ రుజువు అయితేనే నేరాలు. రుజువు చేసే వైపుగా దర్యాప్తు సంస్ధల ప్రయత్నాలు కొనసాగుతాయా అన్నదే ప్రశ్న.

One thought on “గుర్రాల వ్యాపారి హసన్ ఆలీ ఖాన్ విదేశీ బ్యాంకులకు తరలించింది రు.3600 కోట్లు -ఇ.డి

  1. సుప్రీం కోర్టు నియమించిన “సిట్” ను పనిచేయనిస్తే అమ్మగారు, అయ్యగారు తో మొదలుకుని, యువరాజావారి మీదుగా కింది స్ధాయి వానర సేవకుల దాకా గొలుసు కట్టు ముఠాలన్నీ బైటకపడక మానదు. అందుకే కేంద్ర ప్రభుత్వ పెద్దలు కంగారు పడుతున్నారు.

    Excellent point. Keep up the good work.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s