ఆఫ్ఘన్‌లో కొనసాగుతున్న ‘నాటో’ నరమేధం, పౌర నష్టంపై పచ్చి అబద్ధాలు, బుకాయింపులు


ఆఫ్ఘనిస్ధాన్‌లో అర్ధ రాత్రుళ్ళు గ్రామాలపై దాడి చేసి పౌరుల ఇళ్ళపై కాల్పులు జరిపి వారిని కాల్చి చంపడం కొనసాగుతోంది. టెర్రరిస్టు గ్రూపుల సమావేశం జరుగుతోందని చెప్పడం, పౌరుల ఇళ్ళపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడం, పౌరులను కాల్చి చంపి చనిపోయినవారు టెర్రరిస్టులను బుకాయించడం నాటో దళాలకు ముఖ్యంగా అమెరికా సైన్యానికి నిత్యకృత్యంగా మారింది. ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణను ప్రతి ఒక్క ఆఫ్ఘన్ దేశీయుడూ వ్యతిరేకిస్తున్నాడనీ, తమ దేశం నుండి అమెరికా సైనికులు తక్షణమే వెళ్ళిపోవాలని ప్రతీ ఆఫ్ఘన్ జాతీయుడు డిమాండ్ చేస్తున్నాడని దానితో అమెరికాకి సాధారణ పౌరులు కూడా మిలిటెంట్ లాగానో, ఉగ్రవాది లాగానో, హాఖాని గ్రూపు సభ్యుడు లాగానో లేక తాలిబాన్ గ్రూపు సభ్యుడుగానో కనిపిస్తున్నారనీ అమెరికాకి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు జేమ్స్ పెట్రాస్ చేసిన విశ్లేషణ ఈ సందర్భంగా మననం చేసుకోవచ్చు.

గత సంవత్సరం మొదటి అర్ధభాగం పోలిస్తే, ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో ఆఫ్ఘనిస్ధాన్ పౌరుల మరణాలు 15 శాతం పెరిగాయని గురు వారం ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటనలో తెలిపింది. 2010 మొదటి అర్ధభాగంలో  1271 మంది పౌరులు చనిపోగా, 2011 మొదటి ఆరునెలల్లో 1462 మంది ఆఫ్ఘన్ పౌరులు చనిపోయారని సమితి తెలిపింది. ఆఫ్ఘనిస్ధాన్ దక్షిణ ప్రాంతంలోనూ, ఆగ్నేయ ప్రాంతంలోనూ యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ పౌరుల చావులు కూడా పెరుగుతున్నాయని సమితి తెలిపింది. ఐక్యరాజ్య సమితి ఈ మరణాలకు తీవ్రవాదులు ఉంచుతున్న రోడ్డు పక్క బాంబులే ప్రధాన కారణమని చెబుతున్నప్పటికీ ఆ మాటల్లో నిజం ఏమిటన్నదీ బహిరంగ రహస్యం. ఎక్కడినుండో వచ్చి ఆఫ్ఘనిస్ధాన్ దేశాన్ని ఆక్రమించిన నాటో సైన్యాన్ని వదిలిపెట్టి పరదేశ ఆక్రమణపై పోరాడుతున్నవారిని ప్రాణనష్టానికి బాధ్యులుగా పేర్కొనడం అమెరికా కనుసన్నల్లో నడిచే ఐక్యరాజ్యసమితికే చెల్లుతుంది.

వివిధ స్వచ్ఛంధ సంస్ధలు, అధ్యయన సంస్ధలు, రాజకీయ, యుద్ధ విశ్లేషకులు జరుపుతున్న అనేక విశ్లేషణలు, నివేదికలు ఆఫ్ఘన్ పౌరుల మరణాలకు ప్రధాన కారణం మిత్రదేశాల సైన్యమేననీ, వారు విచక్షణా రహితంగా ప్రతి ఒక్కరినీ ఉగ్రవాదుల పేరుతో కాల్చి చంపుతున్నారని అనేక సార్లు నివేదికలు వెలువరించారు. స్వయంగా అమెరికా నియమించుకున్న హమీద్ కర్జాయ్ నేతృత్వంలోని కీలు బొమ్మ ప్రభుత్వం కూడా అనేకసార్లు పౌరుల మరణం పట్ల అమెరికాకి నిరసన తెలిపింది. పౌరులు చనిపోయినట్లయితే అమెరికా దుకాణం మూసివేసుకోవచ్చని కూడా హమీద్ కర్జాయ్ ఇటీవల హెచ్చరించాడంటే కీలు బొమ్మ అధ్యక్షుడికి కూడా ఖండించక తప్పని మారణహోమానికి అమెరికా పాల్పడుతున్నదని అర్ధం చేసుకోవచ్చు.

ఈ రోజు గురువారం జరిగిన ఒక ఘటన అమెరికా చెప్పే పచ్చి అబద్ధాలకూ, బుకాయింపులకు ప్రబల తార్కాణంగా నిలుస్తుంది. తూర్పు పాకిస్ధాన్‌లోని ఖోస్త్ రాష్ట్రంలో నాటో దళాలు అర్ధ రాత్రి ఇళ్ళపై కాల్పులు జరిపి ఆరుగురు పౌరులను చంపేశాయనీ అందుకు నిరసనగా దాదాపు 1000 మంది ఆఫ్ఘన్ పౌరులు వీధుల్లోకి వెల్లువెత్తి అమెరికా బలగాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారని ఆ రాష్ట్ర ప్రభుత్వాధికారులు తెలిపారు. నాటో కూటమి మాత్రం ఆఫ్ఘనిస్ధాన్ ప్రభుత్వ సైన్యంతో కలిసి నిర్వహించిన ఉమ్మడి ఆపరేషన్‌లో హఖాని నెట్‌వర్క్‌కి చెందిన ఆరుగురు ఫైటర్లు చనిపోయారనీ ఒక పౌరుడు గాయపడ్డారనీ బుకాయించింది. అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ నాటో సైన్యానికి చెందిన కెప్టెన్ జుస్టిన్ బ్రాక్‌హాఫ్ “మేము పౌరులను చంపామని నాకు ఎటువంటి సూచనలు అందలేదు” అని నిస్సిగ్గుగా చెప్పాడు.

కాని నాటో బలగాల అఘాయిత్యంపై ఆగ్రహం చెందిన స్ధానిక ప్రజలు రాష్ట్ర రాజధానికి వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టారు. “అమెరికాకి చావు మూడింది! (ఆఫ్ఘన్) ప్రభుత్వానికి చావు మూడింది!!” అంటూ వీధుల్లో పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఊరేగింపులో నడిచిన కొందరు నాటో దాడిలో చనిపోయినవారి శవాలను మోస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. నాటో దళాలు చంపేసిన పౌరుల శవాలను బహిరంగంగా ఊరేగింపులో ప్రదర్శించినప్పటికీ నాటో అధికారులు తాము చంపింది హఖాని గ్రూపు ఫైటర్లే అని బుకాయిస్తున్నారు. రాష్ట్ర రాజధాని ఖోస్త్ కు 7 కి.మీ దూరంలో ఉన్న మాతూన్ అనే ప్రాంతంలోని “తూరా వోరై” గ్రామంలో నాటో బలగాలు దాడులు చేసిన ఘటన చోటు చేసుకుంది.

ఖోస్త్ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రకటించింది. “గత రాత్రి మిత్రపక్షాలు గ్రామంలో ఆపరేషన్ నిర్వహించాయి. దురదృష్టవశాత్తూ గ్రామంలో హఖానీ గ్రూపు కమాండర్లు సమావేశం అయ్యారన్న తప్పుడు నివేదిక ఆధారంగా వారు దాడి జరిపారు. ఈ ఆపరేషన్లో ఆరుగురు పౌరులు చనిపోయారు” అని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రతినిధి ముబారెజ్ జద్రాన్ తెలిపాడని ‘ది హిందూ’ పత్రిక వెల్లడించింది. “అర్ధరాత్రి సమయంలో అంతర్జాతీయ సేనలు గ్రామంలోకి దూసుకొచ్చి ఇళ్ళ కిటికీల్లోంచి కాల్పుల వర్షం కురిపించాయి. ఈ కాల్పుల్లో చనిపోయినవారికి పోరాటకారులతో ఎటువంటి సంబంధమూ లేదు,” అని ఖోస్త్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గుల్ మహమ్మద్ జాజి పత్రికలకు తెలిపాదు.

ఖోస్త్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధీ, రాష్ట్ర ప్రభుత్వంలోని సభ్యుడూ ఇలా చెబుతుండగా నాటో బలగాల కెప్టెన్ బ్రాక్‌హాఫ్ కధనం పూర్తిగా నమ్మశక్యం కాని కట్టుకధలతో కూడి ఉంది. “ఆ ప్రాంతంలోని ఒక కాంపౌండ్ ను భద్రతా బలగాలు ఖాళీ చేస్తుండగా, అనేకమంది తిరుగుబాటుదారులు ఎ.కె-47 తుపాకులు, పిస్టళ్ళు ధరించి నాటో బలగాలపై కాల్పులు ప్రారంభించారు. ఈ ఘర్షణలో పిస్టల్ ధరించి నాటో సైనికులపై కాల్పులు జరిపిన ఒక స్త్రీ చనిపోయింది,” అని ఏమాత్రం జంకూ, గొంకూ లేకుండా చెప్పుకొచ్చాడు. “నాటో బలగాలూ, ఆఫ్ఘన్ ప్రభుత్వ బలగాలూ ఉమ్మడిగా హఖాని గ్రూపుకి చెందిన ఒక నాయకుడి కోసం వేటాడుతున్నాయి. అతడు ఈ ప్రాంతంలో దాడులకూ, ఆయుధాల రవాణాకు బాధ్యుడు” అని కెప్టెన్ బ్రాక్‌హాఫ్ తెలిపాడు. ఘర్షణల సందర్భంగా గాయపడిన ఒక మహిళా పౌరురాలి నాటో సైనికులు ఫస్ట్ ఎయిడ్ అందించి, ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందేందుకు చర్యలు తీసుకున్నామంటూ బ్రాక్ హాఫ్ నాటో సైన్యాలు ఎంతో దయగలవని చెప్పడానికి ప్రయత్నించాడు.

నాటో బలగాల దాడిలో చనిపోయిన వారి ఇళ్ల సమీపంలో నివసిస్తున్న ‘తూరా వోరై’ గ్రామస్ధుడు అసిఫ్ ఖాన్ చనిపోయినవారంతా పౌరులేనని చెప్పాడని ఎ.పి. వార్తా సంస్ధను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. స్ధానిక పాఠశాలల ప్రతినిధి సయ్యద్ మూసా మజ్రో చనిపోయినవారిలో ఒక ఉపాధ్యాయుడూ, ఇద్దరు విద్యార్ధులూ ఉన్నారని తెలిపాడు. ఉపాధ్యాయులనూ, విద్యార్ధులనూ, ఒక మహిళను కూడా చంపడమే కాకుండా వారంతా టెర్రరిస్టు గ్రూపుకి చెందినవారనీ, తాము చంపిన ఒక మహిళ పిస్టల్ ధరించి కాల్పులు జరిపిందని చెప్పడానికి కూడా తెగించిన నాటో బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ లో ప్రజాస్వామ్యం స్ధాపించడానికే అక్కడ ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు బూటకపు మాటలు చెప్పడం సిగ్గు చేటు!

ఇదిలా ఉండగా సొంత బాడీ గార్డు కాల్పుల్లో మరణించిన హమీద్ కర్జాయ్ సోదరుడు అహ్మద్ కర్జాయ్ అంతిమ సంస్కారాల సందర్భంగా ఒక మానవ బాంబు పేలడంతొ కాందహార్ రాష్ట్ర ముస్లిం పూజారుల అధిపతి హెక్మతుల్లా హెక్మత్ తో పాటు నలుగురు చనిపోయారని 15 మంది గాయపడ్డారనీ ఎ.పి. వార్తా సంస్ధ తెలిపింది. కాందహార్ రాష్ట్రానికి చెందిన ఇతర ఉన్నతాధికారులంతా క్షేమమేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపాడు. అహ్మద్ వలి కర్జాయ్ స్మృతి కోసం స్ధానిక మసీదులో ప్రార్ధనలు నిర్వహిస్తుండగా మానవ బాంబు పేలిందని తెలుస్తోంది. వలీ కర్జాయ్ మరణంతో కాందహార్ రాష్ట్రంలోని శక్తివంతమైన అనుచర యుద్ధ ప్రభువును అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కోల్పోయినట్లయింది. వలీ కర్జాయ్ హత్య అమెరికా దురాక్రమణ పధకాలకు కూడా నష్టకరమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s