అమెరికా అప్పు రేటింగ్ తగ్గించడానికి సిద్ధంగా ఉన్న రేటింగ్ సంస్ధలు


ప్రపంచంలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధను కలిగి ఉన్న అమెరికా సావరిన్ అప్పు రేటింగ్‌ను తగ్గించడానికి ప్రపంచంలోని టాప్ రేటింగ్ సంస్ధలు మూడూ సిద్ధంగా ఉన్నాయి. స్టాండర్డ్ & పూర్స్ (ఎస్ & పి), ఫిచ్, మూడీస్ లు ప్రపంచ రేటింగ్ సంస్ధల్లో మొదటి మూడు సంస్ధలుగా పేరు పొందిన రేటింగ్ సంస్ధలు. ఇవి ఆయా దేశాల సావరిన్ అప్పు బాండ్లకు రేటింగ్ లు ఇస్తాయి. ఇంకా వివిధ ద్రవ్య సంస్ధలు, బ్యాంకులు, ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులు తదితర అనేక వాణిజ్య, వ్యాపార సంస్ధలకు ఇవి రేటింగ్ ఇస్తాయి. ఈ రేటింగ్ ని బట్టి ఆయా సంస్ధలలో గానీ, ఆయా దేశాల అప్పు బాండ్లలో గానీ పెట్టుబడుల పెట్టవచ్చా, లేదా అని మదుపుదారులు లేదా పెట్టుబడిదారులు ఒక నిర్ణయానికి వస్తారు. వారొక నిర్ణయానికి రావడానికి ఈ మూడు రేటింగ్ సంస్ధలు ఇచ్చే రేటింగ్ ని పరిగణనలోకి తీసుకుంటాయి. కనుక ఇవి ఇచ్చే రేటింగ్ కి అధిక ప్రాధాన్యత ఉంటుంది.

(మూడేళ్ళ క్రితం సంభవించిన ప్రపంచ ఆర్దిక సంక్షోభంలో ఈ రేటింగ్ సంస్ధల పాత్ర కూడా గణనీయంగానే ఉంది. ఇవి వెనకా ముందూ చూడకుండా వివిధ బ్యాంకులు ఇచ్చిన ఇళ్ళ అప్పుల ఆధారంగా రూపొందించిన వివిధ సెక్యూరిటీలకు టాప్ రేటింగ్ ఇవ్వడంతో వాటిలో అనేక మండి పెట్టుబడుదారులు, బ్యాంకులు, కంపెనీలు, దేశాల ప్రభుత్వాలు కూడా పెట్టుబడులు పెట్టాయి. కాని ఇళ్ల అప్పుల్లో చాలా వరకూ సబ్-ప్రైమ్ అప్పులు అని తేలడంతో ఆ అప్పుల కింద చెల్లింపులు లేక ఆర్ధిక సంక్షోభానికి తక్షణ కారణంగా పని చేశాయి. ఆ అప్పుల్లో పెట్టుబడులు పెట్టిన వారు అసలు, వడ్డీలు ఏవీ రాక నష్టపోయారు. అది వేరే కధ.)

ఇపుడు ఆ మూడు రేటింగ్ సంస్ధలు అమెరికా సావరిన్ అప్పు రేటింగ్ ను తగ్గిస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటివరకూ ప్రపంచంలో కెల్లా అత్యధిక రేటింగ్ ఉన్నది అమెరికా ‘ట్రెజరీ బాండ్లు’ లేక ‘సావరిన్ అప్పు బాండ్లు’ లేదా సింపుల్ గా ‘ట్రెజరీస్.’ అప్పు బాండ్లు అంటే ఏమిటి? దాదాపు అన్ని దేశాల ప్రభుత్వాలూ అప్పులు కావాలంటే మార్కెట్ నుండి సేకరిస్తాయి. అప్పులు సేకరించడానికి ప్రభుత్వాలు బాండ్లు జారీ చేస్తాయి. ఆ బాండ్లు కొన్నవారు ఏ దేశం అమ్మిన ట్రెజరీ బాండు కొన్నారో ఆ దేశానికి అప్పు ఇచ్చినట్లు అర్ధం. ఈ విధంగా ప్రభుత్వాలు జారీ చేసే బాండ్లకు మిగతా ఏ బాండ్లతో పోల్చినా ఎక్కువ నమ్మకం కలిగి ఉంటాయి. నమ్మకం అంటే మనం ఇచ్చిన అప్పు తిరిగి వడ్డీతో సహా తిరిగి వస్తుందన్న నమ్మకం అన్న మాట. ప్రభుత్వాలకు వివిధ ఆదాయ వనరులు ఉంటాయి కనుక ప్రభుత్వాలు జారీ చేసే బాండ్లకు కొనుగోలు దారులు వెంటనే లభిస్తారు.

ప్రభుత్వాలు జారి చేసే బాండ్లు గనక వాటిని “సావరిన్” అప్పు బాండ్లు అంటారు. సావరిన్ అప్పు బాండ్లను వేలం వేస్తారు. వేలంలో పలికిన తక్కువ వడ్దీకి ఆ బాండ్లను జారీ చేస్తారు. ఇలా వివిధ దేశాలు జారీ చేసే సావరిన్ బాండ్లన్నింటిలో అమెరికా జారి చేసే సావరిన్ అప్పు బాండ్లు లేదా ట్రెజరీ బాండ్లు లేదా ట్రెజరీస్ కు అత్యధిక రేటింగ్ ఇప్పటివరకూ ఉంది. అమెరికా కరెన్సీ డాలర్ ప్రపంచ కరెన్సీగా ఉండడం వలనా, అమెరికా ఇప్పటివరకూ శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్ధగా వెలుగొందడం వలనా అమెరికా బాండ్లకు అంత విలువ ఇప్పటివరకూ ఉంటూ వచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడులకు తక్కువ వడ్డీ వస్తుందనుకుంటేనో, లేదా పరిస్ధితి అంతగా బాగా లేదనుకుంటేనో ఆయా పెట్టుబడుదారులంతా అమెరికా ట్రెజరీల్లో పెట్టుబడులుగా పెట్టి ఇక ఫర్వాలేదు అని భావిస్తూ హాయిగా నిద్రపోతారు. అమెరికా సావరిన్ అప్పు బాండ్లకు ఇప్పటివరకూ అంత పేరుంది.

కానీ మూడేళ్ళ క్రితం సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం లేదా “ది గ్రేట్ రిసెషన్” తర్వాత పరిస్ధితి మారుతూ వచ్చింది. అమెరికా బహుళజాతి కంపెనీలు, వాల్ స్ట్రీట్ లోని బడా బడా ఇన్‌వెస్ట్‌బ్యాంకులు కోలుకుని లాభాలు సంపాదిస్తుండగా అమెరికా అర్ధీక వ్యవస్ధ మాత్రం ఇంకా కుంటుతూనే ఉంది. అక్కడ నిరుద్యోగం తీవ్ర స్ధాయిలో కొనసాగుతుండడం దానికి ప్రధాన కారణం. అమెరికా ప్రభుత్వం నుండి అమెరికా పన్ను చెల్లింపు దారులు చెల్లించిన డబ్బుని బెయిలౌట్లుగా పొందిన అమెరికా బహుళజాతి కంపెనీలూ, వాల్ స్ట్రీట్ కంపెనీలు సంక్షోభంలో తాము తొలగించిన ఉద్యోగాలను మళ్ళీ ఇంతవరకూ ఇవ్వలేదు. దానితో అమెరికా ప్రభుత్వానికి వసూళ్ళు తగ్గిపోయి, పన్నులు తగ్గిపోయి, ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి క్షీణించి పోయింది. క్షీణత కొనసాగుతున్నదే కాని కోలుకోవడం ఎప్పుడు సాధ్యమో అర్ధం కాని పరిస్ధితి.

దానితో పాటుగా అమెరికా అప్పు పరిమితిని చేరుకుంది. మళ్ళీ మార్కెట్ నుండి అప్పు సేకరించాలంటె అమెరికా కాంగ్రెస్, సెనేట్ ల అనుమతి తీసుకోవాలి. కాని కాంగ్రెస్ రిపబ్లికన్ల చేతుల్లో ఉంది. వారు అమెరికా ప్రజలపైన ఇబ్బడి ముబ్బడిగా పన్నులు మోపుతూ, ధనికులు, కంపెనీలు, బ్యాంకులు మొదలైన వాటికి పన్నులు తగ్గిస్తూ, ఉద్యోగులకూ, కార్మికులకూ ఉన్న సదుపాయాలను రద్ధు చేస్తూ “పొదుపు బిల్లు” అని ఒక బిల్లుని తయారు చేసి దాన్ని ఆమోదిస్తేనే అప్పు పరిమితిని పెంచడానికి అనుమతిస్తాము అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఒబామా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ప్రజలపై పన్నులు వేస్తే గెలుస్తానో లేదో నని భయపడుతున్నాడు. కాంగ్రెసేమో పొదుపు బిల్లు ఆమోదించాలనీ, ఒబామా యేమో అప్పు పరిమితి పెంచాలనీ పట్టుబట్టి ఉండటంతో పీటముడి పడి ఎంతకీ విడివడడం లేదు.

అమెరికా బడ్జెట్ లోటు (దీన్నే ఫిస్కల్ డెఫిసిట్ అనీ అంటారు) ఒకటంపావు ట్రిలియన్లు దాటింది కనుక అమెరికా ప్రభుత్వం ఇక ప్రజలకు ఇస్తున్న సామాజిక భద్రతా పధకాలకు (నిరుద్యోగ భృతి, పెన్షన్, బోనస్ మొ.వి) చరమగీతం పాడడమో లేక కోత పెట్టడమో చేయాలని కాంగ్రెస్ కోరుతోంది. దానికి అనుగుణంగా పొదుపు బిల్లు తయారు చేసి ఆమోదానికి పెట్టింది. కాంగ్రెస్ లో రిపబ్లికన్లు ఆమోదించినా, సేనేట్ లో డెమొక్రట్లదే మెజారిటీ కనుక ఇరు పక్షాలు దాదాపు రెండు నెలలనుండీ ఒక ఒప్పందానికి రావడానికి చర్చల ద్వారా ప్రయత్నిస్తున్నాయి. కానీ ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉండడంతో ఆ ప్రయత్నాలు ఒక్క అంగుళం కూడా ముందుకు సాగడం లేదు.

ఈ నేపధ్యంలోనే రేటింగ్ సంస్ధలు తొందర పెడుతున్నాయి. రేటింగ్ సంస్ధల ద్వారా ఒత్తిడి చేయడం ద్వారా ఎదుటి పక్షాన్ని లొంగ దీసుకోవాలన్న ప్రయత్నాలు కూడా అంతర్గతంగా సాగుతూ ఉండడానికి అవకాశం ఉంది. రేటింగ్ సంస్ధలను మేనేజ్ చేసుకోవడం ద్వారా ఆ అవకాశాలు ఉండొచ్చు. కానీ రేటింగ్ సంస్ధల హెచ్చరికలవలన మార్కెట్ లో ఒక విధమైన ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అమెరికా అప్పులో ఇప్పటికే పెట్టుబడి ఉన్నవారికి తమ అప్పు ఏమవుతుందో అన్న అందోళన మొదలవుతుంది. అత్యధిక రేటింగ్ ఉన్న అమెరికా అప్పు రేటింగే తగ్గితే మరోసారి ప్రపంచ స్ధాయి సంక్షోభం వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎవరికి వారి తమ తమ పెట్టుబడుల్ని కాపాడుకోవడానికి ఎవరికీ అప్పులివ్వకుండా బిగదీసుకుంటే సాధారణ అప్పు సంక్షోభం ఏర్పడుతుంది. దాన్నే “క్రెడిట్ క్రంచ్” అంటారు. అంటె ఉత్పత్తి సంస్ధలకీ, మదుపుదారులకీ ఎక్కడా అప్పులనేవీ దొరకవు. దానితో ఉత్పత్తి కార్యకలాపాలకి ఆటంకాలు ఏర్పడి ఆర్ధిక కార్యకలాపాలు ఆగిపోతాయి లేదా చాలా నెమ్మదిగా సాగుతాయి. ఫలితంగా ఆర్ధిక వృద్ధి క్షీణించి దేశాలన్నీ మళ్ళీ మాంద్యంలోకి వెళ్ళి పోతాయి. అది చివరికి గ్రేట్ డిప్రెషన్ కి కూడా దారి తీయవచ్చు.

కానీ ఈ పరిస్ధితుల్లో రేటింగ్ సంస్ధలు చెప్పేది ఏది నిజమో ఏది మేనేజ్ చేయబడిందో ఒక పట్టాన అర్ధం కాదు. అలాగని నమ్మకుండా ఉండలేరు. అంతిమంగా రేటింగ్ సంస్ధలు చెప్పేది చెల్లుబాటు కాక తప్పదు. ఎస్ & పి ఏమంటోందంటే అమెరికా సామాజిక భద్రతా పధకాల్లో దేనికి చెల్లింపులు ఆపేసినా అమెరికా అప్పు రేటింగ్ తగ్గించక తప్పదని ప్రవేటుగా అమెరికా అధికారులకీ, కంపెనీలకు చెబుతోంది. ఆగస్టు 2 లోపు రిపబ్లికన్లు, డెమొక్రట్లు ఒక ఒప్పందానికి రాకపోతే ప్రాధాన్యతను బట్టి చెల్లింపులు చేయవలసి ఉంటుందని ట్రేజరీ సెక్రటరీ తిమోతీ గీధనర్ చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. అంటే చెల్లింపులకు వచ్చిన ప్రతిదానికీ చెల్లించకుండా అలా వచ్చే వాటిల్లో ఏది ముఖ్యమో నిర్ణయించుకుని దానికి ముందు చెల్లింపులు చేస్తానని అంటున్నాడు. ఈ పరిస్ధితికి రావడమంటే ఇక అమెరికా అప్పులు చెల్లించలేని స్ధితికి చేరుకోవడమేననీ కనక అమెరికా అప్పు రేటింగ్ తగ్గిస్తానని ఎస్ & పి అంటోంది. ఫిచ్, మూడీస్ సంస్ధలు కూడా దాదాపు ఇదే చెబుతున్నాయి.

అమెరికా ట్రేజరీ నిరుద్యోగ భృతి చెల్లించడాన్ని తాత్కాలికంగా పక్కన పెడితే అది అప్పు డిఫాల్ట్ కిందికి వస్తుందని ఎస్ & పి వాదన. అది నిజం కూడా. ఆ మాటకొస్తే చైనాకి చెందిన ఒక రేటింగ్ సంస్ధ అమెరికా ఇప్పటికే డిఫాల్టు అయినట్లేనని అంటున్నది. ఆగస్టు 2 తేదీకి అమెరికా తాను జారి చేసిన బాండ్లలో కొన్ని పక్వానికి వస్తాయి. అంటే మెచ్యూర్ అవుతాయి. మరికొన్నింటికి వడ్డీ చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ సావరిన్ బాండ్ల చెల్లింపులన్నీ ఆ తేదీకి ఆటోమేటిక్ గా జరిగి పోవాలి. అలా జరక్క పోతే అంటే అప్పు చెల్లింపుల్ని ఆపడమో లేదా కనీసం వాయిదా వేసినా అమెరికా అప్పు డిఫాల్టర్ కింద జమకట్టపడుతుంది. అంటే అమెరికా అప్పులో కొంత భాగం తిరిగి చెల్లించలేక వాయిదా వేసిందనో, ఆపేసిందనో అర్ధం అన్నమాట. ఆ స్ధితికి వస్తే ఇక ఆ దేశం పని ఖాళీ అన్నంత ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. కానీ వాస్తవంలో పరిస్ధితి వేరేగా ఉంటుంది. అది అప్రస్తుతం కనక మరో సందర్భంలో చర్చించుకుందాం.

నిన్నటి వరకూ గ్రీసు విషయంలో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు అదే ప్రచారం చేశాయి. “అయ్యో డిఫాల్టు అవుతుంది. గ్రీసు పని ఖాళీ” అన్నంతగా ప్రచారం చేసి దాని చేత ప్రజలపైన నానా పన్నులన్నింటిని విధింప జేసాయి. దేశానికి చెందిన కంపెనీలని ప్రవేటు వాళ్ళకి అమ్మించాయి. కాని ఇప్పుడు అకస్మాత్తుగా గొంతు మార్చి గ్రీసు డిఫాల్ట్ అయితేనే మేలు అని చెబుతున్నాయి. ఐతే అమెరికాకి ఆ పరిస్ధితి వస్తుందా అంటే “రానివ్వరు” అని మాత్రం చెప్పవచ్చు. రిపబ్లికన్లూ, డెమొక్రట్లూ రాజకీయాల కోసం సిగపట్లు పట్టాయి కానీ చివరి నిమిషాల్లో ఒప్పందానికి వచ్చామని ప్రకటించినా ఆశ్చర్యం లేదు. గ్రీసు విషయం ఇటీవల అలానే జరిగింది. గ్రీసు పొదుపు విధానాలు ఆమోదించకపోతే తదుపరి వాయిదా ఇచ్చేది లేదని చివరిదాకా ప్రకటించి, భయపెట్టి గ్రీసు పార్లమెమ్టు చేత తమకు కావలసిన ప్రవేటీకరణ, పొదుపు లాంటి బిల్లుల్ని ఆమోదింపజేసుకున్నాయి. ఇప్పుడేమో గ్రీసు అప్పు చెల్లించకుండా డిఫాల్టు అయితేనే మేలు అని అక్కడక్కడా చెప్పిస్తున్నాయి.

మొత్తం మీద అమెరికా అప్పు గురించి ఇలాంటి చర్చ జరగడమే ఒక అరుదైన విషయం. అమెరికా అర్ధికంగా బాగా బలహీనపడిందనడానికి ఇది మరొక తార్కాణం. చివరికి ఏదొక ఒప్పందానికి వచ్చినా అమెరికా అర్ధిక పరిస్ధితి మాత్రం సమీప భవిష్యత్తులో బాగవుతుంది అని నమ్మలేని స్ధితికి చేరుకుందని ఘంటాపధంగా చెప్పొచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s