‘గూగుల్ ఇంక్,’ ‘స్కైప్ లిమిటెడ్’ లతో పాటు ఇతర ఇంటర్నెట్ సంస్ధలు, వినియోగదారులకు అందించే సేవలను పర్యవేక్షించే అవకాశం దేశ భద్రతా ఏజెన్సీలకు ఉండాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఆయా కంపెనీలు తాము అందజేసే సర్వీసుల ద్వారా మార్పిడి చేసే సమాచారాన్ని ముందుగానే చదివే అవకాశం భారత దేశ భధ్రతా బలగాలు, గూఢచార సంస్ధలకు ఉండాలనీ, భారత దేశ భద్రత రీత్యా అది అవసరమనీ సంబంధిత కేంద్ర మంత్రి బుధవారం, పరిశ్రమల సమావేశాల సందర్భంగా కోరాడు. టెర్రరిజం తదితర నేరాలనుండి దేశాన్ని రక్షించుకోవడానికి ఈ సర్వీసుల ద్వారా ప్రవహించే సమాచారంపై నిఘా పెట్టడానికి ఆయా భధ్రతా సంస్ధలకు తప్పనిసరిగా అవకాశం ఉండాలని ఆయన డిమాండ్ చేశాడు.
“టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ” మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సచిన్ పైలట్ ఈ మేరకు పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నాడు. “అనేక కంపెనీలతో కూడిన జాబితా మా దగ్గర ఉంది. ఆ కంపెనీలన్నీ ప్రభుత్వ సంస్ధలకు వారు అందించే సేవలలో ప్రవేశం కల్పించాలని, వివిధ సమస్యలకు పరిష్కారం చూపాలనీ కోరాము” అని ఆయన చెప్పాడు. ‘రీసెర్చ్ ఇన్ మోషన్’ (రిమ్) సంస్ధకు చెందిన ‘బ్లాక్ బెర్రీ’ మొబైల్ ఫోన్ అందించే ఎన్క్రిప్టెడ్ ఇ-మెయిళ్ళను ప్రభుత్వ భద్రతా ఏజెన్సీలు చదివేందుకు అవకాశం కల్పించాలని గత సంవత్సరం భారత ప్రభుత్వం కోరుతూ, అటువంటి ప్రవేశం దొరికేవరకూ సదరు కంపెనీ సేవలను నిలిపివేయాలని అదేశించింది. అయితే వ్యక్తిగత ఫోన్ వినియోగదారుల మెయిళ్ళు, టెక్స్ట్ సందేశాలను ముందుగానె చదివే అవకాశాలను బ్లాక్ బెర్రీ తాత్కాలికంగా కల్పించడంతో తాత్కాలిక ప్రాతిపదికన బ్లాక్ బెర్రీ సర్వీసులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం అంగీకరించింది.
బ్లాక్ బెర్రీ వ్యక్తిగత వినియోగదారుల సమాచార మార్పిడి (ఇ-మెయిల్, మెసేజ్లు మొ.వి)ని సాధారణ స్ధాయిలో ఎన్క్రిప్ట్ చేస్తుంది. వివిధ వ్యాపార కంపెనీలు, బహుళజాతి సంస్ధల మధ్య జరిగే సంభాషణల సమాచారాన్ని గరిష్ట స్ధాయిలో ఎన్క్రిప్ట్ చేస్తుంది. వ్యక్తిగత సమాచార, సంభాషణలను చదివే అవకాశం కల్పించినప్పటికీ కార్పొరేట్ సంస్ధల సమాచార, సంభాషణల ఎన్క్రిప్షన్ ను ఛేదించడం ఎవరి వల్లా కాదని ఆ కంపెనీ చెబుతోంది. కార్పొరేట్ కంపెనీల ఈ-మెయిళ్ళ ఎన్క్రిప్షన్ ను ఛేదించే కోడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, అది లేకుండా డిస్క్రిప్ట్ చేయగల టెక్నాలజీ కంపెనీ వద్దనే లేదనీ రిమ్ కంపెనీ చెబుతోంది. ఆ వివాదం అలా ఉండగానే తాజాగా గూగుల్, స్కైప్ లాంటి కంపెనీలను కూడా ఎన్క్రిప్ట్ లను ఛేదించే కోడ్లను ప్రభుత్వ సంస్ధలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అసలు కోడ్ కూడా కాకుండా పూర్తిగా అర్ధమయ్యే విధంగానే వినియోగదారుల సంభాషణలన్నింటినీ చదవగల రూపంలో ప్రభుత్వానికి అందుబాటులో ఉంచాల్సిందేనని గత సంవత్సరం హోమ్ మంత్రి చిదంబరం రిమ్ కంపెనీని గట్టిగా కోరాడు.
“చట్టం అమలు చేయించడంలో నిమగ్నమైన ఏజన్సీలు, హోం మంత్రిత్వ శాఖ, గూఢచార ఏజెన్సీలు, ఆ సమాచారం జాతీయ భద్రత రీత్యా అవసరమని కోరుతున్నాయి” అని సచిన్ పైలట్ పరిశ్రమాధిపతుల సమావేశాల విరామ సమయంలో చెప్పాడు. గూగుల్, స్కైప్ లు తమ సమాచార సేవలను భారిగా ఎన్క్రిప్ట్ చేయడం వలన భద్రతా సంస్ధలు వాటిని చదవలేవనీ, ఈ సౌకర్యాన్ని టెర్రరిస్టు సంస్ధలు దుర్వినియోగం చేసే అవకాశం ఉందనీ భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్నెట్ సర్వీసులు, నెట్ బ్రౌజింగ్, మెసెంజర్ సర్వీసులు మొదలైన సర్వీసులను పర్యవేక్షించడానికి వీలుగా ఆయా కంప్యూటర్లలోకి ప్రవేశాన్ని ఇప్పటికే రిమ్ కల్పించింది. కార్పొరేట్ ఈ-మెయిళ్ళ విషయం ఇంకా పరిష్కారం కాలేదు. అవి చదవగల టెక్నాలజీ తమ వద్దే లేదని బ్లాక్ బెర్రీ చెబుతోంది.
నోకియా కంపెనీ గత డిసెంబర్ లో తమ సర్వర్లను ఇండియాలో స్ధాపించినట్లు తెలిపింది. తద్వారా నోకియా స్మార్ట్ ఫోన్ల సమాచారాన్ని పర్యవేక్షించడానికి భద్రతా సంస్ధలకు కల్పిస్తున్నట్లు ఆ సంస్ధ తెలిపింది. ఎన్క్రిప్షన్ సౌకర్యం అందించే కంపెనీలన్నీ పర్యవేక్షణకు మార్గం చూపాలని లేనట్లయితే అవి ఇండియాలో వ్యాపారం చేసుకునే వీల్లేదని ప్రభుత్వం నిర్మొహమాటంగా చెబుతోంది. గూగుల్, స్కైప్ కంపెనీలు కూడా స్ధానికంగా సర్వర్లు నెలకోల్పాలని ఇండియా కోరింది. స్ధానికంగా సర్వర్లు ఉన్నట్లయితే అవి స్ధానిక చట్టాలకు లోబడి పని చేయవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రజల మధ్య సంభాషణలను పర్యవేక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. పర్సనల్ కంప్యూటర్ల ద్వారా ఇంటర్ నెట్ సాయంతో టెలిఫోన్ సంభాషణలు జరిపే సేవ అందిస్తున్న స్కైప్ సంస్ధ లక్సెంబర్గ్ దేశానికి చెందినది కాగా గూగుల్ అమెరికాకి చెందిన సంస్ధ. స్కైప్ కంపెనీని ఇటీవల మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.
