అమెరికా అణు ప్లాంట్ల వద్ద ఇపుడున్న భద్రతా ఏర్పాట్లు సరిపోవు -టాస్క్ ఫోర్స్


Davis-Besse nuclear power station in Oak Harbor, Ohio

ఓహియో రాష్ట్రంలో ఓక్ హార్బర్ వద్ద గల డేవిస్-బెస్సే అణు విద్యుత్ ప్లాంటు. ఏసిడ్, రియాక్టర్ పాత్ర మూతను తినేయడంతో దీనిని రెండేళ్ళపాటు పని చేయకుండా నిలిపివేయవలసి వచ్చింది.

జపాన్‌లొ మార్చిలో సంభవించిన భూకంపం సునామీల వలన ఫుకుషిమా అణు కర్మాగారం తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత అమెరికా ప్రభుత్వం తమ అణు కర్మాగారాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించాల్సిందిగా అణు నియంత్రణ కమిషన్‌ (న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్ – ఎన్.ఆర్.సి) ను ఆదేశించింది. ఎన్.ఆర్.సి అందుకోసం నిపుణులతో కూడిన టాస్క్ ఫోర్స్ ని నియమించింది. టాస్క్ ఫోర్స్ తయారు చేసిన నివేదికను అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్ధ సంపాదించగా ‘ది హిందూ’ పత్రిక అందులో కొన్ని అంశాలను వెల్లడించింది. టాస్క్ ఫోర్స్ తయారు చేసిన 90 పేజీల నివేదిక, అణు భద్రతకోసం అనేక సిఫారసులు చేసింది. ముఖ్యంగా ఫుకుషిమా ప్రమాదం నేపధ్యంలో అటువంటి ప్రమాదాలను ఎదుర్కోగల భద్రతా ఏర్పాట్లు అమెరికాలో గల 104 అణు రియాక్టర్ల వద్ద లేవనీ నివేదిక ద్వారా వెల్లడించింది.

ఫుకుషిమా ప్రమాదం లాంటివి ఎప్పటికీ వాంఛనీయం కాదని టాస్క్ ఫోర్స్ చెప్పింది. అరుదుగా సంభవించే ఉత్పాతాలను కూడా తట్టుకునే విధంగా అమెరికా అణు రియాక్టర్లు అన్నింటి వద్దా భద్రతా ఏర్పాట్ల స్ధాయిని పెంచవలసిన అవసరం ఉందని చెప్పింది. టాస్క్ ఫోర్స్ మొత్తం మూడు ప్రధాన అంశాలలో సిఫారసులు చేసింది. ఒకటి: అమెరికాలోని అణు కర్మాగారాల ఆపరేటర్లు వరదలు, భూకంపం ప్రమాదాలకు తట్టుకునే విధంగా తమ రియాక్టర్లవద్ద భద్రతా ఏర్పాట్లు ఉన్నదీ లేనిదీ మళ్ళీ సమీక్షించాలని నివేదిక కోరింది. రెండు: ఒక రియాక్టర్ కంటే ఎక్కువ రియాక్టర్లు ఒకే సారి ప్రమాదానికి గురైనపుడు అటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి అవసరమైన నూతన పరికరాలను సిద్ధం చేసుకోవాలని కోరింది. మూడవది: ప్రమాదం సంభవించాక వాడిన ఇంధనం నిలవ ఉంచిన నీటి కొలనులను పర్యవేక్షించడానికి అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలనీ, విద్యుత్ చ్ఛక్తి కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని టాస్క్ ఫోర్స్ నివేదిక సిఫారసు చేసింది.

మంగళవారం టాస్క్ ఫోర్స్ నివేదికలో మొత్తం 12 సిఫారసులు ఉన్నాయని ఎన్.ఆర్.సి పేర్కొంది. అవి అమలు చేసినట్లయితే అణు భద్రత పెరుగుతుందనీ, రక్షణ ఏర్పాట్లు ఏ స్ధాయిలో ఏర్పాట్లు చేస్తే ప్రజారోగ్యం భద్రంగా ఉంటుందో నిర్ధారిస్తాయనీ ఎన్.ఆర్.సి తెలిపింది. పూర్తి నివేదిక ఈ రోజు (బుధవారం) విడుదల చేయనున్నట్లు ఎన్.ఆర్.సి తెలిపింది. జపాన్‌లొ భూకంపం వలన సంభవించిన సునామీతో సముద్రపు నీరు పెద్ద ఎత్తున ఫుకుషిమా అణు కేంద్రాన్ని ముంచెత్తి అక్కడ ఉన్న జరరేటర్లను పనిచేయకుండా చేశాయి. దానితో భూకంపం వలన దెబ్బతిన్న విద్యుత్ సరఫారా స్ధానంలో జనరేటర్లు విద్యుత్‌ను అందించలేకపోయాయి. విద్యుత్ లేక అణు రియాక్టర్లలో కూలింగ్ వ్యవస్ధ నాశనమైపోయింది. దానితొ రియాక్టర్లలోని అణు ఇంధన కడ్డీలు వేడెక్కి కరిగిపోయాయి. దీనిని అణు విద్యుత్ పరిభాషలో “మెల్డ్ డౌన్” అటారు.

కరిగిపోయిన ఇంధనం రియాక్టర్ల అడుగుభాగం నుండి లీకయ్యి రేడియేషన్ వాతావరణంలోనూ, భూమిలోనూ కలిసిపోయింది. ఇంధన కడ్డీలను చల్లబరచడానికి సముద్రపు నీరు, మంచి నీరు వెద జల్లినా అవేవీ పెద్దగా ఉపయోగపడలేదు. రియాక్టర్ల వద్ద ఇప్పటికీ రేడియేషన్ లీక్ అవుతూనే ఉంది. జపాన్ లోని పశువుల్లోను, కూరగాయల్లోనూ రేడియేషన్ ప్రవేశించింది. పాలు కూరగాయలు రేడియేషన్ బారినపడ్డాయి. దాంతో జపాన్ నుండి కూరగాయలు, మాంసం, పాలు తదితర దిగుమతులను దేశాలన్నీ రద్దు చేసుకున్నాయి. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న జపాన్ ఆర్ధిక వ్యవస్ధ మరింత క్షీణించింది. ప్రపంచంలో సరుకుల ఎగుమతిలో ముఖ్యమైన దేశాల్లో జపాన్ ముఖ్యమైనది కావడంతో దాని ప్రభావం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ పైన కూడా పడింది.

జపాన్ అణు ప్రమాదం తర్వాత ప్రపంచంలో ఇతర దేశాలు అప్రమత్తమయ్యాయి. జర్మనీ ప్రభుత్వం తలపెట్టిన కొత్త అణు రియాక్టర్ల నిర్మాణాన్ని రద్ధి చేసుకుని మరో పది సంవత్సరాలలో అణు విద్యుత్ వినియోగాన్ని పూర్తిగా రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఫ్రాన్సు కూడా అదే బాటలో నడుస్తోంది. అమెరికా తన రియాక్టర్ల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించడానికి టాస్క్ ఫోర్స్ నియమించింది. ఇప్పుడు అత్యవసరంగా అమెరికా అణు రియాక్టర్లకు వచ్చే ప్రమాదం ఏమీ లేకపోయినా, అనూహ్య ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఏర్పాట్లు లేవని టాస్క్ ఫోర్స్ నొక్కి చెప్పింది. ఇప్పటివరకూ అణు కర్మాగారాల ఆపరేటర్లు కానీ, ఎన్.ఆర్.సి గానీ జరిపిన సమీక్షల్లోనూ, పరిశోధనల్లోనూ, ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ జరిపిన సమీక్షలో పరిశీలించిన అంశాలకు ఎన్నడూ ప్రాముఖ్యత ఇవ్వలేదని ఆపరేటర్లు, ఎన్.ఆర్.సి సభ్యులు అంగీకరించారు. అంటే ఫుకుషిమా అణు ప్రమాదం, అణు ప్లాంట్లలో ఏర్పడగల ప్రమాదాలకు సంబంధించిన కొత్త కోణాన్ని ఆవిస్కరించిందన్నమాట!

టాస్క్ ఫోర్స్ నివేదికపై అమెరికా ప్రతినిధుల సభ సభ్యులు, సెనేటర్లు తలా ఒక రకంగా స్పందిస్తున్నారు. భద్రతకు ప్రాముఖ్యం ఇచ్చేవారు వెంటనే తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆపరేటర్లను ఆదేశించాలని కోరుతుండగా అణు కంపెనీల ప్రయోజనాలకు ప్రాముఖ్యం ఇచ్చేవారు మరీ అతిగా భయపడుతున్నారనీ, జపాన్‌లో ప్రమాదం సంభవించినంత మాత్రాన ఆటోమేటిక్ గా అమెరికా అణు కేంద్రాల్లో ఏర్పాట్లను అనుమానించవలసిన అవసరం లేదని వాదిస్తున్నారు. జపాన్ ప్రమాదం అనంతరం ఇండియాలో కూడా భద్రతా ఏర్పాట్లను సమీక్షించమని ఆదేశించినట్లు ప్రధాని ప్రకటించాడు. కానీ ఆ సమీక్ష ఫలితాలు ఏమిటో వెల్లడి కాలేదు. అడిగినవారూ లేరు, చెప్పినవారూ లేరు. సుదీర్ఘ కాలంపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లయితే ఇంధన కడ్డీలను చల్లబరచదానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అమెరికా ఎందుకు చేయడం లేదని ఎన్.ఆర్.సి ఛైర్మన్ గత జూన్‌లో జరిగిన బహిరంగ సమావేశంలో ప్రశ్నించాడు. ఇదే ప్రశ్న భారత శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది.

అమెరికా ప్లాంట్లు తమ వద్ద ఎనిమిది గంటలపాటు విధ్యుత్ సరఫరా చేయగల జనరేటర్లు సిద్ధంగా ఉంచుకున్నారు. ఆ తర్వాత కూడా అంతరాయం కొనసాగితే ఏం చేయాలో అమెరికా నిపుణులు, ఆపరేటర్లు సైతం ఇప్పటివరకూ ఆలోచించలేదు. జనరేటర్ సామర్ధ్యం ఐన ఎనిమిది గంటల లోగా సాధారన సరఫరా పునరుద్ధరించబడుతుందనే అంచనా వేసుకున్నారు గానీ, పునరుద్ధరన జరగకపోతే ఏం చేయాలో ఆలోచించలేదూ, ఏర్పాట్లూ చేసుకోలేదు. దాదాపు ప్రపంచం అంతా ఇదే పరిస్ధితి. జపాన్ లో జరిగిందదే. సుదీర్ఘకాలం పాటు విద్యుత్ సరఫరా పునరద్ధరించబడలేదు. దాదాపు మూడు నెలల తర్వాతే అది కూడా పాక్షికంగానే పునరుద్ధరించగలిగారు. అప్పటికి ఐదు రియాక్టర్లలోనూ ఇంధన కడ్డీలు పూర్తిగానో, పాక్షికంగానో మెల్డ్ డౌన్ లో పడిపోయాయి. సునామీ సంభవించిన కొన్ని గంటల్లోనే మెల్డ్ డౌన్ మొదలైందని ఇప్పుడు నింపాదిగా టెప్కో (టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ) చెపుతోంది. ఇప్పటికీ రేడియేషన్‌ విడుదలను అరికట్టలేని పరిస్ధితుల్లో అది ఉందు.

పూర్తిగా విద్యుత్ సరఫరా తెగిపోయిన ఎనిమిది గంటలలోపు విద్యుత్‌ని పునరుద్ధరించే ఏర్పాట్లు చేయాలనీ, ఆ తర్వాత మూడు రోజులపాటు రియాక్టర్ కోర్ ను చల్లబరిచే ఏర్పాట్లు చేయాలని టాస్క్ ఫోర్స్ సిఫారసు చేసింది. వరదలు, భూకంపాల ప్రమాదాలను ఎదుర్కొనే ఏర్పాట్లను పది సంవత్సరాల తర్వాత మళ్ళీ సమీక్షించాలని సిఫారసు చేసింది. కానీ ఇవన్నీ అణు ప్రమాదాలను నిరోధించగలవా లేదా అన్నది అనుమానమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s