మే నెలలో మళ్ళీ క్షీణించిన భారత పారిశ్రామీక వృద్ధి, షేర్లు పతనం


india-industrial-production

ఏప్రిల్, మే నెలల్లో భారత పారిశ్రామిక వృద్ధి రేటు క్షీణించింది

భారత పారిశ్రామికీ వృద్ధి గత సంవత్సరం మే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం మే నెలలో మళ్ళీ క్షిణించింది. మే నెలలో పారిశ్రామిక వృద్ధి 5.6 శాతంగా నమోదయ్యింది. రాయిటర్స్ సర్వేలో ఇది 8.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఈ క్షీణత అంచనాల కంటే ఎక్కువగా ఉండడం, ఇటలీ, స్పెయిన్ దేశాలు సావరిన్ అప్పు సంక్షోభానికి దగ్గర్లోనే ఉన్నాయన్న అనుమానాలు తీవ్రం కావడంతో భారత షేర్ మార్కెట్లు నష్టాల బాటలోనే మూడోరోజూ కొనసాగాయి. గత శుక్రవారం నుండి నష్టాల బాట పట్టిన ఇండియా షేర్ మార్కెట్లు మూడో రోజు కూడా అదే బాటలో కొనసాగాయి. గత తొమ్మిది నెలలో అత్యధిక స్ధాయిలో పారిశ్రామిక వృద్ధి క్షీణించింది. ద్రవ్యోల్బణం అధిక ధరలు, అధిక వడ్డీ రేట్లు, ప్రవేటీకరణ విధానాల వేగం బాగా తగ్గిపోవడం, ఫలితంగా ఎఫ్.డి.ఐ ల ప్రవేశం వాయిదా పడడం, వీటన్నింటికీ అంతర్జాతీయ పరిస్ధితులు తోడు కావడంతో పారిశ్రామిక వృద్ధి క్షీణించిందని కార్పొరేట్ పత్రికలు అంచనా వేస్తున్నాయి.

పారిశ్రామిక వృద్ధి క్షీణత ఒక్క ఇండియాకే పరిమితం కాదు. విదేశీ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వెళ్తున్న చైనాలో కూడా పారిశ్రామిక వృద్ధి క్షీణించింది. దీనికి ప్రధాన కారణాల్లో మొదటిది, సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం అరికట్టడానికి బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం వలన క్రెడిట్ అందుబాటులో లేకపోవడంతో పెట్టుబడులకు ద్రవ్యం లభ్యత తగ్గిపోవడం, రెండవది, యూరప్ అప్పు సంక్షోభం ఉచ్ఛస్ధాయిలో కొనసాగుతూ ఉండడం, మూడవది ద్రవ్యోల్బణం వలన సరుకుల రేట్లు అందుబాటులో లేకపోవడంతో అది పరిశ్రమమలకు సరుకుల అందుబాటు తగ్గిపోవడం. ఇవి ప్రధాన కారణాలు కాగా ఇండియా సంస్కరణలు వేగవంతం చేయడంలో విఫలమవడం వల్లనే పారిశ్రామిక వృద్ధి క్షీణిస్తున్నదని చెబుతూ, భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. పెట్టుబడుల లేమి పారిశ్రామిక క్షీణతకు కారణమయితే చైనాలో కూడా పారిశ్రామిక వృద్ధి తగ్గుతుండడానికి వీరు అంతర్జాతీయ కారణాలను చూపడం గమనార్హం.

బ్యాంక్ ఆఫ్ బరోడాకి చెందిన విశ్లేషకుడొకరు వడ్డీ రేట్ల వలన ప్రభావం పడే రంగాల్లో పారిశ్రామిక క్షీణత కేంద్రీకృతమై ఉందని తెలిపాడు. బ్యాంకు క్రెడిట్ కోసం డిమాండ్ కూడా అధిక వడ్డీ రేట్లవలన తగ్గుతోందని ఆయన చెప్పాడని రాయిటర్స్ తెలిపింది. దాన్ని బట్టి పారిశ్రామిక వృద్ధి క్షీణతకూ సంస్కరణలకూ సంబంధం లేదని స్పష్టమవుతోంది. అయినప్పటికీ రిజర్వు బ్యాంకు జులై 26 న జరిగే ద్రవ్య విధానం సమీక్షలో మరొకసారి వడ్డీ రేట్లు పెంచడానికే మొగ్గు చూపవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్.బి.ఐ గవర్నరు కూడా కొంత ఆర్ధిక వృద్ధి రేటుని త్యాగం చేసైనా సరే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయవలసిన అవసరం ఉందని ద్రవ్య విధానం ప్రధాన లక్ష్యం ద్రవ్యోల్బణం తగ్గింపేననీ పేర్కొన్న సంగతిని గమనిస్తే పారిశ్రామిక వృద్ధి క్షీణత వెనుక అధిక వడ్డీ రేట్లు, అధిక ధరలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలుస్తోంది.

టోకు ధరల సూచి మే నెలలో 9 శాతం పైగా నమోదు అయ్యింది. డీజెల్, వంట గ్యాసుల ధరలు పెంచడంతో ఈ సూచి జూన్ నెలలో మరింత పెరగడం ఖాయం. అంటే ద్రవ్యోల్బణం కూడా ఇంకా పెరగనుంది. టోకు ధరల సూచి జూన్ నెలలో ఎంత పెరిగిందీ రానున్న గురువారం ప్రభుత్వం పకటించనుంది. ద్రవ్యోల్బణ, అధిక ధరలు, తగ్గిన అంతర్జాతీయ డిమాండు వీటన్నింటి వలన ఈ సంవత్సరం జిడిపి వృద్ధి రేటు 8 శాతానికంటే తగ్గుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు, సంస్ధలు అంచనా వేస్తుండగా, ప్రభుత్వ వర్గాలు మాత్రం 8.5 శాతం నమోదవుతుందని నమ్మ బలుకుతున్నాయి. అయితే పారిశ్రామిక వృద్ధి రేటును చూశాక ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ “పరిస్ధితి అంత ఆశాజనకంగా లేదు” అని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఏప్రిల్ నెలలో పారిశ్రామిక వృద్ధి 6.3 శాతం ఉందని మొదట తెలిపిన ప్రభుత్వం దానిని ఆ తర్వాత 5.8 శాతానికి రివైజ్ చేసింది. పారిశ్రామిక ఉత్పత్తిలో 80 శాతం వాటా కలిగి ఉన్న మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉత్పత్తి ఏప్రిల్ నెలలో 6.3 శాతం నమోదు కాగా జూన్ నెలలో 5.6 శాతానికి తగ్గింది. (ఈ శాతాలన్నీ జిడిపిలో శాతాలుగా చూడాలి). ఇండియా పారిశ్రామిక వృద్ధి గణాంకాలు నిరాశాజనకంగా ఉండటంతో పాటు ఇటలీ, స్పెయిన్ వార్తలు కూడా తోడవ్వడంతో బి.ఎస్.ఇ సెన్సెక్స్ సూచి 309.77 పాయింట్లు (1.65 శాతం) తగ్గి 18411.62 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 103.8 పాయింట్లు (1.85 శాతం) తగ్గి 5512.30 పాయింట్ల వద్ద ముగిసింది.

మే నెలలో పెట్టుబడి సరుకుల ఉత్పత్తి తగ్గిపోగా, వినియోగ సరుకుల ఉత్పత్తి పెరిగింది. విద్యుదుత్పత్తి కూడా పెరుగుదల నమోదు చేసింది. కార్ల అమ్మకం అతి తక్కువగా 1.6 శాతం పెరిగింది. రెండు సంవత్సరాల కాలంలో ఇది అతి తక్కువని తెలుస్తోంది. సిమెంటు, ఉక్కు, రిఫైనింగ్ తో కూడిన మౌలిక రంగ వృద్ధి మేలో 5.3 శాతం నమోదైంది. ఇది ఏప్రిల్ (5.2 శాతం) పోలిస్తె కొద్దిగా ఎక్కువ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s