బహుళజాతి కంపెనీలకు మద్దతుగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేసిన ప్రధాని


Manmohan_Singhభారత ప్రధాని రెండో సారి తన మంత్రివర్గంలో మార్పులు తలపెట్టారు. ఈ సారి మార్పుల్లో ప్రధానంగా సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లుగా కనిపిస్తోంది. బహుళజాతి కంపెనీల ప్రవేశానికి అడ్డంకిగా ఉన్నారని భావిస్తున్న మంత్రులను వారి శాఖలనుండి తొలగించారు. పెద్ద ఎత్తున మార్పులు జరుగుతాయని భావించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. ప్రధాన విధానాల అమలుతో ముడిపడి ఉన్న మంత్రిత్వ శాఖలను పెద్దగా కదిలించలేదు. మిత్ర పార్టీల శాఖలను కూడా పెద్దగా మార్చలేదు. డి.ఎం.కె మంత్రి దయానిధిమారన్ రాజీనామా చేసిన స్ధానాన్ని కూడా నింపలేదు. మంత్రివర్గ మార్పులను ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ప్రకటిస్తారని తెలిపినప్పటికీ రాయిటర్స్ వార్తా సంస్ధ గం.2:45ని.లకే మార్పులను ప్రచురించింది. సంస్కరణలకు మద్దతుగా పెద్ద ఎత్తున మార్పులు చేస్తారని పెట్టుబడిదారులు భావించారని, కేవలం కొన్ని మార్పులతో సరిపెట్టడంతో వారు నిరాశ చెందారని రాయిటర్స్ వ్యాఖ్యానించింది.

ఎవరూ ఊహించని మార్పు, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకమైన మార్పు, బహుళజాతి కంపెనీల ప్రవేశానికి అనుకూలమైన మార్పు ఒకటి చోటు చేసుకుంది. అది, జైరాం రమేష్‌ను కీలకమైన పర్యావరణ శాఖనుండి తప్పించి గ్రామిణాభివృద్ధి మంత్రిగా నియమించడంతో పాటు కేబినెట్ ర్యాంకుకు ప్రమోట్ చేయడం. జైరాం రమేష్ సోనియా గాంధీకి సన్నిహితుడని పేరు. నెహ్రూవియన్ ఆర్ధిక విధానాలైన ప్రభుత్వరంగ పెట్టుబడి విధానానికి గట్టి మద్దతుదారుడు. ఆయన పర్యావరణ మంత్రిత్వ శాఖకు నిర్వహిస్తున్న కాలంలో వేదాంత అల్యూమినియం రిఫైనరీ కంపెనీకి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. సరిగ్గ చెప్పాలంటే ప్రభుత్వం రూపొందించిన పర్యావరణ చట్టాలను ఉన్నవి ఉన్నట్లుగా అమలు చేయడానికి ప్రయత్నించాడు. బి.టి వంగ విత్తనాలను ఇండియాలో ప్రవేశించకుండా అడ్డుకున్నాడు. పోస్కో కంపెనీకి దాదాపు ఐదు సంవత్సరాల పాటు పర్యావరణ శాఖ ఆమోదం ఇవ్వకుండా నిలిపినప్పటికీ ఇటీవల ఆమోద ముద్ర వేశాడు. “ఒత్తిళ్ళవలన చట్టాల అమలును అడ్డుకోక తప్పలేదనీ, చట్ట విరుద్ధతను చట్ట బద్ధం చేయడానికి తాను తీవ్ర వ్యతిరేకమైనప్పటికీ ఒత్తిళ్ళు ఆ వైపుగానే నన్ను నెట్టాయని” ప్రకటించి పరోక్షంగా ప్రధానిపై నెపం మోపాడు. ఐతే, జైరాం, అణు విద్యుత్‌కి మద్దతు ప్రకటించి తాను కూడా పూర్తిగా ప్రజల పక్షం కాదని రుజువు చేసుకున్నాడు.

జైరాం రమేష్ పనివిధానం పట్ల ఇతర మంత్రిత్వ శాఖలవారు చాలామంది అసహనం వ్యక్తం చేశారు. చట్టాలను అమలు చేయాలంటూ పట్టుదల వహిస్తున్నాడని విసుక్కున్నారు. అనేక శ్రమల కోర్చి పెట్టుబడుల ప్రవేశానికి ఒప్పందాలు చేసుకుంటే వాటిని చట్ట వ్యతిరేకమంటూ మోకాలడ్డుతున్నాడని ప్రధానికి ఫిర్యాదు చేశారు. వ్యవసాయ మంత్రి శరద్ పవార్, వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ప్రస్తుత హోం మంత్రి మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం తదితరులు జైరాం రమేష్ పై ఫిర్యాదు చేసినవారిలో ఉన్నారు. సోనియా గాంధి మద్దతుతో ఇన్నాళ్ళూ కొనసాగిన జైరాం రమేష్, బహుళజాతి సంస్ధలు తీవ్ర స్ధాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో తన శాఖను కోల్పోక తప్పలేదు. గ్రామీణాభివృద్ధి శాఖకు జైరాం రమేష్ లాంటి డైనమిక్ వ్యక్తుల మద్దతు అవసరమంటూ ప్రధాని వర్గాలు చెపుతున్నప్పటికీ ఆయన్ని మార్చడం వెనక గల అసలు ఉద్దేశ్యం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగే జైరాం రమేష్ తీసుకున్న అనేక నిర్ణయాలను మార్చుకునేలా ఒత్తిడి చేశానని ప్రకటించడం గమనార్హం.

తన కొత్త మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్ధి మంత్రిగా జైరాం రమేష్, కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాకరమైన “ఉపాధి హామీ పధకం” ని అమలు చేయడాన్ని పర్యవేక్షించనున్నాడు. జిడిపిలో దాదాపు 1 శాతానికి సమానమైన సొమ్ముని ఆ పధకం ద్వారా ప్రతి సంవత్సరం ఖర్చు చేయవలసి ఉంటుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఏ కూటమి రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఈ “ఉపాధి హామీ పధక”మేనని అత్యధికులు అంచనా వేశారు. వచ్చే సంవత్సరం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ప్రజల్లో పలుకుబడి పోగొట్టుకోకుండా ఉండడానికే పెద్దగా మార్పులు చేయలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. వీరి భావన ఏమైనప్పటికీ జైరాం రమేష్ శాఖ మార్పు ప్రవేటు బహుళజాతి కంపెనీలకు పూర్తిగా అనుకూలమైనా మార్పేననడంలో సందేహం లేదు.

ఇక పర్యావరణ శాఖ మంత్రిగా జయంతి నటరాజన్‌ను నియమించారు. సోనియా కుటుంబానికి సన్నిహితురాలిగా పేరుపొందిన ఈమె 13 సంవత్సరాల క్రితం మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ఈమె సోనియా గాంధి మద్దతుదారు అని చెబుతున్నప్పటికీ విధానాల అమలు విషయంలో ప్రధాని మన్మోహన మాట జవదాటరని కూడా భావిస్తున్నారు. అంటే ఈవిడ స్వతహాగా పెద్దలు చెప్పినట్లు నడవడమే తప్ప స్వయంగా కొన్ని విధానాలకు మద్దతుదారుగా పేరు సంపాదించుకోలేదని భావించవచ్చు. 57 సంవత్సరాల వయసు గల జయంతి నటరాజన్‌ను పర్యావరణ మంత్రిత్వ శాఖకు నియమించడం ద్వారా బహుళజాతి ప్రవేటు కంపెనీలకు ఉన్న కీలక అడ్డంకిని తొలగించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బొగ్గు వెలికితీతకు అనుమతులు త్వరితగతిన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. విద్యుత్ ప్లాంటులు తదితర ఫ్యాక్టరీలకు త్వరితగతిన అనుమతులు మంజూరు అవుతాయని ఆశిస్తున్నారు.

సల్మాన్ ఖుర్షీద్ ను న్యాయ శాఖ మంత్రిగా నియమించారు. ఈ శాఖను ఇంతకు ముందు వీరప్ప మొయిలీ నిర్వహించారు. మొయిలీ హయాంలో కేంద్ర ప్రభుత్వానికి అనేక విషయాల్లో కోర్టుల  నుండి మొట్టికాయలు ఎదురయ్యాయి. వాస్తవానికి మొయిలీ హయాంలో కోర్టు మొట్టికాయలు వేసింది అనడం కంటే కోర్టు చేత మొట్టికాయలు తిన్న కాలంలోనే మొయిలీ న్యాయ శాఖ మంత్రిగా ఉండవలసి వచ్చింది అనడమే కరెక్టుగా ఉంటుంది. ఎందుకంటె టెలికం కుంభకోణం, కామన్‌వెల్త్ కుంభకోణం, ఆదర్శ్ కుంభకోణం లాంటి వాటిలో మొయిలీకి వ్యక్తిగతంగా పాత్రలేదు. ఇతర శాఖల మంత్రులు, అధికారులు పాల్పడిన అవినీతి వలన కోర్టునుండి విమర్శలు ఎదురయ్యాయి తప్ప ఆయన తన మంత్రిత్వ శాఖలోని వ్యవహార శైలివలన కాదు. అయినప్పటికీ అందుకు మూల్యాన్ని చెల్లించక తప్పదు. మూల్యం చెల్లించడం అంటే మంత్రిత్వ శాఖను మార్చడం తప్ప మరేమీ లేదు.

2జి కుంభకోణం వలన ప్రభుత్వానికి వచ్చిన అప్రతిష్ట మంత్రివర్గ మార్పు వలన తొలగిపోతుందనుకుంటే అది వృధా ప్రయాసగా మిగలవచ్చు.  కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన ఖుర్షీద్ వృత్తి రిత్యా న్యాయవాది. ఆక్స్‌ఫర్డ్ లో విద్యాభ్యాసం చేసిన సల్మాన్ ఖుర్షీద్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఆయన ఇందిరా గాంధీ హయాం నుండీ మంత్రిగా పని చేస్తున్నారు. నాటకాలు రాయడంతో పాటు నటించిన అనుభవం కూడా ఉన్న సల్మాన్, న్యాయ శాఖ మంత్రిగా కూడా తన నటనను ఉపయోగపెట్టగలడేమో చూడవలసిందే. బహుశా సల్మాన్ పైన ఆశలు పెట్టుకోవడానికి ఆయన నటనా కౌశల్యాన్ని వినియోగించడానికేనన్నది వాస్తవం కాకూడదని ఆశిద్దాం. సల్మాన్ కూడా సోనియా గాంధి వర్గానికి చెందినవాడిగా చెబుతున్నారు. యు.పిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితం సాధించడానికీ, సల్మాన్‌ను న్యాయ శాఖ మంత్రిగా నియమించడానికి ఏమన్నా లింకు ఉందేమో తెలియదు కాని రాయిటర్స్ వార్తా సంస్ధ మాత్రం లింకు ఉందనే భావిస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలొ సల్మాన్ కీలక పాత్రధారి అని కూడా ఆ సంస్ధ అంచనా వేస్తోంది.

ఇక న్యాయ శాఖ మంత్రిగా పని చేసిన వీరప్ప మొయిలీకి సల్మాన్ నిర్వహించిన కార్పొరేట్ వ్యవహారాల శాఖను అప్పగించారు. భారత ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన సంస్కరణ విధానాలను వేగంగా ప్రవేశ పెట్టడంలో దారుణంగా విఫలమైందని కంపెనీలు భావిస్తున్న తరుణంలో వీరప్ప మొయిలీ ఆ శాఖను చేపట్టనుండడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి భాగస్వామి పార్టి ఆయిన త్రిణమూల్ కాంగ్రెస్ నాయకురాలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో ఆమె నిర్వహించిన రైల్వే మంత్రిత్వ శాఖ ఖాళీ అయ్యింది. సదరు ఖాళీని ఆ పార్టీ ఎం.పి అయిన దినేష్ త్రివేది ని నియమించారు. ఎన్నికల ప్రయోజనాలకు బాగా ఉపయోగపడే రైల్వే శాఖ మళ్ళీ త్రిణమూల్ పార్టీయే చేజిక్కించుకుంది. ఈ నెలలోనే ఉత్తర ప్రదేశ్ లో రెండు పెద్ద రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రైల్వే శాఖను ఎన్నికల ప్రయోజనాల దృష్టితో చూస్తూ ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా చర్యలు తీసుకోవడం వల్లనే ఆ శాఖ అభివృద్ధి చెందలేదని, రవాణా లాంటి మౌలిక సౌకర్యాల రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి అభివృద్ధి చేయకపోవడం వల్లనే ఎఫ్.డి.ఐ లు పెద్ద ఎత్తున ప్రవేశించడం లేదని రాయిటర్స్ లాంటి వార్తా సంస్ధలు ఎప్పటినుండో ఆరోపిస్తున్నాయి. నిజానికి రైల్వే రంగాన్ని ప్రవేటు రంగానికి అప్పజెప్పే పని చాలా ఏళ్ళనుండే ప్రారంభమైనా, ఆ రంగంలోకి విదేశీ పెట్టుబడులు పెద్దగా రాలేదు. వాస్తవాలను విస్మరించే ఈ వ్యాఖ్యానాలు ప్రభుత్వం పై మరింత వత్తిడి తెచ్చి ప్రవేటీకరణను వేగవంతం చేసేలా ప్రోత్సహించడానికే.

ఇవి కాకుండా రాజీనామా చేసిన వారి శాఖలను అదనంగా ఇతరులకు అప్పజెప్పడం, కొంతమందికి ఇండిపెండేంట్ ఛార్జి అప్పగించడం లాంటి మార్పులను చేపడుతూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. దయానిధి మారన్, మురళీ దేవరా లాంటివారి రాజీనామాలను ప్రధాని ఆమోదించారు. మంత్రివర్గ మార్పుల్లో తొలగించిన సాయి ప్రతాప్, ఎం.ఎస్.గిల్, అరుణ్ యాదవ్, కాంతిలాల్ భూరియా, హాండిక్ ల రాజీనామాలకు కూడా ఆమోదించాలని ప్రధాని రాష్ట్రపతికి సలహా ఇచ్చారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s