ఆడవాళ్ళకు సుద్దులు చెప్పేవారి క్లబ్బులో మరో ఉన్నతాధికారి సభ్యత్వం తీసుకున్నాడు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.కె.గుప్తా శనివారం ఆడవాళ్ళు ఏ సమయాల్లో బైటికి రావాలో, ఏ సమయాల్లో బైటికి రాకూడదో, బైటికి వచ్చేటప్పుడు ఎవరిని వెంటబెట్టుకుని రావాలో కూడా ఆయన తెలిపాడు. తద్వారా సమాజం స్త్రీలు స్వేచ్ఛగా బైటికి రావడానికి అంగీకరించే పరిస్ధితిలో లేదని మరొక సారి రుజువు చేశాడు. “ఆడవాళ్ళు ఏ సమయంలోనైనా బైటికి రావచ్చు. అది వారి ప్రాధమిక హక్కు. వారి హక్కును కాపాడ్డం మా బాధ్యత. అలా రావడానికి ఎవరైనా భయపడుతున్నట్లయితే మాకు చెప్పండి. మేము సహాయం చేస్తాం. లేదా బైటికి వచ్చినపుడు ఏ సమస్య అయినా ఎదుర్కున్నట్లయితే ఫలానా నంబరుకు ఫోన్ చేయండి మావాళ్ళు ఆఘమేఘాలపై మీ ముందు వాలతారు. స్వేచ్ఛగా తిరిగే హక్కు ఎవరికైనా ఒక్కటే. అందులో లింగభేధం లేదు. అలా తిరగడానికే అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేయాల్సిన భాధ్యత మాపై ఉంది” అని ప్రకటించగల దమ్ము పోలీసు అధికారులకే కాదు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులకు కూడా లేదని భారత దేశంలోని రాజకీయనాయకులు, పోలీసు అధికారులు పదే పదే రుజువు చేస్తూ వచ్చారు. ఇప్పుడు గుప్తాగారి వంతు వచ్చినట్లుంది.
గుప్తా గారు ఏమంటున్నారో చూడండి “ప్రాధమికంగా మీరు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. రాత్రి 2 గంటలకు ప్రయాణం చేస్తూ ఢిల్లీ క్షేమకరమయిన ప్రాంతం కాదని చెప్ప కూడదు. …మీ సోదరుడిని వెంట తీసుకెళ్ళండి. లేదా మీ డ్రైవర్నయినా తీసుకెళ్ళండి… ఢిల్లీలో నివసించే అన్ని కుటుంబాలు, అందరు పౌరులూ అటువంటి సకారణమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం,” అని ఢిల్లీ పోలీసు కమిషనర్ సెలవిచ్చారు. “ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ” (ఫిక్కీ) వారి మహిళా సంఘం నిర్వహించిన ఒక సమావేశంలో శనివారం ఆయన మాట్లాడాడు. దేశ రాజధాని నగరంలోనే అందునా భారత దేశానికి మణి మకుటాయమానంగా వెలుగొందుతున్న మహిళా పరిశ్రమాధిపతులు, పెట్టుబడిదారీ మణులు ఏర్పాటు చేసుకున్న సమావేశంలోనే గుప్తాగారు ఈ సందేశం ఇవ్వడానికి సాహసించారు. పెట్టుబడిదారి అయినా, పారిశ్రామికవేత్త అయినా ఆడది ఆడదే అని చాటి చెప్పారు. ఆడవాళ్ళు హద్దుల్లో ఉండక తప్పదని “స్త్రీలు పూజించబడే దేశం” లోనే హెచ్చరికలు జారీ చేసారు.
భారత దేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచం అంతా… ఇలా మహిళలను అవమానపరిచే సందేశాలు, వ్యాఖ్యలు, ప్రకటనలు చేయడం ఇదేం కొత్తా కాదు, చివరా కాదు. అదొక సహజమైన భావన. “సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు” అన్నది ఎంతటి నిత్య సత్యమో, “మహిళ మగతోడు లేకుండా గడపదాటి బైటకి రారాదు” అన్నది అంత సత్యం. మహిళ పొరపాటున మర్చిపోతారేమో అన్నట్లుగా తడవకొకడు/తడవకొకతె ఈ సూత్రాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఆ మధ్య ఒక పబ్‌లో మందు మరో పెగ్గు పోయమంటే సమయం మించిపోయింది అన్నందుకు అక్కడికక్కడే తుపాకితో కాల్చి పారేసి శవాన్ని పొయ్యిలో వేసి తండూరి ఛికెన్‌లా మాడ్చిన ఘటన ఇంక కళ్ళముందు కదలాడుతూనే ఉంది. కెనడాలో ఇటీవలే ఒక పోలీసు అధికారి “ఆడవాళ్ళు స్లట్ లాగా దుస్తులు ధరించరాదు” అని సందేశం ఇచ్చాడు. ఆడవాళ్ళు అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగడానికి వారు దుస్తులే కారణమని అర్ధం వచ్చేటట్లుగా ఎంతమంది ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించారో, సందేశాలిచ్చారో లెక్కే లేదు. వాళ్ళల్లో ఈ పోలీసోడొకడు, అంతే. ఐతే ప్రజాస్వామ్యం, స్త్రీ స్వేచ్ఛా, మానవ హక్కులు వెల్లివిరుస్తున్నాయని గొప్పలుపోయే పశ్చిమ దేశాల్లో సైతం స్త్రీల పట్ల ఇటువంటి తేలిక భావనలు ఉండడమే అసలు సంగతి. వాళ్ళు తమ గొప్పతనం గురించి ఎన్ని చెప్పుకున్నా, వాస్తవాలేమిటో అందరికీ తెలిసిందే. కాని బహిరంగంగా, మహిళల రక్షణకు ఏం చర్యలు తీసుకోవాలి అని చర్చిస్తున్న సమావేశంలోనే కెనడా పోలీసు ఈ వ్యాఖ్య చేయడమే విడ్డూరం.
రెండు మూడు సంవత్సరాల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇటువంటి వ్యాఖ్య ఒకటి చేసి ఆనక నాలుక కరుచుకున్నారు. “హెడ్‌లైన్స్ టుడే” విలేఖరి సౌమ్యా విశ్వనాధన్ అనే మహిళ, ఆఫీసు నుండి తెల్లవారు ఝాము 3 గంటలకు ఇంటికి వెళ్తుండగా ఎవరో కాల్చి చంపేశారు. తెల్లవారు ఘామున ఆ ఘటన జరగడం ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గారికి బొత్తిగా నచ్చలేదు. “అంత సాహసవంతంగా వ్యవహరించకూడదు” అని ఆమె వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్యల పట్ల మహిళా సంఘాలు, మానవ హక్కులు, పొర హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమె గొంతు సవరించుకున్నారు. “నా ఉద్దేశ్యం ఒక్క మహిళలనే కాదు. ఉదయం మూడు గంటల సమయంలో ప్రయాణం పెట్టుకోవడం ఎవరికైనా మంచిది కాదు. అబ్బాయిలైనా సరే. అదే నా ఉద్దేశ్యం రాత్రి 9 గంటల తర్వాతైనా సరే బైటికి వెళ్ళడం క్షేమం కాదు” అని ఆమె చెప్పారు. అదీ సంగతి! రాత్రి 9 గంటలు దాటినా ఇల్లు దాటకండి అని అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా చెప్పిందావిడ. ఆ లెక్కన సెకండ్ షోలు వెయ్యడం ధియేటర్లు వాళ్ళు మానెయ్యాల్సి ఉంటుంది మరి. రాత్రి 9 తర్వాత అంతా ఇళ్లకు చేరితే సెకండ్ షో చూసేదెవరింక? తప్పు సవరించుకో బోతూ మరొ తప్పుకి దిగడం. సినిమాలనే కాదు. తొమ్మిది తర్వాతే చాలా వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాటి సంగతి? అసలు ఆ విధంగా రాత్రి సమయాలు క్షేమకరం కాని విధంగా ఎందుకు తయారయ్యింది? పరిస్ధితి ఆ విధంగా మారడానికి బాధ్యులెవరు? ప్రభుత్వాల బాధ్యత ప్రమాదం కనుక వెళ్ళకండి అని చెప్పడమా? లేక ప్రమాదాలు లేకుండా చేయడమా?
“కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు ….” అంటూ భారత స్త్రీలకు విధులు నిర్దేశించాయి మన పురాణాలు. అక్కడితో ఆగకుండా కౌమార్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, ముసలితనంలో కొడుకు రక్షణలో ఉండాలని కూడా సెలవిచ్చాయి. ఈ సూక్తులన్నీ సంస్కృతంలో ఉన్నాయి చాలా వరకూ. ఇప్పుడు మహిళలకు సూక్తులు చెబుతున్నవారు సంస్కృతంలో ఉన్న సూక్తులకు ఆంగ్ల అనువాదం అందించడం తప్ప కొత్తగా చెబుతున్నదేమీ లేదు. ఇంతకీ ఇది, స్త్రీ తన జీవితమంతా మగవాడి రక్షణలోనే గడపాల్సిన అగత్యం ఉందనీ, మహిళలు స్వతంత్రంగా వ్యవహరించే వీలు లేదు పొమ్మని శాసిస్తున్నట్టా? లేక సమాజంలో మొదటి నుండీ స్త్రీలకు రక్షణ లేదని అంగీకరిస్తున్నట్టా?
