రక్షణ రంగం, ఉన్నత సాంకేతిక రంగాలలో అమెరికా ప్రవేటు పెట్టుబడులు కావాలంటే విదేశీ పెట్టుబడులపై విధించిన సుంకాలు తొలగించాలనీ, పెట్టుబడులకు అనుమతి ఇచ్చే ప్రక్రియలను సులభతరం చేయాలనీ అమెరికా ‘పరిశ్రమలు, భద్రత’ ల విభాగానికి అండర్ సెక్రటరీగా ఉన్న ఎరిక్ ఎల్. హిర్ష్ హార్న్ సోమవారం అన్నాడు. “మిలట్రీ ఆధినికరణకు ఇండియా పూనుకుంది. రానున్న ఐదు సంవత్సరాలలో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తాయని అంచనా వేస్తున్నారు” అని ఆయన తెలిపాడు. ఇండియా అమెరికాలు సంయుక్తంగా ఏర్పరుచుకున్న ఉన్నత సాంకేతిక సహకార గ్రూపు (హై టెక్నాలజీ కో-ఆపరేషన్ గ్రూపు) ఎనిమిదవ సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. అందులో ఎరిక్ ఉపన్యసించాడు.
గత నాలుగు నెలల్లొ అమెరికా కంపెనీలు ఈ రంగంలో 8 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు లభించాయనీ, మరిన్ని పెట్టుబడులు రాగల అవకాశం ఈ రంగంలో ఇంకా చాలా ఉన్నాయని ఆయన తెలిపాడు. “సుంకాల రూపంలో ఉన్న అడ్డంకులు, సుంకేతర రూపాలలోని అడ్డంకులు కూడా ఈ రంగంలో వాణిజ్యానికి తీవ్ర ఆటంకంగా పరిణమించాయి” అని ఎరిక్ చెబుతూ వాటిని తొలగించడానికి ‘నూతన మార్గాలు’ వెతకాల్సిన అవసరం ఉంది అని ఆయన పేర్కొన్నాడు.
అదీ సంగతి! విదేశీ పెట్టుబడులవలన ఇండియాకి ఏదో ఒక రూపంలో లాభాలు ఉండాలి. ఆ పెట్టుబడులపై విధించే సుంకాలు ఆ ఆదాయాల్లో ముఖ్యమైన భాగం. విదేశీ పెట్టుబడులు రావాలంటే ఇండియా తన రెవిన్యూ ఆదాయాన్ని తగ్గించుకొని త్యాగం చేస్తే తప్ప రావడం కుదరదని అమెరికా అధికారి బహిరంగానే చెబుతున్నాడు. “రౌతు మెత్తనైతే, గుర్రం మూడు కాళ్ళమీద నడుస్తుందని” సామెత. అమెరికా, తాను స్వయంగా అమలు చేయని అనేక విధానాలను, సూత్రాలను అనేకం ఇతర దేశాలపై రుద్దుతుంది. ఇండియాలోకి ప్రవేశించడానికి పన్నులేవీ ఉండకూడని డిమాండ్ చేసే అమెరికా అమెరికాకి వచ్చే పెట్టుబడులపై మాత్రం రహస్య టారిఫ్‌లు విధించడానికి సిద్ధంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యాలు సమానత్వం ప్రాతిపదికన జరగాల్సిన అవసరాన్ని అమెరికా ఏ మాత్రం గౌరవించదనడానికి ఇదో మచ్చుతునక.
