ప్రమాద దశకు యూరప్ అప్పు సంక్షోభం, ఇటలి అప్పు సంక్షోభంపై ఎమర్జెన్సీ సమావేశం?


యూరప్ అప్పు సంక్షోభం ప్రమాద దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్‌ దేశాల్లో మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధను కలిగి ఉన్న ఇటలీ అప్పు గురించి చర్చించడానికి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు హెర్మన్ వాన్ రోంపీ సోమవారం ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. రోంపి ప్రతినిధి సోమవారం నాటి సమావేశంలో ఇటలి గురించి చర్చించడం లేదని చెబుతున్నప్పటికీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు అధికారులు ఇద్దరు ఇటలీ గురించి చర్చించడానికే సమావేశమని చెప్పినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. రోంపీ ప్రతినిధి డిర్క్ దే బేకర్ ని సోమవారం సమావేశంలో చర్చించనున్న అంశం గురించి ప్రశ్నించగా సమాధానం చెప్పడానికి నిరాకరించాడని రాయిటర్స్ తెలిపింది. “అది సమన్వయం. సంక్షోభ సమావేశం కాదు” అని ఆయన అన్నాడు.

గత శుక్రవారం జులై 8 తేదీన, షేర్ మార్కెట్లలొ ఇటలీ ఆస్తుల షేర్లు పెద్ద ఎత్తున అమ్మకానికి గురయ్యాయి. దానితో గ్రీసు తర్వాత యూరోజోన్ దేశాల్లో ఆర్ధిక వ్యవస్ధతో పోలిస్తే అత్యధిక అప్పు నిష్పత్తి ఉన్న ఇటలీ, అప్పు సంక్షోభంలో బలి కానున్న తదుపరి దేశమన్న భయాలు పెరిగాయి. గ్రీసు ఆర్ధిక వ్యవస్ధలో ఆ దేశం అప్పు 150 శాతం ఉండగా, ఇటలీ జిడిపిలో ఆ దేశ అప్పు 120 శాతం వరకూ ఉంది. పరిమాణం రీత్యా చూస్తే అమెరికా, జపాన్ ల తర్వాత అత్యంత పెద్ద మొత్తంలో అప్పు కలిగిన దేశం ఇటలీ. ఎమర్జెన్సీ సమావేశంలో గ్రీసుకి అందించవలసి ఉన్న రెండవ బెయిలౌట్ గురించి కూడా చర్చిస్తారని అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్ధ తెలిపింది.

శుక్రవారం ఇటలీ సావరిన్ అప్పు బాండ్లపై మార్కెట్ డిమాండ్ చేస్తున్న వడ్డీ జర్మనీ బాండ్లపై డిమాండ్ చేస్తున్న వడ్డీ కంటే 2.45 శాతం ఎక్కువ నమోదైంది. అంటే ఇటలీ సావరిన్ అప్పు బాండ్లపై వడ్డీ (yield) 5.28 శాతం డిమాండ్ చేశారు. ఈ వడ్డీ 5.5 నుండి 5.7 శాతం వరకూ ఉన్నట్లయితే ఇటలీ అప్పు బాండ్లపై అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందని కొంతమంది బ్యాంకర్లు భావిస్తున్నారు. ఒక దేశం మార్కెట్లోని మదుపుదారుల నుండి అప్పు సేకరించడానికి ఆ దేశ ట్రెజరీ విభాగం ట్రెజరీ బాండ్లను జారీ చేస్తుంది. ఏ దేశమైనా అప్పు సేకరించాలని భావిస్తే ఈ బాండ్లను వేలం వేస్తారు. ఈ బాండ్లను కొన్నవారు ఆ దేశ ప్రభుత్వానికి అప్పు ఇచ్చినట్లు అర్ధం. కొనే సమయంలో పలికే వడ్డీ ఆ బాండు పక్వానికి వచ్చే వరకూ మారదు. కానీ వేలం సమయంలో కొన్నవారు ఆ తర్వాత సెకండరీ మార్కెట్ లో అమ్మకానికి పెట్టే అవకాశం ఉంటుంది. అలా సెకండరీ లేదా ఆ తర్వాత స్ధాయి మార్కెట్ లో అమ్మకానికి పెట్టినపుడు అధిక వడ్డీ డిమాండ్ చేస్తారు. అంటే యీల్డ్ ను ఎక్కువ డిమాండ్ చేస్తారు.

ఇలా యీల్డ్ పెరిగితే ఆ దేశం మళ్ళీ తాజాగా అప్పు సేకరించడానికి ఎక్కువ యీల్డ్ ఇవ్వవలసి ఉంటుంది. ఇలా యీల్డ్ పెరుగుతూ పోతే మార్కెట్ నుండి ఇక అప్పులు సేకరించలేని స్ధాయికి చేరుకుంటుంది. అలా అప్పులు దొరకని పరిస్ధితినే అప్పు సంక్షోభం అంటున్నారు. మార్కెట్ లో చెల్లించగల స్ధాయి వడ్డీతో అప్పు సేకరించలేని స్ధితికి చేరుకున్నందున గ్రీసు, ఐర్లండ్, పోర్చుగల్ దేశాలకు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు కలిసి ప్రత్యేక అప్పు ప్యాకేజి మార్కెట్ కంటె తక్కువ వడ్డీకి సరఫరా చేస్తూ దానికి బెయిలౌట్ అంటున్నారు. తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చినప్పటికీ ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు సంక్షోభంలో ఉన్న దేశాలపైన విషమ షరతులను విధిస్తున్నాయి.

ఈ షరతుల ద్వారా సంక్షోభంలో ఉన్న దేశాల్లొని ప్రభుత్వ రంగ కంపెనీలన్నింటినీ ప్రవేటీకరణ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ దేశ ఉద్యోగుల జీతాల్లో కొత విధించడం, పెన్షన్ల భారం ప్రభుత్వం పైనుండి పాక్షికంగా తొలగించి ఉద్యోగులపైనే వేయడం, ఉద్యోగులకున్న సంక్షేమ సదుపాయాలను రద్దు చేయమనడం మొదలైన విషమ షరతులు విధించి అవి మరింత సంక్షోభంలో కూరుకు పోవడానికి దోహదం చేస్తున్నాయి. ఆ షరతుల ద్వారా ఇ.యులోని ధనిక దేశాల బహుళజాతి కంపెనీలు, బ్యాంకులకు లబ్ది చేకూరేలా చేసుకుంటున్నాయి. అంటే ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు సంక్షోభం పరిష్కారానికి ఇచ్చే బెయిలౌట్ వలన మరింత నష్టం తప్ప లాభం లేకుండా పోయింది. దాని బదులు ఆ దేశాలు యూరోజోన్ నుండి బైటికి వచ్చి తమ స్వంత కరెన్సీ పునరుద్ధరించు కోవడం మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. గ్రీసు త్వరలో యూరోజోన్ నుండి బైటికి రావడం ఖాయమని చాలా మంది భావిస్తున్నారు.

ఇప్పటివరకూ గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలు పైన చెప్పిన విధంగా ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల బెయిలౌట్ పొందాయి. గ్రీసు గత సంవత్సరం మొదటి బెయిలౌట్ పొందినప్పటికీ, బడ్జెట్ లోటు అనుకున్నంతమేరకు తగ్గించలేక పోవడంతో పాత బెయిలౌట్ స్ధానంలో కొత్త బెయిలౌట్ అవసరమైందని చెబుతున్నారు. కాని గ్రీసుకు కొత్త బెయిలౌట్ లో ప్రవేటు మదుపుదారులు కూడా భాగం పంచుకోవాలని జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియా లాంటి దేశాలు పట్టుబడుతున్నాయి. ప్రవేటు మదుపుదారులు భరించవలసిన మొత్తం, దానికి సంబంధించిన విధి విధానాల్లో తీవ్ర భేదాభిప్రాయాలు తలెత్తి చర్చలు పీడముడి పడిపోయాయి.

గ్రీసు సంగతి ఇలా ఉండగానే ఇటలీ అప్పుపై మార్కెట్ లో భయ సందేహాలు తలెత్తాయి. వాస్తవానికి పోర్చుగల్ తర్వాత స్పెయిన్ సంక్షోభం లో కూరుకు పోవచ్చని భావించినప్పటికీ ఆ దేశం పొదుపు బడ్జెట్ ఆమోదించి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు విధించే షరతులను ప్రభుత్వ స్ధాయిలోనే అమలు చేయడంతో మార్కెట్ లో అప్పులు సేకరించ గలిగింది. ఇక తర్వాతి వంతుగా ఇటలీ రంగం మీదికి వచ్చింది. ఇటలీ ఆర్ధిక వ్యవస్ధ పెద్దది కావడంతో దానికి ఇవ్వవలసిన బెయిలౌట్ కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇటలీకి బెయిలౌట్ ఇవ్వడం ఒక సవాలుగా మారుతుంది. ఈ సవాలును ఎలా అధిగమిస్తారొ వేచి చూడవలసిందే. ఈ సంక్షోభాల వలన పెట్టుబడిదారీ వ్యవస్ధ సారాంశం, ఒక సంక్షోభం నుండి మరొక సంక్షోభానికి ప్రయాణం చేయడమేనని బాగా అర్ధం అవుతోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s