పాకిస్ధాన్ నిలిపివేసిన 800 మిలియన్ డాలర్లు, అమెరికా పాక్‌కి సంవత్సరానికి అందించే సహాయంలో మూడోవంతని “ది న్యూయార్క్ టైమ్స్” పత్రిక తెలిపింది. గత శరత్కాలం ఐ.ఎం.ఎఫ్ కి పాకిస్ధాన్ సమర్పించిన నివేదిక ప్రకారం 2010-2011 సంవత్సరానికి గాను పాకిస్ధాన్ మిలట్రీ ఖర్చు 6.41 బిలియన్ డాలర్లని బిబిసి తెలిపింది. ఇది అంతకు ముందు సంవత్సరం కంటె 1.27 బిలియన్ డాలర్లని తెలిపింది. సి.ఐ.ఎ గూఢచారులను పాకిస్ధాన్ బహిష్కరించినందుకు అమెరికా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి కూడా ఈ “సహాయం నిలిపివేత” చర్య ఉద్దేశించినదని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. టెర్రరిజంపై పాకిస్ధాన్ యుద్ధాన్ని మరింత తీవ్రం చేయాలని ఒత్తిడి చేయడానికి కూడా అమెరికా ఈ చర్య తీసుకుందని ఆ పత్రిక తెలిపింది.
అమెరికా నిలిపివేసిన సహాయంలో కొంత భాగం, వేరే ప్రాంతాల్లో మొహరించి ఉన్న పాక్ సైన్యాన్ని ఆఫ్ఘన్ సరిహద్దులకు తరలించడానికి అయిన ఖర్చులను తిరిగి చెల్లించడానికి ఉద్దేశించినదని టైమ్స్ తెలిపింది. మిగిలినది మిలట్రీ పరికరాల కొనుగోలుకు ఉద్దేశించినదని తెలిపింది. అంటే అమెరికా చెబుతున్న “సహాయం”, నిజానికి సహాయం కాదనీ, అది పాకిస్ధాన్‌కి అయిన ఖర్చుల్ని తిరిగి చెల్లించడమేనని అర్ధం అవుతోంది. నువ్వు నాకు ఫలానా పని చేసి పెడితే దానికైన ఖర్చు నేను భరిస్తానని చెప్పిన అమెరికా, తీరా పాకిస్ధాన్ ఆ పని చేసి పెట్టాక అందుకైన ఖర్చును చెల్లించకుండా ఎగనామం పెడుతున్నదని దీనిని బట్టి అర్ధం అవుతోంది. అమెరికాతో స్నేహ సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం పెట్టుకున్న దేశాలన్నీ ఇటువంటి అనుభవాలు చవిచూసినవే. అమెరికా పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ కి ఏ గతి పట్టిందో కళ్ళెదుట కనపడుతోంది. పశ్చిమ దేశాలతో సాంగత్యం పెట్టుకోకుండా ఉన్నన్నాళ్ళూ స్వతంత్రంగా బతికిని లిబియా, గత ఐదు సంవత్సరాల్లో అమెరికా, యూరప్‌లతో స్నేహ సంబధాలు పెట్టుకున్నాక ఆ దేశ పరిస్ధితి కూడా కళ్ళెదుటే ఉంది.
అమెరికా రక్షణ విభాగం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది. “పాక్‌లో మా శిక్షకులు (ట్రైనర్లు – సి.ఐ.ఏ గూఢచారులను అమెరికా ఇలా సంబోధిస్తోంది), సిబ్బంది అస్తిత్వం బాగా తగ్గిపోయాక, మా శిక్షణ, మద్దతులను శక్తివంతం కావించడానికి తోడ్పడే సహాయాన్ని మేమిక ఇవ్వడానికి వీలు కాదు” అని. దీన్ని బట్టి అమెరికా స్నేహ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికని చెబుతూ పాక్‌పై కర్ర పెత్తనానికి దిగుతున్నదని స్పష్టమవుతోంది. కాని మెజారిటీ సహాయాన్ని నిలిపి వేశాక పాకిస్ధాన్ నుండి సహకారం కొనసాగుతుందా అన్నది అనుమానాస్పదమైన విషయం. పాక్ భూభాగంపై రక్షణ పొందుతున్న తాలిబాన్, ఆల్-ఖైదా లపై పోరాటానికి పాకిస్ధాన్ సహాయం అత్యవసరమని నొక్కి చెప్పే అమెరికా మాటల్లోని యధార్ధత కూడా ఇప్పుడు అనుమానాస్పదంగా మారిందనడంలో అతిశయోక్తి లేదేమో!
బిన్ లాడెన్, పాకిస్ధాన్‌లో మిలట్రీ అకాడమీకి చేరువగానే స్ధావరం ఏర్పాటు చేసుకోవడం పట్ల అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఒకింత ఆగ్రహంతో ఉన్నారనీ, పాక్‌కి సాయం కొనసాగింపుపై వారు ప్రశ్నలు లేవనెత్తారనీ, వారిని సంతృప్తి పరచడానికే తాజా చర్య అనీ కొద్దిమంది చెబుతున్నారు. కాని అమెరికా బహిరంగంగా చేపట్టిన చర్య పాక్ ప్రభుత్వమూ, మిలట్రీ లతో పాటు పాకిస్ధాన్ ప్రజలకు మరింత అవమానకరమైనదిగా ఉంది. ఇటీవల పాకిస్ధాన్‌లో చేసిన సర్వేలో 69 శాతం ప్రజలు అమెరికాతో స్నేహం పాకిస్ధాన్ కి నష్టకరమనీ, ఆ దేశం పాకిస్ధాన్‌కి మిత్ర దేశం కాదని శతృదేశమేననీ అభిప్రాయపడినట్లుగా బిబిసి తెలిపింది. సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు తమకింతవరకూ సమాచారం లేదని పాక్ మిలట్రీ అధికారులు చెప్పినట్లు ఇస్లామాబాద్ బిబిసి విలేఖరి తెలిపారు. అమెరికా చేసే మిలట్రీ సహాయాన్ని పౌరుల ఉపయోగం నిమిత్తం తరలించమని తామిప్పటికే కోరామని కూడా వారు తెలిపినట్లు తెలుస్తోంది.
అమెరికాలో పాకిస్ధాన్ రాయబారిగా గతంలో పని చేసిన ‘మీలీహా లోధి” ఈ విషయంపై స్పందిస్తూ “ఈ చర్యతో అమెరికా పాకిస్ధాన్ మిలట్రీపై గల ప్రభావాన్ని కోల్పోతుంది. పాక్ ప్రజలతో కూడా సంబంధాలు కోల్పోతుంది. ఎందుకంటే ఈ చర్యని పాకిస్ధాన్ కి ప్రోత్సాహంగా చూడ్డానికి బదులు పాకిస్ధాన్‌కి విధించిన శిక్షగానే అంతా చూస్తారు. కొన్ని నెలలుగా బలహీనపడిన సంబంధాలను పునఃనిర్మించుకునే పద్దతి ఇది కాదు” అని ఈసడించుకుంది. అమెరికా మిలట్రీ అధికారి మైక్ ముల్లెన్ ఇటీవల మాట్లాడుతూ పాక్ విలేఖరి షహజాద్ హత్య వెనుక నేరుగా పాకిస్ధాన్ ప్రభుత్వాధికారులే ఉన్నారని ఆరోపించాడు. పాక్ విదేశీ మంత్రి ఫిరదౌస్ ఆషిక్ ఈ ప్రకటనను “పూర్తి బాధ్యతారాహిత్యంగా, బాధాకరమైనదిగా” అభివర్ణించాడు. ఇటువంటి మాటలు టెర్రరిజంపై పోరాటంపై ప్రభావం కలిగిస్తాయని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించింది.
పాకిస్ధాన్ ఇప్పటికైనా అమెరికాతో స్నేహ సంబంధాలు తెంపుకోవటం అన్నింటికంటే ఉత్తమం. ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా సైనిక స్ధావరాలు ఉండడం ఒక్క ఆఫ్ఘనిస్ధాన్ ప్రయోజనాలకే గాక పాకిస్ధాన్, ఇండియాల ప్రయోజనాలకు కూడా తీవ్ర భంగకరం.
