మరోసారి నిరవధిక ఆందోళనలో ఈజిప్టు ప్రజానీకం, ముబారక్ అవశేషాల కోనసాగింపుపై ఆగ్రహం


Demonstrators chant slogans at Tahrir Square in Cairo

ఈజిప్టు రాజధాని కైరోలోని తాహ్రిరి కూడలిలో నినాదాలిస్తున్న యువతి

18 రోజుల నిరవధిక దీక్షతో 30 సంవత్సరాల నియంతృత్వ పాలనను కూలదోసి, నియంత ముబారక్‌ను జైలుపాలు చేసిన ఈజిప్టు ప్రజానీకం మరొకసారి పోరాటబాట చేపట్టారు. ఈజిప్టు విప్లవం చేసిన డిమాండ్లను నెరవేర్చడంలో తాత్కాలిక సైనిక ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదనీ, డిమాండ్లు నెరవేర్చడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయడం లేదనీ ఈజిప్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈజిప్టు విప్లవం ప్రారంభ కాలంలో నిరసనకారులను కాల్చి చంపడానికి కారణమైన సైనికాధికారులనూ, పోలీసులనూ విచారించడం లేదనీ, వారిని స్వేచ్ఛగా వదిలేస్తున్నారనీ పైగా నిరసన కారులపై మాత్రం నేరాలు మోపి జైలుకు పంపిస్తున్నారనీ వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు, న్యాయ వ్యవస్ధలొ ముబారక్ అనుచరగణం ఇంకా ఉన్నదనీ వారు ముబారక్ పాలనలో ముఖ్యులను విచారించి శిక్షించడానికి సుముఖంగా లేరనీ, కావున వారిని వెంటనే ఆ పదవుల నుండి తొలగించాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు.

గత శుక్రవారం ప్రార్ధనల అనంతరం ప్రారంభించిన ఆందోళనలను కొనసాగించడానికి ఈజిప్టు ఆందోళనా సంస్ధలు నిర్ణయించాయి. ఈజిప్టు రాజధాని కైరో తో పాటు అలెగ్జాండ్రియా, సోయజ్ లాంటి పట్టణాల్లో కూడా వారు పట్టణ ప్రధాన కూడళ్ళను ఆక్రమించి గుడారాలను నిర్మించారు. శుక్రవారం నుండి బైఠాయింపును కొనసాగిస్తున్నారు. కైరో నగరంలోని తాహ్రిరి స్క్వేర్ ను ఆక్రమించుకుని ఇతరులు లోనికి రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు గానీ, సైన్యంగాని లోపలికి రాకుండా కాపలా కాస్తున్నారు. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఈజిప్టులోని సంపద్వంతమైన ఉత్తర ప్రాంతంతో పాటు దక్షిణ ప్రాంతంలోని చిట్ట చివరి పట్టణాలకు కూడా నిరసనలు వ్యాపించాయి. దేశం మొత్తం సైనిక ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని ఎండగట్టడానికి నిర్ణయించినట్లుగా నిరసనలు, ఊరేగింపులూ నిర్వహిస్తున్నారు.

ఐ.ఎ.ఇ.ఎ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఎల్ బరాదీ “పాలకులకీ ప్రభుత్వానికి మధ్య అంతరం తీవ్రంగా పెరిగింది. విప్లవం చేసిన డిమాండ్లకు వెంటనే, నిర్ణయాత్మక స్పందన కావాలి” అని ట్విట్టర్ లో శనివారం రాసుకున్నాడని “ది హిందూ” పత్రిక తెలిపింది. విప్లవ ఫలితాలు అమలు కాకుండా నిలిపివేశారని ప్రజలు ముక్త కంఠంతో నిరసిస్తున్నారని ఆ పత్రిక తెలిపింది. ముబారక్ కాలం నాటి కీలకమైన శక్తులు న్యాయవ్యవస్ధలోనూ, పోలీసుల్లోనూ, సివిల్ సర్వీసుల్లోనూ కూడా ఇంకా కొనసాగుతున్నారని ప్రజలు తిట్టిపోస్తున్నారు. వారందరినీ తొలంగించాలని డిమాండ్ చేస్తున్నారు. 900 మందికి పైగా విప్లవ కారులను చంపడంలో ముఖ్య పాత్ర పోషించిన పోలీసు అధికారులు, ఇతర ముబారక్ కాలం నాటి అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి సైనిక జనరళ్ళ కౌన్సిల్ మీన మేషాలు లెక్కిస్తోందని అసలు వారికా ఉద్దేశ్యం లేనట్లు కనిపిస్తోందని వివిధ ప్రజా సంఘాలు సంస్ధలు ఆరోపిస్తున్నాయి.

విప్లవానంతరం వివిధ సెక్యులరిస్టు సంస్ధల మధ్యనా, ముస్లిం బ్రదర్ హుడ్ సంస్ధతోనూ విభేధాలు తలెత్తాయి. ఎన్నికలు ఎంత త్వరగా నిర్వహించాలన్నదానిపై విభేధాలు కేంద్రీకృతమయ్యాయి. ముస్లిం బ్రదర్ హుడ్ ఎన్నికలకు సర్వ సన్నద్ధంగా ఉండడంతో అది ప్రకటించినట్లుగానే సెప్టెంబరులో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాది. ఇతతులు, కొన్ని సెక్యులరిస్టు సంస్ధలు సెప్టెంబరు నాటికి వివిధ రాజకీయపార్టీలు సిద్ధం కాకపోవచ్చనీ కనుక ఎన్నికలు మరికొంతకాలం వాయిదా వేయాలనీ కోరుతున్నారు. సైనిక కౌన్సిల్ కూడా ఎన్నికల్ని వాయిదా వేయబోమనీ ప్రకటించింది. ఈ విభేధాలన్నింటినీ ప్రస్తుతానికి పక్కనబెట్టాలనీ విప్లవ డిమాండ్లను ఆమోదింపజేసుకోవడంలో ఐక్యంగా వ్యవహరించాలని ఆయా సంస్ధలు నిర్ణయించుకున్నాయని తెలుస్తోంది. ఐతే కొన్ని సంస్ధల కార్యకర్తలు శుక్రవారం తర్వాత కూడళ్ళను ఖాళీ చేసి వెళ్ళారని తెలుస్తోంది.

“మనం అన్నింటికంటె పైన ఉన్న భాగాన్ని తొలగించాము గానీ మిగిలినదంతా కదలకుండా అలాగే కొనసాగుతోంది” అని తాహ్రిరి కూడలిలో ఒక రైతు వ్యాఖ్యానించినట్లు రాయిటర్స్ తెలిపింది. “ముబారక్, అతని కుటుంబం, అతని పాలనకు చెందిన సంకేతాత్మక అవశేషాలన్నింటినీ బహిరంగంగా విచారిస్తేనే అది నిజమైన విచారణ” అని తాహ్రిరి కూడలిలోని ఒక బ్యానర్ చెబుతోంది. కూడలిలో ఉన్న ఒక స్టేజ్‌పై ఉన్న మహిళ మైకు చేతిలో పట్టుకుని “ఓ ఫీల్డ్ మార్షల్ తంతావీ! మేమే ఇప్పుడు యజమానులం. బానిసలుగా బతికిన రోజుల పోయాయి” అని మిలట్రీ కౌన్సిల్ అధిపతి జనరల్ తంతావీని ఉద్దేశిస్తూ అరుస్తుండగా చుట్టూ ఉన్న కార్యకర్తలు వంతపాడారు. “మాకు డబ్బులేమీ అవసరం లేదు. మా బంధువులను, సోదరులను, సోదరీమణులను విప్లవంలో పోలీసులు కాల్చి చంపారు. వారి మరణానికి కారణమైన వారిని శిక్షించేవరకూ మేమిక్కడనుండి కదిలేది లేదని సూయజ్ నగరంలోని ప్రధాని కూడలి వద్ద ఉన్న ప్రజలు నినాదాలిస్తున్నారు.

సూయజ్ నగరంలో కూడా నిరవధిక నిరసన దీక్షలో పాల్గొనడానికి వందలమంది ముందుకు వస్తున్నారనీ కైరోలోని తాహ్రిరి కూడలిలోగల నిరసనకారులు చెప్పారు. 150 మంది ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారని తెలిపారు. పాలకులకు రెండు రోజుల సమయం ఇస్తున్నామనీ, లేదంటే సహాయ నిరాకరణోద్యమ మొదలవుతుందనీ, అన్ని నగరాలలోనూ ప్రవేశం బంద్ చేస్తామని చెప్పారు. శనివారం టి.వి లొ మాట్లాడుతూ ఈజిప్టు ప్రధాని షరఫ్ ప్రజలనుద్దేశిస్తూ “ఈజిప్టు పౌరులే మొత్తం ఈజిప్టు సార్వ భౌమత్వానికి, అధికారాలకూ నిఖార్సయిన పునాది” అని ప్రకటించాడు. ఇటువంటి మాటలు ప్రభుత్వ టి.విలో రావడం ముబారక్ కాలంలో ఊహించడానికె వీలు లేనిది. నిరసనకారులపై కాల్పులు జరిపిన భద్రతాధికారులందరినీ సస్పెండ్ చేస్తామని ఆయన ప్రకటించాడు. అవినీతి కేసులు విచారించాలని కోర్టులపై ఒత్తిడి చేస్తానని చెప్పాడు. విప్లవ యువతరంతో చర్చలు జరపడానికి ఓక కమిటీని నియమిస్తున్నానని తెలిపాడు. నిరసనకారులు లేవనెత్తిన ఆరోగ్య సేవలు, ఇళ్ళ నిర్మాణం, విద్యా సౌకర్యాలు లాంటి వివిధ సామాజిక సమస్యల పరిష్కారానికి కమీటీలు వేస్తున్నానని ప్రకటించాడు.

ఐతే ఇవేవీ కైరో లోని నిరసనకారులను సంతృప్తి పరచలేదు. తమ బైఠాయింపు కొనసాగుతుందని వారు తెలిపారు. “మేము దెబ్బలు తినడానికి సిద్ధం. కాని ఇక్కడనుండి వెళ్ళడానికి సిద్ధంగా లేము” అని తెలిపారు. గత సోమవారం, సూయెజ్ నగరంలో నిరసనకారులను చంపడానికి బాధ్యులైన 7గురు పోలీసులను బెయిల్ పైన విడుదల చేశారు. న్యాయమూర్తులు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపిస్తూ చనిపోయినవారి కుటుంబాలవారు, వారి మద్దతుదారులు రెండురోజుల పాటు దాడులు, నిరసనలు, అల్లర్లకు దిగారు. పోలీసులు బెయిల్ పై విడుదల కాగా ముబారక్ పాలనలోని ఇతర అధికారులు అవినీతి కేసులనుండి నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇవన్నీ ఈజిప్టు ప్రజలను ఆగ్రహావేశాలకు గురి చేస్తున్నాయి. తాము మోసగించబడ్డామన్న నిర్ధారణకు రావడానికి దోహదం చేస్తున్నాయి.

దక్షిణాన గల లక్సర్, అస్యూట్ వంటి నగరాల్లో కూడా నిరసన కారులు కూడళ్ళలో గుడారాలు లేపి ఆందోళన చేపట్టారు. ఆ నగరాల్లో మరింతమంది ప్రజలను సమీకరించడానికి వారు ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. “ఇంకా ఎన్నాళ్ళు ఆగాలి?” అని ప్రశ్నిస్తూ వారు నినాదాలిస్తున్నారు. శనివారం మిలిటరీ కౌన్సిల్ నూతన సమాచార మంత్రిని నియమించింది. గతంలో ఆ పదవిలో పనిచేసిన వ్యక్తిని పదవినుంచి తొలగించి అవినీతి ఆరోపణలపై విచారణ నిర్వహీంచారు. అయితే ఆయన ఇటీవలే ఏ నేరం చేయలేదంటూ తీర్పునిచ్చి విడుదల చేశారు. కొత్త మంత్రి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఒక వార్తా పత్రిక ఎడిటర్ గా తెలుస్తోంది. ఐనప్పటికీ సమాచార శాఖామంత్రి నిర్దోషిగా విడుదల కావడం, అవినీతికి పాల్పడలేదని తీర్పునివ్వడం ఈజిప్టు ప్రజలకు బొత్తిగా మింగుడుపడలేదు. “మేము ఇక్కడ ఉన్నంత సేపు ఏదో చేస్తున్నట్లు నటిస్తున్నారు. మేము వెళ్ళీపోయాక చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు. ప్రజలకోసం తమంతట తాము ఏమీ చేయడానికి వారు సిద్ధంగా లేరు’ అని కైరోలో ప్రదర్శనలో పాల్గొన్న ఒక మహిళ ఆరోపించిందని హిందూ పత్రిక తెలిపింది.

ప్రజలు వాస్తవానికి సైనికాధికారుల నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని ఈజిప్టు ప్రజలు కోరుకోలేదు. తాత్కాలిక పౌర ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్పిడి ప్రక్రియ చేపట్టాలని వారు కోరుకున్నారు. కాకుంటే మిలట్రీ తరపున ఒక వ్యక్తి పౌర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించవచ్చని వారు కోరారు. ఎమర్జెన్సీ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. వీటిలో వేటినీ మిలట్రీ కౌన్సిల్ అమలు చేయలేదు. ఎమర్జెన్సీ చట్టాన్ని అలానే కొనసాగిస్తున్నారు. ముబారక్, ఆయన కుటుంబం అవినీతిపై విచారణ జరగడం లేదు. ముబారక్ జబ్బు పడ్దాడని చెబుతూ ఆసుపత్రిలో చేర్చామని చెప్పారు. కానీ ముబారక్ ఆసుపత్రిలో కూడా లేడని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.

ఈజిప్టు విప్లవం విజయవంతం కాకపోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ లు ప్రధాన అడ్డంకిగా మారాయి. ముబారక్‌ని దించడానికి అమెరికా అంత త్వరగా అంగీకరించడం ఇజ్రాయెల్ కి బొత్తిగా మింగుడు పడలేదు. కాని ముబారక్ ని గద్దె దించనట్లయితే పరిస్ధితి తమ చేతుల్లోంచి జారిపోతుందని అమెరికా బాగానే గ్రహించింది. అందుకే మొదటి నుండీ మిలట్రీని పక్కన ఉంచి ఆందోళనలకారులనుండి మంచి పేరు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది. కాల క్రమంలో ప్రజల్లో ఆందోళనా వేడి తగ్గుతుందని భావించినట్లుంది. కాని ఈజిప్టు ప్రజానీకం మళ్ళీ ఆందోళనకు సిద్ధమైంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఆధ్వర్యంలో ఈజిప్టు తాత్కాలిక ప్రభుత్వం నడిచినంతకాలం ఈజిప్టు ప్రజల డిమాండ్లు నెరవేరే అవకాశాలు లేవనే చెప్పాల్సి ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s