పాంజ్‌షిర్ రాష్ట్రంలోని దారా జిల్లాలో కాబూల్‌కి ఉత్తరంగా 99 కి.మీ దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆఫ్ఘన్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి మహమ్మద్ ఖాసిం జంగల్‌బాగ్ వెల్లడించిన ఈ ఘటనను నాటో ప్రతినిధి అమెరికా సైనిక లెఫ్టినెంట్ కల్నల్ డేవిడ్ డోహెర్తీ ధృవీకరించాడని పత్రిక తెలిపింది. తన ఇంటిముందు నిలబడి ఉన్న అమానుల్లా అటుగా వెళ్తున్న కాన్వాయ్‌ని ఆపి గొడవ పెట్టుకున్నాడనీ, చూస్తుండగానే కాల్పులు ప్రారంభించాడనీ పోలీసు ఛీఫ్ జంగల్‌బాగ్ తెలిపాడు. తాజా మరణాలతో 2011లో చనిపోయిన నాటో సైనికుల సంఖ్య 282కి పెరిగింది. జులై నెలలో మరణాల సంఖ్య 11 కి పెరిగింది. ప్రధానంగా డ్రోన్ విమానలపై ఆధారపడుతున్న అమెరికా సైన్యం, యుద్ధ ఘటనలు కాని ఘటనల్లో ఈ విధంగా అధిక నష్టాన్ని ఎదుర్కొంటున్నది.
తాలిబాన్ ఆఫ్ఘన్ ప్రభుత్వ సైన్యం లోకి జొరబడటం, అప్పటికప్పుడు తలెత్తే తగాదాలు తీవ్ర రూపం దాల్చటం లాంటి కారణాలను నాటో అధికారులు ఇటువంటి ఘటనలకు కారణాలుగా చూపుతున్నారు. సెప్టెంబరు 2007 నుండీ ఇటువంటి ఘటనలు 70 వరకు జరిగాయని నాటో చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఇవి ఇంకా అధికంగా ఉంటాయని తాలిబాన్ ప్రకటనలను బట్టి తెలుస్తున్నది. దురాక్రమణ కొనసాగుతున్న కొద్దీ ఈ ఘటనలు పెరుగుతూ పోతున్నాయని నాటో అధికారులే చెబుతున్నారు. ఫలితంగా నాటో బలగాలు నైతిక స్ధైర్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని వారు చెబుతున్నారుని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. దానితో అదనపు శిక్షణా టెక్నిక్కులను, వడపోత పద్ధతులను అమలు చెస్తున్నామని వారు చెబుతున్నారు.
పోలీసు అధికా జంగల్‌బాగ్ ప్రకారం అమానుల్లా, ఆఫ్ఘనిస్ధాన్ గూఢచార విభాగంలోని రెండవ ర్యాంకు అధికారి ఐన జనరల్ అస్సమ్ దిన్ అస్సమ్ వద్ద బాడీగార్డుగా పని చేస్తున్నాడు. ‘నేషనల్ డైరెక్టరేట్ ఫర్ సెక్యూరిటీ’ లో అస్సమ్ డెప్యుటీ డైరెక్టర్ గా పని చేస్తున్నాడని తెలిపాడు. పాంజ్‌షీర్ రాష్ట్రం ఆఫ్ఘనిస్ధాన్‌లో ఉన్న అత్యంత భద్రత కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా నాటో పరిగణిస్తోంది. త్వరలో ఆఫ్ఘన్ భద్రతా బలగాలకు అప్పగించే రాష్ట్రాల్లో పాంజ్‌షీర్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో తజిక్ తెగవాళ్ళు ఎక్కువగా నివసిస్తారని తెలుస్తోంది. తాలిబాన్ ప్రధానంగా పష్తూన్ తెగవారు ఉండే గ్రూపు. పష్తూన్లు తూర్పు, దక్షిణ ఆఫ్ఘనిస్ధాన్‌లో ఎక్కువగా నివసిస్తారు. తజిక్ తెగ అధికంగా ఉండే రాష్ట్రంలోనే నాటో దళాలకు రక్షణ లేకపోవడాన్ని బట్టి విదేశీ సైనికుల అస్తిత్వాన్ని ఆఫ్ఘనిస్ధాన్‌లో ఎవరూ కోరుకోవడం లేదని అర్ధం అవుతోంది.
