ప్రపంచ పటంలోకి మరొక కొత్త దేశం వచ్చి చేరింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన రిఫరెండంలో దక్షిణ సూడాన్ ప్రజలు 90 శాతానికి పైగా కొత్త దేశాన్ని కోరుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని అమలు పరుస్తూ జులై 9, శనివారం తెల్లవారు ఝాము ప్రారంభ క్షణాల్లో దక్షిణ సూడాన్ ను ఏర్పాటు చేస్తూ ప్రకటన జారీ అయింది. ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు బాన్ కి మూన్, ఐక్య సూడాన్ అధ్యక్షుడు ఆల్-బషర్, 30 ఆఫ్రికా దేశాల ప్రతినిధుల సమక్షంలో నూతన దేశం ఏర్పాటు చేస్తూ ప్రకటన జారీ అయింది. నూతన దేశం “రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్” గా పిలవబడుతుంది. అనేక సంవత్సరాల పాటు సాగిన అంతర్యుద్ధం చివరికి 2005 నాటి శాంతి ఒప్పందంతో ముగిసింది. దక్షిణ సూడాన్‌లో ప్రత్యేక దేశ ఏర్పాటుపై రిఫరెండం నిర్వహించాలని ఆ ఒప్పందంలొని ప్రధాన అంశం.
ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయన్నది వివాస్పద అంశం. ఐక్యరాజ్య సమితిలో 192 దేశాలు సభ్యత్యం కలిగి ఉన్నాయి. వాటికన్, కొసోవో, తైవాన్ లు సమితి సభ్యత్వం ఉన్న దేశాలుగా పరిగణించరు. 1971 వరకు తైవాన్ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్యం కలిగి ఉంది. ఆ సంవత్సరంలొ తైవాన్ స్ధానంలో చైనా సభ్య దేశంగా చేరింది. తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి చైనా అంగీకరించదు. తైవాన్ తన భూభాగంగానే చైనా పరిగణిస్తుంది. 1949లో చైనాలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం అయ్యాక అప్పటివరకు చైనాను పాలించిన కొమింగ్‌టాంగ్ పార్టీ నాయకుడు చాంగ్-కై-షేక్ నాయకత్వంలోని ధనిక వర్గం చైనానుండి పారిపోయి తైవాన్ చేరుకుని ప్రత్యేక దేశం ప్రకటించుకున్నారు. చైనాలోని కమ్యూనిష్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తైవాన్‌ని అసలైన దేశంగా సమితి గుర్తించి సభ్యత్వాన్ని మంజూరు చేసింది. ఆ పరిస్ధితి 1971 లొ తిరగబడింది. కోసోవో, వాటికన్, తైవాన్ లను కలుపుకుంటే దక్షిణ సూడాన్ 196 వ దేశం అవుతుంది. ఐక్యరాజ్య సమితిలో 193 వ దేశంగా నమోదవుతుంది.
శుక్రవారం అర్ధ రాత్రి 12 గంటలు దాటాక దక్షిణ సూడాన్ దేశ అస్తిత్వం ప్రారంభమయ్యింది. కొత్త దేశాన్ని మొదటి సారిగా ఉత్తర సూడాన్ గుర్తించింది. అనంతరం ఈజిప్టు గుర్తించింది. కొత్త దేశంతో ఈజిప్టుకు నైలు నదీ జలాల సమస్య ఇప్పటికే ఏర్పడింది. వలసపాలన కాలంలో కుదుర్చుకున్న నైలునదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని సూడాన్ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. దక్షిణ సూడాన్ ప్రజలు ప్రస్తుతం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. దక్షిణ సూడాన్ పార్లమెంటు స్పీకర్ జేమ్స్ వాని ఇగ్గా, స్వాతంత్ర్య ప్రకటన చదివి కొత్త దేశం ఆవిష్కరణను ప్రకటించాడు. దక్షిణ సూడాన్ ప్రధమ అధ్యక్షుడు సల్వా కీర్, సివిల్ వార్ హీరో అయిన జాన్ గారంగ్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు.
కొత్త దేశం ఏర్పాటయినప్పటికీ ఉభయ సూడాన్ లు పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయి. సరిహద్దు సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. సరిహద్దు వద్ద ఉత్తర సూడాన్ లో గల డ్వార్ఫర్ తిరుగుబాటు చల్లారలేదు. వారు కూడా దక్షిణ సూడాన్ స్వాతంత్ర్య ప్రకటనలో పాల్గొనడం విశేషం. ఉత్తర సూడాన్ లో ఒక మిలియన్ దక్షిణ సూడానీయులు మిగిలే ఉన్నారు. ఉత్తర సూడాన్ ముస్లింలు అధికంగా గల దేశం కాగా దక్షిన సూడాన్ క్రిస్టియన్లు అధికంగా గల దేశం. దక్షిణ సూడాన్ ఆయిల్ నిల్వలు బాగా ఉన్న ప్రాంతం. దీనికి పశ్చిమ దేశాల మద్దతు ఉంది. దక్షిణ సూడాన్ లో గల ఆయిల్ నిల్వలు, క్రిస్టియన్లు మెజారిటీగా ఉండటంతో దక్షిణ సూడాన్ ప్రత్యేక దేశ కాంక్షకు సులభంగా మద్దతు లభించింది.
దక్షిణ సూడాన్ స్వతంత్ర ప్రకటనలో ఐక్య సూడాన్ అధ్యక్షుడు ఒమర్ హస్సన్ ఆల్-బషర్ పాల్గొనడం అక్కడ ఉన్న పశ్చిమ దేశాల నాయకులకు ఇబ్బంది కలిగించే విషయం. ఎందుకంటే, పశ్చిమ దేశాల పక్షపాతి అయిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు బషర్ పై డార్ఫర్ లో యుద్ధ నేరాలకు పాల్పడ్డాన్న ఆరోపణతో అరెస్టు వారంటు జారీ చేసింది. ఐ.సి.సి లిబియా అధ్యక్షుడు గడ్దాఫీ పైన కూడా ఇటీవల అరెస్టు వారాంట్ జారి చేసింది. ఈ కోర్టుకి ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో అమెరికా తదితర పశ్చిమ దేశాలు పాల్పడిన అమానుషమైన యుద్ధ నేరాలు కనపడవు.
