
శుక్రవారం పత్రికల సమావేశం నిర్వహించిన కపిల్ సిబాల్, తాను యు.ఎస్.ఒ నిబంధనల ప్రకారమే వ్యవహరించానని తెలిపాడు. తనపై వ్యాజ్యంలో చేసిన ఆరోపణలు దురుద్దేశంతో కూడుకున్నవనీ, తన పరువును బజారుకీడ్చే ఉద్దేశంతో చేసినవనీ ఆగ్రహించాడు. అసలు రు.650 కోట్ల పెనాల్టీ విధించడానికి ప్రాతిపదిక ఏంటని ప్రశ్నించాడు. యు.ఎస్.ఒ ఫండ్ కూడా రు.50 కోట్ల పెనాల్టీ మాత్రమే విధించిందనీ దానిని రు.650 కోట్లని ఎలా చెబుతారనీ ప్రశ్నించాడు. అయితే రు.50 కోట్ల పెనాల్టీని యు.ఎస్.ఓ ఫండ్ విధిస్తే దానిని కపిల్ సిబాల్ చెప్పినట్లు రు. 5.5 కోట్లకు తగ్గించిన కారణమేమిటో ఆయన వివరించలేదు. రు.50 కోట్ల పెనాల్టీని రు.650 కోట్లకు ఎలా పెంచుతారని ప్రశ్నించిన సిబాల్ అదే పెనాల్టీని రు.5.5 కోట్లకు ఎలా తగ్గించాడో చెప్పకుండా తప్పించుకోవడంలోనే ఆయన కొంటెతనం వెల్లడవుతోంది.
“సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వలన నేను చాలా బాధపడుతున్నాను. టెలికం మంత్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రిలయన్స్ కంపెనీకి విధించిన పెనాల్టీని రు.5 కోట్లకు తగ్గించాడని చెప్పడం సరైంది కాదు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని వ్యక్తిగత విభేధాలను పరిష్కరించుకోవడానికి వినియోగించడం తగదు” అని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. వివరాలను వెల్లడిస్తూ ఆయన “ఏ కారణాల వల్లనో” రిలయన్స్ కంపెనీ నవంబరు 2010 నెలలో టెలికం సేవలను ఆపేసిందనీ, డిసెంబరు 21 తేదీన కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేశామనీ తెలిపాడు. పెద్ద మొత్తంలో రు.50 కోట్ల పెనాల్టీ విధిస్తామని బెదిరించారనీ తెలిపాడు.
రు.50 కోట్ల పెనాల్టీ విధిస్తామన్న నోటీసు రిలయన్స్ కంపెనీపై ఒత్తిడి చేయడానికి ఇచ్చినది. నోటీసుతో వారు (కంపెనీ) ఆందోళన చెందారు” అని సిబాల్ తెలిపాడు. చివరికి ఫిబ్రవరి 16 తేదీన ఆపేసిన సేవలను రిలయన్స్ కంపెనీ పునరుద్ధరించిందనీ, రు.5.5 కోట్లను పెనాల్టీగా చెల్లించిందనీ ఆయన తెలిపాడు. యు.ఎస్.ఒ ఫండ్, ఆర్ కాం కంపెనీల మధ్య కుదురిన ఒప్పందం మేరకు సేవలకు అంతరాయం కలిగిన కాలాలను (7 నుండి 45 రోజులు) బట్టి పెనాల్టీని లెక్కించారని ఆయన వివరించాడు. తన మంత్రిత్వ శాఖ అధికారుల నిర్ణయాన్ని తీసిపారేశానని చెప్పడం దురదృష్టకరకనీ, ఒక మంత్రి “నిజాయితీ లేదనీ ప్రవేటు పార్టీలకు మేలు చేసే వాడని” ముద్ర వేసే పరిస్ధితుల్లో ప్రభుత్వాలు పని చేయడం కష్టమనీ ఆయన ఆక్రోశించాడు.
మంత్రి ఇచ్చిన వివరణలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ప్రజల ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేశారనీ, దానిని వ్యక్తిగత విభేధాలను పరిష్కరించుకోవడానికి వాడరాదని కోరిన నేపధ్యంలో పత్రికా విలేఖరులు, ఉద్దేశ్య పూర్వకంగా తనను లక్ష్యం చేసుకుంటున్నారా అని ప్రశ్నించినప్పటికీ ఆయన ఆ విషయాన్ని వివరించలేదని ‘ది హిందూ’ పత్రిక వెల్లడించింది. సి.పి.ఐ.ఎల్ సంస్ధ దాఖలు చేసిన వ్యాజ్యంలో యు.ఎస్.ఒ.ఎఫ్ (యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్) ఒప్పందం, యు.ఎ.ఎస్.ఎల్ ఒప్పందాల నియమ నిబంధనల ప్రకారం ఒక్కో సర్కిల్ కు రు. 50 కోట్ల చొప్పున పెనాల్టీ చెల్లించవలసి ఉందని తెలిపింది. అయితే కపిల్ సిబాల్ రు.50 కోట్ల పెనాల్టీ మాత్రమే విధించారని చెబుతూ “ఒక్కో సర్కిల్ కి రు.50 కోట్ల చొప్పున” అన్న దాన్ని తన వివరనలో విస్మరించాడని అర్ధం అవుతోంది. ఈ తేడాను వివరించే పని కపిల్ సిబాల్ పెట్టుకోలేదు. వ్యక్తిగత విభేధాలన్న ఆరోపణకు కూడా వివరణ ఇవ్వడానికి నిరాకరించాడు.
మాజీ టెలికం మంత్రి ఎ.రాజా తన పదవికి రాజీనామా చేశాక కపిల్ సిబాల్ ఆ శాఖను చేపట్టాడు. వచ్చీ రావడంతోనే ఆయన 2జి స్పెక్ట్రం కేటాయింపుల్లో ప్రభుత్వం ఒక్క పైసా కూడా నష్టపోలేదని ప్రకటించి సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురయ్యాడు. “మంత్రి వర్యులు బాధ్యతగా మాట్లాడ్డం నేర్చుకోమని చెప్పండి” అని సుప్రీం కోర్టు సిబాల్ ప్రకటన అనంతరం స్పందించింది. “వ్యక్తిగత విభేధాలు” అని సిబాల్ ఎవరిని ఉద్దేశించి అన్నాడో ఇక్కడ తెలియడం లేదు. బహుశా తన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు జడ్జిని ఆయన ఉద్దేశించారా లేక సి.పి.ఐ.ఎల్ లో ఎవరినైనా ఉద్దేశించారా అన్నది తెలియడం లేదు. మొత్తం మీద కపిల్ సిబాల్ ఇచ్చిన వివరణ వ్యాజ్యం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి బదులు మరిన్ని ప్రశ్నలను రేకెత్తించింది.
