ప్రవేటు వెల్త్ మేనేజ్‌మెంట్ వ్యాపారంలో ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యుబిఎస్) భారత దేశానికి చెందిన బోంబే స్టాక్ ఎక్ఛేంజ్ (సెన్సెక్స్) సూచిపై గతంలో తాను అంచనా వేసిన లక్ష్యాన్ని బాగా తగ్గించింది. యు.బి.ఎస్ సెన్సెక్స్ సూచి 22,500 పాయింట్లకు చేరుకుంటుందని అంచనా వేయగా, ప్రస్తుతం దానిని 21,000 పాయింట్లకు తగ్గించింది. లాభాల సంపాదనలో ప్రతికూల ఒరవడిలో ఉన్నందున సెన్సెక్స్ లక్ష్యాన్ని తగ్గిస్తున్నట్లుగా అది తెలిపింది.
ఈ సంవత్సరం ప్రారంభం నుండి భారత షేర్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. భారత షేర్ మార్కెట్ల నుండి ఎఫ్.ఐ.ఐ (ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్‌వెస్టర్స్) లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ఈ సంవత్సరారంభం నుండి పెరిగింది. మరే ఇతర ఎమర్జింగ్ దేశం కూడా ఇండియా షేర్ మార్కెట్లు ఎదుర్కొన్నంత నష్టాలను ఎదుర్కోలేదని వ్యాపార వార్తా సంస్ధలు చెబుతున్నాయి. రాయిటర్స్ వార్తా సంస్ధ అందులో ఒకటి.
అమెరికాలో ఆర్ధిక వృద్ధి ఊహించని విధంగా నెమ్మదించడం, జపాన్ లోని ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగడంతో జపాన్ ఆర్ధిక వ్యవస్ధలో ఉత్పత్తి, డిమాండ్ లు క్షీణించడం, చైనాలో కూడా వడ్డీ రేట్ల పెంపుదల వలన వృద్ధి రేటు నెమ్మదించడం, యూరప్ అప్పు సంక్షోభం మరోసారి ఉధృతం కావడం ఇవన్ని కారణాల వలన భారత షేర్ మార్కెట్లపై ప్రభావం చూపాయని విశ్లేషకుల అంచనా. అయితే వీటి ప్రభావం ఇతర దేశాల మార్కెట్లపై ఉన్నప్పటికీ అవి ఇండియా ఎదుర్కొన్నంత తీవ్రంగా నష్టాలను ఎదుర్కోవడం లేదు.
భారత రిజర్వ్ బ్యాంకు ఇప్పటికి 11 సార్లు వడ్డీ రేట్లను పెంచింది. ద్రవ్యోల్బణం అత్యధిక స్ధాయిలో కొనసాగుతుండడంతొ దాన్ని కట్టడి చేయడానికి వడ్డీ రేట్లను పెంచేందుకు మొగ్గు చూపింది. షార్ట్ టర్మ్ లో కొంత ఆర్ధిక వృద్ధి కోల్పోయినప్పటికీ ద్రవ్యోల్బణం అంతకంటే ప్రమాదమని బ్యాంకు తెలిపింది. కానీ ద్రవ్యోల్బణం మాత్రం అదుపులోకి రాలేదు. ద్రవ్యోల్బణం సూచించే అధిక ధరలు ఒకవైపు, వడ్డీ రేట్ల పెంపుదల వలన క్రెడిట్ రేటు కూడా పెరగడంతో ఆర్ధిక వ్యవస్ధలో క్రెడిట్ లభ్యత కఠినంగా మారి అది ఆర్ధిక వృద్ధి పైన ప్రభావం చూపుతోంది. దరిమిలా షేర్ మార్కెట్లు కూడా తీవ్రంగా ఒడిదుడుకలకు లోనవుతున్నాయి. ఫలితమే సెన్సెక్స్ లక్ష్యం తగ్గింపు.
