భారత దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు జూన్ 24 తో ముగిసిన వారంతో పోలిస్తే జులై 1 తో ముగిసిన వారంలో 2.17 శాతం పెరిగాయి. జూన్ 24 అన్ని రకాల విదేశీ మారక ద్రవ్య నిల్వలు మొత్తం 309.020 బిలియన్ డాలర్లు ఉండగా అది జులై 1 కి 315.715 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత రిజర్వ్ బ్యాంకు శుక్రవారం విడుదల చేసిన వారం వారీ ప్రకటనలో తెలిపింది. డాలర్లలో లెక్కించిన విదేశీ మారక ద్రవ్య నిల్వలను వివిధ అంతర్జాతీయ కరెన్సీలలో ఏర్పడిన తగ్గుదల, హెచ్చుదల లను పరిగణలోకి తీసుకుని లెక్కించినవని ఆర్.బి.ఐ తెలిపింది.
ఈ నిల్వలలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐ.ఎం.ఎఫ్) లో ఇండియాకి ఉన్న రిజర్వ్‌డ్ ట్రాంచి పొజిషన్ కూడా కలిసి ఉన్నాయని ఆర్.బి.ఐ తెలిపింది. వీటితో పాటు బంగారం నిల్వలు, ఐ.ఎం.ఎఫ్ లోనే ఇండియాకి ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కూడా కలిసి ఉన్న విషయాన్ని పై పట్టికలో గమనించవచ్చు. గత సంవత్సరం జులై 2 నాటికి 278,267 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉన్న విషయం పట్టిక ద్వారా తెలుస్తోంది. అంటె క్రితం సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం నిల్వలు 37.448 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఇది 13.46 శాతం పెరుగుదలకు సమానం.
