ఒక వైపు 2జి కుంభకోణంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించి కేసు విచారణను సి.బి.ఐ కి అప్పగించడమే కాక కేసుకి సంబంధించినంతవరకూ, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ నుండి సి.బి.ఐ ని తప్పించి తనకే జవాబుదారిగా ఉండాలని ఆదేశించినప్పటికీ, కపిల్ సిబాల్ కాగ్ తో పాటు సుప్రీం కోర్టుని కూడా అవమానించినంతపని చేశాడు. ఆయన ఆ ప్రకటన చేసిన తర్వాత సుప్రీం కోర్టు “మంత్రి వర్యులు బాధ్యతతో మెలగడం నేర్చుకోమని చెప్పండి” అని అటార్నీ జనరల్ తో వ్యాఖ్యానించింది.
ఇపుడా కపిల్ సిబాలే అదే కుంభకోణానికి సంబంధించిన వేరే కోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రభుత్వేతర సంస్ధ (ఎన్.జి.ఓ) ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’ (సి.పి.ఐ.ఎల్) తాజాగా కపిల్ సిబాల్ పైనా, అటార్నీ జనరల్ జి.ఇ.వాహన్‌వతి లపై సి.బి.ఐ చేత దర్యాప్తు చేయించాలని సుప్రీం కోర్టును గురువారం కోరింది. యు.ఎ.ఎస్.ఎల్ అనే ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అనీల్ అంబానీ కంపెనీ, ఆర్‌కాం (RCOM) పై డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డి.ఒ.టి) సంస్ధ విధించిన రు.650 కోట్ల అపరాధ రుసుముని కపిల్ సిబాల్ ఏకపక్షంగా రు.5 కోట్లకు తగ్గించాడని సి.పి.ఐ.ఎల్ తన దరఖాస్తులో ఆరోపించింది. అలాగే యు.పి.ఎ-1 ప్రభుత్వంలో సొలిసిటర్ జనరల్ గా పనిచేసిన జి.ఇ.వాహనవతి 2జి స్పెక్ట్రం కేసులో న్యాయ మంత్రిత్వ శాఖ, టెలికం మంత్రి ఎ.రాజా కి చేసిన సూచనను పక్కన బెట్టాడని సి.పి.ఐ.ఎల్ ఆరోపించింది.
“టెలికం సెక్రటరీతో సహా డి.ఒ.టి లోని సీనియర్ అధికారులంతా ఏకగ్రీవంగా ఒక అభిప్రాయానికి వచ్చి ఆర్‌కాం పై రు.650 కోట్ల పెనాల్టీ విధిస్తే అటువంటి అభిప్రాయాన్ని కూడా పక్కకు నెట్టి మంత్రి కపిల్ సిబాల్ ప్రవేటు ఆపరేటర్‌కు లాభం చేకూరేలా కేవలం రు.5 కోట్ల పెనాల్టితో సరిపెట్టడం ద్వారా తన పదవిని దుర్వినియోగం చేశాడు. అనిల్ అంబాని నాయకత్వంలోని ప్రవేటు కంపెనీ రిలయన్స్ ఇన్‌ఫోకాం కు లాభం కలిగించడానికి జరిగిన ఈ అధికార దుర్వినియోగం పై సి.బి.ఐ చేత క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాలి” అని ఆ సంస్ధ తన దరఖాస్తులో కోరింది.
రిలయన్స్ గ్రూపు కంపెనీ “యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్” (యు.ఎస్.ఒ.ఎఫ్) ఒప్పందం తాలూకు నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఒక్కో సర్కిల్‌కి రు.50 కోట్ల చొప్పున పెనాల్టీ విధించాలని డి.ఒ.టి అధికారులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారనేందుకు సాక్ష్యంగా సి.పి.ఐ.ఎల్ డాక్యుమెంట్లను కూడా కోర్టుకు అందజేసింది. ఆర్‌కాం సంస్ధ యు.ఎస్.ఒ.ఎఫ్ ఒప్పందం నియమ నిబంధనలతో పాటు యు.ఎ.ఎస్.ఎల్ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘిస్తూ యు.ఎస్.ఒ.ఎఫ్ సైట్లకు సబ్‌స్క్రైబ్ చేసిన వినియోగదారులకు సేవలను స్వచ్ఛందంగా, ఏక పక్షంగా, అనధికారికంగా రద్దు చేసిందని సి.పి.ఐ.ఎల్ పేర్కొంది. ఈ కేసు హియరింగ్ జులై 11 న జరగవచ్చని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.
