ఐ.ఎం.ఎఫ్ మాజీ అధ్యక్షుడు డొమినిక్ స్ట్రాస్ కాన్ స్వదేశం ఫ్రాన్సులో మరొక రేప్ కేసు ఎదుర్కొంటున్నాడు. న్యూయార్క్ లోని ఒక లగ్జరీ హోటల్ మెయిడ్ పై అత్యాచారానికి ప్రయత్నించాడని ఆరోపణలు రావడంతో స్ట్రాస్ కాన్ ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. అయితే రేప్ నేరం ఆరోపించిన మహిళ తన వివరాల గురించి అబద్ధాలు చెప్పిందనీ, రేప్ ప్రయత్నం జరిగిన తర్వాత తాను చేసిన ఫోన్ కాల్స్ పై కూడా అబద్ధాలు చెప్పిందనీ ప్రాసిక్యూటర్లు చెప్పడమే కాక ఆమె ఆరోపణల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి విదితమే. గినియాకి చెందిన ఆ మహిళ మాత్రం తనపై అత్యాచార ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలనుండి వెనక్కి తగ్గలేదని ఆమె లాయరు తెలిపాడు.
తన సోదరిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె సోదరుడు కూడా రాయిటర్స్ సంస్ధతో మాట్లాడుతూ చెప్పాడు. సంపద్వంతమైన పశ్చిమ దేశాల వ్యవస్ధలు తలుచు కుంటే ఏమైనా సృష్టించగలరని చెబుతూ తన సోదరికి నిష్పాక్షిక న్యాయం లభించడం పట్ల అనుమానాలు వ్యక్తం చేశాడు. మెయిడ్ రేప్ కేసును ప్రాసిక్యూటర్లు సీరియస్ గా పట్టించుకోవడం లేదనీ, కేసు తేలి పోవచ్చనీ కూడా వార్తలు వస్తున్నాయి. మనహట్టన్‌లొ నిర్దేశించబడిన నివాసం దాటి వెళ్ళడానికి వీల్లేదని షరతు విధించిన కోర్టు కొద్ది రోజుల క్రితం షరతులను ఎత్తివేసి బెయిల్ అవసరం లేకుండానే విడుదల చేసింది. స్ట్రాస్ కాన్ తనకే పాపం తెలియదని చెబుతున్న సంగతి తెలిసిందే.
బలహీనురాలయిన గినియా మహిళ ఆరోపణలనుండి స్ట్రాస్ కాన్ తప్పించుకున్నప్పటికీ ఫ్రాన్సులో మరొక రేప్ కేసు స్ట్రాస్ ఎదుర్కొంటున్నాడు. ట్రిస్టేన్ బానన్ అనే మహిళ ఎనిమిదేళ్ళ క్రితం స్ట్రాస్ కాన్ తనను రేప్ చేయడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తోంది. విలేఖరిగా పనిచేస్తున్న ట్రిస్టేన్ 2003లో, పారిస్‌లో స్ట్రాస్ కాన్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళినపుడు బలాత్కారానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపిస్తున్నది. ఫ్రాన్సులో చట్టాల ప్రకారం రేప్ నేరానికి సంబంధించిన కేసును బాధితురాలు సంఘటన జరిగిన పదేళ్ళ వరకూ కేసు నమోదు చేయవచ్చు. పారిస్ లోని ఒక ఫ్లాట్‌లో ఇంటర్వ్యూకి వెళ్ళినపుడు సంఘటన జరిగిందని ఆమె చెబుతోంది. కాని స్ట్రాస్ కాన్ బానన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నందుకు తానే కేసు దాఖలు చేస్తానని చెబుతున్నాడు. న్యూయార్క్‌లో స్ట్రాస్ కాన్ మే 14న అరెస్టు అయిన కొద్ది సేపటి తర్వాత బానన్ తనపై కూడా అత్యాచారానికి ప్రయత్నించాడనీ, అప్పుడే కేసు పెట్టి ఉండాల్సిందనీ వ్యాఖ్యానించింది.
సంఘటన జరిగినప్పుడు కేసు దాఖలు చేయనప్పటికీ ట్రిస్టేన్ 2007లో ఒక టి.వి ఛాట్ లో మాట్లాడుతూ ఆ విషయాన్ని ప్రస్తావించింది. స్ట్రాస్ కాన్ పైన రేప్ ప్రయత్నం క్రిమినల్ కేసు దాఖలు చేయవలసిందిగా బానన్ తనకు చెప్పిందని ఆమె లాయర్ కౌబ్బీ బిబిసికి తెలిపాడు. మంగళవారం తాను పారిస్ ప్రాసిక్యూటర్ వద్ద కేసు దాఖలు చేస్తానని ఆయన తెలిపాడు. “ఈ చర్యలు చాలా తీవ్రమైనవి. ఈ ఘటనలు హింసతో ముడిపడి ఉన్నాయి. అందుకె ఈ తరహా కేసులను సీరియస్ గా పరిగణించాల్సి ఉంది” అని కౌబ్బీ అన్నాడు. ట్రిస్టేన్ పై అత్యాచార ప్రయత్నం సంటటన ఫిబ్రవరి 2003 లో జరిగిందని ఆయన తెలిపాడు.
ప్రస్తుతం 32 సంవత్సరాల వయసున్న ట్రెస్టేన్ కధనం ప్రకారం స్ట్రాస్ కాన్ తన ఇంటర్వ్యూ కావాలంటే తన చేతిని పట్టుకుంటేనే ఏదైనా మాట్లాడతని ఆమెతో చెప్పాడు. అలా మొదలైన ఘటన స్ట్రాస్ బలవంతంగా ఆమెను నెలమీదికి నెట్టడం, ఆమెపై బడి బలత్కారంగా ఆమె ధరించిన జీన్స్ ప్యాంట్ తెరవడం, బ్రా హుక్స్ తొలగించడం వరకూ దారి తీసింది. నేలపై స్ట్రాస్ కాన్ పట్టునుండి బైటపడడానికి ఆమె కొంతసేపు ఘర్షణ పడింది. “అతను నన్ను బలవంతంగా రేప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అర్ధమయ్యాక నేను బూటు కాళ్ళతో తన్నడం మొదలుపెట్టాను. నాకు విపరీతమైన భయం వేసింది” అని ట్రిస్టేన్ ఎల్’ ఎక్స్‌ప్రెస్ అనే ఫ్రెంచి వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. “అప్పట్లో అందరూ నేను కేసు పెట్టినా గెలవలేనని చెప్పారు. దాంతో నేను కేసు పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. కాని న్యూయార్క్ ఘటన గురించి విన్న తర్వాత ఈ సందర్భంలోనైనా నేను చెప్పదలుచుకున్నది వింటారన్న ఆశ కలిగింది” అని ట్రిస్టేన్ వివరించింది.
“నేను ఎనిమిదేళ్ళుగా అనుభవిస్తున్న నరకానికి అంతం పలకాలంటే విషయాన్ని కోర్టుకి తీసుకెళ్ళడం తప్ప మరొక మార్గం లేదు. ఒక వ్యక్తిపై మరొక వ్యక్తి ఆరోపణ చేయడం, అది కూడా వాళ్ళెంత శక్తిమంతులో కూడా ప్రస్తావించకుండా ఉన్నపటికీ, తరచుగా అనుమానితులు విడుదల చేయబడతారన్న సంగతి నాకు బాగానే తెలుసు” అని ఆమె తన ఇంటర్వ్యూ లో పేర్కొన్నది. ఐతే స్ట్రాస్ కాన్ లాయర్లు బానన్ పై కేసు దాఖలు చేయాలని కాన్ కోరినట్లు తెలిపారు. “ఊహాత్మక సంఘటనల” పై తప్పుడు ఆరోపణలు చేయడంపై న్యాయపరమైన ఫిర్యాదు చేయవలసిందిగా తమ క్లైంటు కోరాడని ఫ్రెంచి లాయర్లు తెలిపారు.
స్ట్రాస్ కాన్ మళ్ళీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి అవకాశాలున్నాయని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అధ్యక్ష పదవి కాకున్నా ఆర్ధిక మంత్రి లేదా ఆర్ధిక సలహాదారు పదవులను పొందే అవకాసం ఉందని ఊహాగానాలు సాగాయి. కాని ఫ్రాన్సు సోషలిస్టు పార్టీ ఆ విషయాన్ని తేల్చేసింది. ఆ పార్టీ ప్రతినిధి బెనోయిట్ హేమన్ పత్రికలతో మాట్లాడుతూ “ప్రస్తుత పరిస్ధితుల్లో స్ట్రాస్ కాన్ అధ్యక్ష పదవికి పోటి చేయడం అనేది ఉన్న అవకాశాల్లోకెల్లా అత్యంత బలహీనమైన అంశం” అని తేల్చేశాడు.
విలేఖరి, రచయిత్రి కూడా అయిన ట్రిస్టెన్ బానన్ తల్లి అన్నే మన్సోరెట్, స్ట్రాస్ కాన్ పని చేస్తున్న రాజకీయ పార్టీ సోషలిస్టు పార్టీలోనే రాజకీయ నాయకురాలుగా ఉంది. తన కూతురుని స్ట్రాస్ కాన్ బలత్కారం చేయడానికి ప్రయత్నించినపుడు ఆయనపై కేసు పెట్టొద్దని తానే కూతురికి నచ్చజెప్పానని చెప్పింది. కానీ న్యూయార్క్‌లో స్ట్రాస్ కాన్ రేప్ ఘటనలో పాల్గొన్న సంగతి తెలిశాక ఫ్రాన్సులో అనేక మంది మగపుంగవులు ఆ కేసు విఫలమవుతుందంటూ దుర్మార్గంగా వ్యాఖ్యానించడంతో తనకు తిరుగుబాటు చేయాలన్న కోపం వచ్చిందని ఆమె తెలిపింది. ఆడవారిపై దుర్మార్గానికి పాల్పడిన వారి పక్షమే అంతా మాట్లాడ్డం, బాదితుల వ్యధగురించి తేలిగ్గా తీసి పారేయడం బానన్ తల్లిని అధికంగా బాధించింది. ఆ పరిస్ధితినుండే కూతురుకు మద్దతు ఇవ్వాలని ఆమె నిశ్చయించుకుంది.
బానన్ లాయరు తాము జూన్ మధ్యలో కేసు దాఖలు చేయామనుకున్నామని చెప్పాడు స్ట్రాస్ కాన్ అమెరికాలో ఎదుర్కొంటున్న విచారణ తేదీలతో మా కేసు దాఖలు తేదీలకు ఎటువంటి సంబంధం లేదనీ వివరించాడు. న్యూయార్క్ కేసు తేదీలవలన ఇబ్బంది రాకుండా ఉండటానికి కొద్ది రోజుల తర్వాత కేసు నమోదు చేస్తామని కౌబ్బీ చెప్పాడని బిబిసి తెలిపింది. అయితే రెండు కేసుల్నీ ముడిపెట్టనవసరం లేదనే తాను చెప్పానని ఇప్పుడంటున్నాడని బిబిసి తెలిపింది.
