చైనా బ్యాంకుల్లో పేరుకుపోయిన తిరిగి రాని అప్పులు $0.5 ట్రిలియన్లు -మూడీస్ హెచ్చరిక


చైనా బ్యాంకుల్లో తిరిగి రాని అప్పులు పేరుకుపోయాయనీ, అవి అలానే కొనసాగితే చైనా బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ తగ్గించాల్సి ఉంటుందని మూడీస్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. 2008లో ఆర్ధిక సంక్షోభం సంభవించినపుడు, దాని బారిన పడకుండా ఉండడానికి చైనా పెద్ద ఎత్తున బెయిల్ ప్యాకేజీని అమలు చేసింది. బెయిలౌట్ ప్యాకేజితో పాటు దేశంలోపల విచ్చలవిడిగా అప్పులు మంజూరు చేసింది. ఉత్పత్తి కార్యక్రమాలకు బదులుగా వినియోగ సరుకులైన కార్లు, టి.విలు, ఫ్రిజ్ లు కొనుగోలు చేయడానికి అప్పులు మంజూరు చేసింది. ఆ అప్పుల్లో తిరిగిరాని అప్పులు 540 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని మూడీస్ రేటింగ్ సంస్ధ లెక్కించింది. ఈ చెడ్డ అప్పులను వదిలించుకోనట్లయితే చైనా బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ పై ప్రభావం ఉంటుందని మూడీస్ తెలిపింది.

సంక్షోభ కాలంలో చైనా ప్రభుత్వం 10 ట్రిలియన్ యువాన్లకు పైగా అప్పులు మంజూరు చేసింది. స్ధానిక ప్రభుత్వాలు అత్యధికంగా ఈ అప్పులను పొందాయి. రోడ్లు, భవంతులతో పాటు విచక్షణా రహితంగా స్ధానిక ప్రభుత్వాలు ఖర్చు చేశాయని అప్పట్లో చైనా ప్రభుత్వం కూడా హెచ్చరించింది. స్ధానిక ప్రభుత్వాల అప్పులను చైనా ప్రభుత్వం కొంత మేరకు రద్దు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అవన్నీ పోగా ఇంకా 540 బిలియన్ డాలర్లు చెల్లని అప్పులు పేరుకుపోయాయని మూడీస్ లెక్క కట్టింది. చైనా ప్రభుత్వ ఆడిటింగ్ సంస్ధ గత నెల విడుదల చేసిన నివేదికను మూడీస్ సమీక్షించి ఈ వివరాలను వెల్లడించింది. స్ధానిక ప్రభుత్వాలు 10.7 ట్రిలియన్ యువాన్లకు పైగానే అప్పులు తీసుకున్నాయని చైనా ఆడిటింగ్ సంస్ధ వెల్లడించింది. కానీ నివేదికను సమీక్షించిన మూడీస్, స్ధానిక సంస్ధల అప్పు అంతకంటే ఎక్కువేనని తెలిపింది.

చైనా ప్రభుత్వ ఆడిటింగ్ సంస్ధ తేల్చినదాని కంటే స్ధానిక సంస్ధలు 3.5 ట్రిలియన్ యువాన్లు (540 బిలియన్ డాలర్లు) అధికంగా బ్యాంకుల వద్ద అప్పు తీసుకున్నాయని మూడీస్ వెల్లడించింది. మూడీస్ హెచ్చరిక అనంతరం చైనా బ్యాంకుల షేర్లలో మంగళవారం అమ్మకాల వత్తిడి ఏర్పడినప్పటికీ పెద్దగా నష్టాలు రాలేదు. మూడీస్ లెక్కలు చైనా ప్రభుత్వం వెల్లడించిన ఇతర వివరాలకు దగ్గరగా ఉండటం వల్లనే  మూడీస్ ప్రకటన వలన పెద్దగా ప్రభావం పడలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీర్ఘకాలంలో ఈ విషపూరిత అప్పులు చైనా ఆర్ధిక వ్యవస్ధను అస్ధిరంపాలు చేయవచ్చని మదుపరులు ఆందోళనలో ఉన్నారు. బ్యాంకులు ఈ నష్టాలను భరించవలసి వస్తే గనక తదుపరి అప్పుల మంజూరు కఠినతరం కావచ్చని వీరి ఆందోళనగా తెలుస్తోంది.

“స్ధానిక ప్రభుత్వాల అప్పుల్లో మెజారిటీ అప్పులు సరైనవేనని భావిస్తున్నాం. కానీ అప్పుల లక్షణాలు, వాటివల్ల సంభవించగల ప్రమాదాల గుణగణాలను బట్టి చూస్తే స్ధానిక ప్రభుత్వ అప్పులకు బ్యాంకులతో గతంలో అంచనా వేసిన దానికంటే అధికంగా సంబంధం ఉందని నిర్ధారించాము” అని మూడీస్ చైనా విభాగం విశ్లేషకుడు వొన్నే ఝాంగ్ చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. బ్యాంకులు స్ధానిక ప్రభుత్వాలకు ఇచ్చిన అప్పులు ఎగవేతకు గురైతే చైనా బ్యాంకుల వద్ద పనికిరాని ఆస్తులు (Non-Performing Assets – NPAs) పేరుకు పోయి బ్యాంకుల ఆస్తుల్లో అవి 12 శాతానికి చేరవచ్చని మూడీస్ హెచ్చరించింది. సాధారణంగా ఎన్.పి.ఎ ల మొత్తం 5 నుండి 8 శాతం వరకు ఉన్నట్లయితే అది భరించదగినదిగా చైనా ప్రభుత్వం లెక్కిస్తుంది. చైనా ప్రభుత్వం ఏదొక మాస్టర్ ప్లాన్ వేసి చెడ్డ అప్పులను శుభ్రం చేయనట్లయితే చైనా బ్యాంకుల ఔట్ లుక్ మైనస్ కి చేరుతుందని మూడీస్ చెప్పింది.

అనేక మంది ఇన్‌వెస్టర్లు (మదుపుదారులు) చైనా స్ధానిక ప్రభుత్వాల అప్పులను ప్రమాదకరంగా పరగణిస్తూ వచ్చాయి. చైనా ఆర్ధిక వృద్ధి రేటు మంగగించడంతో అప్పుల ఎగవేత ఊపందుకుంటుందేమోనని వీరు భయపడుతున్నారు. అంతిమంగా అది బ్యాంకింగ్ వ్యవస్ధను దెబ్బతీయవచ్చని భావిస్తున్నారు. చైనా ప్రకటించిన 4 ట్రిలియన్ యువాన్ల స్టిములస్ ప్యాకేజీ ద్వారా స్దానిక ప్రభుత్వాలకు ఇచ్చిన అప్పులే ఇపుడు ఏకు మేకై కూచున్నాయి. అవి 2013 లో తిరిగి చెల్లించవలసి ఉంది. వీటిని చాలా వరకు రోడ్ల నిర్మాణానికి వినియోగించినా, కొన్ని చోట్ల అవసరం లేకపోయిన రోడ్లు వేశారనీ, కట్టిన ఇళ్ళు ఖాళీగానే ఉన్నాయనీ వార్తలు వచ్చాయి. బ్యాంకులే ఈ అప్పుల్లో కొంత భాగాన్నొ లేదా మొత్తాన్నొ భరించడానికి నిర్ణయించవచ్చని భయపడుతున్నారు. రాజకీయంగా సున్నితంశం ఐనందున కేంద్ర ప్రభుత్వం ఈ అప్పుల భారాన్ని బ్యాంకులపైనె మోపవచ్చని భావిస్తున్నారు.

ఐతే స్ధానిక ప్రభుత్వాలు ఈ అప్పులను చెడ్డవిగా మారకుండా చూస్తాయనీ ఆస్తుల అమ్మకం లాంటి అవకాశాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక విధానాలను నెత్తిన పెట్టుకుంటున్న చైనా, అనివార్యంగా దానితో పాటు వచ్చే సంక్షోభాలను కూడా మోయవలసి ఉంటుంది. మార్కెట్ పెట్టుబడిదారీ విధానం ఉన పశ్చిమ దేశాలు ఎదుర్కొంటున్న అవలక్షణాలన్నీ ఒక దాని వెంట ఒకటి రావడం అనివార్యం. చైనాలో ఉన్న ప్రత్యేక పరిస్ధుల ద్వారా ఆ లక్షణాలను పారద్రోలవచ్చని భావిస్తే అది అమాయకత్వమే అవుతుంది.

2 thoughts on “చైనా బ్యాంకుల్లో పేరుకుపోయిన తిరిగి రాని అప్పులు $0.5 ట్రిలియన్లు -మూడీస్ హెచ్చరిక

  1. అప్పు తీసుకున్నవాళ్ళ ఆస్తులు అమ్ముడుపోకపోతే గ్యారంటర్ల ఆస్తులు అమ్మడం ద్వారా డబ్బులు రాబట్టుకుంటారు కదా, ఆ బ్యాంక్‌లకి గ్యారంటర్ల ఆస్తులు కూడా అమ్ముడుపోలేదా?

  2. ఇక్కడ ప్రధానంగా చర్చలో ఉన్న అప్పుదారులు చైనాలోని స్ధానిక ప్రభుత్వాలు, అంటే మన పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పిరేషన్లు వగైరా వంటివి. అవి అప్పులతో నిర్మించిన ఆస్తులు రోడ్లు, ఇళ్ళు, ప్రభుత్వ భవనాలు, చిన్న చిన్న వంతెనలు. వీటిలో ఇళ్ళు, భవనాలు మాత్రమే అమ్ముడవుతాయి. కొన్ని చోట్ల అవసరం లేకపోయినా ఇళ్ళు, రోడ్లు నిర్మించారట. కేవలం వినియోగం కోసమే. అందుకనే ఆస్తులు అమ్మడం కంటే ఆప్పుల్ని రద్దు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. స్ధానిక ప్రభుత్వాలకు గ్యారంటీలేవీ లేకుండానే అప్పులిచ్చేశారు, వినియోగం పెంచడం కోసం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s