అమెరికా కంపెనీలు లాభాల్లో, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ నష్టాల్లో


2007-08 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఫలితంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా దెబ్బతింది. 2009 వరకూ అమెరికాలోని కంపెనీలు కూడా తీవ్రమైన ఆర్ధిక కష్టాల్లో ఉన్నట్లు ప్రకటించాయి. లేమేన్ లాంటి ఫైనాన్సి దిగ్గజం నిట్ట నిలువునా కూలిపోవడంతో ప్రపంచం నిర్ఘాంతపోయింది. వాల్ స్ట్రీట్ లోని బహుళజాతి ద్రవ్య సంస్ధలైన ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులన్నీ తోటి బ్యాంకులపై నమ్మకం కోల్పోయి ఒక్క సెంటు కూడా చేబదుళ్ళు, అప్పులు ఇవ్వడానికి నిరాకరించడంతో అప్పు దొరకడం గగనమైంది. “క్రెడిట్ క్రంచ్” గా పేర్కొన్న ఈ పరిస్ధితిలో మహా మహా దిగ్గజాలైన ప్రవేటు ఫైనాన్స్ సంస్ధలు, కంపెనీలు సంక్షోభం పరిష్కారానికి ముందుకు రాలేదు. స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలో ప్రభుత్వం ఏ బాధ్యతా చేపట్టకూడదనీ, అన్నీ మార్కెట్ కే వదిలిపెట్టాలనీ మార్కెట్ ఆర్ధిక సూత్రాలను వల్లించే పండితులు కూడా సంక్షోభ పరిష్కారం మార్కెట్ చేబడుతుందని ధైర్యంగా చెప్పలేకపోయారు. ఏ కంపెనీ, బ్యాంకూ తమ ద్రవ్య నిల్వలను దాచిపెట్టుకోవడంతో డబ్బు కోసం ఊపిరాడని పరిస్ధితి ఏర్పడింది.

చివరికి అమెరికా ప్రభుత్వమే రంగంలోకి దిగి దివాలా బ్యాంకుల్ని వశం చేసుకుంది. అంటే జాతీయకరణ కావించింది. ప్రవేటు కంపెనీల జాతీయకరణ అంటేనే ఇంతెత్తున లేచే స్వేచ్ఛా మార్కెట్ పండితులు చిత్రంగా ఈసారి నోళ్ళు తెరవలేదు. స్తంభించిపోయిన ఆర్ధిక వ్యవస్ధకు ఊపందించాలంటే అమెరికా ప్రభుత్వమే పూనుకుని 700 బిలియన్ డాలర్ల బెయిలౌట్ అందించాలని నిర్ణయిస్తే “ప్రభుత్వానికి మార్కెట్‌తో ఏం పని?” అని ఎప్పటిలాగా అడగలేక పోయారు. పైగా బెయిలౌట్ల కోసం ప్రవేటు కార్ల కంపెనీలు, ఇన్‌‌వెస్ట్‌మెంట్ బ్యాంకులు పోటీలు పడ్డారు. ప్రభుత్వం ముందు జోలె పట్టి నిలబడ్డారు. “టూ బిగ్ టు ఫెయిల్” గా పేరు పొందిన ప్రవేటు ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులకు అమెరికా ప్రభుత్వం పదుల బిలియన్ల కొద్దీ బెయిలౌట్‌లు మంజూరు చేసింది. అతి పెద్ద కార్ల కంపెనీలు జి.ఎం, క్రిస్లర్ కంపెనీలు కూడా దేహీ అంటూ అడుక్కున్నాయి.

ఒక్క అమెరికాలోనే కాదు. స్వేచ్ఛా మార్కెట్ విధానం అంటూ గొప్పలు పోయే పశ్చిమ దేశాల ప్రభుత్వాలన్నీ ప్రవేటు కంపెనీలకు దోచి పెట్టాయి. ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నుల డబ్బుల్ని ఉదారంగా ప్రవేటు బ్యాంకర్లకు పంపకం చేశాయి. ఒబామా వచ్చాక కూడా మరొక 790 బిలియన్ డాలర్ల బెయిలౌట్‌ని ప్రవేటు సంస్ధలు మింగేశాయి. అవి కాకుండా ఫెడరల్ రిజర్వు 2008 నుండీ తన వడ్డీ రేటుని 0.25 శాతం వద్దనే ఉంచింది. అంటే ఈ ప్రవేటు కంపెనీలకు ఉదారంగా అప్పులు లభించేందుకే అతి తక్కువ వడ్డీ రేటుని ఇప్పటికీ అట్టే పెట్టింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు కూడా 1 శాతం వద్దనే వడ్డీ రేటు అట్టే పెట్టింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అవన్నీ కాక క్వాంటిటేటివ్ ఈజింగ్ – 2 పేరుతో 600 బిలియన్ డాలర్లతో అమెరికా ట్రెజరీ బాండ్లు కొనేసి మార్కెట్ లోకి డబ్బు విరజిమ్మింది.

ఆర్ధిక సంక్షోభం బద్దలైనప్పటినుండీ అమెరికా ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్‌మెంట్లు ఆర్ధిక వ్యవస్ధను గాడిన పెట్టే పేరుతో ప్రవేటు కంపెనీలకు ఉదారంగా పందేరం పెట్టిన మొత్తం డబ్బు ఇప్పటివరకూ 13.86 ట్రిలియన్ డాలర్లని సోర్స్‌వాచ్ వెబ్ సైట్ పేర్కొంది. ఇది కేవలం ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించినది మాత్రమేనని తెలిపింది. బెయిలౌట్లలో అవినీతి జరగకుండా కాపలా కాయడానికి నియమించబడిన నీల్ బరోస్కీ తయారు చేసిన నివేదిక ప్రకారం 23.7 ట్రిలియన్ డాలర్లని బిజినెస్ ఇన్‌సైడర్ వెబ్‌సైట్ తెలిపింది. అంటే బెయిలౌట్ గా పంచింది తక్కువ అంచనా ప్రకారం దాదాపు అమెరికా జిడిపి అంత ఉంటే, మోడరేట్ అంచనా ప్రకారం దాదాపు దానికి రెట్టింపు ఉంది. ఈ డబ్బంతా మింగిన ప్రవేటు బహుళజాతి సంస్ధలు. …ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్ధలు, కార్ల కంపెనీలు, వాణిజ్య బ్యాంకులు, ఇతర పరిశ్రమలు… అమెరికా ప్రభుత్వం ద్వారా ప్రజల పన్నుల డబ్బుని భోంచేసి సంక్షోభం నుండి బైటపడ్డాయి.

ఐతే, సంక్షోభం పేరుచెప్పి ప్రవేటు కంపెనీలకు బెయిలౌట్లను పందేరం పెట్టిన అమెరికా ప్రభుత్వం మాత్రం ఇంకా సంక్షోభంలోనే ఉంది. ఎందుకుండదు మరి? ప్రవేటు బహుళజాతి సంస్ధలకు ఇచ్చిన డబ్బు, ఆర్ధిక వ్యవస్ధ ఊపు కోసం ట్రెజరీ ద్వారా, ట్రెజరీ బాండ్ల కొనుగోలు ద్వారా పంపింగ్ చేసిన డబ్బంతా ఇప్పుడు ప్రభుత్వం పైన అప్పుగా పేరుకుపోయింది. బడ్జెట్ లోటు పెరిగిపోయింది. బెయిలౌట్లు మింగిన ప్రవేటు కంపెనీలు ఉద్యోగాలు సృష్టించడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా పన్ను వసూళ్ళూ పడిపోయాయి. ఆదాయం తగ్గిపోయింది. మరో వైపు ఎడతగని దురాక్రమణ యుద్ధాలు మింగుతున్న డబ్బు అదనపు అప్పుగా ప్రభుత్వ అప్పుల ఖాతాలో చేరుతోంది. డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా ఉండబట్టిగానీ లేదంటే అమెరికా గ్రీసు కంటె ముందే దివాళా తీసి ఉండేది.

ఈ విధంగా పన్నుల డబ్బుని భోంచేసి కుదుటపడ్డ కంపెనీలు ప్రభుత్వానికి గానీ, ప్రజలకు గానీ బాకీ పడ్దామన్న సంగతిని మర్చిపోయాయి. అధికారికంగా రిసెషన్ (మాంద్యం) నుండి 2009లో బైటిపడ్డామని చెప్పుకున్నాక అమెరికా సాధించిన రికవరీ అత్యంత ఘోరమైన రికవరీగా, ఉద్యోగాలు లేని రికవరీగా పేరుపడింది. సాధారణంగా మాంద్య అనంతరం రికవరీ సాధిస్తుండగానే ఉద్యోగాల సంఖ్య కూడా పెరగడం సంభవించేది. కానీ ఈ సారి ప్రభుత్వాల బెయిలౌట్ల వలన ప్రవేటు కంపెనీలు లాభపడ్డాయి కానీ తద్వారా ఉద్యోగాల కల్పన మాత్రం జరగలేదు. బెయిలౌట్ డబ్బులు, అతి తక్కువ వడ్డీ రేట్ల వలన మిగిలి పోతున్న డబ్బు అంతటినీ కంపెనీలు స్పెక్యులేటివ్ పెట్టుబడులుగా పెడుతున్నాయి. ఉత్పత్తి కార్యకలాపాల్లో పెట్టుబడులు పెట్టినట్లయితే ఉద్యోగాలు వస్తాయి. అంతిమంగా కంపెనీలు ద్రవ్య పెట్టుబడులద్వారా లాభాలు సంపాదిస్తుండగా ప్రభుత్వ ఆర్ధిక శక్తి బలహీనంగానే తగలడింది.

స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలో ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రవేటు కంపెనీలదే. ప్రవేటు కంపెనీలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్ధాపించి ఉద్యోగాలు కల్పిస్తాయన్న సూత్ర బద్ద అవగాహన తప్ప ప్రవేటు కంపెనీలే ఉద్యోగాలివ్వాలన్న తప్పనిసరి భాధ్యత వాటికి లేదు. ఫలితంగా నిరుద్యోగ భూతం జడలు విప్పింది. ఓవైపు కంపెనీలు మరిన్ని ఉద్యోగాల్ని కత్తిరిస్తూ లాభాలు పొందుతుండగా, మరొక వైపు నిరుద్యోగం పెరిగి సరుకులు కొనే శక్తి వినియోగదారుల వద్ద క్షీణించి పొయింది. దానితో ప్రభుత్వం ఆర్ధికంగా బలహీనపడి ఇంకా సంక్షోభం నుండి బైటపడడానికి జిడిపి పెంచుకోవడానికి అష్టకష్టాలు పడుతూనె ఉంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసాక అమెరికా ప్రభుత్వం లెక్కలు వేయడం మొదలెట్టాక ప్రస్తుతం సాధిస్తున్న రికవరీయే అతి ఘోరమైన రికవరీ అని ఆర్ధిక వేత్తలు చెప్పెశారు. నిరుద్యోగం పది శాతం అని ప్రభుత్వం చెబుతున్నా అది నిజానికి 20 శాతం పైనే ఉంటుందని నౌరుబి లాంటి ఆర్ధిక వేత్తలు చెబుతున్నరు. వినియోగాన్ని పెంచేందుకు బ్యాంకులు అప్పులివ్వాల్సి ఉండగా, అవి మొఖం చాటేయడంతో అప్పులు దొరకడం లేదు. ఇళ్ళధరలు ఇంకా కోలుకోలేదు. ఆర్ధికంగా సౌకర్యవంతంగా ఉన్న కుటుంబాల సంఖ్య విపరీతంగా పడిపోయింది. ఈ రికవరీ ఇంకా అనేక ఏళ్ళపాటు కొనసాగుతూనే ఉంటుందని ఆర్ధిక పండితులు అంచనా వేస్తున్నారు.

ఐతే కంపెనీల పరిస్ధితి ఇందుకు విరుద్ధం. అనేక అమెరికా కంపెనీలు ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లాభాలు పెద్ద మొత్తంలో ప్రకటించబోతున్నాయని అంచనా వేస్తున్నరు. స్టాండర్డ్ & పూర్ షేర్ల సూచి లోని 500 కంపెనీల లాభాలు 13.6 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇది లాభశాతం కాదు. గత క్వార్టర్ కంటే లాభాలు ఎంత శాతం పెరుగుతున్నాయన్న లెక్క మాత్రమే. వాల్ స్ట్రీట్ లోని బ్రౌన్ బ్రదర్స్ హారిమాన్ విశ్లేషణా సంస్ధ ఈ అంచనా వేసింది. ఎమర్జింగ్ మార్కెట్ల డిమాండ్ ని సొమ్ము చేసుకుని అమెరికా కి చెందిన అనేక టెక్నాలజీ కంపెనీలు, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు పెద్ద ఎత్తున లాభాలు సంపాదిస్తున్నాయి. ఎమర్జింగ్ మార్కెట్లలో ఆ కంపెనీల లాభాల వాటా ఎక్కువగా ఉండడంతో ఆ లాభాల మొత్తం గతం కంటే ఎక్కువగా ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. ఉత్పాకతనూ, లాభదాయకతనూ కంపెనీలు పెంచుకున్నాయని ఆ పత్రిక తెలిపింది.

సంక్షోభం తర్వాత అమెరికాలో సాధించిన రికవరీ కంపెనీలకు పోగా, బెయిలౌట్ల భారం ప్రజల మీద పడుతోంది. రిపబ్లికన్ సభ్యులు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో ఆ పార్టీకి చెందిన సభ్యులు పొదుపు బిల్లు తయారు చేసి ఆమోదించాలని ఒబామా నెత్తిన కూచున్నారు. ఆ బిల్లులో పెన్షన్ల తగ్గింపు, ఆరోగ్య భీమా తొలగింపు, ప్రజలపై మరిన్ని పన్నులు మోపుతూ, ధనికులకూ, కంపెనీలకు మాత్రం పన్నులను తగ్గిస్తూ ప్రతిపాదనలు ఉన్నాయి. ఒబామా కంపెనీలకు ఇక పన్నుల మినాయింపు రద్దు చేద్దామని చెబుతున్నానని అంటున్నాడు. చివరికి ఒబామా, రిపబ్లికన పార్టీ కలిసి ఏ ఒప్పందానికి వచ్చినా అమెరికా ప్రజలపైన మరింత భారం పడక తప్పదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s