ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో (లేదా కోశాగార సంవత్సరం – ఫిస్కల్ ఇయర్) ఏప్రిల్ – మే కాలానికి ఎఫ్.డి.ఐ లు 7.78 బిలియన్ డాలర్లు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. ఇది గత సంవత్సరం ఇదే కాలానికి నమోదైన 4.39 బిలియన్ డాలర్ల కంటే 77 శాతం అధికమనీ తెలిపింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఎఫ్.డి.ఐ ల ద్వారా షేర్ మార్కెట్లలోకి వచ్చిన పెట్టుబడి అంతకు ముందు సంవత్సరం కంటే 25 శాతం తగ్గిందనీ, ప్రపంచ వ్యాపితంగా సంక్షోభం నుండి వివిధ దేశాలు సాధించిన రికవరీలో హెచ్చు తగ్గులు ఉండడం దీనికి కారణమని ప్రభుత్వం వివరించింది.
ఎఫ్.డి.ఐ పెట్టుబడుల రాక ఇటీవలి కాలంలో తగ్గిందనీ, కానీ ఈ పరిస్ధితి తిరగబడిందని తాజా గణాంకాలు తెలుపుతున్నాయని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. బ్రిటిష్ పెట్రోలియం, రిలయన్స్ కంపెనీలు చేసుకున్న ఒప్పందం ద్వారా 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుండడం పరిస్ధితి అనుకూలంగా మారిందనడానికి సంకేతమనీ వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ పెట్టుబడిదారుల నమ్మకానికి పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందనీ, వివిధ ప్రభుత్వ ప్రక్రియలను సులభతరంగా మార్చామని తెలిపింది. పోస్కో ప్రాజెక్టు ఆమోదం, కెయిర్న్-వేదాంత స్వాధీన ఒప్పందానికి ఇచ్చిన ఆమోదం… ఇవన్నీ దేశంలోకి ఎఫ్.డి.ఐ ల ప్రవాహం పెరగడానికి దోహద పడతాయని ఆనందం వ్యక్తం చేసింది ప్రభుత్వం.
పోస్కో ప్రాజెక్టుకి ఆమోదం ఇచ్చినందుకు తన భుజం తానే చరుచుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు వలన నిర్వాసితులవుతున్న పాతికవేల మంది ప్రజల జీవన్మరణ పోరాటం తాను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కేంద్రం పరోక్షంగా తెలియజేసినట్లయింది. నెల రోజుల నుండి పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతిరోజూ నేలపై పడుకొని పోస్కో అధికారులు, వారికి రక్షణగా పోలీసులు రాకుండా కాపలా కాస్తున్న ప్రజల గోడు తమ మస్తిష్కాల దరిదాపులకు కూడా రాలేదని కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రకటించుకుంది. వారికి జీవనాధారమైన తమలపాకుల తోటలను పోలీసులు ధ్వంసం చేసినా, మారు మాట్లాడక మౌనంగా వాటిని తిరిగి నిలబెట్టుకున్న గిరిజన ప్రజానీకానికి ప్రభుత్వాలు ఏ మాత్రం విలువ ఇవ్వవని చాటుకున్నట్లయింది.
నిజానికి అటవీ భూములపైన అక్కడ నివసించే గిరిజనులకు సర్వాధికారాలు ఉంటాయనీ, ఆ భూములను గిరిజనేతరులెవరూ కొనుగోలు చేయడానికి వీల్లేదనీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన “అటవీ హక్కుల చట్టం” చెబుతోంది. తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్ధానిక కలెక్టరు చేత ఆ భూమి ప్రభుత్వానిదే అని అబద్ధాలు చెప్పిస్తున్నాయి. డాలర్లను పండించలేని గిరిజనులు తమ జీవనోపాధికి సాయం చెయ్యాలని ఏ ప్రభుత్వాన్నీ నిలదీయలేదు. ప్రజల బాగోగులు చూడాల్సిన ప్రభుత్వాలు ఇన్నాళ్ళూ తమకు సాయం చేయనందుకు ఎన్నడూ నిలదీయలేదు. తమ బతుకేదో తాము బతుకుతున్న గిరిజనుల జీవితాల్లోకి హఠాత్తుగా ఊడిపడి ప్రభుత్వాలు తమ భూమి తమకు ఇవ్వాలనీ, అది కూడా పరాయి దేశం నుండి వచ్చిన కంపెనీవాడికోసం ఇవ్వాలని ఒత్తిడి చేయడం, ఇవ్వనందుకు పోలీసుల్ని దింపి బెదిరించడం చూస్తే ఎఫ్.డి.ఐల రాక భారత ప్రజల మేలుకోసమా లేక కీడు కోసమా అన్న విషయం ఇట్టే అర్ధమవుతోంది.
