రేప్ కాదు… పరస్పర అంగీకారమే, అనూహ్య మలుపు తిరిగిన స్ట్రాస్ కాన్ కేసు


Once an accused, now a victim

డొమినిక్ స్ట్రాస్ కాన్: నిన్నటి దాకా నిందితుడు, ఇప్పుడు బాధితుడు?

ఐ.ఎం.ఎఫ్ మాజీ అధ్యక్షుడు డొమినిక్ స్ట్రాస్ కాన్ కేదు అనూహ్య మలుపు తిరిగింది. జరిగింది రేప్ కాదనీ, పరస్పర అంగీకారంతోనే జరిగిందనీ తాజా వివరాలను బట్టి అర్ధమవుతున్నదని న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు నమ్ముతున్నట్లు తెలుస్తోంది. బాధితురాలుగా చెప్పబడుతున్న మహిళ, తన వ్యక్తిగత వివరాల గురించి పదే పదే అబద్ధాలు చెబుతుండడంతో ఆమె విశ్వసనీయతపై ప్రాసిక్యూటర్లు నమ్మకం కోల్పోయారని రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్, బిబిసి వార్తా సంస్ధలు తెలిపాయి. ఫలితంగా స్ట్రాస్ కాన్‌పై నమోదు చేసిన కేసు తేలిపోయే అవకాశాలున్నాయని వార్తా సంస్ధలు తెలిపాయి. ఐతే రేప్ నేరం స్ట్రాస్ కాన్ పై లేక పోవచ్చు గానీ ఆయన గుణగణాలపైనా, పదే పదే పలువురు మహిళలతో లైంగిక సంబంధాలకు ప్రయత్నించడం పైనా ఎవరికీ అనుమానాలు లేకపోవడం గమనార్హం.

మే 19న న్యూయార్క్ లోని ఒక లగ్జరీ హోటల్ లో మెయిడ్ గా పనిచేస్తున్న 32 ఏళ్ళ గినియా మహిళ పై స్ట్రాస్ కాన్ రేప్ కి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సూట్‌ని శుభ్రం చేయడానికి స్ట్రాస్ కాన్ గదిలోకి వెళ్ళిన మహిళను, బాత్‌రూం నుండి నగ్నంగా వచ్చిన కాన్ బలవంతం చేయడంతో ఆమె విదిలించుకుని బైటికి పరుగెత్తుకు వెళ్ళీందనీ, కాన్ ఆమె వెంటపడి హాల్ వే గుండా ఈడ్చుకువచ్చి తన సూట్ లోకి తీసుకెళ్ళి మళ్ళీ అత్యాచార ప్రయత్నం చేయడంతో మహిళ ఆయన నెట్టేసి పారిపోయిందనీ బాధితురాలిగా చెప్పబడుతున్న మహిళ చెప్పిందని పోలీసులు సంఘటన జరిగిన రోజున పత్రికలకు తెలిపారు. పోలీసులు వాస్తవాలను పూర్తిగా విచారించకుండానే మహిళ చెప్పింది చెప్పినట్లుగా నమ్మారని ప్రాసిక్యూటర్లు అభిప్రాయపడుతున్నట్లుగా ఇప్పుడు పత్రికలు చెబుతున్నాయి.

ఫోరెన్సిక్ నివేదికలో మహిళ ధరించిన యూనిఫాం కాలర్ పైన వీర్యం ఆనవాళ్ళు దొరికాయని తేలింది. ఆ నివేదిక వెలువడినప్పుడే డిఫెన్సు లాయర్లు ఫోరెన్సిక్ నివేదిక తమకు అనుకూలంగా వచ్చినట్లు తెలిపారు. పరస్పర అంగీకారంతోనే జరిగినట్లుగా తమ డిఫెన్సు ఉంటుందని డిఫెన్సు లాయర్లు మొదటినుండి చెబుతున్నారు. పోలీసులు, ప్రాసిక్యూటర్లు ప్రారంభంలో మహిళ విశ్వసనీయతను గొప్పదిగా నమ్ముతూ అలాగే చెబుతూ వచ్చారు. హోటల్ సిబ్బంది కూడా ఆ మహిళకు మద్దతుగా వచ్చారు. అన్నీ అనుకూలంగా ఉన్నట్లు తోచడంతో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అమె చెబుతున్నది సరిగా విచారించకుండానే గ్రాండ్ జ్యూరీ వద్దకు తీసుకెళ్ళినట్లు కేసుకు సన్నిహితులైన వారిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. “బలాత్కారం అని ఆమె చెబుతున్నదానిలో ఎక్కడా వాస్తవం లేదు. కానీ ఎవరూ దాన్ని సరిచూసుకోలేదు. లేకుంటే ఆమె చెప్పేది తప్ప మరేమీ నమ్మడానికి సిద్ధంగా లేరు” అని ఆ వ్యక్తి చెప్పాడని రాయిటర్స్ తెలిపింది.

వార్తా సంస్ధలు రాసినదాన్ని బట్టి రేప్ నేరానికి ప్రయత్నించిన దాఖలాలు లేవు. కానీ స్ట్రాస్ కాన్ ఎప్పటిలాగానే సదరు మహిళను లోబరుచుకుని తనకు కావలసింది ఆమె అంగీకారంతోనే నెరవేర్చుకున్నాడు. రేప్ నేరానికి కాన్ పాల్పడనప్పటికీ స్త్రీలోలుడన్న బిరుదును మాత్రం సార్ధకం చేసుకున్నాడని చెప్పవచ్చు. అయితే ఫ్రాన్సు పత్రికలు రాజకీయ నాయకుల ఇటువంటి వ్యవహారాలను వారి ప్రైవేటు లైఫ్ కింద జమ కట్టి స్త్రీలోలత్వాన్ని సైతం భరించదగిన గుణం గానే స్వీకరించే అలవాటు ఉందని గతంలోనూ, ఇప్పుడూ వార్తా సంస్ధలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో స్ట్రాస్ కాన్ వచ్చే సంవత్సరం అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు. స్ట్రాస్ కాన్ మిత్రులు, ఆయన రాజకీయ కెరీర్ పై ఆశలు పెట్టుకున్నవారు తాజా పరిణామాలతో మహదానందం పొందుతున్నట్లు తెలుస్తున్నది. ఆయన రాజకీయ వైభవాన్ని పునద్ధరించే పనుల్లో పడినట్లు కూడా రాయిటర్స్ తెలిపింది.

కాని మరికొందరు విశ్లేషకులు జరగవలసిన నష్టం ఇప్పటికె జరిగిపోయిందనీ అధ్యక్షుడుగా పోటీచేయగల అవకాశాలు సన్నగిల్లినట్లేనని భావిస్తున్నారు. కాకుంటే అధ్యక్షులుగా ఎన్నికైన వారికి సలహాదారుగానో, లేదా ఆర్ధికమంత్రిగానో నియామకం పొందవచ్చని భావిస్తున్నారు. ప్రధాన మంత్రిగా కూడా పోటీ చేయవచ్చని కూడా భావిస్తున్నారు.

స్ట్రాస్ కాన్‌ని అరెస్టు చేశాక న్యూయార్క్ పోలీసులు చేతులకు బేడీలు వేసి నడిపించడం పట్ల ఆ రోజున ఫ్రాన్సు ప్రజలు, పత్రికలు అమెరికా పోలీసు వ్యవస్ధను తీవ్రంగా తిట్టిపోశారు. అమెరికా సంప్రదాయం అనాగరికంగా ఉందని ఎత్తి చూపారు. మద్దతుదారులు స్ట్రాస్ కాన్ పైన నేరాన్ని బలవంతంగా మోపారనీ, ఆయన ఎన్నికల అవకాశాలను నాశనం చేయడానికి కుట్ర పన్నారనీ ఆరోపించారు. లేదా డబ్బు గుంజడానికి మహిళే ఈ ఉపాయం పన్నిందని కూడా అరోపించారు. చివరికి అదే నిజమయ్యేట్లుగా కనిపిస్తోంది. డ్రగ్ ముఠాలతోనూ, మనీ లాండరింగ్ ముఠాలతోనూ గినియా మహిళకు సంబంధాలున్నట్లు ప్రాసిక్యూటర్లు అనుమానిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక పోలీసు అధికారులను ఉటంకిస్తూ తెలిపింది.

సంఘటన జరిగిన తర్వాత రోజే మహిళ ఒక వ్యక్తికి పోన్ చేసిందనీ, అతను గత రెండు సంవత్సరాల్లో అనేక సార్లు మహిళ బ్యాంకు ఖాతాలో జమ చేసిన అనేకమందిలో ఒకరని ప్రాసిక్యూటర్లు కనుగున్నారు. దాదాపు 100,000 డాలర్లవరకూ జమ చేసినట్లు కనుగొన్నారు. కాన్‌పై కేసు వేయడం ద్వారా తనకు చేకూరే లాభాల గురించి అతనితో ఫోన్‌లో చర్చించిందనీ, ఆ సంభాషణలను రికార్డు కూడా చేసారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసింది. ఈ కేసులో స్ట్రాస్ కాన్ కి మొదట బెయిల్ కూడా దొరకలేదు. తర్వాత కూడ 1 మిలియన్ డాలర్ల డబ్బు, 5 మిలియన్ డాలర్ల బాండు సమర్పించడంతో పాటు అతను ఉన్న ఇల్లు విడిచి ఎక్కడికీ వెళ్ళరాదన్న షరతుతో బెయిల్ మంజూరు చేసారు. బెయిల్ షరతులపై పిటిషన్‌తో కాన్ కోర్టుకు అప్పీలు చేయనున్నట్లు అతని లాయర్లు తెలిపారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s