
గ్రీసు ప్రభుత్వం తన ప్రజలపై ఆమానుషంగా ఆర్ధిక దాడులకు తెగబడే బిల్లుని ఆమోదించింది. ప్రవేటు, ప్రభుత్వ రంగాలలోని కార్మికులు, ఉద్యోగులు మంగళ, బుధవారాల్లో 48 గంటల సమ్మెను నిర్వహించినా, పార్లమెంటు బయట విరసనకారులు పోలీసులతో తలపడినా గ్రీసు ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకు పోయింది. 155 – 138 ఓట్ల తేడాతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పొదుపు చర్యల బిల్ల ను పార్లమెంటు ఆమోదంచింది.
ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు అప్పు ఇస్తున్న సందర్భంగా విధించిన షరతుల ప్రకారం పన్నుల పెంపు, ఖర్చుల కోత, ప్రవేటీకరణ చర్యల ద్వారా 28 బిలియన్ యూరోలు సంపాదించాల్సి ఉంది. షరతులు, కోతలు, రద్ధులు అమలు చేయవలసిన విధి విధానాలతో కూడిన రెండవ బిల్లును కూడా ఆమోదిస్తే గ్రీసు ప్రజలకు దీర్ఘకాలిక తద్దినం మొదలయినట్లే. వీరాలాపాలు పలికిన గ్రీసు పాలక పార్టీ పార్లమెంటు సభ్యుల్లో ఒకరు తప్ప మిగిలినవారంతా అనుకూల ఓటు వెశారు. వ్యతిరేక ఓటు వేసినాయన విప్ ధిక్కరించినందున వెంటనే సస్పెండ్ అయ్యాడు.
గ్రీసు జులై నెలలో గతంలో తెచ్చిన అప్పులపై చెల్లింపులు చేయవలసి ఉంది. మెచూరిటీ ఐన బాండ్లు, వడ్డీ చెల్లించాల్సిన బాండ్లకు ఈ చెల్లింపులు చేయాలి. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు తమ షరతులను ఆమోదిస్తే 12 బిలియన్ యూరోలు ఇస్తామనీ లేకుంటే ఇవ్వబోమనీ మొహమాటం లేకుండా చెప్పారు. గ్రీసు ప్రతిపక్షాలకు ఆ సంస్ధలు పాలక పార్టీకి సహకరించమని కోరారు. లేకుంటే గ్రీకు బైటపడడం కష్టమని భయపెట్టారు. గ్రీసు ప్రజలకు కూడా “మీ ప్రభుత్వం మిమ్మల్ని పన్నులతోటీ, కోతలతోటీ చావ బాదుతుంది, మీరు మాత్రం సమ్మెలు, హర్తాళ్ళూ చెయ్యకుండా గౌరవ ప్రదంగా వ్యవహరించాలి” అని ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు సుద్దులు చెప్పాయి.
షరతుల అమలుతో గ్రీసు దశాబ్దాల అభివృద్ధిని వెనక్కి నెడుతున్నారు. ఆర్ధిక వ్యవస్ధ గత సంవత్సరం షరతుల అమలుకే 5.5 శాతం కుదించికుపోయింది. ఈ సంవత్సరం గ్రీసు మరింత కుచించుకు పోతుందని విశ్లేషకులు ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు. గ్రీసు సంక్షోభం ప్రభావం యూరప్‌తో పాటు మిగతా ప్రపంచంపై పడి వారం రోజులపాటు షేర్లు నష్టాలకు గురచ్చాయి. 11 మిలియన్ల గ్రీకులు తమ హక్కుల్ని కాపాడుకోవాలంటే మరొకసారి యోధులుగా మారక తప్పదు.
