“పౌర అణు ఒప్పందం” విషయంలో అమెరికా, ఇండియాను మోసగించనున్నదా?


A mushroom cloud rises above Mururoa Atoll, French Polynesia, after a French nuclear test there in 1970. (AFP)

1970లో ఫ్రాన్సు ఫ్రెంచి పాలినేసియాలోని మురురో అటోల్ వద్ద అణు పరీక్ష నిర్వహించినపుడు ఏర్పడిన పేలుడు ఆకారం (click to enlarge)

2008 సంవత్సరంలో అమెరికా, ఇండియాలు “పౌర అణు ఒప్పందం” పై సంతకాలు చేశాయి. ఆ ఒప్పందం ద్వారా అప్పటివరకు అణు విషయాల్లో ప్రపంచంలో ఏకాకిగా ఉన్న ఇండియా అణు వ్యాపారంలో భాగస్వామ్యం పొందడానికి అమెరికా వీలు కల్పించిందని అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికా సంస్ధలు వార్తలు రాశాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇండియా సంతకం చేయనప్పటికీ అణు వ్యాపారం చేయడానికి ఇండియాకి అవసరమైన అణు పరికరాలు అమ్మడానికీ మినహాయింపు లభించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇది అరుదైన విషయమనీ అమెరికా ఇండియాకి మాత్రమే ఆ గౌరవం, అవకాశం ఇచ్చిందనీ భారత పత్రికలు కూడా ఉబ్బితబ్బిబ్బయ్యాయి. పాకిస్ధాన్ తనకు కూడా అటువంటి ఒప్పందం కావాలని అమెరికాని కోరితే అమెరికా నిర్ద్వంద్వంగా తిరస్కరించిందని కూడా వార్తా సంస్ధలు తెలిపాయి.

ఐతే, తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇండియాకు ప్రతికూలంగా పరిస్ధితులు ఏర్పడుతున్నట్లుగా సూచిస్తున్నాయి. అణు పదార్ధాలు, పరికరాలు సరఫరా చేయగల దేశాల కూటమి “న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు” (Nuclear Suppliers Group -NSG) తాను ఏర్పరచుకున్న నిబంధనలను సమీక్షించుకుని కొత్త నిబంధనలను రూపొందించింది. ఈ కొత్త నిబంధనలు ఇండియాకి అమెరికాతో చేసుకున్న “పౌర అణు ఒప్పందం” ద్వారా లభించిన మినహాయింపును పూర్వ పక్షం చేస్తున్నాయనీ, ఇక ఇండియాకు మినాయింపు లేనట్లేననీ నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇండియాలు అట్టహాసంగా చేసుకున్న పౌర అణు ఒప్పందం చివరికి ఉత్తుత్తి ఒప్పందంగా మిగిలిపోతుందని వారు చెబుతున్నారు. అదే గనక నిజమైతే పౌర అణు ఒప్పందం విషయంలో అమెరికా, ఇండియాను అడ్డంగా మోసగించినట్లే.

ఎన్.ఎస్.జి అనేది అణు పదార్ధాలు, పరికరాలు తయారు చేయగల దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్ధ. ఇదొక పెత్తందారీ గ్రూపు. దీనిలో 46 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాలు అణు పధార్ధాలు గానీ, పరికరాలు గానీ ఎన్.ఎస్.జి కి బైట ఉన్న దేశాలకు అమ్మాలంటే ఆ దేశాలు ఎన్.పి.టి (Nuclear Non-Proliferation Treaty) ఒప్పందంపై సంతకాలు చేసి ఉండాలి. అలా సంతకం చేయనట్లయితే అటువంటి దేశాలకు అణు పదార్ధాలు, పరికరాలు సరఫరా చేయడానికి వీల్లేదు. ఎన్.పి.టి పై సంతకం చేయడంతోనే ఆటోమేటిక్‌గా ఆ దేశాలకు అణు పరికరాలను అమ్మరు. సంతకం చేసిన తర్వాత ఆ దేశాలు కొనదలచుకున్న అణు పదార్ధాలుగానీ, అణు పరికరాలుగానీ దేనికి ఉపయోగపెడుతున్నదీ ఎన్.ఎస్.జి కి చెప్పాల్సి ఉంటుంది. అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికైతే అణు పరికరాలు, పదార్ధాలను అమ్మవు. శాంతియుత ప్రయోజనాలకోసం మాత్రమే ఉపయోగిస్తానంటేనే అమ్మడానికి అంగీకరిస్తాయి.

అంతటితోనె అయిపోలేదు. తాము కొనసలుచుకున్న అణు పదార్ధాలు, పరికరాలను నిజంగా శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నదీ లేనిదీ ఐ.ఎ.ఇ.ఎ సంస్ధను పరిశోధించడానికి (inspection) అవకాశం ఇవ్వాలి. అణు పదార్ధాలు, పరికారాలు ఉపయోగించి నిర్మించిన కర్మాగారాలలో శక్తివంతమైన కెమెరాలను ఐ.ఎ.ఇ.ఎ అమరుస్తుంది. శుద్ధి చేసిన యురేనియంని శాంతియుత ప్రయోజనాలకు కాకుండా అణు బాంబుల తయారీకి తరలిస్తే ఈ కెమెరాలు పసిగడతాయి. దానితో పాటు ఐ.ఎ.ఇ.ఎ ఇన్‌స్పెక్టర్లు ప్రతి సంవత్సరం ఆ దేశాల అణు కర్మాగారాల్లో పరిశోధన జరుపుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడొచ్చినా కాదనకుండా ఆహ్వానించాలి. అంటె అణు పదార్ధాలూ, పరికరాలు కొన్నందుకు ఆయా దేశాలు దొంగలుగానో, ద్రోహులుగానో అనుమానించబడుతూ ఉంటారు. అణ్వస్త్ర తయారీకి అణు ఇంధనాన్ని తయారు చేస్తారేమోనని అనుక్షణం కాపలాకి గురవుతారు. అంత అవమానకరంగా ఎన్.ఎస్.జి నిబంధనలు ఉంటాయి.

ఈ పరిశోధన మాటున అమెరికా అణ్వస్త్ర దేశాలలో (అణు పదార్ధాలు, పరికరాలు కొనుగోలు చేసిన దేశాలు) తన గూఢచారులను నియమిస్తుంది. వారు ఐ.ఎ.ఇ.ఎ సంస్ధ పేరు చెప్పుకుని వస్తారు. నిష్పాక్షిక పరిశోధకులుగా ఐ.ఎ.ఇ.ఎ వారికి సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తుంది. కానీ అసలు ఐ.ఎ.ఇ.ఎ సంస్ధే అమెరికా జేబు సంస్ధ. అది పంపించే ఇన్‌స్పెక్టర్లు కూడా అమెరికా తరపునే పనిచేస్తూ ఉంటారు. వారు ఆ దేశాల అణు కర్మాగారాలు, అణు ఇంధనం నిలవ ఉంచిన ప్రాంతాలు, అణ్వాయుధాలు భద్రపరిచిన ప్రాంతాలు అన్నింటిపైన పూర్తి సమాచారం సేకరించి అమెరికాకి అందిస్తారు. అంటె దేశ రక్షణకి సంబంధించిన గుట్టుమట్లన్నింటినీ అమెరికా, ఎన్.పి.టి ఒప్పందం మాటున సేకరించి పెట్టుకుంటుందన్నమాట. ఇది ఆయా దేశాల స్వతంత్రతనూ, సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడంతో సమానం. ఇతర దేశాల స్వతంత్రత, సార్వభౌమాధికారాల పట్ల అమెరికా, యూరప్ దేశాలకు అంత తేలిక భావం ఉంటుందన్నమాట.

Nuclear Weapon Free Zones

ప్రపంచంలో వివిధ ప్రాంతాలు అణు పదార్ధాలు లేని జోన్లుగా ప్రకటిస్తూ ఒప్పందాలు ప్రకటించాయి (పెద్ద బొమ్మకై క్లిక్ చేయండి)

అమెరికా, తాను మిత్ర దేశాలుగా చెప్పుకునే దేశాలపైన కూడా ఈ అణు గూండాయిజం చేస్తుంది. తన బద్ధ శత్రువైన ఇరాన్‌ను ఐ.ఎ.ఇ.ఎ ను అడ్డు పెట్టుకుని అమెరికా ముప్పుతిప్పలు పెడుతోంది. ఇరాన్ వాస్తవానికి ఎన్.పి.టిపై సంతకం చేసిన దేశం. యురేనియం శుద్ధి చేసే టెక్నాలజీని ఇరాన్, పాకిస్ధాన్ అణు పితామహుడు అబ్దుల్ ఖాదిర్ ద్వారా సంపాదించుకుంది. విద్యుత్ ఉత్పత్తి కోసం అణు కర్మాగారాలను నిర్మించుకుంది. వైద్య ప్రయోజనాల కోసం కూడా అణు రియాక్టర్లను నిర్మిస్తున్నామని అది చెబుతోంది. కాని ఇరాన్ అణ్వస్త్ర రాజ్యంగా మారుతుందేమోనని అమెరికా, యూరప్‌లు భయపడుతున్నాయి. ఎన్.పి.టినీ, ఐ.ఎ.ఇ.ఎ ని అడ్దు పెట్టుకుని ఇరాన్ అణు వసతులన్నింటినీ చెకింగ్ పేరిట తన గూఢచారులను కొందరిని చొప్పించింది. వారు ఇరాన్ అణు కర్మాగారాలని చెక్ చేసే పేరిట ఇరాన్ అణు వసతుల సమాచారాన్ని సేకరించి అమెరికాకి అందించారు. ఇది పసిగట్టిన ఇరాన్ వారిని దేశం నుండి వెళ్ళగొట్టడమే కాక ఐ.ఎ.ఇ.ఏ ఇన్‌స్పెక్టర్లు దేశంలోకి రావడానికి అనుమతిని నిరాకరించింది. గౌరవ ప్రదంగా బతికే ఏ దేశమైనా ఇదే చేస్తుంది. ఇన్‌స్పెక్షన్ పేరిట అమెరికా తరపున గూఢచర్యం చేస్తే ఏదేశం ఒప్పుకుంటుంది? ఇరాన్ ఒప్పు కోలేదు. ఈ సంగతుల్ని దాచిపెట్టి ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేస్తున్నదంటూ ప్రచారం చేసి ఐక్యరాజ్య సమితి చేత ఆంక్షలు విధింప జేసింది అమెరికా.

ఆంక్షలు విధించడం వెనక అసలు కారణం అమెరికా, యూరప్‌లు చెప్పేది కాదు. శాంతియుత ప్రయోజనాల కోసమైనా సరే, ఇరాన్‌కి అణు ఇంధనానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందటానికి వీల్లేదు. అణు ఇంధనం ఐన యురేనియం శుద్ధి చేయగల పరిజ్ఞానం ఇరాన్ కి తెలియకూడదు. యురేనియం శాంతియుత ప్రయోజనాలకోసమైతే 20 శాతం శుద్ధి చేస్తే సరిపోతుంది. అదే అణ్వాయుధాలు తయారు చేయడానికైతే 90 శాతం శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇరాన్ ఆ 20 శాతానికి మించి శుద్ధి చేసిన దాఖలాలు ఇంతవరకూ లేవు. ఆ విషయం అమెరికా గూఢచారి సంస్ధ సి.ఐ.ఏ, ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ మొస్సాద్ లు తేల్చి చెప్పాయి. ఇరాన్ అణు బాంబు తయారు చేయాలంటే కనీసం 5 సంవత్సరాలు పడుతుందని మొస్సాద్ ఇటీవల ప్రకటించింది. గూఢచార సంస్ధలు ఈ విషయం చెప్పిన తర్వాత కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయదలుచుకున్నదని ఆరోపిస్తూ, అమెరికా యూరోప్ లు భద్రతా సమితి చేత నాల్గవసారి ఆంక్షలు విధింపజేశాయి. వారి ఉద్దేశ్యం అసలు ఇరాన్ అణు సాంకేతిక పరిజ్ఞానం సంపాదించడానికి, శాంతియుత ప్రయోజనాలకైనా సరే, వీల్లేదు.

సి.ఐ.ఏ, మొస్సాద్ లు అంత నమ్మకంగా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయడానికి ఐదు సంవత్సరాలు పడుతుందని ఎలా చెప్పగలిగాయి? ఎలాగంటే ఇరాన్, అణు కర్మాగారాలలో ఉన్న కంప్యూటర్లలో మొస్సాద్, సి.ఐ.ఏలు రహస్యంగా ‘స్టక్స్‌నెట్’ అనే వైరస్‌ని ప్రవేశ పెట్టాయి. ఈ వైరస్ శక్తివంతమైన వినాశనకారి. ముఖ్యంగా పరిశ్రమల్లో వినియోగించే కంప్యూటర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన వైరస్ ఇది. సీమన్స్ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్ పరికారలపైన ఇది ఇంకా శక్తివంతంగా పని చేస్తుంది. కంప్యూటర్ ప్రోగ్రాంలను నిర్వీర్యం చేస్తుంది. ప్రపంచంలో ఈ వైరస్ బారిన పడిన కంప్యూటర్లలో 60 శాతం ఇరాన్ కంప్యూటర్లే. 18 శాతం ఇండోనేషియా కంప్యూటర్లు కాగా, 8.5 శాతం కంప్యూటర్లు ఇండియాకి చెందినవి కావడం గమనార్హం. ఇండియా అణ్వస్త్ర రాజ్యంగా మారడం మొదటినుండీ అమెరికా వ్యతిరేకిస్తున్న సంగతిని గుర్తుంచుకుంటే ఈ వైరస్ బారిన ఇండియా కూడా పడడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.

Nuclear Non-Proliferation Treaty Review Conference, May 2010

మే 2010 నెల మొత్తం జరిగిన అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం సమీక్షా సభ

ఇరాన్ అణు కర్మాగారాల్లో కంప్యూటర్లలో వైరస్ ని పవేశపెట్టడమే కాక అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌కి రహస్యంగా సరఫరా ఐన అణు పరికరాలు కూడా నాసిరకం అందే విధంగా చూడగలిగాయి. దానితో ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమంలో వినియోగించే సెంట్రిఫ్యూజ్‌లు ఆశించినంతమేరకు శుద్ధి చేయడంలో విఫలమయ్యాయి. దానితో ఇరాన్ అణు కార్యక్రమం తీవ్రంగా దెబ్బతింది. స్టక్స్ నెట్ వైరస్ వెనక అమెరికా, ఇజ్రాయెల్ లే ఉన్నాయనేందుకు సాక్ష్యాలు కూడా లభ్యమయ్యాయి. అమెరికా నిపుణులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని విఫలం చేయగలిగినందుకు గొప్పలు పోయిన విషయం పత్రికలకు కూడా ఎక్కింది. నిజానికి ఇరాన్ అణు కార్యక్రమాన్ని తాము నాశనం చేయగలిగామనో, లేదా ఆటంకపరిచామనో చెప్పుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ లు ఏ మాత్రం సిగ్గుపడవు. పైగా గర్విస్తాయి. మాతో పెట్టుకుంటే అంతే మరి అని వికృతానందాన్ని ప్రదర్శిస్తాయి. ఆ విధంగానే స్టక్స్ నెట్ వెనక అమెరికా, ఇజ్రాయెల్ గూఢచార సంస్ధలు, ఇజ్రాయెల్ ఆర్మీ ఐ.డి.ఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) ఉన్నాయని వెల్లడయ్యింది.

గత నెలలో అమెరికాలోని పబ్లిక్ బ్రాడ్‌కాస్ట్ సర్వీసు (పి.బి.ఎస్) లో ‘నీడ్ టు నో’ (Need to know) అనే ఓ రెగ్యులర్ కార్యక్రమంలో వైట్ హౌస్ అధికారి గ్యారీ సామోర్ ఓ ప్రకటన చేశాడు. ఈయన ఆయుధాల నియంత్రణ, సామూహిక విధ్వంసక ఆయుధాల నియంత్రణా విభాగానికి సంబంధించిన అధికారి. ఆ కార్యక్రమంలో ఆయన ఇలా ప్రకటించాడు. “వారి సెంట్రి ఫ్యూజ్ మిషన్లతో వాళ్ళు (ఇరానియన్లు) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి సంబంధించినంతవరకు ఆయా విషయాలను సంక్లిష్టం చేయడానికి మేము చేయగలిగినదంతా చేస్తున్నాము” అని. అంటె బహిరంగంగానే ఇరాన్ సెంట్రి ఫ్యూజ్ లను పని చేయకుండా చేశామని చెప్పాడాయన. బ్రిటిష్ డెయిలీ టెలిగ్రాఫ్ పత్రిక ఒక కధనం ప్రచురించింది. దాని ప్రకారం ఐ.డి.ఎఫ్ అధిపతిగా పనిచేసిన ‘గాబి ఆష్కెనాజి’ రిటైరైన సందర్భంగా జరిగిన పార్టీలొ ఒక చిన్న ఫిల్మ్ ప్రదర్శించారు. అందులో గాబి ఛీవ్ ఆఫ్ స్టాఫ్ గా సాధించిన విజయాల్లో చెప్పుకోదగ్గ విజయంగా ‘స్టక్స్ నెట్’ సృష్టి ని పేర్కొన్నారు.

కనుక ఒక శక్తివంతమైన వినాశనకారిగా పేరుపొందిన కంప్యూటర్ వైరస్ సృష్టి వెనక అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వాలే ఉన్నాయన్న మాట!  అది కూడా మరొక స్వతంత్ర దేశానికి చెందిన అణు కార్యక్రమాన్ని విధ్వంసం చేయడానికే దాన్ని సృష్టించడం అమెరికా, ఇజ్రాయెల్ రాజ్యాల స్వభావాన్ని తేటతెల్లం చేస్తున్నది. ఇదే వైరస్ ని ఇండియాపైనా, పాకిస్ధాన్ పైనా కూడా ప్రయోగించడాన్ని బట్టి అమెరికా వాస్తవంలో ఎవరికీ మిత్రుడు కాదని అర్ధం అవుతుంది. తన ప్రయోజనాల కోసమే అమెరికా మిత్రులు, శతృవులను ఏర్పరుచుకుంటుంది తప్ప దానికి శాశ్వత మిత్రులని ఎవరూ ఉండరని గుర్తించాలి. మిత్ర దేశంగా చెప్పుకునే పాకిస్దాన్ అణు కార్యక్రమాన్ని కూడా నాశనం చేయడానికి అమెరికా ప్రయత్నం చేసింది. పాకిస్ధాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను కూడా అమెరికా దొంగిలించడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే పాకిస్ధాన్‌ని అమెరికా ఎప్పుడూ నమ్మలేదు. పాక్‌ని తన ప్రయోజనాల కోసం వాడుకుంది తప్ప అది పాక్‌కి మిత్ర దేశం ఎంత మాత్రం కాదు.

ఇండియా విషయంలోనూ అంతే. అమెరికా ప్రయోజనాల కోసమే పౌర అణు ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలో ఉత్పత్తి అయ్యి కుప్పలుగా పేరుకున్న అణు రియాక్టర్లను అమ్ముకోవడానికే ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. తాను సరఫరా చేసిన పరికరాలను వినియోగించి నిర్మించే అణు కర్మాగారాలపైన అమెరికా నిఘా పెట్టడానికి ఇండియా ఒప్పుకుంది. అయితే ఇప్పటికే ఉన్న అణు కర్మాగారాల్లో నిఘా పెట్టడానికి మాత్రం అంగీకరించలేదు. కానీ అణు నష్ట పరిహారం జరిగితే నష్టం ఎవరు భరించాలన్న దానిపై ఇండియా చేసిన చట్టం (Nuclear liability bill) అమెరికాకి నచ్చలేదు. నష్టాన్ని ఇండియా ప్రభుత్వమే భరించాలని చట్టం చేయాలని అమెరికా కోరించి. కానీ భారత అణు నిపుణులు, మేధావులు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా అభ్యంతరం చెప్పడంతో నష్టపరిహారం అణు పరికరాలు అమ్మిన కంపెనీలు కూడా భరించాలని అది 500 కోట్ల రూపాయల వరకూ భరించాలని భారత పార్లమెంటు చట్టం చేసింది. నిజానికి రు.500 కోట్లు చాలా చాలా తక్కువ. అణు ప్రమాదం జరిగితే ఎలా ఉంటుందో జపాన్ ఫుకుషిమా దైచి ప్రమాదం స్పష్టంగా విప్పి చూపింది. వందల సంవత్సరాల పాటు నష్టం ఉంటుంది. ప్రమాదం జరిగీన్ ప్రాంతం ఇక దేనికీ ఉపయోగపడదు. అసలు ప్రమాదం నుండి బైటపడే మార్గాలే ఇంతవరకూ సరిగ్గా కనిపెట్టలేదని ఫుకుషిమా ప్రమాదం తేల్చింది. ఒక దాని తర్వాత ఒకటి ఊహిస్తూ చర్యలను తీసుకుంటూ పోయారు తప్ప ఖచ్చితంగా ఇదీ పరిష్కారం అని తెలిసి ఏ చర్యా తీసుకోలేక పోయారు. ఇప్పటికీ ఫుకుషిమా కర్మాగారం రేడియేషన్ విడుదల చేస్తూనే ఉంది. రేడియేషన్ నీటిని సముద్రంలో ఇంకా కలుపుతూనే ఉన్నారు. అటువంటి నష్టానికి రు.500 కోట్లు నష్టపరిహారం అంటే సముద్రంలో నీటి బిందువంత. ఆ పరిహారం చెల్లించడానికి కూడా అమెరికాకి ఇష్టం లేకుండా పోయింది. అందుకే ఇంతవరకూ అమెరికా, ఇండియాల ఒప్పందం కార్యరూపం దాల్చ లేదు.

తాజాగా రూపొందించిన నిబంధనలతో పౌర అణు ఒప్పందం కార్యరూపం దాల్చే అవకాశం లేకుండా చేస్తున్నాయి. మరి ఇండియాకి ఇచ్చిన మినహాయింపు సంగతి గురించి అడిగితే అమెరికా కొత్త నిబంధనలు ఇండియాని దృష్టిలో తెచ్చినవి కావని గొణుగుతోంది తప్ప నిర్ధిష్టంగా ఏమీ చెప్పలేదు. ఇండియా ఒప్పందం కొనసాగుతుంది అని నిర్ధిష్టంగా గట్టిగా చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ఐతే ఇండియా ఇప్పటికే యురేనియం శుద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞాన్ని దేశీయంగా అభివృద్ధి చేసుకుంది. వాడిన ఇంధనాన్ని మళ్ళీ వాడుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇండియా అభివృద్ధి చేసుకుంది. నిజానికి ఇండీయా అబివృద్ధి చేసిన రీ ప్రాసెసింగ్ టెక్నాలజీ వినూత్నమైనది, శక్తివంతమైనది. ఈ టెక్నాలజీని వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించగల శక్తి ఇండియాకి ఉంది. కాని అమెరికాకి అదే ఇష్టం లేదు. ఇండియా వాణీజ్య ప్రయోజనాలకు వినియోగించగల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్.ఎస్.జి దేశాలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేసుకోవడంతోటే అమెరికాకి కడుపు మంటగా ఉంది. ఇండియాలో ధోరియం ఇంధనం ఎక్కువగా లభిస్తుంది కనుక ధోరియం శుద్ధి టెక్నాలజీని కూడా ఇండియా అభివృద్ధి చేసుకుంది. అంటే అమెరికాకి తెలియని ధోరియం శుద్ధి టెక్నాలజీని ఇండియా అమ్మగలగడమే కాక శుద్ధి చేసిన ధోరియంను కూడా సరఫరా చేయగలదని భారత నిపుణులు చెబుతున్నారు. కనుక ఎన్.ఎస్.జి గ్రూపు లో ఇండియా సభ్యురాలుగా చేరగల అర్హత ఉంది. కాని ఇండియాని చేర్చుకోవడానికి అమెరికా, యూరప్ లు ప్రస్తుతం నిరాకరిస్తున్నాయి.

అందువలన కొత్త నిబంధనల వలన ఇండియాకి కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు. ఇన్నాళ్ళూ కొనసాగిన నిబంధనలు ఇక ముందూ కొనసాగుతాయి. కానీ అమెరికా ఇండియాకు మినాహాయింపులు ఇస్తున్నామంటూ కుదుర్చుకున ఒప్పందానికి కట్టుబడక పోవడమే అసలు సంగతి. ఇండియాతో చేసుకున్న ఒప్పందానికి అమెరికా స్వస్తి చెప్పబోతున్నదని భావించవచ్చు. ఇది ఇండియా సామర్ధ్యాన్ని తగ్గించదు గానీ ఇండియా ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తుంది. నేరుగా అమెరికాతో ఒప్పందం చేసుకున్నా ఫలితం లేకపోవడమనేది, అమెరికా చేతిలో మోసపోవదమనేది ఇండియా ప్రతిష్టకు సంబంధించిన సమస్యగానే ప్రపంచ అణు నిపుణులు కూడా చూస్తున్నారు. భారత ప్రభుత్వం ఇంకా దీనిపై స్పందించలేదు. అమెరికా కూడా ఇదమిద్ధంగా ఏమీ చెప్పలేదు. భారత ప్రభుత్వం తనను మోసం చేసిన అమెరికాని నిందించే బదులు భారత ప్రజలకు తానే ఏదో దొంగ సమాధానాలు చెప్పడానికే మొగ్గు చూపవచ్చు. ఎందుకంటె దేశంలో అనేకమంది నిపుణులు, మేధావుల సలహాలను పెడచెవిన బెట్టి అమెరికాతో ఒప్పందం చేసుకుని, తీరా అది ఆచరణలోకి రాకపోతే వారందరి ముందూ పరువు భంగంగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది.

ఇప్పటికిప్పుడే అమెరికా ఇండియాని మోసం చేసింది అని గట్టిగా చెప్పలేక పోవచ్చు. కానీ జరుగుతున్న పరిణామాలు దాన్నే సూచిస్తున్నాయి. నిర్ధారణకు రావడానికి మరిన్ని పరిణామాల కోసం ఎదురు చూడాలి. అయితే అమెరికా దేనికైనా తెగిస్తుందనీ, ఇండియా సామర్ధ్యాన్ని నాశనం చేయడానికైనా తెగిస్తుందన్న సత్యాన్ని మాత్రం అంగీకరించక తప్పదు.

One thought on ““పౌర అణు ఒప్పందం” విషయంలో అమెరికా, ఇండియాను మోసగించనున్నదా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s