త్వరగా సంస్కరణలు ఆమోదించండి, మాకోసం మీ మార్కెట్లు పూర్తిగా తెరవండి -అమెరికా


ఇండియా సంస్కరణల అమలు వేగవంతం చెయ్యాలనీ, తద్వారా భారత మార్కెట్లను అమెరికా ప్రవేశించడానికి వీలుగా మరింత బార్లా గేటులు తెరవాలని అమెరికా కోరింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ వాషింగ్టన్‌లో జరుగుతున్న ఇండియా అమెరికా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ ఇండియా ఫైనాన్షియల్ మార్కెట్‌ను బాగా అభివృద్ధి చేసుకుందని సర్టిఫికెట్ ఇచ్చాడు. మరిన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టినట్లయితే ఇండియాలో కాపిటల్ మార్కెట్లు అభివృద్ధి చెంది అమెరికా కంపెనీలు స్వేచ్ఛగా ప్రవేశించడానికి వీలు కలుగుతుందని గీధనర్ తెలిపాడు. సమావేశానికి ఇండియా ప్రభుత్వ ప్రతినిధిగా ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు.

భవిష్యత్తులో ఇండియా ఆర్ధిక వృద్ధి అది చేయబోయే తదుపరి సంస్కరణల వేగవంతమైన అమలు పైనే అధారపడి ఉంటుందని గీధనర్ ఊరించాడు. సంస్కరణలు చేయనట్లయితే తగ్గుముఖం పట్టిన భారత జిడిపి వృద్ధి రేటు మళ్ళీ కోలుకోవడం కష్టమని గీధనర్ పరోక్షంగా హెచ్చరించాడు. మంగళవారం ఇరు దేశాల ఆర్ధిక మంత్రులు, వారి సహాయకులు వార్షిక ఆర్ధిక చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో అమెరికా ఆర్ధిక నిపుణులు ఇండియాపై సంస్కరణలను వేగవంతం చేయాలని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. “మా దృక్కోణం నుండి చూసినపుడు ఆర్ధిక సంస్కరణల అమలులో ప్రగతిని చూడడానికి ఇష్టపడతాము. సంస్కరణలు, కార్పొరేట్ సంస్ధల అప్పు కోసం లోతైన, మరింత ద్రవ్యతతో కూడిన మార్కెట్‌ సౌకర్యాన్ని అందిస్తుంది. తద్వారా ద్రవ్య రంగంలో అమెరికా కంపెనీలు, వారీ సాంకేతిక పరిజ్ఞానమూ భారత్‌లో ప్రవేశించడానికి అవకాశం లభిస్తుంది. మా ఇరు పక్షాల ప్రయోజనాలు ఒకరికొకరు ఉత్సాహపరుచుకునేవి” అని గీధనర్ తెలిపాడు.

గీధనర్ అమెరికా ఉద్దేశ్యాన్ని స్పష్టంగా, మొహమాటం లేకుండా చెబుతున్నాడు. ఇండియా మరిన్ని సంస్కరణలు చేస్తేనే అమెరికా కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెడతాయని చెబుతున్నాడు. అయితే ఆ పెట్టుబడులు తెచ్చేవాళ్ళు ఎవరు? అమెరికా కంపెనీలు పెట్టుబడులు తేకుండా, ఇండియా క్యాపిటల్ మార్కెట్ నుండే సేకరిస్తాయట. అది జరగాలంటె అమెరికా కంపెనీలు స్వేచ్ఛగా ప్రవేశించడానికి కేపిటల్ మార్కెట్‌ని సమకూర్చే ద్రవ్య రంగంలో సంస్కరణలను వేగవంతం చేయాలట. ద్రవ్య రంగం అంటే మరేమీ కాదు. బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు, హెడ్జ్ ఫండ్‌లు, మ్యూచువల ఫండ్‌లు, షేర్ మార్కెట్లు, చిట్ ఫండ్‌లు లాంటి ఎన్.బి.ఎఫ్.సి లు (Non-Banking Financial Companies) ఇవన్నీ ద్రవ్య రంగం కిందికి వస్తాయి.

ద్రవ్య రంగంలో భౌతిక ఉత్పత్తులేవీ ఉండవు. అంతా డబ్బే. డబ్బే డబ్బును ఉత్పత్తి చేస్తుంది. వడ్డీలు, షేర్ల లాభాలు, సావరిన్ అప్పు బాండ్ల యీల్డ్‌లు, వివిధ ఫండ్‌లలో వచ్చే వడ్డీ రాబడి ఇలా డబ్బుని డబ్బుగానే పెట్టుబడిగా పెట్టి దానిపై లాభాలు సంపాదించే రంగమే ద్రవ్య రంగం. ఈ ద్రవ్య రంగమే 2008-2009 నాటి ప్రపంచ ద్రవ్య సంక్షోభాన్ని సృష్టించి, కొద్ది రోజుల్లోనే ప్రపంచ ఆర్ధిక సంక్షోభంగా పరిణామం చెందింది. దానినుండి అమెరికా, యూరప్ లు ఇంకా కోలుకోలేదు. వారు సంక్షోభం నుండి కోలుకోవడానికి ఇండియా లాంటి దేశాలు అమలు చేసే సంస్కరణలపై ఆధారపడుతున్నారు. అందుకే త్వరగా సంస్కరణలు పూర్తి చేయండి అని ఇండియాను నిర్దేశిస్తున్నాడు. ఓవైపు అమెరికా కంపెనీల కోసం సంస్కరణలు తీవ్రం చేయాలని చెబుతూనే మరోవైపు అవి భారత దేశ ఆర్ధిక వృద్ధిని పెంచుతాయని కూడా చెబుతున్నాడు.

ఒక దేశంలో సంవత్సరానికి ఉత్పత్తి అయ్యే మొత్తం ఉత్పత్తిని ఆ దేశ జిడిపి అంటారు. ఇందులో మోసపూరితమైన అంశం ఒకటి ఉంది. భారత దేశ సరిహద్దులలోపల జరిగే ప్రతి ఉత్పత్తినీ ఇండియా జిడిపి కిందనే జమ కడతారు. విదేశీ కంపెనీలు వచ్చి ఇక్కడ వనరులను వినియోగిస్తూ ఉత్పత్తిని తీసి విదేశాలకు ఎగుమతి చేస్తాయి. ఆ ఉత్పత్తి కూడా ఇండియా జి.డి.పి లో జమ కడతారు. స్పెషల్ ఎకనమిక్ జోన్ లను కేవలం ఎగుమతి చేయడానికి ఉద్దేశించారు. అక్కడ జరిగే ఉత్పత్తి భారతీయులకు ఉపయోగపడదు. అయినా అది ఇండియా జిడిపి కిందనే జమ వేస్తారు. ఇలా భారతీయులకు ఉపయోగపెట్టని ఉత్పత్తులని కూడా ఇండియా జిడిపిలో జమ కట్టి దాన్నే ఓ గొప్ప విజయంగా మన పాలకులు ఊదరగొడుతున్నారు. అదే కాక షేర్ మార్కెట్లలోకి వచ్చే ఎఫ్.ఐ.ఐ ల వలన భారతీయులకు ఉపయోగం ఏమీ లేదు. లాభాల కోసం అవి ప్రపంచమంతా పరుగులు పెడుతూ ఇండియా షేర్ మార్కెట్లలో లాభాలు వస్తున్నాయనుకుంటే వస్తాయి. ఏ మాత్రం నష్టం వచ్చినా మరో దేశానికి పరుగెడతాయి. ఈ ఎఫ్.ఐ.ఐ పెట్టుబడుల్ని ‘హాట్ మనీ’ అంటారు. అంటే ఎప్పుడూ ప్రయాణంలో ఉంటూ వేడి వేడిగా ఉంటుందని కాబోలు.

ఇలా ప్రజలకు ఉపయోగపడే ఉత్పత్తులు కాకుండా కేవలం ద్రవ్య రూపంలో ఉండే పనికిమాలిన పెట్టుబడులు, విదేశాలకు ఎగుమతి అయ్యే పనికోచ్చే ఉత్పత్తులు దేశ జిడిపిలో కలిపేసి దాన్ని దేశ గొప్పతనంగా చెప్పుకోవడమే పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధ మోసం. భారత దేశ బ్యాంకులు, ఇన్సూరెన్సు సంస్ధలు భారత దేశ వ్యవసాయ దారులనుండి, కార్మికులు, ఉద్యోగులు, స్వయం ఉపాధి కల్పించుకున్నవారు మొదలైన అందరి నుండి డిపాజిట్లు సేకరిస్తాయి. వాటికి కొద్దిగా వడ్డీ చెల్లిస్తూ, తాము సేకరించిన డిపాజిట్లను అవసరమైన వారికి అప్పులుగా ఇస్తాయి. ఈ అప్పులు ఇవ్వడంలోనె అసలు కిరికిరి జరుగుతుంది.

ఎవరికి అప్పులివ్వొచ్చు అన్నది పెద్ద ప్రశ్న. వాస్తవంగా ఆ డబ్బు భారతీయులు దాచుకున్న డబ్బు కనక భారతీయుల్లోనె అవసరమైన వారికి అంటే ఉత్పత్తి క్రమంలో పాల్గొంటున్న వారికి అప్పులిచ్చి ప్రోత్సహించాలి. ఇండియా వ్యవసాయ రంగంపై ప్రధానంగా ఆధారపడి ఉన్నందున రైతులకు పరపతి సౌకర్యాన్ని విస్తృతంగా కల్పిస్తే వారు పంటలు పండించి దేశానికి అనేక ఉత్పత్తులను ఇస్తారు. వాళ్ళకు గిట్టుపాటు ధరలు కల్పిస్తే ఆ డబ్బులో కొంత మళ్ళీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. ఆదాయం అనుమతించిన మేరకు వివిధ వినియోగ సరుకులు కొనుగోలు చేస్తారు. తిండికోసం ఖర్చు పెడతారు. రైతులే కాకుండా స్వయం ఉపాధికి ప్రయత్నిస్తున్నవారికి అప్పులిచ్చి వారికి ఆదాయ వనరులు సమకూర్చవచ్చు. తద్వారా నిరుద్యోగం తగ్గించవచ్చు. కొంతమంది భారతీయ పారిశ్రామిక వేత్తలు ఉంటారు. వారు పెద్ద పెద్ద పరిశ్రమల కోసం చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్ధాపించగల విజ్ఞాం ఉన్నవారు. వారికి అప్పులు సమకూర్చినట్లయితే పరిశ్రమలు పెట్టడమే కాక మరింతమందికి ఉపాధి కల్పిస్తారు. ఆ విధంగా మరింతమంది ఉపాధి సంపాదించి వారు కూడా ఆ డబ్బుని వివిధ సరుకుల కోనుగోలుకి వినియోగిస్తారు.

ఇలా వివిధ వర్గాల భారతీయ ప్రజలకు చిన్న చిన్న అప్పులు ఇచ్చి ఉపాధి సౌకర్యం కల్పించడమే కాకుండా దేశంలో ఉత్పత్తి అయ్యే వివిధ సరుకుల కోనుగోలు కూడా పెంచవచ్చు. అది ఆర్ధిక వ్యవస్ధ వేగంగా వృద్ధి చెందడానికి దారి తీస్తుంది. ప్రజలకు ఉపాధి లేకుండా, రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా, స్వయం ఉపాధిని ప్రోత్సహించకుండా ఉంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి, దేశంలో వివిధ రంగాల్లో ఉత్పత్తి అయ్యే సరుకులను కొనలేని పరిస్ధితిలో ఉంటారు. ఫలితంగా కొనుగోళ్ళు లేక ఉత్పత్తి పేరుకు పోయి, ఆర్ధిక వ్యవస్ధ ప్రతిష్టంభనకు లోనవుతుంది. అధిక ఉత్పత్తి సంక్షోభం ఏర్పడుతుంది. షాపుల్లో సరుకులు పుష్కలంగా ఉన్న కొనే వారు అరుదుగా ఉంటారు. 1990 వరకూ భారత ప్రభుత్వాలు నడిపిన రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారులు ప్రభుత్వ రంగ పరిశ్రమలని దోచుకు తిన్నారు. ప్రభుత్వ రంగ ఆదాయాన్ని ప్రవేటు వ్యక్తులకు దోచిపెట్టారు. బ్యాంకుల వద్ద అప్పులు తీసుకున్న కోటీశ్వరులు అవి ఎగ్గొట్టి బ్యాంకులు దివాలా తీయడానికి కారణమయ్యారు.

ఆ విధంగా రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారుల లంచగొండి తనం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, చేతగానితనం వీటన్నింటివలన ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూలనపడ్డాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలు నష్టాలు చూడడానికి కారణం రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్లు, వారి స్నేహితులైన ప్రవేటు కోటీశ్వరులు కాగా, ఆ దోషాన్ని ప్రభుత్వ రంగపైకి నెట్టేశారు. పరిశ్రమలు ప్రభుత్వం నడపడం వల్లనే అవి నష్టపోయాయని దుర్మార్గంగా ప్రచారం చేసి ప్రవేటీకరణ, సరళీకరణ, గ్లోబలీకరణ విధానాలను అమలు చేయడం ప్రారంభించారు. ఈ విధానాల సారంశం ప్రభుత్వరంగంలో ఉండే కార్యకలాపాలన్నింటినీ ప్రవేటు వాళ్ళకి అప్పజెప్పడం. ప్రభుత్వం ఏమీ చేయ్యకూడదు. వాటి పని చట్టాలను అమలు చేయడమే. ప్రవేటు పెట్టుబడిదారులు లాభాల కోసం చేసే ప్రతి దుర్మార్గానికీ కాపలా కాయాలి. వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటె అప్పుడు కార్మికులు, ఉద్యోగులను తీసేసే హక్కులు ఉండాలి. సమ్మె చేస్తే పోలీసుల్ని దింపి చావ బాదాలి. కార్మికులపైన ఎన్ని గంటల పని రుద్దినా ఏమీ అన కూడదు. వేతనాలు ఎంత తక్కువ ఇచ్చినా కిక్కురుమనకూడదు.

దీనితో పాటు మరొక ఘోరం విదేశీ కంపెనీలు విచ్చలవిడిగా దేశంలోకి రావడానికి అనుమతినివ్వడం. దేశంలోకి విదేశీ కంపెనీలు వస్తే వారిపైన పన్నులు వేయకూడదు. వాళ్ళూ చేసే ఎగుమతులపైన పన్నులు వేయగూడదు. ఆదాయపు పన్నులో మినహాయింపులు ఇవ్వాలి. వారి పరిశ్రమల కోసం వారు ఎక్కడ కోరుకుంటె అక్కడ భూములి ఇవ్వాలి. అవి రైతుల పంటభూములైనా ఇవ్వాల్సిందే. భూములు తప్ప వారికే ఆదాయ వనరూ లేకపోయినా వాళ్ళకి నామ మాత్రంగా నష్టపరిహారం చెల్లించి అక్కడినుండి తరిమి కొట్టాలి. భూములు వదులుకోవడానికి ప్రజలు సిద్ధపడకపోతే, సమ్మెలు ఆందోళనలు చేస్తే వాటిని ప్రభుత్వం అణిచివేయాలి. అణచివేయలేక పోతే అది ప్రభుత్వం చేతగానితనంగా విదేశీ పత్రికలు పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసి గేలి చేస్తారు. దొంగ సర్వేలు చేపట్టి ఎత్తి పొడుస్తారు. భారత దేశాన్ని అభివృద్ధి చేయడానికీ, జిడిపిని పెంచడానికీ విదేశీ కంపెనీలు వస్తుంటే అడ్డుపడుతున్నారనీ, అభివృద్ధి నిరోధకులనీ తిట్టిపోస్తారు. ఈ కంపెనీలు తమ తమ దేశాల్ని ఉద్ధరించకుండా భారత దేశాన్నే ఉద్దరించడానికి ఎందుకు నడుం కట్టాయో చెప్పరు. తమ తమ దేశాల్లో అధిక వేతనాలు, పర్యావరణ చట్టాలు, కార్మిక చట్టాలను భరించలేక చవక శ్రమతో లాభాలను పెంచుకోవడానికే ఇక్కడికి వస్తున్నారు తప్ప ఉద్ధరించడానికి కాదన్న వాస్తవాన్ని దాచిపెడతారు.

ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వాలు భారత దేశ ప్రజలు దశాబ్దాల తరబడి శ్రమించి నిర్మించుకున్న ప్రభుత్వ రంగ కంపెనీలను అమ్మేస్తున్నారు. అన్నం పెట్టే రైతుకి ప్రోత్సాహం ఇవ్వకుండా ప్రజలు దాచుకున్న డబ్బుని విదేశీ, స్వదేశీ ప్రవేటు కంపెనీలకు వేల కోట్ల అప్పులిస్తున్నారు. వారు అప్పుల్ని ఎగ్గొట్టినా కమీషన్లు మేసి వారిపై చట్టాలని అమలు చేయడం లేదు. సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ లతో కూడిన నూతనా ఆర్ధిక విధానాల వలన విదేశీ కంపెనీలు కుప్పలు కుప్పలు పెట్టుబడులు తెచ్చి ఇండియాని అభివృద్ధి చేస్తారనీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెస్తారనీ దొంగ మాటలు చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఏ కంపెనీ కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చి భారతీయులతో పంచుకున్న దాఖలాలు లేవు. పైగా ఆధునిక పరిజ్ఞానాన్ని బదలాయించేందుకు వీల్లేదు అని షరతులు పెడుతున్నాయి. భారత ప్రజలు, కార్మికులు, రైతులు, కూలీల అనేక సందర్భాల్లో భారత పాలకుల నూతన ఆర్ధిక విధానాలను ప్రతిఘటించడంతో ఇప్పటివరకూ కొంతవరకే ప్రభుత్వ రంగాన్ని అమ్మగలిగారు. ప్రవేటీకరణ అన్ని రంగాల్లోనూ పచ్చిగా ప్రవేశపెట్టలేక పోయారు. ప్రవేటీకరణ జరిగిన చోట ఇండియా ప్రవేటు కంపెనీలతో భాగస్వామ్యాన్ని అనుమతించారు తప్ప పూర్తి విదేశీ ప్రవేటీకరణని అనుమతించలేదు. బ్యాంకుల్లో 51 శాతం, ఇన్సూరెన్సులో 25 శాతం ప్రవేటీకరణ మాత్రమే చేశారు. రిటైల్ రంగం, రియల్ ఎస్టేట్ రంగం ఇలా కొన్ని పెద్ద రంగాలు ప్రవేటికరణ చేయడానికి ప్రభుత్వం వెనకాడుతున్నాయి. దానికి కారణం ప్రజల ప్రతిఘటనే.

అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ ఇవన్ని ఎత్తి చూపుతున్నడు. రెండవ విదత సంస్కరణలు త్వరగా పూర్తి చేయ్యండని డిమాండ్ చేస్తున్నాడు. అంటె ప్రజలకు కొద్దొ గొప్పో ఉపాధి అందిస్తున్న మిగిలిన ప్రభుత్వ కంపెనీలన్నింటినీ అమ్మెయ్యాలి. ప్రొవిజన్ షాపులు పెట్టుకుని జీవనోపాధి పొందుతున్న లక్షల కుటుంబాలను వీధిపాలు చేసి రిటైల్ రంగాన్ని ప్రవేటీకరించాలి. వాల్-మార్ట్ లాంటి ఆంబోతు కంపెనీలని ఇండియాకి రానిచ్చి భారతీయుల కడుపు మీద కొట్టాలి. బ్యాంకులు, ఇన్సూరెన్సు రంగాల్ని పాతికా పరకా కాకుండా మొత్తం ప్రవేటీకరించాలి. అవన్నీ చేస్తే అమెరికా కంపెనీలు ఇండియా వచ్చి ఉద్ధరిస్తాయని గీధనర్ చెబుతున్నాడు. ఈ సంవత్సరం ఇండియా జిడిపి ఇప్పటిదాకా తక్కువ నమోదు చేసింది. దానికి కారణం ప్రవేటీకరణ పూర్తిగా చేయకపోవడమే అని చెబుతున్నాడు.

గీధనర్ చెప్పిందాన్లో ఓ ముఖ్యాంశం ద్రవ్య రంగాన్ని ప్రవేటీకరించాలని. తద్వారా అమెరికా కంపెనీలు భారత ద్రవ్య రంగంలోనే అప్పులు సేకరించి దాన్నే ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడి ప్రకృతి వనరులను కొల్లగొట్టి సరుకులు ఉత్పత్తి చేసే పట్టుకెళ్తారట. వాళ్ళు పట్టుకెళ్ళీనా ఇండియాలోనే ఉత్పత్తి జరిగింది కనక అది ఇండియా జిడిపి కిందికే వస్తుంది కనక, మన జిడిపి రెండంకెల్లో వృద్ధి చెందుతుంది. దానివలన రైతులు భూములు కోల్పోయినా, గిరిజనులు జీవనోపాధి కోల్పోయినా, ఆ కంపెనీలు కాలుష్యం సృష్టించి చుట్టుపక్క గ్రామాలన్నింటా జబ్బుల్ని పంచినా అదేమీ ఫర్వాలేదు. అంతిమంగా ఇండియా జిడిపి పెరిగిందా లేదా? జిడిపి పెరిగినప్పుడు ప్రపంచంలో ఇండియా సూపర్ ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతోందని ప్రశంసలు వస్తున్నాయా లేదా? మన ప్రధానికి భారత ఆర్ధిక వ్యవస్ధను గాడిన పెట్టినవాడిగా అవార్డులు వచ్చాయా లేదా? అవే ముఖ్యం తప్ప ఆ అభివృద్ధి మాటున ఎన్ని కోట్లమంది భారతీయులు బికార్లుగా, నిరుద్యోగులుగా, దరిద్రులుగా మారినా ఫర్వాలేదు. అభివృద్ధి అన్న తర్వాత కొన్ని నష్టాలను భరించాలి మరి. అయితే నష్టాలు భరించేది ఎల్లప్పుడూ ప్రజలే కావడం అసలు విషాధం. వాళ్ళు గోచిపాతతో ఉన్న దాన్ని కూడ త్యాగం చెయ్యమంటున్నారు తప్ప ఏ టాటాలో, అంబానిలో ఎప్పుడూ త్యాగం చేసిన పాపాన పోలేదు. దొంగ ట్రస్టులు పెట్టి నల్ల ధనం తెల్ల ధనంగా మార్చుకుంటూ గొప్ప దాతలుగా కూడా వారు వెలుగొందుతుంటారు.

ఇండియాని చైనాతొ పోల్చడం మరొక అపభ్రంశం. చైనా జిడిపి వృద్ధి రేటు 9, 10 శాతం నమోదు చేస్తోంది. ఇండియా దానితో పోటీ పడుతోంది. మరో ఇరవై, ముప్ఫై సంవత్సరాల్లో చైనాను ఇండియా దాటి పోతుంది. అమెరికాని కూడా దాటి పోతుంది. మరో యాభై సంవత్సరాల తర్వాత ఇండియాయే అతి పెద్ద జిడిపి కలిగి ఉంటుంది…. ఇలా చెత్త రాతలన్నీ రాస్తూ భారత దేశంలో ఉన్న ప్రధాన పార్శ్వాన్ని మరుగుపరచడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత దేశ ప్రధాన పార్శ్వం దరిద్రం, నిరుద్యోగం, రైతుల ఆత్మ హత్యలు, తాగునీరు కరువు, విద్యుత్ కరువు, నిరక్షరాస్యత… ఇవీ అసలు భారతం. వారి చెంతనే అంబానీలు, టాటాలు, బిర్లాలు, ప్రపంచం అంబానీలనూ, టాటాలనూ మాత్రమే చూస్తే చూడొచ్చు గాక! కనీసం భారత ప్రభుత్వమైనా భారతీయుల్ని చూడాలి కదా! కనీ భారత ప్రభుత్వాలకు కూడా అంబానీలే కావాలి. వారి ప్రయోజనాలే ముఖ్యం. టాటా, అంబానీల ప్రయోజనాలు, వారితో పెద్ద భాగస్వామ్యం నెరిపే విదేశీ కంపెనీల ప్రయోజనాలే ప్రభుత్వాలు చూస్తున్నాయి తప్ప ప్రజల ప్రయోజనాల విషయంలో నాటకాలు ఆడుతున్నాయి.

ఆ నాటకాలను కొనసాగించాలని, మరింత ప్రతిభావంతంగా రక్తి కట్టించాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీ గీధనర్ ఇండియా పాలకులను కోరుతున్నాడు. దానికి భారత పాలకుకు కూడా తలలూపుతూ, పోస్కో కి వ్యతిరేకంగా పోలీసు నిర్బంధాన్ని తీవ్రం చేయడానికి నిర్ణయించుకుంటున్నారు. భారత ప్రజలు ఎంత త్వరగా మేలుకుంటే దేశానికి అంత మంచింది.

4 thoughts on “త్వరగా సంస్కరణలు ఆమోదించండి, మాకోసం మీ మార్కెట్లు పూర్తిగా తెరవండి -అమెరికా

  1. so, what our govt.(Sorry, can we call it so? i don’t think so, may be “few filthy minds”) doing is pure business…with our nation. I still don’t understand what’s the GDP got to do with common man, GDP is not at all reflecting the common man’s life standards, but the wealth of POLITICIANS.

    Nice article and very nice blog, i think first of its kind in telugu. Keep rocking.

  2. Hi Vanamali,

    What you said about the govt. is true. GDP reflects only the total product that doesn’t reach the common man, but pays a lot to domestic as well as foreign wealthy plunderers, looters and brokers. Thank for your encouragement.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s