బ్రిక్స్ నిర్ణయానికి పాతరేస్తూ చైనా ఫ్రాన్సు అభ్యర్ధి క్రిస్టిన్ లాగార్డేకి ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షురాలుగా ఉండడానికి మద్దతు ప్రకటించింది. బ్రిక్స్ (BRICS) అనేది ఐదు లీడింగ్ ఎమర్జింగ్ దేశాల కూటమి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా లు ఇందులో సభ్య దేశాలు. ఐ.ఎం.ఎఫ్ అధ్యక్ష పదవి ఖాళీ అయ్యాక యూరప్ దేశాలు యూరప్ అభ్యర్ధిని ఆ పదవిలో నియమించాలని కోరింది. యూరప్ అప్పు సంక్షోభం ఎదుర్కొంటున్నందున అది న్యాయమని చెప్పింది. ఆత్రుతగా ఫ్రాన్సు ఆర్ధిమ మంత్రి క్రిస్టిన్ లాగార్డేని తమ అభ్యర్ధిగా ప్రకటించాయి. బ్రిక్స్ దేశాల కూటమి సమావేశమై ఐ.ఎం.ఎఫ్ అధ్యక్ష పదవికి దేశం ఆధారంగా నియమించాలని కోరడం తగదనీ, ప్రతిభ ఆధారంగానే నియమించాలని కోరాయి. యూరప్ దేశాలు ఐ.ఎం.ఎఫ్ అధ్యక్ష పదవిని తమ గుత్త హక్కుగా భావించడాన్ని అవి పరోక్షంగా నిరసించాయి.
కానీ బ్రిక్స్ దేశాలు ఎమర్జింగ్ ఎకానమీ దేశాల తరపున ఉమ్మడి అభ్యర్ధిని ప్రకటించడంలో విఫలమయ్యాయి. లాగార్డే అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన కొద్ది రోజులకే ఆమె తనకు చైనా మద్దతు ఉందని ప్రకటించింది. చైనా ఆమె ప్రకటనను అవుననిగానీ కాదని గానీ చెప్పలేదు. కాని ఇండియా కాదని చెప్పింది. చైనా లాగార్డేకి మద్దతు ఇస్తున్నట్లుగా ఏమీ చెప్పలేదు అని ఇండియా ప్రకటించింది. ఈ లోపు మెక్సికో సెంట్రల్ బ్యాంకు అధిపతి ‘అగస్టిన్ కార్స్టెన్స్’ కూడా తన అభ్యర్దిత్వాన్ని ప్రకటించాడు. మరొకరు పోటీలో నిలిచినప్పటికీ ఐ.ఎంఎఫ్ బోర్డు వీరిద్దరినీ మాత్రమే షార్ట్ లిస్ట్ చేసింది. గత నెల రోజులనుండి వీరు దేశాలను చుట్టి వచ్చారు.
ఇండియా లాగార్డేకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పలేదు. అలాగని ఇవ్వననీ చెప్పలేదు. బ్రిక్స్ కూటమి ఉమ్మడి అభ్యర్థిని నిలపకపోయినా కనీసం మెక్సికో అభ్యర్ధికయినా మద్దతు ఇవ్వవచ్చు. కానీ అదీ చేయలేదు. అగస్టిన్ ఒక వాదన చేశాడు. లాగార్డే అభ్యర్ధిత్వంలో ‘ప్రయోజనాల ఘర్షణ’ (conflict of interest) పరిస్ధితి తలెత్తుతుందని చెప్పాడు. ఒక వైపు యూరప్ అప్పు సంక్షోభంలో ఉండగా యూరప్ అభ్యర్ధే ఐ.ఎం.ఎఫ్ అధ్యక్ధులుగా ఉంటే యూరప్ తరపున పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందనీ, వారితో సంబంధం లేని తనకు మద్దతు ఇవ్వాలనీ కోరాడు. లాటిన్ దేసాలు ఆయనకు మద్దతు ఇచ్చినా ఆఫ్రికా దేశాలు లాగార్డేకి మద్దతు ఇచ్చాయి. ఆ దేశాలపై ఫ్రాన్సు ప్రభావం ఉన్నందున అవి ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అమెరికా ఏమి చెప్పకపోయినా దాని మద్దతు లాగార్డెకే అని చెప్పవచ్చు.
ఆసియాలోని చైనా, ఇండియా, ఇండోనేషియాలు ఎమర్జింగ్ దేశాల్లో ప్రముఖంగా ఉన్నాయి. ఇండోనేషియా ఇప్పటికే లాగార్డేకి మద్దతు తెలిపింది. తాజాగా చైనా కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఇన్నాళ్ళూ పైకి ఏమీ చెప్పకుండా మౌనం పాటించిన చైనా, ప్రధాని వెన్ యూరప్‌లో పర్యటన జరుపుతున్న సందర్భంగా లాగార్డేకి మద్దతు ప్రకటించింది. దానికి కారణం లేక పోలేదు. ప్రారంభంలోనే లాగార్దే అభ్యర్ధిత్వం ప్రకటించిన ఫ్రాన్సుకూ, చైనాకు మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఫ్రాన్సు తో ఒప్పందం అంటే అది ఇ.యుతో ఒప్పందమే. ఆ ఒప్పందం ప్రకారం లాగార్డేకి మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఫలంగా చైనా ప్రతినిధిని ఐ.ఎం.ఎఫ్ ఉపాధ్యక్షుల్లో ఒకరిగా నియమించాలన్నది ఆ ఒప్పందం.
బ్రిక్స్ దేశాలతో కలిసి ప్రతిభకే పట్టం కట్టాలనీ, గుత్తాధిపత్యం తగదనీ అంత ఘనంగా తీర్మానించిన చైనా మొదటినుండీ ఉపాధ్యక్ష పదవి కోసం యూరప్‌తో టచ్‌లో ఉన్నట్లు ఇప్పుడు చైనా ప్రకటనను బట్టి అర్ధమవుతోంది. యూరప్‌తో టచ్‌లో ఉంది గనకనే లాగార్డే ప్రారంభంలోనే చైనా మద్దతు తనకుందని చెప్పగలిగంది. చైనా లాగార్డెకి మద్దతు ఇస్తున్న విషయాన్ని చైనా సెంట్రల్ బ్యాంకు ఐన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (People’s Bank of China) గవర్నర్ ‘ఝౌ గ్జియావో-ఛువాన్’ ప్రకటించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది.
ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ కి ప్రత్యేక సలహాదారుగా పని చేస్తున్న చైనా ఆర్ధికవేత్త “ఝూ మిన్” డెప్యుటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఎన్నిక కావడానికి లాగార్డే సహకరిస్తుందని చైనా భావిస్తున్నదని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక ఇ.యు వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది. లాగార్డే కూడా కొన్ని రోజుల క్రితం “ఐ.ఎం.ఎఫ్ ఉన్నత మేనేజ్మెంట్లో ముఖ్యమైన పాత్ర నిర్వహించడానికి ఝు మిన్ అన్ని విధాల తగినవాడ”ని ప్రకటించింది. ఈ ప్రకటన చైనాతో కుదిరిన ఒప్పందం దరిమిలా వెలువడిందన్నది నిర్వివాదాంశం.
యూరప్ ముందుగానే లాగార్డే అభ్యర్ధిత్వాన్ని ప్రకటించినందున తనకు అవకాశాలు తగ్గిపోయాయని అగస్టిన్ అభిప్రాయంగా ఉంది. లాగార్డే ఎన్నిక కావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. అయితే తగినంత మెజారిటీ లాగార్డేకి ఉందా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నా, చివరి నిమిషంలో ఇండియా లాంటి దేశాలు మద్దతు ప్రకటించినా ఆశ్చర్యం లేదు. కానీ చైనా బ్రిక్స్ దేశాల తీర్మానానికి కట్టుబడి ఉంటే పరిణామాలు ఆసక్తికరంగా ఉండేవి. రష్యా బ్రిక్స్ తీర్మానంపై సంతకం చేసినా, జి8 కూటమితో కలిసి లాగార్డేకి మద్దతు ఇచ్చిన తీర్మానంపై కూడా సంతకం చేసింది. బ్రిక్స్ కూటమి వ్యవహారం “పేరు గొప్ప. ఊరు దిబ్బ” చందంగా ఉందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.
